Previous Page Next Page 
సంకల్పం పేజి 18

   

     కాళ్ళను భక్తి పారవశ్యంతో తాకి కాలివేళ్ళపై తన నుదుటి నుంచాడు.
   
    ఊరికి ఆవలగా నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా, ఒంటరిగా వున్న ఆ ఇంటి ఆవరణలో పరుచుకున్న ప్రశాంతత భగ్నమయినట్లుగా, ఉలికిపాటుగా కళ్ళు తెరిచారు ప్రొఫెసర్ అప్పన్న దొర.
   
    తన కాళ్ళమీద తలను ఆనించి వున్న వికాస్ కేసి విస్మయంగా చూసి, ఒకింత అసహనాన్ని కూడా ప్రదర్శించాడు.
   
    "ఎవరు నువ్వు?" గంభీరంగా వుంది ప్రొఫెసర్ కంఠం.
   
    వికాస్ చటుక్కున లేచాడు.
   
    ఒక మహామేధావిని చూసిన గగుర్పాతుకి లోనయ్యాడు. కొద్దిపాటి భయం, అపారమైన గౌరవం.... కొన్నివేల సంవత్సరాలు అంధకారంలో మ్రగ్గిన అంధుడికి కళ్ళముందున్న ప్రపంచమంతా కాంతివంతమయిన అద్భుత క్షణం బ్రహ్మాండాన్ని శాసించగల మేధస్సు ముందు నిలుచున్నా అద్భుతమైన అనుభూతి, మహాభక్తుడు ఉత్సవ విగ్రహాల్ని దాటి గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు, ఓడలు ఉప్పొంగేలా ఆవహించుకునే భక్తిపారవశ్యం....
   
    కొద్ది క్షణాల వరకు తేరుకోలేకపోయాడు వికాస్. తేరుకున్న మరుక్షణం అన్నాడు "వికాస్" అని.
   
    "నేను నీ పేరు అడగలేదు...." అసహనం, అసంతృప్తి కోపం, కసి సమపాళ్ళలో కలిసిన కంఠం శాసిస్తున్నట్లుగా అంది.
   
    "సా... సారీ.... సర్... నేనొక ఇంజనీర్ ని...." అతికష్టంమీద అనగలిగాడు వికాస్.
   
    "శతకోటి లింగాల్లో బోడిలింగం.... కొందరు రిజర్వేషన్స్ ని అద్దం పెట్టుకొని, ఇంకొందరు డొనేషన్స్ ని అడ్డం పెట్టుకొని, ఇంకొందరు బట్టీ పట్టిన పాఠ్యాంశాల్ని ముక్కున పెట్టుకొని ఈ దేశంలో ఇంజనీర్లు, డాక్టర్స్, శాస్త్రవేత్త లవుతాడు- నాన్ క్రియేటివ్ ఫూల్స్.... సోమరిపోతులూ, దేశభక్తి లేని ద్రోహులు, రిడిక్యులస్, ఆ... అయితే ఏమిటి?" మరింత అసహనం ఆయన కంఠంలో ధ్వనించింది.
   
    "మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడగలగటం నా అదృష్టం- ఒక హిందువుకి తిరుపతి, ఒక క్రైస్తఉనికి వాటికన్ సిటీ, ఒక ముస్లిమ్ కి మక్కా ఎంత పవిత్రమైనవో, ఎంత గొప్పవో... నాలాంటి చిన్న ఇంజనీర్ కి మీరు అల్లా...."
   
    ఆనందోద్వేగంతో అన్నాడు వికాస్ - చేతులు కట్టుకుని విద్యార్ధిలా ఆయన ముందు నించుని.
   
    ఆయన మొఖంలో ఒకింత ఆనందం... తృప్తి... కదలిక...
   
    "ఎందుకొచ్చావ్..." ఆయన కంఠంలోని విసురు కొద్దిగా తగ్గింది.
   
    జరిగిందంతా చక....చకా..... బ్రిస్క్ గా చెప్పాడు వికాస్.
   
    ఆయన మౌనంగా విన్నాడు. ఆయన మొఖంలో ఎలాంటి భావం కనిపించలేదు.
   
