Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 18

    కూతురు మూర్ఖత్వం, మొండిధోరణి, ఆమాటలు విశ్వనాధంగార్కి కోపం తెప్పిస్తున్నా, కోపం కంటే ఆశ్చర్యం ఎక్కువైంది ఆయనకి. రూప ఏం చేస్తుందో ఎలా సాధిస్తుందో, ఏ ధైర్యంతో ఇన్ని మాటలు మాట్లాడుతుందో, ఏ అండతో ఇదంత సాధిస్తానంటుందో ఆయనకేం అంతుబట్టలేదు. ఇంత మొండిగా ఎందుకు మాట్లాడుతుందో, ఆఖరికిదంతా ఎలా తయారవుతుందో అని అయన బుర్ర పాడయింది.
    "పద్మా! దీనికేదో పిచ్చి పట్టింది. కాళ్ళు చేతులు కట్టి గదిలో పారేయ్ ఆ పిచ్చి వదిలేవరకు గదిలో తిండి పెట్టకుండా పడుకోబెట్టు నల్గురోజులలో దారికి వస్తుంది. వూరుకుంటున్నకొద్ది రెచ్చిపోతుంది. కాళ్ళు చేతులు విరగ్గోడ్తాను గుమ్మం కదిలితే ఈసారి. చేసిన నిర్వాకం చాలు. మమ్మల్ని ఇలానైనా బతకని. మా పరువు ఇప్పటికే నడిబజారెక్కింది. ఇంకా కోర్టులు, పేపర్లలో కుడా ఎక్కాలా? పిచ్చి వేషాలు ఆలోచనలు మాని ఇంట్లో పడుండు. ఆ తర్వాత నీ రాత ఎలా వుంటే అలా అవుతుంది. ఎంత చేద్దామనుకున్నాను. ఎన్ని సంబంధాలు చూస్తున్నాను. మంచి మొగుడ్ని తెవాలనుకున్నాను. మంచి ఇంట్లో పడేయ్యాలనుకున్నాను, హు మన చేతిలో ఏముంది. నీ ఖర్మ ఎలా కల్గి ఈ పెడ బుద్దులు పుట్టాయి."
    కూతురి భవిష్యత్తు తలుచుకుంటే ఆయనకి బాధా, ఆవేదన దాంతో బాటు ఆ కలలన్ని కల్లలు చేసిన రూపమీద కోపం, అసహ్యం ఏవేవో భావాలు కలగసాగాయి.
    "నన్నెవరు' ఏం చెయ్యలేరు ఆపలేరు. నేను అనుకున్నది సాధిస్తాను. నేనేం చిన్నపిల్లని కాను, ఇది నా జీవిత సమస్య. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను. దయచేసి నా దారికి అడ్డు రాకండి. నా ఖర్మానికి నన్ను వదలండి. మికిదంతా యిష్టం లేకుంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అంతేగాని నన్ను కట్టడి చేయడానికి ప్రయత్నించకండి" రూప మొండిగా అంది.
    "ఎక్కడికే పోతావు. అడుక్కు తింటావు రోడ్డంట. నీ బతుక్కి, నీ చదువుకి పిలిచి ఉద్యోగాలు ఇచ్చేస్తారనుకుంతున్నవా! ఏం చూసుకునే ఆ మిడిసిపాటు. పోతా పోతా అని బెదిరిస్తున్నావు, ఇల్లు దాటితే నీ గతి కుక్కలకి కూడా పట్టదు. ఏమనుకుంటున్నావో.....బజారు పాలవాలి......అదొక్కటే నీకు దారి ఏం చూసుకుని మమ్మల్ని ఏదిరిస్తున్నావు. నీ మేలు కోరే వాళ్ళమీద తిరగాబడ్తున్నవా. ఇంత జరిగినా నీకు బుద్ది రాదీమే? పాపిష్టి దానా, నీ రాత ఇలా తగలబడబట్టే నీకి ఆలోచనలన్నీ వస్తున్నాయి.....పద్మావతి కోపం పట్టలేకపోయి
    "పద్మా! దీంతో ఇంక లాభం లేదు. దినివరస చుస్తే ఏదో చేసేట్టే వుంది. లాక్కెళ్ళి ఆ గదిలో పడేయ్.....దాని బతుకు కుక్కలు చింపిన విస్తరి చేసుకుని, మనల్ని ఈమాత్రం శాంతిగా కూడ బతకనియదు దీన్ని వదిలితే తరువాత సంగతి తరువాత ముందు గదిలో పడేసి గొళ్ళెం పెట్టు ఊ....పద" విశ్వనాధంగారూ, పద్మ చెరోరెక్క పట్టి లాగి గదిలోకి లాక్కెళ్ళరు.
