Home » Sree sree » Maro Prasthanam


                                           మట్టిపులి
    

వచ్చావా, రాక్షసా! రా!
తెచ్చావా? ద్రాక్షసారా!

ఓ రాక్షసనామ వత్సరమ్మా! రమ్మా!
నీ తెచ్చిందేమిటమ్మ, జిన్నా? రమ్మా!

రాక్షసివో, రాక్షసుడివో-
ఉభయులదీ ఒకే గుణం-
బహువచనంలో అంతా
రాక్షసులే, ఇది నిజం!

రాక్షసతకు లేదంటా లింగభేదం,
మతభేదం లేదు, లేదు రంగుభేదం!
లేదు శృంగభేదం, కడువాడి దాని కొమ్ములు!
ఊడని కోరలు, భుజంగ దంష్ట్రలకే తమ్ములు!

ఆసటగా, బాసటగా రాక్షసా! రా!
తీసుకురా, మోసుకురా ద్రాక్షసారా!

ఓ ఉగాది రాక్షసీ! ఒలకనీ మధురసం!
 మనసారా మధువు గ్రోలి మత్తెక్కద నీ నిమిసం!

రక్తాక్షులతో చూస్తూ రాస్తా రక్తాక్షరాలు!
ఇటూ అటూ ఎటు చూసిన ఎర్రని చేవ్రాలు!

ఇది విప్లవ విజయవేళ
ఎవరూ కాదనలేరు!
అధవా బధిరాంధులు కా
దంటే మనలేరు!

సమసమాజ దిశగా ఈ సకల  జగం కదుల్తోంది!
పురోగమన విరోధులకు సమాధులు రచిస్తోంది

ఈ గవ్యం నా గమ్యం: తాగుబోతునే నేను.
ఐనా నేనాడూ మోతాదును దాటిపోను!
మదరాసున మదిరా ఘనమాధుర్యం కనబడదు
చాటుమాటు పనులకు నా స్వాంత మెప్పుడెగబడదు,
అందుచేతనే తరచూ నేను ఆంధ్రావణికి వెళ్తుంటాను.
ఇందుకు కారణం ఏనాడూ ప్రత్యేకాంధ్రాభిమానం కానేకాదు
పెసరట్లు ఆరగించాలని, బ్రాందీ ఆస్వాదించాలని!
ఈ రెండింటికీ తెలుగునాటనే చోటు
ఎక్కడా ఎప్పుడూ వీటికుండదు లోటు!
ఆల్కహాలిక ధూమ జ్వాలలు సెగలిస్తవి నా తపస్సుకు,
రాక్షసత్వపు రాక్షసి బొగ్గులు పదునిస్తవి నా మనస్సుకు

                                           *    *    *
రాబోయే వత్సరాన్ని రాక్షసిగా భావిస్తున్నాను
అందమైన ఊహాచిత్రాల్ని అందరి ముందూ గిస్తున్నాను,
అస్రజన్ములూ, అగ్రవర్ణులూ,
అగ్రేసురులూ, నరకేసురులూ,
పార్వతీ పరమేశ్వరులూ,
సర్వత్రా విషవ్యాధులూ
దీని కపాలపు స్థిరనివాసులు!
దీని నసాళపు తీవ్ర శ్వాసలు!

కుడికంట్లో టెలిస్కోపులు, ఎడంకంట మైక్రోస్కోపులు
ఎడచెవిలో దీర్ఘశ్రవణం, పెడచెవిని శీఘ్రస్థలనం!
హృదయం ఉండవలసిన చోట దీని
కుందో ద్రావకాల రిజర్వాయర్ ఊట!
ఊపిరితిత్తుల్లో బొగ్గుపులుసు వాయువు,
ఆక్సిజనాన్ని హతమార్చే స్నాయువు!
ఆహారనాళిక! ఆహా భద్రకాళిక!
కడుపుందే అది చాల
గొప్ప రసాయనిక పరిశోధనశాల!
అర్భుదాల ఆయుధాలే వీడిహస్తాలు!
అద్భుతాలు, అనేకానేకాలు!
ఆకాశాన్ని తాకే రాకెట్ల కాళ్లు
ఎక్కడైనా వాళ్లే రెక్కల ఇనప చీకట్ల రైళ్లు!

