Home » Chandu harshavardhan » నల్లతంబి

ఆమెను చూసి ఠక్కున ఆగిపోయాడు రాజశేఖర్.
ప్రక్క గదిలో వున్న చందన కిటికీ చువ్వలకు ఆనుకుని వుంది. ఆమె చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి.
ఆ రోజున ఆ సంఘటన జరిగిన తరువాత ఆమె పూర్తిగా ముభావంగా వుండడం అతను గమనిస్తూనే వున్నాడు. తెల్లని మల్లెపువ్వులాంటి చీరలో దివి నుంచి దిగి వచ్చిన సౌందర్యాధి దేవత వీనస్ లా వుండే అందం ఆమెది. ఆ అందం ఎడారిలో పూచిన సిరివెన్నెల...
ఆమె ఆలోచనలలో....
తన ఆగమనంవల్ల అతని జీవితం అడవి కాచిన వెన్నెలగా వ్యర్ధమైపోతోన్నదన్న బాధ.
తాళి కట్టిన భర్తకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నానని అంతరాత్మ నిలదీస్తుంటే...తనను తను సమాధానపరచుకోలేకపోతోంది చందన.
తనలో చెలరేగే కోర్కెలను, ఆశలను నిర్ధాక్షిణ్యంగా అణచివేసుకోవడాన్ని ఏమనాలో గానీ ప్రస్తుతం వారిరువురు భార్యాభర్తల మధ్య వుండే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనురాగ బంధాలకు దూరమై పోతున్నారు.
లోకం దృష్టిలో తాము ఆదర్శ దంపతులు - అనురాగం ఇచ్చి పుచ్చుకుంటున్న దంపతులు. కానీ, వాస్తవం ఈ గది నాలుగు గోడల మధ్య సమాధి అయిన చేదు నిజం!
ఎంత కాలం ఈ మూగ వేదనను అనుభవించాలి? తమ జీవితాలకు సాఫల్యం ఏమిటి?
తెలిసో, తెలియకో ఒక వ్యక్తిని ప్రేమించింది తను. విధి ఆడిన వింత నాటకంలో ప్రేమ వరకే అతనితో నడిచి పెళ్ళి దగ్గరకొచ్చేసరికి మరికారి చిటికెన వ్రేలును పట్టుకుని ఏడు అడుగులు వేయవలసిన విచిత్ర పరిస్థితి ఎదురైంది.
పర్యవసానం....తన జీవితంతోపాటు అతని జీవితం కూడా అశాంతికి నిలయమైపోయింది. ఇక సుఖమాయ జీవితం అనేది ఎడారి ఎండమావిలా అగుపిస్తున్నది.
అతనిలోనూ ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అతను చందన గురించే ఆలోచిస్తున్నాడు.
తాను తాళి కట్టిన నేరానికి కుందనపు బొమ్మలాంటి చందన బ్రతుకు ఎండిన మోడులా అయిపోయిందనే బాధ అతనిలోనూ స్పష్టంగా కనిపిస్తున్నది. ఆమె చేసిన నేరమేమిటి? ముందూ వెనుకలూ ఆలోచించకుండా పూర్వాపరాలు విచారించకుండా తానే తొందరపడి మూడుముళ్ళు వేశాడు. ఆమె ఎవరినో ప్రేమించిందని తెలిసి తాను దూరంగా వున్నంత మాత్రాన ఆమెకు ఉపశమనం కలుగుతుందా? ఆమె సంతోషిస్తుందా? పరోక్షంగా ఆమెను మానసికంగా శిక్షిస్తున్నాడు తాను. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
రాజశేఖర్ మధనపడుతున్న ఆ సమయంలోనే తడబడుతున్న అడుగులతో చందన వచ్చి అతని పాదాలమీద పడి వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఆమెను ఆ స్థితిలో చూసిన రాజశేఖర్ హృదయం ద్రవించిపోయింది.
అప్రయత్నంగానే ఆమెను పైకి లేపి......కన్నులలో నిలిచినా నీటిని తుడిచి కన్నులతోనే అనునయించాడు.
"సారీ, చందనా! తాళి కట్టినంత మాత్రాన నీ మీద సర్వహక్కులు నాకున్నాయని ఆశపడను. ఆవేశపడను. అంతేకాదు, నిన్ను మలిన పరచను. నీ ప్రియుడికి ద్రోహం చేయలేను. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించడంలో నేను బలహీనపడే క్షణాలు ఏమయినా వస్తాయేమోనని నీకు దూరంగా వుంటున్నాను. అంతే కాని నీ మీద కోపం కాని, ద్వేషం కానీ నాకు లేవు. ప్లీజ్ నన్నర్ధం చేసుకో."
అతను క్షణం కూడా అక్కడ నిలవలేదు.
అది ఉపశమనమో....తిరస్కారమో.....అవమానమో!
గదిలో ఒంటరిగా వున్న చందన....ఒక స్త్రీగా తనకు తనే ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది.
                                              *    *    *
స్త్రీకి మాతృత్వం గొప్పవరం.
