"అక్షరాలు కాస్త చిన్నవిగా ఉన్నాయండి.... రంగారావు అని రాసుంది."
"ఇంట్లో కాస్త సున్నముంది. అమ్మాయిని పిలిచి రాసేయమనాలి." అన్నాడు వెంకట్రత్నం.
"వద్దు సార్! కనీసం ఈ ఒక్కరోజు కిదిలా గుండనివ్వండి."
"ఎందుకూ?" అన్నాడు వెంకట్రత్నం ఆశ్చర్యంగా.
"ఎవరో దూరాన్నుంచి ఈపేర్రాయడం చూశాను. నేను దగ్గరౌతూంటే వాడు పారిపోయాడు. వాడసలేం రాయదల్చుకున్నాడో? రంగారావుని తిడతాడో, పొగుడుతాడో, ఉత్తినే రంగారావని ఎవడూ రాయడు గదా! రాసిన వాడు పని పూర్తిచేయడానికి మళ్ళీ వస్తాడు. అప్పుడు వాడిని పట్టుకోవచ్చు. వాడు దొరక్కపోయినా వాడేం రాస్తాడో తెలుసుకోవచ్చు. మీరు సున్నం కొట్టేస్తే వాడింకో యిల్లు చూసుకుంటాడు."
"చూసుకుంటే నాకేం నష్టం?"
"పోనీ నాకు నష్టమనుకోండి. ఏదో నా కుతూహలం, అంతే!"
"పోనీలే, నువ్వన్నట్లే చేద్దాం! అది సరే! ఏమిటీ నువ్విలా వచ్చావ్? వెతకబోయిన తీగె కాలికి తగిలినట్లయింది. నేనే మీ యింటికొద్దామని బయల్దేరాను" అన్నాడు వెంకట్రత్నం.
గౌతమ్ అసలు విషయం చెప్పకుండా, "మీ మనసులో మాట నాకు తెలిసిపోయింది. మిమ్మల్ని శ్రమపెట్టడమెందుకని నేనే బయల్దేరి చక్కా వచ్చాను" అన్నాడు.
"అయితే లోపలకు పద" అన్నాడు వెంకట్రత్నం.
ఇద్దరూ లోపలకు వెళ్ళి కుర్చీల్లో కూర్చున్నారు.
"నా మనసులో మాట నీకేం తెలిసిందో చెప్పు" అన్నాడు వెంకట్రత్నం.
"అది మీరు చెబితేనే బాగుంటుంది" అన్నాడు గౌతమ్.
"నువ్వో అమ్మాయిని ప్రేమించావు. అవునా?" అన్నాడు వెంకట్రత్నం.
"మీకెలా తెలుసు?" ఆశ్చర్యంగా అడిగాడు.
"అనుభవంతో చాలా విషయాలు చెప్పకుండానే తెలుసుకోగలను" అని "నువ్వింకా ఆ విషయం ఆ అమ్మాయితో చెప్పలేదు కదూ!" అన్నాడు వెంకట్రత్నం.
"మీకేవో అద్భుత శక్తులున్నాయి" అన్నాడు.
"ప్రేమే ఒక అద్బుత శక్తి!" అన్నాడు వెంకట్రత్నం.
గౌతమ్ ఏదో అనబోతుండగా వెంకట్రత్నం చిన్న కూతురు కాఫీ తెచ్చిచ్చింది.
"ఇప్పుడేం భోంచేసి వస్తున్నాను........." అన్నాడు గౌతమ్ మొహమాటంగా.
"కాఫీకి వేళాపాళా ఏమిటి?" అన్నాడు వెంకట్రత్నం.
"మరి మీరు?"
"నేను రోజుకొక్కసారే తాగుతాను. అది నా అలవాటు" అన్నాడు వెంకట్రత్నం!
గౌతమ్ మాట్లాడకుండా కాఫీ తాగి గ్లాసు కింద పెట్టాడు. వెంకట్రత్నం చిన్న కూతురొచ్చి గ్లాసు తీసుకెళ్ళిపోయింది.
