Previous Page Next Page 
ఔనంటే కాదంటా పేజి 18

ఇంద్రనీల్ బ్రష్ తీఉస్కుని బాత్ రూంలోకి వెళ్ళి, అక్కడనుంచి "శక్తీ....శక్తీ...." అని అరిచాడు.
"ఏమిటీ?" శక్తి అటు వెళ్ళింది.
"ఈ తలుపుకి బాత్ రూం లేదు" అరిచాడు.
శక్తి చిరాగ్గా "ముందు సరిగా మాట్లాడటం నేర్చుకో ఈ బాత్ రూంకి తలుపు లేదు అనాలి" అంది.
"అబ్బ... నేను సరిగానే అంటున్నాను. ఈ తలుపుకి బాత్ రూం లేదు కావలిస్తే చూడు" అతను తలుపు తీసి చూపించాడు.
అటుపక్క ఓపెన్ గా పెరడు వుంది.
"ఇదేమిటీ? ఈ తలుపుతీస్తే బాత్ రూమ్ వస్తుందా అంటే అవునన్నారే?" విస్మయంగా చూస్తూ అంది శక్తి.
మామ్మగారు వచ్చి "పెరట్లో నిమ్మచెట్టుకీ, అరటిచెట్టుకీ నీళ్ళందుతాయని ఈ వాటాలో వాళ్ళకి అలా ఏర్పాటు చేశాం. మరుగుదొడ్డి అటుచివర వుంది. అదిమాత్రం నాకూ, మీకూ, మీనాక్షి వాళ్ళకి కామన్" అంది.
శక్తి కోపంగా "చూడండీ... తలుపు లేకపోతే చీర అడ్డు పెట్టుకుని అవసరం గడుపుకుంటాం. కానీ అసలు స్నానాలగదే లేకపోతే బంగన బయలుగా ఎలా చేస్తాం? కనీసం దడైనా కట్టించాలిగా?" అంది.
"అలాగేనమ్మా! అడ్వాన్స్ గా ఓ అయిదువేలు పారేయ్! రేపీపాటికి కట్టించనూ..." అన్నాడు తాతగారు.
శక్తి లోపలికి వెళ్ళి బ్యాగ్ తెరిచి విసురుగా డబ్బు తీసి లెక్కపెడుతుంటే ఇంద్రనీల్ వచ్చి "ఆవేశపడకు అటువైపు ఎవరూ రారంటున్నారు కదా.... అడ్జస్ట్ అయిపోదాం" అన్నాడు.
శక్తి చురుగ్గా చూసి "డబ్బు వ్యవహారాలు నీకు సంబంధించినవి కావు. నీ పని నీవు చూస్కుంటే మంచిది" అంది.
అతను తలవంచుకుని వెళ్ళిపోయాడు.
శక్తి డబ్బును తాతగారి చేతిలోపెట్టి "రేపు ఈపాటికల్లా బాత్ రూం కట్టిస్తానన్నారు. ఆ పని చూడండి" అని హెచ్చరించింది.
"ఆ! అలాగే.... రంగనాయకీ! అమ్మాయికీ, అబ్బాయికీ మంచి కాఫీ పెట్టి పట్రా" అంటూ ఆయన హుషారుగా డబ్బులు జేబులో కుక్కుకున్నాడు.
మామ్మగారు ఆ పని చూడటానికి తమ వాటాలోకి వెళ్ళింది.
తాతగారు ఇంద్రనీల్ తో "బాబూ! మీకు న్యూస్ పేపర్ చదివే అలవాటు వుందా?" అని అడిగాడు.
శక్తి విసవిసా వచ్చి "మాకు న్యూస్ పేపరున్నా, రేడియో వున్నా, టీ.వీ.కలర్ ది అయినా.... ఎవరితో కలసి పంచుకునే అలవాటు లేదు" అంది.
ఆయన చిన్నబుచ్చుకుని కండువా ఓసారి దులిపి వేసుకుని "ఆ గుండ్రాయి చూశావా... అది మేం కుంకుడుకాయలు కొట్టుకునేది. అది మీరు వాడకూడదు. అలాగే ఆ మూల నేలలోకి దిగేసిన రుబ్బురోలు కూడా!" అన్నాడు. ఇంట్లోకి వెళుతూ "పంచుకోవడం తెలీని పిల్లమూక. ఎలా బతుకుతారో ఏమో!" అని గొణిగాడు.