ప్రసవవేదానానంతరం బిడ్డను తీసుకుని గుండెలకు హత్తుకోవడం ప్రతి స్త్రీకి అపురూపమైన, మధురాతి మధురమైన అనుభూతి.
తన రక్తం పంచుకొని, పేగు తెంచుకొని పుట్టిన ఆ చిన్న జీవన రాజీవం కోసం అనుక్షణమూ తపించిపోవడం మాతృ హృదయంలో పొంగిపొరలే ప్రేమాభిమానాలకు సంకేతం!
బోసినవ్వులు చిందించే ఆ చిన్నారికీ కన్నా తల్లికీ మధ్య క్షణమైనా విడదీయరాని మమతానుబంధం పెనవేసుకుపోతుంది.
ఆ బంధం మూన్నాళ్ళ ముచ్చటైనప్పుడు ఆ తల్లిపడే వేదన వర్ణనాతీతం.
అలాంటి వ్యధలోనే ప్రస్తుతం ఒక ఇల్లాలు ఆ గది నాలుగు గోడల మధ్యనే తనలో తాను కుమిలిపోతున్నది.
కన్ను మూసినా తెరచినా పసిపిల్లల రూపమే ఆమె కనులముందు మెదిలి తీవ్రమైన అశాంతిని అలజడులను కలుగజేస్తున్నది.
ఆమె అనుపమ_పోలీస్ ఇన్ స్పెకర్ ధీరజ్ అర్ధాంగి.
"పిల్లలు పుట్టాలంటే అదృష్టం ఉండాలి తప్ప గుడులు-గోపురాలు చుట్టూ ప్రదక్షిణాలు చేసినందువల్ల ప్రయోజనం వుంటుందా? మన జన్మకు ఇంతే అని సరిపెట్టుకోవాలి. కాని, నిరంతరం దిగులుతో నువ్వూ బాధపడి నన్నూ క్షోభపెట్టినందువల్ల ఏమయినా ఉపయోగం వుంటుందా?"
అనునయించే ధోరణిలో ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు ధీరజ్.
"మీరు మగవారు ఎలాగయినా ఉండగలరు. నేను అలాకాదే. ఒక గొడ్రాలి మూగవేదన నాది". గొంతు గాద్గదికమైపోగా క్షణం చెప్పడం ఆపింది అనుపమ.
"సరే, ఒక పని చెయ్యి. నీకు అభ్యంతరం లేకపోతే అనాధ శరణాలయానికి వెళ్ళి ఎవరినయినా తెచ్చి పెంచుకుందాం. అంతే తప్ప అనుక్షణమూ దుఃఖిస్తూనే కూర్చుంటే ఈ ఇల్లు అశాంతికి నిలయమై పోతుంది."
"పరాయి బిడ్డ మన కన్నబిడ్డ కాగలదా?"
"సరే, నీ ఇష్టం! నీ బాధ చూడలేక ఆ సలహా ఇచ్చాను. నీకు ఇష్టం లేకపోతే మానెయ్యి. అంతేకాని క్షణక్షణమూ నన్ను ఈటెల్లాంటి మాటలతో తూట్లు పొడవద్దు." విసురుగా లోపల గదిలోకి వెళ్ళిపోయాడు ధీరజ్.
అతను వేల్లినవైపు చూసి నిట్టూర్చింది అనుపమ.
భర్త గదిలో నుంచి వస్తున్న చప్పుళ్ళనుబట్టి అక్కడ ఏం జరుగుతున్నదో అర్ధమైంది. అయినా మనస్సు ఉండబట్టలేక కిటికీ తెరను తొలగించి చూసింది. విస్కీని గ్లాసులోకి వంచుకుంటున్నాడు ధీరజ్.
అతని ముఖం కందివుండడం గమనించింది.
విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయిన సందర్బంలోనే అతను మందుపుచ్చుకుంటాడని తెలుసు.
తను అనవసరంగా అతని మనస్సును కష్టపెట్టలేదుకదా?
ప్రతి సమస్యకు పరిష్కారం వున్నట్టు అతను చెప్పినట్టు తన సమస్యకూ పరిష్కారం వుంది.
అనాధ శరణాలయం నుంచి ఎవరయినా అనాధను తెచ్చుకుని పెంచుకుంటే సరిపోతుందేమో! భర్త సలహానే పాటించాలని అనుపమకు ఆ క్షణంలో అనిపించింది.
పెంచిన మమకారం కన్న మమకారం కాగాలుగుతుందా?
ఎందుకు కాకూడదు? కన్న మమకారం కంటే పెంచిన మమకారమే ఉన్నతమైందని అంటారు మరి!
తన భర్త ఇచ్చిన సలహా చుట్టూ అనుపమ ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి.
                                  *    *    *
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్ ప్రెస్ రాజమండ్రి స్టేషనులో ఆగింది.
అంతవరకూ కాంటీన్ లో కాఫీ తాగుతున్న అధికారి, సంజీవి ఫ్లాట్ ఫారమ్ మీదకు వచ్చారు.