    కొద్దిక్షణాలు నిశ్శబ్దం ఆవరించుకుందక్కడ-
   
    "పీటర్ స్కాట్ ఒక బాటిల్ తెచ్చిపెట్టగలవా?" అప్పుడు ఆయన కంఠంలోని శాసనాధికారం లేదు- ఒకింత అభ్యర్ధన ఉంది. మరుక్షణం భీమిలీ టౌన్ లోకి చిన్నపిల్లాడిలా పరుగెత్తుకు వెళ్ళాడు.
   
    అరగంట తర్వాత బాటిల్ తో ఆయనముందు ప్రత్యక్షమయ్యాడు వికాస్. ఆయాసంతో గొంతు తడారిపోయి గుండెలెగిసి పడుతున్నాయి.
   
    ఆయన రవ్వంత మెచ్చుకోలుగా వికాస్ కేసి చూశారు.
   
    రెండు పెగ్గులు వరుసగా తీసుకున్నాక- తన భవిష్యత్ ఏమి కానున్నదని వికాస్ టెన్షన్ గా ఎదురు చూస్తుండగా...
   
    "ఇంతకీ నీకేం కావాలి...?" అడిగాడాయన చార్మినార్ సిగరెట్ వెలిగించుకుంటూ.
   
    "బ్యాటరీతో నడిచే కారుని నేను తయారుచెయ్యాలి" సర్వశక్తుల్నీ కూడ దీసుకుంటూ అన్నాడు.
   
    మూడో పెగ్ తీసుకొని నవ్వాడు బలహీనంగా-
   
    "కారు ఇండస్ట్రీ మాంద్యాన్ని ఎదుర్కుంటోందట- నిజమేనా?"
   
    "నిజమే సార్"
   
    "మరలాంటప్పుడు కారుని ఉత్పత్తి చేయటం అవివేకం కాదా? అంబాసిడర్, ప్రీమియర్ కంపెనీలు లే ఆఫ్ కు సన్నాహాలు చెసుకుంటున్నాయట నిజమేనా?"
   
    "నిజమే సార్ అదే సమయంలో నూటికి నూరుశాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మూతపడిన స్టాండర్డ్ మోటార్ కంపెనీ లైట్ మోటార్ వెహికల్ తో పునఃప్రారంభం కాబోతోంది" అంటూ తనతో ఉన్న ఫైల్ తెరిచి ఉన్న కటింగ్ ని తీసి ఆయనకిచ్చాడు.
   
    ఆయన దాన్నందుకొని ట్యూబ్ లైట్ వేయమని చెప్పి దాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకున్నారు.
   
                            స్టాండర్డ్ మోటార్ కు త్వరలో చలనం
   
    మద్రాస్, డిసెంబర్ 27 : స్టాండర్డ్ మోటార్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ను జనవరి 15ణ తిరిగి తెరిచారు. మూతపడిన ఈ కంపెనీ పునరుద్దరణకు రు. 34,26 కోట్ల పథకాన్ని బి.ఐ.ఎఫ్.ఆర్. ఖరార్ చేసిన విషయం విదితమే. ఈ మద్రాస్ కంపెనీ 1989లో ఉత్పత్తి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. మూతపడే నాటికి కంపెనీలో 120 మంది ఎగ్జిక్యూటివ్ లు, 3000 మంది కార్మికులు వున్నారు. దాదాపు 100 మంది ఎగ్జిక్యూటివ్స్ ఇతర ఉద్యోగాలు వెతుక్కున్నారు. కార్మికులు మాత్రం అలాగే ఉన్నారు. కార్మికులలో 999 మంది స్వచ్చందంగా పదవీ విరమణ చేయాలని బి.ఐ.ఎఫ్.ఆర్. సూచించింది. 700 మంది యిప్పటికే దీనికి సమ్మతించారు. పునరుద్దరణ పధకం ప్రకారం, కార్ల ఉత్పత్తిని కంపెనీ తిరిగి చేపట్టబోదు. ఎల్ సీవీలను మాత్రం తయారుచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీ నుంచి 1000 ఎల్ సీ వీలను కొనుగోలు చేయడానికి సమ్మతించింది. అలాగే తన వాటాగా 3 కోట్ల తాజా పెట్టుబడిని సమకూర్చుతుంది. ప్రస్తుతం ఆటోమోబైల్ పరిశ్రమ మాంద్యంలో ఉన్నప్పటికీ, సాటి కంపెనీలకంటే దీనికి కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. నూటికి నూరుశాతం స్వదేశీ వాహనం కావటం వల్ల ఎన్.ఎం.పి.ఎల్. ఎల్ సీవీపై లాభశాతం అధికంగా వుంటుంది. విడిభాగాలు పూర్తిగా స్వదేశీవే కనుక వినియోగదారులకు విడి భాగాల సమస్య ఉండదు. కాబట్టి, విడిభాగాలకు కొరత లేకుండా చేసి మార్కెట్ లో పట్టు సంపాదించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.
       
