వెంకటస్వామి మాటల చమత్కారానికి ఓ సంఘటన గురించి చెబుతాను.
ఓ రోజు ఉదయం కూలీల స్త్రీలంతా టీ కొట్టుకొచ్చారు. వెంకటస్వామి భార్య అనంతలక్ష్మి జబ్బు మనిషి అయినా సామాను కొట్టునంతా ఆమే చూసేది.
అప్పుడే ఓటర్లను నమోదుచేసే పనిమీద ఓ అయ్యవారు వచ్చారక్కడికి. టీకి ఆర్డరిచ్చి అక్కడున్నవాళ్ళ పేర్లు రాసుకోవడం మొదలుపెట్టాడు. అందరూ తమ భర్తలపేర్లు, సంతానం పేర్లు చెప్పారుగానీ సరోజ మాత్రం తన భర్తపేరు చెప్పలేదు.
అయ్యవారు ఎంత ప్రాధేయపడ్డా ఆమె తన భర్త పేరు మాత్రం చెప్పలేదు.
ఈ అవస్థంతా కనిపెట్టిన వెంకటస్వామి అయ్యవారికి టీ అందిస్తూ "ఏం అనుకోకు మాస్టారూ. మా సరోజ సతీ అనసూయ టైప్. భర్త పేరు తన నోటితో చెప్పదు. పగలంతా మహాపతివ్రతలే" పగలు అనే పదాన్ని నొక్కి చెబుతూ అన్నాడు.
మాస్టారితోసహా అందరూ పడీపడీ నవ్వారు.
సాయంకాలం పని ముగించుకుని పోతు సరోజ టీకొట్టు దగ్గర ఆగింది.
'ఒక టీ వెయ్' అని ఆర్డరిచ్చి ఉదయం అన్న మాటలకి తన రియాక్షన్ ఏమిటో స్పష్టంగా చెప్పింది, 'పగలంతా మహాపతివ్రతంటే రాత్రిపూట కానట్టేగా, అయినా అంత పబ్లిక్ గా అలా చెబితే నా పరువేం కాను' అంది.
"పరువుకి పోతే పరువం అంతా వేస్టయిపోతుంది" అనీ మరోమారు తన మాటకారితనంతో ఆమెను బోల్తా కొట్టించాడు.
సరోజ బావుంటుంది. నల్లగా వున్నా అందమైన శిల్పంలాగా వుంటుంది. ఈ మధ్యనే ఆమె మీద మనసుపుట్టింది వెంకటస్వామికి.
అతనిలాంటివాడు ఇటువంటి విషయాల్ని నాన్చడు. తాడోపేడో క్షణంలో తేల్చుకుంటాడు.
అందుకే టీ ఇస్తూ "మొత్తానికి నిన్ను చూస్తుంటే ఓ పదేళ్ళ వయసు తగ్గినట్టు అన్పిస్తుంది. మరి పడకలో కూడా వయసు తగ్గినట్టు అన్పించడం నిజమో కాదో తెలుసుకోవాలని యమ ఉబలాటంగా వుందే. రాత్రికి భోజనాలయ్యాక తొమ్మిది గంటలకి మామిడి తోపులోకి వచ్చెయ్ కూడదా" అని ఎంతో అర్ధింపుగా అడిగాడు.
ఆ మాటలకి సరోజకి నవ్వొచ్చింది. "మరి నీ అనంతలక్ష్మికి విషయం తెలిస్తే?" అని తన అనుమానాన్ని బయట పెట్టింది సరోజ.
"ఏం ఫరవాలేదు. బ్రిడ్జ్ అండర్ రిపేర్. టేక్ డైవర్షన్ - అంటే బ్రిడ్జి రిపేరులో వున్నది. వాహనాలు మరో దారిలో వెళ్ళాలి. ఇదీ అంతే" అని నవ్వాడు.
ఆయన చెప్పిన ఆ ఉదాహరణ రాత్రి మామిడి తోపులోకి వెళ్ళే వరకు గుర్తొచ్చినప్పుడంతా నవ్వుతూనే-వుంది సరోజ.
ఇదంతా ఎందుకు చెప్పానంటే వెంకటస్వామి లాంటివాళ్ళు అరుదుగా వుంటారు. ఆయనకి ఎన్ని కష్టాలు రానీ ఇతరులను నవ్విస్తూనే వుండేవాడు. చివరికి ఆయనకి సడెన్ గా అనారోగ్యం వచ్చినా తన హాస్య ప్రియత్వాన్ని వదలలేదు.
"ఏభై ఏళ్ళుగా ఈ శరీరాన్ని చూసి చూసీ విసుగెత్తిపోయింది. వెధవ ప్రాణం ఇందులోంచి పోతే ఎంచక్కా ఇంకో శరీరాన్ని వెదుక్కుని మళ్ళీ పుట్టొచ్చు" అనేవాడు.
అనారోగ్యం చేసిన ఆర్నెల్లుకే అతడు పోయాడు. అది వేరేసంగతి.
అలాంటి వెంకటస్వామి టీకొట్టు ఎప్పుడూ జనంతో కళకళలాడి పోయేది.
అప్పుడే ఊళ్ళోకి పత్తిపంట వచ్చింది.
అప్పటివరకు శెనగ, వరి తప్ప మరేం పంటలు వేసేవాళ్ళు కాదు రైతులు.
పత్తి వేస్తే మంచి డబ్బులొస్తాయని విత్తనాలు ఇచ్చింది ప్రభుత్వం.
పత్తి పంట అలా మొదలైంది మన ఊర్లో.
ఆ పంట వేసిన రెండేళ్ళు మంచి లాభాలు వచ్చాయి. దాంతో మరింత కళ వచ్చింది ఊరికి.
పూరిళ్ళు పెంకుటిళ్ళు అయ్యాయి. పెంకుటిళ్ళు మిద్దెఇళ్ళుగా మారాయి. ఊరు వానాకాలంలో ఆకులు లేకుండా పూలనే సింగారించుకున్న తురాయి చెట్టు మాదిరిగా అయిపోయింది.
మా నాన్న అంటే మీ తాతయ్య కష్టజీవి.
ఉదయం పొలంలోకి వెళితే ఇక సాయంకాలమే ఇంటికి వచ్చేది. అంత కష్టపడతాడు కాబట్టే రాబడి కూడా గణనీయంగా పెరిగింది.