                                         *    *    *
ఈ ఉగాది కవి సమ్మేళన కార్యక్రమంలోనే
లక్షలాది శ్రోతల కభివందనాలు వేనవేలు
మధ్య తరగతి వాళ్లే చాలామంది దీన్ని వింటుంటారు,
మధ్య మధ్య వహవ్వా అనో, ఛి ఛి అనో అంటుంటారు.

                                         *    *    *
గాలిపటం తాడు తెగింది,
గాలిలో ఎగురుతోంది! లాగి దీన్ని పట్టుకోవాలి,
తాగుడు మైకంలో వాగింది మళ్లీ ఆకట్టుకోవాలి!
ఆ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది
చప్పున స్మారకం హెచ్చింది!
రాక్షసనామ సంవత్సరపు రమ్యభావ చిత్రం రాస్తుంట!
ఇదేమిటి, అదేదో పెద్దపులిలాగ ఇలా కనిపిస్తుంట!

దాననీ! నువ్వెంత దానవి!
కాననంలో బెబ్బులి అందానివి!
గద్దె దిగని ప్రభుత్వానివి!

అహింసా మంత్రం పరిభావిస్తావు!
హింసతోనే పరిపాలిస్తావు!
నీ ఒంట్లో దూది, ఒంటినిండా బూది!
ధనస్వామ్యానికి ప్రజాస్వామ్యమంటూ
మట్టిపులిమి, మసి కలిపి కనిపించే నువ్వు
నిజానికో మట్టి పులివి!

భయపడుతున్నంతసేపే జడిపిస్తావు,
బాసలిచ్చిఆశపెట్టి మురిపిస్తావు.
సుదూరాన నీ రూపం చూడ్డానికి భయంకరం,
సమీపించి చూస్తే అది శక్తిలేని సరీసృపం!

భయంతీరిపోయాక జ్వరం ఆరిపోయాక-
పోల్చుకుంటారు ప్రజలు నువ్వుత్త మట్టి పులివని;
అడుగుతారు నువ్వేం చెయ్యగలవని?
బోర్లిస్తారు కుండెడు నీళ్లు నీ మీద!
మట్టిలో మట్టిగా మట్టి పులి కలుస్తుంది, కరుగుతుందా మీద!

                                             *    *    *
భారతీయ గగన వాణి వారెంతో దయ నన్నీ!
గీరతాని కాహ్వానించారందుకు కృతజ్ఞుణ్నా!

                                          *    *    *

ఎందుండి ఈ ఉద్వేగం? ఎందుకో నిర్వేదం?
అదుపులేని ఈ ఉద్రేకం కదుపుతోందేదో ఉన్మాదం!

మనిషిగా బతకడం సులభమేకాని    
కవిగా బతకడం ఎంత కష్టం!
అబద్ధానికి భయపడే నాకు
నిజమంటే ఎంత ఇష్టం!

అందుకే నిజం చెబుతున్నాను
ఇది రాస్తున్నప్పుడు నేను తాగలేదు!
పెసరట్టూ, బ్రాందీకోసంకాదు
తెలుగుదేశానికి నా రాకపోక లెన్నోను,

విశాఖపట్టణం సముద్రతీరంలో నేను
నా మొదటి ఇరవై యేళ్లు వెదుక్కుంటాను,
భాగ్యనగరపు గల్లీలలో నేను
నా భాగ్యలక్ష్మిని పారేసుకున్నాను,1
కాకినాడలో నా కన్నులాగేశారు,
నా కాలాన్ని దాచేశారు.2

విశాఖపట్టణం వెన్నెల నిశీథం నాకు
వెలలేని, తులలేని వెండిరేకు!
తెలుగుదేశపు తూర్పు సముద్రం ముక్క
కేవలం నా కన్నీటి చుక్క!

అడవులమీద ఆకాశం తొంగి చూస్తున్నప్పుడు
కొండల్లో ప్రతిధ్వనిస్తుంది నా గుండెల చప్పుడు
తెలుగుదేశంలో ఎక్కడవున్నా నేను
నా తొలి యౌవనాన్ని పునర్జీవిస్తాను!

అందుకే అంటున్నాను సందేహం దేనికి?
వెళ్లండి నా పాటల్లారా! విశాఖపట్టణానికి
మొక్కవోని ధైర్యంతో కదలండి, ఉక్కు సంకల్పంతో నడవండి
వెళ్లండి నా పాటల్లారా! విశాఖపట్టణం మీదకి!