ఇంద్రనీల్ మొహం తుడుచుకుంటూ లోపలికి వచ్చి "మొదటిలోనే అంత గట్టిగా మాట్లాడకుండా వుండాల్సింది" అన్నాడు.
"నీకు తెలియదు ఎవర్ని ఎక్కడ వుంచాలో అక్కడే వుంచాలి" గట్టిగా చెప్పింది శక్తి.
అతను ఆమెను ఓసారి చూసి "సరే.... నేను బావి దగ్గరకెళ్ళి నెలలు తోడి తెస్తాను. స్నానాలు చేసి బజారుకి పోవాలిగా" అన్నాడు.
"ముఖ్యంగా తాడూ, బొక్కెనా కొనాలి.  వేరేవాళ్ళవి వాడటం నాకు యిష్టం వుండదు" అంది.
ఇంద్రనీల్ బావిదగ్గర నీళ్ళు తోడుతుండటం చూసి మాసిన గడ్డంతో, నీరుకావిరంగు పంచెతో వున్న ఒక వ్యక్తి అటు వచ్చాడు.
"మీరేనా ఈ వాటాలో దిగిందీ?" అన్నాడు.
"అవును" అన్నాడు నీళ్ళు తోడుతూనే ఇంద్రనీల్.
"మీ ఆవిడ ఉద్యోగం చేస్తుందటగా!" అన్నాడు.
"అవును."
"మా ఆవిడ కూడా నాపేరు సదానందం మీ పేరూ?"
"ఇంద్రనీల్."
"మేం అవతల పక్కవాటాలో వుంటాం. నన్ను అందరూ మీనాక్షి మొగుడంటారు. ఎందుకంటే, మా మీనాక్షి డబ్బు సంపాదిస్తుంది కదా! అందుకూ! డబ్బుకే గానీ మనిషికి విలువ లేదీలోకంలో. నేనంటే వేలిముద్ర గాన్ని. మరి మీరో?" అన్నాడు.
"నేను గ్రాడ్యుయేట్" చెప్పాడు ఇంద్రనీల్.
"మరి చక్కగా ఏ ఫ్యాన్ కింద కూర్చునే ఉద్యోగమో చేసుకోవచ్చుగా?" ఉచితసలహా పారేశాడతను.
ఇంద్రనీల్ కి తెలుసు తను రేపటినుంచీ ఇలాంటివి అనేక ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుందని అందుకు అతను సంసిద్దుడై వున్నాడు.
"నాకు ఉద్యోగగండం వుంది" అన్నాడు.
"ఆ!" నోరు తెరచి అలాగే వుండిపోయాడు సదానందం.
"అవును జలగండంలాగే ఇదీనూ ఓ ప్రముఖ జ్యోతిష్కుడు చెప్పాడు. నోరు మూయచ్చు" అని బకెట్ తో నీళ్ళు పట్టుకుని తమ పోర్షన్ వైపు వెళ్ళిపోయాడు ఇంద్రనీల్.
"మళ్ళీ కలుస్తాను ఇంద్రనీల్ గారూ! ఏమిటో... ఎంత మంచిపేరున్నా ఏంలాభం? రేపటినుంచీ శక్తిగారి మొగుడంటారు పాపం!" అని సదానందం అనటం అతనికి వినపడింది.    
                                             * * *
శక్తి మంచంమీద బోర్లాపడుకుని ఇంగ్లీష్ మ్యాగజైన్ చదువుతూ "ఏదో మాడుతున్న వాసన వస్తోంది" అని అరిచింది.
వంటగదిలో పోపు వేయిస్తున్న ఇంద్రనీల్ "ఆ.... మాడబోయింది. ఆపేశానులే.... నువ్వు చదువుకో" అన్నాడు.
ఇంతలో తలుపుమీద టకటకా.... కొట్టిన చప్పుడైంది.
శక్తి తలెత్తి చూసింది.
ఆకుపచ్చరంగు వెలిసిన నేతచీరలో, తలంటుకున్న జుట్టుని చివర్న ముడేసి, నుదుట తిలకంబొట్టూ, దానిమీద విభూదీ, కింద కుంకుమ బొట్టూ పెట్టుకుని, చిరునవ్వే ఆభరణంలా మొహమంతా పులుముకుని ఒక స్త్రీ తలుపుదగ్గర నిలబడి వుంది. ఆమెచేతిలో చిన్న స్టీలుభరిణ వుంది.
"లోపలికి రండి" అప్రయత్నంగా ఆమెని మన్నించింది శక్తి.

 Previous Page Next Page