హమీద్ భాయ్ గడ్డానికి సోప్ రాసుకుని షేవింగ్ చేసుకోబోతూండగా బయటనుంచి కేక- వెనుకే డోర్ బెల్ శబ్దం వినిపించింది.
"ప్రెసిడెంట్ గారూ! ప్రెసిడెంట్ గారూ-"
"ఆరై భయ్ ఆరై-" అంటూ గడ్డానికి సోప్ తోనే బయటికొచ్చాడతను.
అతని అవతారం చూసి డోర్ బెల్ మోగించిన శాస్త్రి కొంచెం చమ్ కాయించి సర్దుకున్నాడు.
"ఇదేంటి సార్- నేను పరేషానయినా-"
"నిమిషానికొకడు దర్వాజా బాదుతూంటే ఇలా రాకుండా ఇంకెలా వస్తయ్?" చిరాగ్గా అన్నాడు హమీద్ మియా.
రోజూ గడ్డం చేసుకునేప్పుడే అందరూ ఇంటిమీద పడి డిస్టర్బ్ చేయటం అతనికి చిరాగ్గా ఉంది.
"ఇంతకూ బాత్ క్యాహై శాస్త్రీ సాబ్! పొద్దుటేల్ పొద్దుటేల్ ఎందుకు వచ్చినయ్ నువ్వు?" అడిగాడతను.
"వచ్చినయ్ అనగూడదు సార్- ఎందుకు వచ్చారు అనాలి-"
"గ్రామర్ క్లాసు తర్వాత భయ్- బాత్ క్యాహై బోలో-"
"ఇంకేముంది? మా 'డి' బ్లాక్ లో మంచి నీళ్ళు రావటంలే! పదిపదిహేను రోజులకొకసారి ఇదే లొల్లి! మీ కమిటీ వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా యాక్షన్ తీసుకోలేదు"
హమీద్ మియా చిరాగ్గా సెల్ తీసి వైస్ ప్రెసిడెంట్ మొహిందర్ ఫోన్ చేశాడు.
"మొహిందర్ భాయ్- ఆ 'డి' బ్లాక్ లో ఫిర్ సే పానీ బంద్ హో గయా హై! దాని రిపేర్ల సంగతి ఏం చేసినయ్?"
"ఆ రిపేర్లు చేయించమని ఆర్గనైజింగ్ సెక్రటరీకి చెప్పాను కదా" అన్నాడతను.
వెంటనే ఆర్గనైజింగ్ సెక్రటరీకి ఫోన్ చేశాడు హమీద్ మియా.
"అదా! వాటర్ వ్యవహారాలన్నీ విజయ్ యాదవ్ చూస్తున్నాడు" చెప్పాడతను.
విజయ్ యాదవ్ కి ఫోన్ చేస్తే-
"శంకరమూర్తికి చెప్పాను సార్-" అని జవాబు రావడంతో హమీద్ మియాకి విసుగొచ్చింది.
అప్పుడే వాచ్ మెన్ అక్కడికొచ్చాడు.
"సార్ 'డి' బ్లాక్ లో నీళ్ళు రావటం లేదంట! దాని రిపేర్ల సంగతి మీతో మాట్లాడమని శంకర్ మూర్తి సార్ చెప్పిండు-" అన్నాడు.
"అంటే నేను చెప్పిన పని తిరిగి తిరిగి నాకే చేయమని చెప్తున్నయ్! సరే శాస్త్రీ సాబ్ నేను ఇయాళ మీటింగ్ పెట్టి డిసైడ్ జేస్తుంది-"
శాస్త్రి వెళ్ళిపోగానే మళ్ళీ గడ్డం చేసుకోబోతూంటే మళ్ళీ డోర్ బెల్...
"థూ! ఇస్కి......." అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా విశ్వనాథం-
"ఇదిగో ప్రెసిడెంట్ సాబ్! మళ్ళీ ఇవాళ ఎవడో నా మిల్క్ పాకెట్ లోని పాలు సగం కాజేశాడు- కిందటిసారి కూడా నీకీవిషయం చెప్పా! ఎవరో కావాలని కుట్రపన్ని ఈ పని చేస్తున్నారు! నువ్వేం యాక్షన్ తీసుకోవా!"
హమీద్ మియాకి మండిపోయింది.
"అంటే? ఏంది నువ్ చెప్పేది? మై పోలీస్ నా నౌఖరీ కరూ? మై మిల్క్ పాకెట్స్ కా చౌకీదార్ హూ? క్యా బాత్ కర్ రహే హై మియా?"
అదే సమయంలో- ఆ పక్క ఫ్లాట్లో ఉన్న హనుమంతరావ్ తన కొడుకు శ్రీనుతో హోంవర్క్ చేయిస్తున్నాడు.
"సిక్స్ ఎయిటీ జార్ ఎంత?"
శ్రీను తన కాలిక్యులేటర్ తీసి లెక్క కట్టబోయాడు గానీ హనుమంతరావ్ ఠక్కున లాగేసుకున్నాడు.
"ఏంట్రా! సిక్స్ ఎయిటీ జార్ చెప్పడానికి నీకు కాలిక్యులేటర్ కావాలా? ఏడోక్లాసు చదువుతున్నావ్- టేబుల్స్ అన్నీ బైహార్ట్ రావాలె నీకు?"
శ్రీను చిరాగ్గా చూశాడు.
"అట్లాగా! అయితే మీ ఆఫీసర్ సెల్ నెంబరెంతో చెప్పు చూద్దాం-"
"నీకెందుకది?"
"అసలు చెప్పు చూద్దాం-"
హనుమంతరావ్ తన సెల్ ఫోన్ లో ఆ నెంబరు వెతకబోయాడు.
"నీకేమయినా తెలివుందా డాడీ! తెల్లారిలేస్తే పాతికసార్లు మీ బాస్ తో మాట్లాడుతుంటావ్- అయినా నెంబర్ ఇంతవరకూ బైహర్ట్ చేయలేకపోయావ్-"
"ఒరేయ్" అంటూ తండ్రి చెవి మెలిపెడుతూంటే "అబ్బ" అంటూ గావుకేక పెట్టాడు.
"ఏంట్రా! నొప్పా? మా తాత మా నాన్న చెవి మెలేస్తేనే మా నాన్నకు చదువొచ్చింది. మా నాన్న నా చెవి మెలిపెడితేనే నాకు చదువొచ్చింది. అందుకని నేను నీ చెవి మెలిపెడుతూనే నీకు చదువొస్తుంది- అవునా, కాదా?"
"ఓకే డాడీ- నీకోమాట చెప్పనా?"
"ఏంటది?"
"వంశపారంపర్యంగా వస్తోన్న ఈ గూండాయిజాన్ని మన తరంతో ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్లీజ్ బిహేవ్ లైక్ ఏ డాడ్" అనేసి చెవి వదిలించుకుని వెళ్ళిపోయాడు వాడు.
హనుమంతరావ్ షాకింగ్ ఎక్స్ ప్రెషన్ చూసి అతనిభార్య కనకం నవ్వింది.
"ఏడో క్లాస్ కే నాకిలా వార్నింగిచ్చాడంటే టెన్త్ కొచ్చేసరికి ఎలా ఉంటాడంటావ్?"
"వీర ఉతుకుడే..... డౌటెందుకు?" అన్నాడు శంకరమూర్తి ఇంట్లోకొస్తూ.
"నోనో- వీడినిలా వదుల్తే లాభం లేదు. బైఫోర్స్ అయినాసరే డిజిప్లిన్ లో పెడతా"
"ట్రై చెయ్ చూద్దాం!" విజయ్ లోపలికొచ్చాడు హమీద్ తోపాటు.
అప్పుడే స్కూల్ బ్యాగ్ భుజానేసుకుని బయటికొచ్చాడు శ్రీను.
"మమ్మీ ఫిఫ్టీరూపీస్ పాకెట్ మనీ ఇవ్వూ!"
"ఫిఫ్టీ రుపీసా?" అదిరిపడ్డాడు హనుమంతు.
"మనమేం లక్షాధికారులమా? రోజూ నువ్వో యాభై, నేనో యాభై ఖర్చు చేస్తే డబ్బెలా సరిపోద్ది?" దబాయించాడు హనుమంతు.