"ప్రేమ అర్భుత శక్తి అన్నారు. ఆ శక్తితో ఎంత దూరాన ఉన్నా మనం ప్రేమించిన వాళ్ళతో మాట్లాడ గలమా?" అన్నాడు గౌతమ్.
"విమానాలు వచ్చి ప్రపంచం దగ్గరైపోయింది. ప్రేమించిన వాళ్ళతో మాట్లాడ్డానికి వాళ్ళ దగ్గరకు వెడితే సరిపోతోంది. వేరే అద్భుత శక్తి ఎందుకూ?"
"కొందరికి ధైర్యం చాలదు. అలాంటి వాళ్ళలో నేనొకడిని."
"నీకు ధైర్యమే కావాలంటే అది నేనిస్తున్నాను. నువ్వెవరిని ప్రేమిస్తున్నావో ఆమె నిన్ను ప్రేమిస్తోంది. రేపే వెళ్ళి ఆమె ముందు నీ ప్రేమను బయటపెట్టు" అన్నాడు వెంకట్రత్నం.
గౌతమ్ ఆశ్చర్యంగా ఆయనవేపే చూశాడు.
"ప్రేమించడం తప్పుకాదు. ప్రేమించిన వాడు భయపడకూడదు." అన్నాడు వెంకట్రత్నం.
"థాంక్స్" అంటూ లేచాడు గౌతమ్.
* * * *
"చాలా ఆశ్చర్యం అక్కా! ఆ యింటి గోడ మీద రంగారావు అని వ్రాసుంది" అన్నాడు గిరిధర్ రొప్పుతూ వచ్చి.
ముందు హాస తెల్లబోయినా తర్వాత తమాయించుకుని నవ్వేసి, "నువ్వు నాకు ఠోకరా యివ్వాలనుకుంటున్నావు కదూ, నేను నమ్మను" అంది.
"ఠోకరా కాదక్కయ్యా! కావాలంటే నువ్వు నాతో రా....చూపిస్తాను...."
"ఏమో, నువ్విప్పుడు రాసి వచ్చావేమో ఎవరు చెప్పగలరు?"
"అదేంటక్కా! నువ్వు నన్ను నమ్మించాల్సింది పోయి నేను నిన్ను నమ్మించాల్సొస్తోంది" అన్నాడు గిరిధర్.
"ఏమోరా, ఇప్పుడు నన్ను నేను నమ్మడమే కష్టంగా వుంది. అంతా విచిత్రంగా వుంది నాకు" అంది హాస.
గిరిధర్ ఏదో అనబోగా ఆమె చెవుల్లో "హలో, హాసా!" అన్న పిలుపు వినబడింది.
"ఎవరూ?" అంది హాస వులిక్కిపడి.
"నేను.... నీ తమ్ముడికి నాపై నమ్మకం కుదిరిందా?"
"కుదిరింది. కానీ యింతకీ నువ్వెవరు?"
గిరిధర్ ఆమె ధోరణి చూసి, "ఓహో! నీకు ఫోన్ వచ్చినట్లుంది" అనేసి బయటకు వెళ్ళిపోయాడు.
"నేనెవరినైతేనేం? నీ శ్రేయోభిలాషినే...."
"నాతో ఎందుకిలా మాట్లాడుతున్నావ్?"
"చెప్పానుగా నీ శ్రేయోభిలాషినని....నీకో మంచి కబురు చెప్పాలని పిలిచాను. రేపు నిన్నొక అద్భుత వ్యక్తి కలుసుకోబోతున్నాడు.
అతడెవరో తెలుసా?"
"ఎవరు?"
"సాయంత్రం నీ ఫ్రెండ్స్ తో చెబుతూ వర్ణించావే....అలాంటి మనిషి నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అతన్ని నువ్వు తొలిచూపులోనే ప్రేమించాలి"
"ఏమిటీ!"