త్రీటైర్ బోగీ దగ్గర టి.టి.ఇ. కోసం పరిశీలనగా చూసిన అధికారి చూపులు ఒకచోట ఆగిపోయాయి.
బోగీకి కొంచెం దూరంగా ఒక మధ్యవయస్కురాలితో మాట్టాడుతూ కనిపించాడు టి.టి.ఇ. అధికారి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటు నడిచాడు.
"సర్...! అనకాపల్లి వెళ్ళడానికి రెండు బెర్త్ లు కావాలి."
"నో అకామడేషన్" అంటూ మధ్యలో వచ్చిన అతనివైపు టి.టి.ఇ విసుగ్గా చూశాడు.
అధికారి వెంటనే పర్సులోనుంచి రెండు వందనోట్లు తీసి టిక్కెట్ల కింద పెట్టి అతని చేతికందించాడు.
అతని ముఖం క్షణంలో విప్పారింది. "సామర్లకోట ఖాళీగానే వుంది. 510 నెంబరు కోచ్ లో పది, పదకొండులో కూర్చోండి. ట్రెయిన్ బయలుదేరాక వస్తాను" అంటూ టిక్కెట్లు, నోట్లు కోటు జేబులో వేసుకున్నాడు టి.టి.ఇ.
అధికారి 510 నెంబరు కోచ్ లోకి ప్రవేశించాడు. మగవాడి వేషంలో వున్న సంజీవి అతన్ని అనుసరించింది.
మూడు కావడానికి పావుగంట వ్యవధి వుంది. వైజాగ్ వెళ్ళే వాళ్ళంతా నిద్రలో జోగుతున్నారు.
తమకు ఎలాట్ చేసిన బెర్తులు సింగిల్ సీట్లవి కావడంవల్ల కింది దానిలో సంజీవిని పడుకోమని చెప్పి తను పై బెర్తుకు చేరుకున్నాడు అధికారి.
వాళ్ళు ఉన్న బెర్తుకు దగ్గరలోనే ఒక రాజకీయ నాయకుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతను వట్టి రాజకీయనాయకుడు మాత్రమే కాదు, పాలకపక్ష ఎం.ఎల్.ఏ., పైపెచ్చు సివిల్ సప్లయిస్ ప్లస్ విజిలెన్స్ మంత్రిగారు కూడా!
అతని బెర్తుకు రెండు వైపులా ఉన్న బాడీగార్డులు నిద్రలో జోగుతున్నారు.
అయితే, సాక్షాత్తూ ఒక రాష్ట్రమంత్రి రైలులో అదీ త్రీటైర్ లో ప్రజలతోపాటు మామూలు ప్రయాణం చేస్తున్నాడంటే ఎవరయినా ఆశ్చర్య పోతారు. కానీ ఇది నిజం.
ఎందుకంటే విమాన ప్రమాదాలు, బస్సు ప్రమాదాలను తప్పించుకోవలెనంటే రైలులో ప్రయాణించడం సురక్షితం అని ఆయన అభిప్రాయం.
సదరు మంత్రిగారు విశాఖజిల్లా ఇన్ చార్జ్ మంత్రి కావడంవల్ల రాబోయే సార్వత్రిక ఎన్నికలకోసం వివిధ వర్గాల ద్వారా వసూలైన పార్టీ ఫండు రెండు కోట్లను నగరంలోని హైకమాండ్ కు అందజేసి తిరిగి వస్తున్నాడు.
ఎక్స్ ప్రెస్ రాజమండ్రి స్టేషన్ ను వదిలింది.
తెలతెలవారుతుండగా అనకాపల్లి స్టేషనులో ఆగింది.
ట్రయిన్ ఆగీఆగడంతో అధికారి, సంజీవి కిందకు దిగారు.
ఇది జరిగిన గంట తరువాత విశాఖపట్టనంలో రైలు ఆగాక కానీ తన సూట్ కేసులు మారిపోయిన సంగతి మంత్రిగారికి తెలీలేదు.
ఆయన అనుచరగణం చేసిన హడావుడికి పోలీసులు గుమికూడారు.
సూట్ కేసులు మారిపోయిన విషయం క్షణాలమీద తెలిసిస్పోయింది అందరికీ.
"ఏమైంది సర్? సూట్ కేసులు మారిపోయాయా? వాటిలో ఏమున్నాయి? అవి ఏ రంగులో వుంటాయి? ఎక్కడ మారిపోయి వుండవచ్చు?" అంటూ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆ మాటలకు మంత్రిగారికి పచ్చివెలక్కాయ గొంతుకడ్డు పడ్డట్టయింది. ఆ సూట్ కేసులలో ఏముందంటే ఎం చెప్పగలడు?
తన దగ్గర ఏమీ లేదనీ, రిక్తహస్తాలతో తిరిగి వస్తున్నాదనీ తమ పార్టీ నాయకులకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు రెండు కోట్ల విలువచేసే సొమ్ము ఉన్న సూట్ కేసులు పోయాయని చెపితే ఎవరూ నమ్మరు సరిగదా, అంతడబ్బు ఎక్కడినుంచి వచ్చిందనే సందేహం వస్తుంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra