ఇక ఆ పరిస్థితుల్లో ఏం మాట్లాడినా సమర్థించుకోవడానికే అవుతుందని మౌనంగా వుండిపోయాడు.
"ప్రజలు డబ్బుతో(బ్యాంకుల నుండి) ఆ ఫ్యాక్టరీ ప్రారంభించారు. అందులో మీరు ఉద్యోగులయ్యారు. వారికి లాభాలు....మీకు బ్రతుకుతెరువు___జీతాల పెనుగుదల.....మరి సగటు భారతీయుడికి......?
ఓకే.......లీవ్ ఇట్....
మేన్ మేడ్ డిజాస్టర్స్ ఎన్ని సంభవింవాయి మీ ఫ్యాక్టరీలో.....? అర్థం కాలేదా? ఫ్యాక్టరీ వినాశనానికి మీరు చేసిన దాడులు......?"
విషయంలో లోతుకు వెళ్ళినకొద్దీ ఆమె ముందు ఆదిత్య అల్పుడైపోతున్నాడు.
"దాదాపు పదిహేను"
"మీరు బేసిక్ పెరగలేదని ఒక యూనిట్ లోని మిషన్ ని నాశసం చేశారు. ఇంక్రిమెంట్సు పెంచలేదని గోడౌన్ ని తగులబెట్టారు క్వార్టర్స్ కట్టించలేదని ప్రోడక్టు క్వాలిటీని దెబ్బతీసారు......" అంటూ బెల్ నొక్కింది.
మరలా ప్రారంభించింది___
"మీ పిల్లలకు స్కూల్ ఫ్రీ అలవెన్స్ ఇవ్వలేదని బాయిలర్ ని తగులబెట్టారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవటం కోసం మీ యాజమాన్యం వస్తువు రేటు పెంచి ఒడ్డెక్కింది. మీ డిమాండ్స్ పరిష్కరింపబడి మీరు ఒడ్డెక్కారు. ఆల్టిమేంట్ సఫరల్స్ ఎవరు" అంతకంతకు ఆమె మాటల్లో పెరుగుతున్న తీవ్రతను ఆదిత్య గమనించక పోలేదు.
ఇకామె ఫైనాన్స్ చేయదచి తేలిపోయింది.
అంతలో ఓ అటెండర్ ఓ ప్లాస్టిక్ బకెట్ తెచ్చి సాహితిముందున్న టేబుల్ మీద ఉంచాడు.
"సీ....ఇది మీ కంపెనీ తయారు చేసినదేనా?"
"యస్ మేడమ్."
"దీన్ని మా అటెండర్ కొని కరెక్టుగా 120 రోజులు. కనీసం ఆరు నెలలన్నా కాకముందే దీనికి రెండు పగుళ్ళు వచ్చాయి. ఈ పగుళ్ళు అతని మేన్ హేండ్లింగ్ వల్ల వచ్చినవికావు. అపురూపమైన వస్తువుగా చూసుకున్నా వచ్చాయంటే ఏమిటర్థం.......? నాణ్యతలోపం. అంటే ఇక్కడ రెండు జరిగి ఉండాలి. ఒకటి యాజమాన్యమే నాసిరకం ముడిపదార్థాన్ని మీకు అందించి ఉండాలి. మీ సైడ్ నుంచి ఆలోచిస్తే మన కెందుకులే వీటి నాణ్యత___క్వాంటిటీ మనకు కావాల్సింది అని మీ ఉద్దేశ్యం అయి ఉండాలి. లేదా ముడి సరుకులు మంచివే అయినా మీ అశ్రద్థ వలన ఈ రకమైన వస్తువులు తయారయి ఉండాలి. వీటి వలన తెలుస్తున్న దేమిటి.....? ఒకటి మీ యాజమాన్యపు అక్రమార్జన, రెండు మీ నిర్లక్ష్యం.
మీ ఇద్దరి గురించే మీరాలోచిస్తున్నారు తప్ప మీకు అస్థిత్వాన్ని ఇస్తూన్న పేద వినియోగదారుల గురించి ఆలోచించలేదు.
మీరు, మీ యాజమాన్యం ఆడుకొనే పారిశ్రామిక ఆవేశకావేశ స్వార్గపర అశాంతి చదరంగంలో సామాన్యులు పావులు. ఆ తర్వాత దేశ ఆర్ధిక స్థితి మరోపావు. మీ సమ్మె సందర్భంగా ఎన్ని బస్సులుతగలెట్టారు......? దాదాపు పదిహేను. అంటే 60 లక్షలనష్టం.
ఆ బస్సులు మీవికావు......మీ యజమానివి కావు, ప్రజలవి! కాని అసంతృప్తి నలుగురి దృష్టిలో పడేందుకు.....ఆ విధంగా మీ యాజమాన్యంపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు నాశనం చేసారు.
మీ అన్నలు ఏదో చేయలేదని మీ తమ్ముళ్ళను చంపుకున్నట్లే గదా?!
వాటిని సృష్టించ శక్తిలేని మీరు నాశనం మాత్రం చేశారు.
అలాగే మరో కంపెనీ వర్కర్స్ మరికొన్ని బస్సులు, రైళ్ళు.... టోటల్ గా జరిగేదేమిటంటే బస్సు చార్జీలు పెరగటం. ఈ వినాశనం ఏ మాత్రం సంబంధంలేని సామాన్యులు పెరిగిన బస్సు ధరల్నిగతిలేక ఆయాసంగా చెల్లిస్తున్నారు. మీకు మాత్రం కంపెనీ బస్సులుంటాయి. లేదంటే కన్వేయన్స్ ఎలవెన్స్-ప్రయాణపు భత్యం-కంపెనీ చెల్లిస్తుంది.
ప్రజలు డబ్బుకు జవాబుదారి కాదు-వివాశనానికి జవాబుదారికాదు- చితికిపోతున్న దేశ ఆర్ధిక స్థితికి జవాబుదారి కాదు- దేశం నాశనమైనా, మీకు సంబంధంలేదు దేశభక్తి అంటే అసలు తెలియనే తెలియదు.
మీకు అన్నం పెట్టే తల్లిలాంటి ఫ్యాక్టరీ నాశనం అయినా, మాతృభూమి మరుభూమి అయినా మీకేం చీకూ చింతాలేదు. మీ యాజమాన్యానికి లాభాలు, మీకు మీ డిమాండ్స్ తీరితేచాలుకాదూ!?
మరో విషయం.....మీ స్థానంలో మీ యజమాని ఉన్నాడనుకో..... అప్పుడు నా విమర్శలో వారే ప్రధానమావుతారు. అప్పుడు నేనడిగేమొదటి పాయింట్.....మీ వర్కర్స్ తో పని చేయించుకుంటూ, లాభాలార్జిస్తూ, వారి సమస్యల్ని గాలిక్జి వదిలేసి అటు వినియోగదారుల్ని, ఇటు మీ వర్కర్స్ ని మోసం చేస్తున్నారేం అనడుగుతాను.
మీ ఇద్దరిలో ఎవర్ని ఏది అడిగినా సమిధలుమాత్రం సామాన్య ప్రజ. చివరగా దేశం__అంతేనా?"
ప్రవాహంలా సాగిన ఆమె ఘాటైన ప్రసంగంలోని ప్రతి ప్రశ్న ఒక్కో కొరడాదెబ్బలా వచ్చి తగిలినట్లనిపించింది. ఆదిత్యకు.
అంతటి మేధాశక్తి, దాని వెనుక ప్రతి సమస్యను రూట్ అవుట్ చేయగల అపూర్వమైన పరిసీలనాత్మకత, ఈ రెంటివెనుక ఉన్న దేశ భక్తీ, తన దేశ సామాన్య ప్రజలపట్ల తనకున్న సానుభూతి, అభిమానం, ప్రేమ ఓహొ....అపూర్వమైన స్త్రీ__
అ అనిబీసెంట్.....ఓ మదర్ తెరిస్సా......ఓ సరోజీనీనాయుడు..... మహొన్నతమైన ఈ ముగ్గురు స్త్రీల ఉత్కృష్టతకు ఈమె పుణికి పుచ్చుకుందా?
తనొచ్చినపని మర్చిపోయాడు__
తనను విమర్శించిందన్న ప్రసక్తిలేదు....
ఆమె ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని, పరిపూర్ణతను కొలచే ప్రయత్నంలో దిగ్ర్భామ చెందాడు.