మరునాటి సాయంత్రం రామకృష్ణ దంపతులు అరవింద్ యింటికి వచ్చారు.
రామకృష్ణ సుదర్శనంగారితో రాజకీయాలు-అవి ఇవి మాట్లాడుతూ వుండిపోతే అర్చన లోపలికి వెళ్ళిపోయింది. "బాగున్నారా పిన్నిగారూ? ఆరోఘ్యం ఎలా వుంది?"
"ఏమిటో ఈ మధ్య గుండెలో నొప్పి వస్తుందమ్మా! అబ్బాయి బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడు! ఎలా వున్నావమ్మా? ఏమిటి విశేషాలు? ఒక్క దానివే వచ్చినట్టున్నావే? ఇలా కూర్చో!" అర్చన చెయ్యిపట్టి మంచంమీద కూర్చోబెట్టుకుంది.
"మారు కూడా వచ్చారు. బయట బాబాయి గారితో మాట్లాడుతున్నారు."
"అలాగా?" అతిథి మర్యాద కోసం ఆవిడ లేవబోయింది.
"మీరు కూర్చోండి పిన్నిగారూ! ఇప్పుడు టీలవీ ఏం పెట్టుకోకండి."
"నేనేమీ హడావిడి చెయ్యను. కాస్త టీ మాత్రం పెట్టుకొస్తాను."
"గతికితే అతకదని సామెత. పెళ్ళి సంబంధం తెచ్చి మీ ఇంట్లో అవీ ఇవీ తీసుకోకూడదు."
"పెళ్ళి సంబంధమా? ఎవరికి?" ఆవిడ ముఖంలో చెప్పలేనంత ఆశ్చర్యం.
"పెళ్ళికి రెడీగా అబ్బాయిని పెట్టుకుని సంబంధం ఎవరికని అడుగుతారేమిటి పిన్నిగారూ?"
ఆవిడ ముఖం మ్లానమైంది. "వాడు పెళ్ళి చేసుకుంటానంటే నాకీ బాధ ఎందుకు? గుండెలో ఈ నొప్పి ఎందుకు?"
"ఇహ మీ సుస్తీ, గుండెలో నొప్పి-అన్నీ మటుమాయం! మీ అబ్బాయి పెళ్ళికి ఒప్పుకొన్నాడు. నేనూ మావారూ కలిసి ఒప్పించాం. శనివారం వెంకటేశ్వరస్వామి గుడిలో పెళ్ళిచూపులు...."
"వాడేమిటి? పెళ్ళికి ఒప్పుకోవడం ఏమిటి? నేను నమ్మలేకుండా వున్నాను."
"ఒప్పుకున్నాడు పిన్నిగారూ! సంబంధం గురించి మాట్లాడడానికే నేనూ, మావారూ వచ్చాం. అమ్మాయి లెక్చరర్. మా మేనమామకూతురే- కాంచన. మీకు చూపెట్టాలని ఆల్బంలో ఫోటో వుంటే పట్టుకొచ్చాను" బ్యాగ్ లోంచి ఫోటో తీసి అందించింది. అది గ్రూప్ ఫోటో. "ఈ మధ్యలో కుర్చీలో మా మేనమామ, ఈవిడ ఆయన భార్య. ఇది కాంచన. ఇది దాని చెల్లెలు, వీడు తమ్ముడు!"
"పిల్ల లక్షణంగా వుంది. వాడు పెళ్ళికి ఒప్పుకోవడం, కథ పెళ్ళి చూపుల వరకూ రావడం...నాకేమిటో ఇంకా నమ్మబుద్ది కావడంలేదు!" ఆనందభాష్పాలతో ఆమె కళ్ళు జలజలలాడిపోతున్నాయి. "ఇంత తీయటి వార్త చెప్పిన నీకు నోరు తీపి చెయ్యకుండా ఎలా పంపిస్తాను?" ఆవిడకి ఒంట్లో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టుగా వుంది. స్వీట్ తెమ్మని నౌకర్ని బజారుకి పరిగెత్తించింది. తను కిచెన్ లోకి వెళ్ళి గ్యాస్ స్టౌ మీద టీకి నీళ్ళు పెట్టింది.
అర్చనకూడా వచ్చింది. డైనింగ్ టేబిల్ ముందున్న కుర్చీ జరుపుకుని కూర్చుంది.
"ఎన్నాళ్ళ నిరీక్షణ ఇది! ఎక్కడ ఏ అందమైన పిల్లను చూసినా వాడికి జోడీగా ఊహించుకొనేదాన్ని. ఊహలు ఊహలుగానే మిగిలిపోయాయి. వాడికి హాస్పిటలే ప్రపంచం. ఇంట్లో వున్నా ఏవో మెడికల్ జర్నల్స్, మ్యాగజైన్స్ తిరగేస్తుంటాడు తన గదిలో. ఇహ నేనూ, ఆయనా! ఆయనది మొదటినుండైనా కబుర్లాడే స్వభావం కాదు. చాలా ముక్తసరి మనిషి. ఏవో ఆధ్యాత్మిక గ్రంధాలు, న్యూస్ పేపర్స్ తిరగేస్తుంటారు. ఇహ నేను ఇంట్లో పూజా పునస్కారాలతో, వంటా వార్పులతో ఎంతసేపని పొద్దుబుచ్చను? ఇంట్లో కాస్త తోడుగా కోడలు రావాలని ఎంతగా పోరాడాను వాడిని? చివరికి మనోవ్యాధితో మంచమెక్కాల్సి వచ్చింది."
"ఇహ దిగులక్కరలేదు పిన్నిగారూ! ఏడాది రెండేళ్లు తిరగేసేసరికి మీ యిల్లు మనుషులు, మనుమరాళ్ళతో సందడిగా తయారవుతుంది!"
వీడ్కోలు తీసుకుంటూ చెప్పింది అర్చన_ "మీకు, మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చితే గుళ్ళో మేం కూర్చున్న చోటికి వచ్చి కూర్చోండి. నచ్చకపోతే మీ దారిన మీరు, మా దారిన మేమూ వచ్చేస్తాం."
శనివారం సాయంత్రం గుడికి బయల్దేరుతూ ఫోన్ చేసి చెప్పింది అర్చన.
అరవింద్ వాళ్ళమ్మగారిని వెంటబెట్టుకుని వెళ్ళేసరికి గుడిలో అర్చనా, ఆమె వెంట మరో యువతీ ప్రదక్షిణలు చేస్తూ కనిపించారు.
అరుంధతమ్మ తదేకంగా చూసింది. "బాగుందికదా?" సంతృప్తి నిండిన స్వరంతో నెమ్మదిగా అడిగింది కొడుకును.
"చూడ్డానికి బాగుంది."
"చూడ్డానికి కాకపోతే ఇంక దేనికి బాగుండాలి?"
"అమ్మాయి అభిరుచులూ, అభిప్రాయాలూ కూడా తెలియాలి కదా?"
"చదువుకుంది. ఆమె భావాలు కూడా ఉన్నతంగా వుంటాయని ఎందుకనుకోవు?" మాట్లాడుతూనే ప్రదక్షిణాలు పూర్తిచేశారు. వీళ్ళు కొబ్బరికాయ కొట్టి, హారతి, తీర్ధప్రసాదాలు తీసుకునేసరికి, అర్చన వాళ్ళు వెళ్ళి మంటపంలో ఓ పక్కన కూర్చున్నారు.