"నీ శ్రేయోభిలాషిగా నీకిది నా శాసనం__"
"హలో__హలో__" అంది హాస.
అవతలనుంచి బదులు రాలేదు.
ఆమె నిట్టూర్చి__
"నేను భ్రమపడుతున్నానా లేక ఏదయినా అద్భుతశక్తి నన్ను వెంటాడుతోందా?" అనుకుంది.
19
ఏడంతస్థుల మేడలో మూడో అంతస్థు. నలభై గదుల్లో నాలుగో గది. అక్కడ అయిదు కుర్చీల్లో యిద్దరు కూర్చున్నారు.
ఒకడు నడి వయస్కుడు.
ఒకడు యువకుడు
యువకుడు ఎర్రగా, బుర్రగా, అమాయకంగా వున్నాడు.
నడి వయస్కుడు నల్లగా, నిండుగా, కౄరంగా వున్నాడు.
"అంతా గుర్తుంది కదూ!" అన్నాడు నడి వయస్కుడు.
యువకుడు తలూపాడు.
"ఏం గుర్తుందో కట్టె కొట్టె తెచ్చె అన్నట్లు మూడు ముక్కల్లో చెప్పు"
"ప్రేమించానంటాను, పెళ్ళి చేసుకుంటాను, చంపేస్తాను"
"శభాష్!" అన్నాడు నడివయస్కుడు.
యువకుడు అమాయకంగా నవ్వాడు. చంపేస్తానన్నాడెలా నవ్వాడో ఇప్పుడూ అలాగే నవ్వాడతను.
"నీ నవ్వే నీకు శ్రీరామరక్ష" అన్నాడు నడివయస్కుడు.
"మరి నేను బయల్దేరేదా?"
"బయల్దేరేముందు దార్లో ముళ్ళ గురించి గుర్తుందా?"
అతను తలూపాడు.
నడివయస్కుడు "గుడ్" అని తలూపి-
"నీక్కావలసింది నీకు తెలుసు. నాక్కావలసింది నాకు తెలుసు. మనక్కావలసింది ఆ భగవంతుడి క్కూడా తెలియకుండా జాగ్రత్తపడాలి. ఇంతే నేను నీకు చెప్పేది...."
అతడు నవ్వాడు.
"ఇంకేమైనా సందేహాలుంటే అడుగు అన్నాడు నడివయస్కుడు.
"నేనింకా గుర్తుంచుకోవాల్సినవేమిటి?" అన్నాడతడు తాపీగా.
"అతి ముఖ్యమయిన విశేషాలు రెండే రెండు....ఆమె పేరు హాస, నీ పేరు రమణ...."
* * * *
ఏడంతస్థుల మేడకు ఏడు కిలోమీటర్ల దూరంలో గోవిందరావు స్ట్రీట్ లో కల్పనా హోటల్ ప్రక్కన ఓ పచ్చ మేడుంది.
ఆ పచ్చమేడ లోపల హాల్లో అప్పుడు పచ్చదీపాలు వెల్గుతున్నాయి. ఆ పచ్చదీపాల క్రింద సుమారు పదిమంది అమ్మాయిలు రంగురంగుల దుస్తుల్లో సీతాకోక చిలుకల్లా తిరుగుతున్నారు. వారిలో ప్రతిభ వుంది.
వారిచుట్టూ పదిమంది అమ్మాయిలున్నారు. వారిలో దేవేంద్ర కూడా వున్నాడు.
వారందరూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు కనబడుతుంది.
హాల్లో మధురంగా వినిపిస్తోంది రికార్డుల వీణానాదం. కొందరది విని ఆనందిస్తున్నారు. కొందరుత్సాహ పడుతున్నారు.
ప్రతిభకు అసహనంగా వుంది. దేవేంద్ర ఆమెనే చూస్తున్నాడు.
దేవేంద్ర ఆమెను సమీపించి_ "ఎంజాయ్ ద మ్యూజిక్" అన్నాడు.