వెనకా ముందూ ఏమీ ఎవరూ లేనోళ్లని,
అరిగేలా తిరిగే కాళ్లని, ఆకలితో అరిచే నోళ్లని,
మోసగిస్తూ- తిండిని దొంగిలించే వాళ్లని, విషాన్ని రంగరించే వాళ్లని
శిక్షార్హులుగా నిలబెడతామని చెప్పండి నా పాటల్లారా
విప్పండి మీ గొంతుక నా గొంతుక ద్వారా:

అన్నం కావాలని కోరడం అపరాధ మవుతూంటే
హక్కులు రావాలని అడగడం అపచారమవుతూంటే
మనిషిగా జీవించే అవకాశాలే మాయమవుతూంటే, ఒళ్లంతా గాయమవుతూంటే
చదువును తరిమేసి విద్యాలయాల్లో మరణం ప్రవేశిస్తూంటే,
అక్రమాల, అన్యాయాల అజమాయిషీలో అబద్ధం పరిపాలిస్తుంటే

ఆగ్రహం కొలిమిలో మండే ఆశయాలే ఆయుధాలుగా
సంఘటిత శక్తిని కవచంగా ధరించి, శపథం వహించి,
సాహసంగా ప్రతిఘటించి, సాగరంలా పరాక్రమిస్తే
సైన్యాలే వెనుకంజ వేస్తాయని చాటండి నా పాటల్లారా!
              నాటండి విప్లవ బీజాలు!
మూగుతున్నాయి మేఘాలు, మోగుతున్నాయి బాజాలు
మెరుపుల తళతళల్లో, ఉరుముల పెళపెళల్లో
విజయం వర్షించాలి!
విప్లవం వర్థిల్లాలి!
వెళ్లండి నా పాటల్లారా!
అశేషాంధ్ర జనానీకపు
విశాల హృదయాల్లోనికి!
పాడండి నా పాటల్లారా! ఈ ఉగాది మాదని!
         ఇది రాక్షసి కాదని!
                                        రచన:9-4-1975ముద్రణ:మరో ప్రస్థానం, విరసం ప్రచురణ-మే 1980.

1. భాగ్యనగరపు గల్లీలలో నేను నా భాగ్యలక్ష్మిని పారేసుకున్నాను.
అప్పటికే మద్రాసు, ఢిల్లీ, లక్నో నగరాలలో రకరకాల ఉద్యోగాలు చేశాడు శ్రీశ్రీ. యాజమాన్యం (ఆంధ్రప్రభ)తో పడక, గాంధేయవాది (ఢిల్లీ ఆలిండియా రేడియో) అని, కమ్యూనిస్టు (లక్నో) అని అన్ని ఉద్యోగాలు ఊడిపోయాయి. బ్రతుకు తెరువుకోసం నిజాం నవాబు రిఫార్ము సెక్రటేరియట్(1946) లో కొద్ది నెలలు కొలువు చేశాడు. ముల్కీ సర్టిఫికెట్ సంపాదించుకోలేనందువల్ల ఆ ఉద్యోగం కూడా ఊడిపోయింది.
హైదరాబాద్ లో కటిక దరిద్రం అనుభవించాడు. హైదరాబాద్ అసలు పేరు  భాగ్యనగర.
2. కాకినాడలో నా కన్ను లాగేశారు, నా కాలాన్ని దాచేశారు.
కాకినాడ(1961 డిసెంబర్ మొదటివారం) లో శ్రీశ్రీ మీద ఆత్యాచారం జరిగింది. కొత్తగా కాంగ్రెస్  పూజారిగా మారిన ఒక మాజీ కమ్యూనిస్టు శ్రీశ్రీని కొట్టి కెమెరా, చేతి గడియారం లాక్కున్నాడు. కెమెరా లెన్సు పాడుచేశాడు. 'కన్ను లాగేశారు.' చేతి గడియారం మరమ్మత్తు అయింది. కెమెరా మాత్రం బాగవ్వలేదు. అది రష్యన్ కెమెరా. అటు తర్వాత శ్రీశ్రీ ఆ కెమెరాని ఒక కమ్యూనిస్టు మిత్రుడికి ఇచ్చేశాడు. "కమ్యూనిజానికి మాజీ కమ్యూనిస్టులే మొదటి శత్రువుల"ని శ్రీశ్రీ ఈ సందర్భంలోనే రాశాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra