Previous Page Next Page 
69 సర్దార్ పటేల్ రోడ్ పేజి 18

 

    అమాంతం సీత చెక్కిలి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆ వుద్వేగంలో.
    నటరాజ్ చటుక్కున కళ్ళు మూసుకున్నాడు.
    "గవర్నమెంట్ ప్రతీ యింటికీ కూడా ఓ సెన్సార్ బోర్డుని వేస్తె కానీ లాభం లేదండీ."
    సీత సిగ్గుపడిపోయింది.
    "మరీ చిన్న పిల్లలయిపోతున్నారు."
    రామచంద్రమూర్తి చటుక్కున జేబులో నుంచి కళ్ళజోడు తీసి ఆమె కళ్ళకి అమర్చాడు.
    "ఇది నేనిచ్చే పెళ్ళి రోజు కానుక."
    సీత ఆనందంతో పొంగిపోయింది.
    "థాంక్యు!"
    "నువ్వింక మనసు బాగోనప్పుడల్లా హాయిగా 'కన్యాశుల్కం' చదువుకోవచ్చు, మనసారా నవ్వుకోవచ్చు, గిరీశం డైలాగులు అదివరకు లాగా నాకు చదివి వినిపించవచ్చు. నటరాజ్ కన్యాశుల్కం పుస్తకం తేవోయ్."
    సీత ముఖం వాడిపోయింది . నటరాజ్ లోపలి గదిలోకెళుతుంటే.
    "ఇప్పుడా పుస్తకానికి తొందరేమొచ్చింది కానీ, మీరా రికార్డ్ వేసుకోండి.'
    రామచంద్రమూర్తి కదల్లేదు. అతనికి మాట కూడా రావటం లేదు.
    నటరాజ్ తిరిగి వచ్చాడు.
    "సీతమ్మ గారి లైబ్రరీలో పుస్తకాలేమీ కనిపించటం లేదండి! అల్మారా ఖాళీ."
    అతనికి అర్ధమయింది.
    ఉయ్యాల బల్లమీద వాలిపోయి పగలబడి నవ్వసాగాడు.
    "నాకా రికార్డ్ యిష్టమని , అది కొనడానికి నీకిష్టమయిన పుస్తకాలన్నీ అమ్మేశావు. నీ కిష్టమైన పుస్తకాలు చదువుకోవడానికి నీకు కళ్ళజోడు లేకుండా పోయిందని నేను గ్రామఫోన్ అమ్మి కళ్ళజోడు తీసుకొచ్చాను."
    నటరాజ్ కి  కూడా నవ్వాగలేదు.
    ఇద్దరూ నవ్వుతుంటే సీతకు మాత్రం కన్నీళ్ళు కారిపోతున్నాయి.
    "మీ యిద్దరికీ పిచ్చేక్కినట్లుంది! ఇందులో అంత పగలబడి నవ్వాల్సిన విషయమేముంది?' రోషంగా అందామె.
    "ఊరికే విరగబడి నవ్వడం మన తెలుగువాళ్ళ సంస్కృతండీ! కావాలంటే తెలుగు సినిమాలు, తెలుగు టీవీ చూడండి. నా స్టేట్ మెంట్ రాంగయితే చెప్పుచ్చుకొట్టండి."
    "మీరేమనుకోనంటే నాదో బెస్ట్ సజెషన్ సర్" అన్నాడు నటరాజ్.
    "ఏమిటది?" క్రాస్ వర్డ్ ఫజిల్ లో ఓ ఐటమ్ ని తీక్షణంగా పరిశీలిస్తూ అన్నాడు రామచంద్రమూర్తి.
    "మన ఆర్ధిక పరిస్థితి చూస్తుంటే నాకు భయం వేస్తోంది సార్! అచ్చం మన్ మోహన్ సింగ్ గారి పరిస్థితిలాగా వుంది. ఆఫ్ కోర్స్ అయన కంటే మనం కొంచెం మెరుగానుకోండి! ఎందుకంటే వాళ్ళకు హర్షద్ మెహతాలున్నారు గానీ మనకు లేరు కదా! మీకు తెలీదేమో! బియ్యం స్టాక్ చాలా వేగంగా తగ్గిపోతోంది . అందుకని నా సలహా ఏమిటంటే మనం యింట్లో ఒక పేయింగ్ గెస్ట్ ని పెట్టుకుంటే గానీ కొంత వరకయినా కోలుకోలెం!"
    రామచంద్రమూర్తి అతని సలహాకు ఆశ్చర్యపోయాడు.
    "పేయింగ్ గెస్టా?"
    "అవున్సార్! మంచివాడిని చూసి పెట్టుకున్నామనుకొండి ఇటు మనకి మంచి కాలక్షేపమూ వుంటుంది. అటు కొంతవరకూ యిల్లు కూడా గడుస్తుంది.
    అతను ఆలోచనలో పడ్డాడు.
    ఆలోచిస్తున్న కొద్దీ ఆ ఐడియా బాగానే వున్నట్లనిపించింది.
    సీత కూడా ఆ ఆలోచనను వెంటనే ఆమోదించింది. ఆమె కెందుకో లోలోపల అనిపిస్తుంది. రామచంద్రమూర్తి ఫెన్షన్ యింక ఎప్పటికీ రాదేమోనని! ఒకవేళ ఎప్పటికో వచ్చినా అప్పటికి తామిద్దరూ వుండకపోవచ్చు.
    "అయితే ఇవాళే న్యూస్ పేపర్లో ఎడ్వర్డయిజ్ మెంట్ యిచ్చేస్తాన్సర్!" అన్నాడు నటరాజ్ వుత్సాహంగా.
    ఆ మర్నాడు న్యూస్ పేపర్లో ప్రకటన రానే వచ్చింది.
    ఆ ప్రకటన చూసి మస్తాన్రావ్ పరుగున వచ్చాడు.
    "ఏమిటి మూర్తి! ఆ ఎడ్వర్టయిజ్ మెంట్ నిజంగా నువ్వే యిచ్చావా?"
    "అవును! ఏం?"
    "అహహ ఏం లేదు , నీ పొజిషన్ నిజంగా అంత బావుండలేదన్న సంగతి నాకు తెలీదు."
    "గవర్నమెంట్ లో సిన్సియర్ గా పనిచేసిన వాడి పొజిషన్ ఎప్పుడు అలాగే వుంటుందిలే" నవ్వుతూ అన్నాడతను.
    వాళ్ళు మాట్లాడుతుండగానే నటరాజ్ పరుగుతో వచ్చాడు అతని దగ్గరకు.

 Previous Page Next Page