Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 18

   
    
    అభినయ్ వెనక్కి తిరిగి  స్నేహబృందం దగ్గరికి వచ్చాడు.
     "అద్భుతం, వండర్ పుల్! నీకు జీవితంలో ఓటమి లేదురా!" అంటూ వెయ్యిరూపాయలు  అందించాడు పూర్ణ.
    ఆ డబ్బుని కమల్ చేతికి అందించాడు అభినయ్
    "సిద్దార్థ ఫీజు కట్టి మిగిలింది మీదగ్గరుంచి" అన్నాడు.
     కాలేజీలో ఆ వార్త  పెద్ద సంచలనాన్ని కలిగించింది
    ఎంతపని జరిగిపోయింది? కాలేజీలో ఆడపిల్లలకి రక్షణ కల్పించలేని యాజమాన్యంపట్ల పేరంట్స్ కి ఇన్సిట్యూషన్ మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుందోనని ప్రిన్సిపాల్ కలవరపడ్డాడు.
    అదీకాక పోయి,పోయికొరివితో  తల గోక్కున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి అమ్మాయినా ముద్దుపెట్టుకునేది? అదీ అంత పబ్లిక్ గానా?
     ఆగొడవ పెద్ద చర్చనీయాంశం అయిపోయింది అందరిలోనూ
    దాన్ని అడ్వంచర్ గా కొందరు భావించారు
     దారుణం అని కొందరు అభిప్రాయపడ్డారు.
     అభినయ్ సాహసాన్ని చూసి,  ఆముద్దు  తమని పెట్టుకుంటే ఎంత  బాగుండేదోనని కొంత మంది  అమ్మాయిలు అనుకున్నారు.
     అభినయ్ క్లాసుకు వెళ్ళలేదు. వెళ్లాలనిపించలేదు.
     క్యాంటీన్ కేసి  నడిచాడు మెల్లగా.
     అతను ముభావంగా మారిపోయాడు.
     "తొందరపడ్డానా?" తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు.
    " మొండితనంతో కాదని సరిపెట్టుకోవచ్చు.... కానీ తను చేసినదానికి గీత తలెత్తుకు తిరగలదా?"
     ఈ  విషయం ముందే ఎందుకు ఆలోచించలేకపోయాడు?
     డబ్బు కోసం తనే పనయినా చేస్తాడా?
       నో!
     ఆ డబ్బు తన కోసం  కాదు........
    ఒక్క గీతే కాదు, కాలేజీలో అమ్మాయిలందరి దృష్టిలో తనెంత హీనంగా మారిపోతాడు ఈక్షణంనించి.
     ఆపదలో చిక్కుకున్న జయశ్రీని రక్షించి   ఆపేరు చెపితేనే ఆమె అల్లరయిపోతుందనుకున్న తను...... తను....... ఇంతమంది ఎదుట మరో ఆడపిల్లని ఎలా అవమానించాడు?
    ఆడపిల్లల్ని కాలేజీలో సరదాగా ఆటపట్టించవచ్చు. టీజ్ చేసి ఆనందపడవచ్చు. అంతవరకూ పర్వాలేదు
    కానీ..... కానీ.... ఇది...... ఇది....ఛ......
     జుట్టులోకి చేతి వేళ్ళని పోనిచ్చి జుట్టు పీక్కున్నాడు.
       "కాఫీ తాగు"
     తలెత్తి చూశాడు కమల్.
     ఆలోచనలతో తలనొప్పి వచ్చేస్తుంది. కాఫీ తాగి సిగరెట్ వెలిగించాడు.

 Previous Page Next Page