    "వదలండి నన్ను. నేను ఇంట్లోంచి పోతా, నన్ను వదలండి నన్ను మీరు బంధించలేరు......నేను అనుకున్నది చేసితిర్తాను. నన్ను వదలండి....రూప గించుకుంటు పిచ్చిపట్టినదానిలా అరిచింది.....ఆ దెబ్బతో నిజంగా కూతురికి మతి స్థిమితం తప్పిందేమోనన్న అనుమానం వచ్చింది పద్మావతికి. భర్త మొహంలోకి ఆదుర్దాగా చూసింది. అయన ఓరిమి ఆఖరిమెట్టుకు చేరింది. పట్టరాని ఆవేశంతో రూప జుత్తు పట్టుకు యిడ్చు కెళ్ళి గదిలోకి తోసి.....
    "నీకిదే మందు. నీ పిచ్చి కుదిరేవరకు నీకిదే శాస్తి " అంటూ బయట గొళ్ళెం పెట్టేశారు.
    లోపల్నించి రూప తలుపులు బాదింది. అరిచింది. గోల చేసింది. ఆ రభసకి ఇద్దరూ బయట తలలు పట్టుకు కూర్చున్నారు. హటాత్తుగా మీద పడిన ఈ విపత్తు వాళ్ళిద్దరి మతులు పోగొట్టింది. అసలే రూప చేసిన పనికి మనసులు పాడయిన వాళ్ళకి రూప ఈ మొండితనం, మితందవాదం చూసి కర్తవ్యం తోచక తలలు పట్టుకున్నారు. మాములుగా అయితే రూపని నాలుగు తిట్టి ఏ డాక్టరు దగ్గరికో తీసుకెళ్ళి ఏదో చేసేవారు. రూప ఇలా మొండిపట్టు పట్టడం, రామనాధం గారింటికెళ్ళి బెదిరించి రావడం కోర్టు కేక్కుతాననడం, ససేమిరా ఎబార్షన్ చేయిన్చుకోననడం....ఇదంతా వాళ్ళకి మరింత మతి పోగొట్టింది.
    "దానికేదో పిచ్చి పట్టింది. ఆ కుర్రాడలా నమ్మించి మోసం చేశాడని షాక్ తగిలినట్టుంది. ఆ కోపంలో, ఆ ఆవేశంలో ఏదో చేసి కసి తీర్చుకోవాలని పిచ్చిపిచ్చిగా ఆలోచిస్తున్నది. నాల్గురోజులు పొతే ఆవేశం చల్లారితే అదే దారికి వస్తుందిలెండి. నెమ్మదిగా దానికి మంచి, చెడ్డ రోజు భోధపరుస్తాను. రెండురోజులాగి ఏ డాక్టరు దగ్గరకైనా తీసుకు వెళతాను." నిస్పృహగా , నీరసంగా కూలబడిన భర్తకి ధైర్యం చెపుతూ అంది పద్మావతి. విశ్వనాధం గారు శూన్యంలోకి చేతులాడించి "ఏమో ఏం చేస్తావో? నాకు మతి పోతోంది తలచుకుంటే" అంటూ తల పట్టుకుని పడకగదిలోకి వెళ్ళిపోయారు.
    "నీవు తొందరపడలేదు గదా. బాగా ఆలోచించావా రూపా. ఎంతయినా వాళ్ళు నీ తల్లిదండ్రులు, నీ మేలుకోరే వాళ్ళు ఇలా చెప్పకుండా చేయకుండా ఇంట్లోంచి మాయం అయితే, వాళ్ళు కంగారుపడి బాధపడ్తారేమో......నీ ఆచూకి తెలియక గభారా పడ్తారేమో పోనీ,యిలా నా దగ్గరికి వెళ్తున్నాని చెప్పవలసిందేమో...." సుమతి కొంచెం బాధగా, సందేహంగా అంది.
    "నీకు తెలియదు ఆంటీ! చెపితే మా వాళ్ళు ఒప్పుకుంటారా? అక్కడికి చెప్పాను , చితక్కొట్టి గదిలో పడేసి తలం పెట్టారు. ఎంతసేపూ తప్పు దాచి కప్పెట్టి కడిగేసుకుని చేతులు దులుపుకుంటామన్న ఆలోచన తప్ప, నేనిలా ధైర్యంగా కోర్టుకెక్కి న్యాయం కోసం పోరాడడానికి ఒప్పుకుంటారా? వాళ్ళకి పరువు ముఖ్యం. వాళ్ళకే కాదు సగటు తల్లిదండ్రులకి సంఘంలో చెడ్డపేరు వస్తుందన్న భయం. మీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వస్తే నా వెనకాలే వచ్చి నాకు ఇదంతా మీరు నేర్పి పెట్టారని మిమ్మల్ని తిట్టి గోల చేస్తారు. వాళ్ళకి తెలిస్తే చచ్చినా కేసు వేయనియరు. కోర్టులో మన పని జరగదు ఆంటీ! అందుకే పారిపోయి వచ్చేశాను" అంది రూప.
    అర్ధరాత్రి పదకొండు గంటలు దాటాక- ఒక సూటుకేసులో తన బట్టలు వేసుకుని అవతలివేపు గుమ్మం గొళ్ళెం వెయ్యాలన్న ఆలోచన వాళ్ళకి రాకపోవడంతో అటువేపు తలుపు తీసుకుని తిన్నగా సుమతి ఇంటికి వచ్చేసింది రూప.
    "ఆంటీ! మీరున్నారు మీరు భరోసా ఇచ్చారన్న నిబ్బరం లేకపోతే ఇల్లు వదిలి ఎలా రాగాలిగేదాన్ని. డిగ్రీ అన్నా చేతిలోకి రాకుండా బయటికి వచ్చి ఏం చెయ్యగలిగేదాన్ని. నా అదృష్టం కొద్ది మీరు దొరికారు. నా సమస్యలకి జవాబుగా మీరు నా తరపున నిలబడ్డారు.
    కనక ఇంత సాహసం చెయ్యగలిగాను లేకపోతే అమ్మ నాన్న ఏ డాక్టరు దగ్గరికో యిడ్చు కెళ్ళి ఎబార్షన్ చేయించేవారు. నన్నింట్లో బంధించి అడుగడుగునా మాటలతో హింసిస్తూ, నన్నూ శపిస్తూ, చిన్నబుచ్చుతూ, ఈ సంగతి నల్గురికి తెలిసి పెళ్ళి కాకపోతే మాటలతో మరింత కుళ్ళబొడిచేవారు. చేసిన తప్పు కంటే ఆ హ్యుమిలేషన్ భరించలేక, అవమానంతో ఏడుస్తూ వాళ్ళెంత హీనంగా చూసినా గత్యంతరం లేక, ఎదిరించే ధైర్యం లేక కుక్కలా పడుండే అవస్థనించి మీరు నన్ను కాపాడారు ఆంటీ! నేనిలా దొంగతనంగా వచ్చానని కోపంగా వుందా మీకు!"
    "లేదమ్మా! ఎటొచ్చి మీ వాళ్ళ బాధ తలచుకుంటే బాధగా వుంది. సరే, కాలమే అన్ని గాయాలు మాన్పుతుంది. చూద్దాం, నీ ఈ ధైర్యాన్ని కొన్నాళ్ళు పోయాకైనా హర్షిస్తారేమో. నీ వన్నట్టు కోర్టులో కేసు ఆరంభం అయ్యేవరకు నీ ఉనికి వాళ్ళకి తెలియకపోవడం మంచిది. నీ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగాలంటే తప్పదు. వాళ్ళని భాధపెట్టాలి" సుమతి భారంగా అంది.
    "రూపా! రేపే సురేష్ కి లాయరు నోటిసు పంపిస్తాను. మనకి కేసులో వున్న స్ట్రాంగ్ పాయింటు నీవింకా మైనరువి అవడం. పద్దెనిమిది నిండడానికింకా రెండు నెలలు టైముండడం మన అదృష్టం. లేకపోతే కేసు వేసే పాయింట్ లేకపోయేది మనకు. నీవు మేజర్ వి అయివుంటే సురేష్ మోసం చేసినా కోర్టులో అది నేరంగా నిలిచేది కాదు. బలవంతంగా రేప్ చేస్తే తప్ప ఇద్దరూ కల్సి చేసిన దానికి కోర్టు శిక్షించ లేదు." కోర్టు సురేష్ ని శిక్షించినా మనినా నాకేం ఫరవాలేదు. ఇది నలుగురికి తెలియాలి.
    అందరిముందు సురేష్ ని దోషిగా నిరూపించడానికే ఇలా కోర్టు ఎక్కుతున్నాను ఆంటీ."

 Previous Page Next Page