    "సిగ్గులేని రాజకీయ నాయకుల లంచగొండితనం వలన దేశం చితికి పోతోంది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జపాన్ ఎదగటానికి ఇంతకాలంలో సగ భాగం కూడా తీసుకోలేదు. అతి చిన్న పనికి, అది పెద్ద మొత్తంలో స్వార్ధపరులు టెండర్స్ వేస్తే ఓ.కే. చేసి ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచి దోచుకుతింటున్నారు.
       
    ఇలాంటి వ్యవస్థలో నువ్వు ప్రయోగానికి నాంది పలుకుతావా? పిచ్చెక్కిందా? బ్రతకనిస్తారా నిన్ను? బయటకు రానిస్తారా నీ కారుని?" ఆయన మాటలు ముద్దగా వస్తున్నాయి. హితవు చెబుతున్నట్లుగా ఉన్నాయి.   
   
    "మీరు దయతో అంగీకరించిన హైపవర్డ్ బ్యాటరీ డిజైన్ కి సూచన చేయగలిగితే నా కారుని తెచ్చే ప్రయత్నంలో ఈ ప్రపంచాన్నైనా ఎదుర్కొంటాను"
   
    "భానోజీరావు అంత పెద్ద అవమానం చేసినట్లుగా నాకనిపించటం లేదే? ఒక్క క్షణం ఆగు" అని మరో పెగ్గు తీసుకున్నాడు.
   
    "ఊ.... చెప్పు.... నువ్వింత రిస్క్ తీసుకోక తప్పనంత అవమానం జరిగిందా?"
   
    కొద్ది క్షణాలు మౌనం...
   
    అప్పుడు సమయం అర్దరాత్రి కావటానికి మరో ఐదు నిమిషాలు మాత్రమే ఉంది.
   
    "సున్నిత మనస్కుడ్ని ఒరేయ్ అనే మాట సయితం తీవ్రమైన మనస్తాపాణికి గురి చేస్తుంది. ప్రాణానికి ప్రాణంగా కలిసి మెలిసి ఉండే కుటుంబంలో ఒక సభ్యుడికి తెలీకుండా మిగతావారు ఒక నిర్ణయం తీసుకుంటే చాలు-అతఃనికా కుటుంబం నుంచి విడిపోవాలన్నంత ఆగ్రహం కలుగుతుంది. సెన్సిటివ్ కావటమన్నది గొప్ప విషయమని నేను చెప్పటం లేదు సార్.....బట్.... నేనలాంటి వాడ్నే..." ఒకింత ధైర్యాన్ని ప్రోది చేసుకొని అన్నాడు వికాస్.
   
    ఒక్క క్షణం వికాస్ వేపు విస్మయంగా చూశాడాయన.
   
    "యూ నో ఫ్రాంక్.... డి.... డక్స్...? అమెరికన్..."
   
    "తెలీదు సార్!" ఆశ్చర్యపోతూ అన్నాడు వికాస్.
   
    "1975 నుంచి 1980 వరకు హెవీ వెయిట్ ఫుల్ కాంటాక్ట్ కమిటీ చాంపియన్ గా 329 మేచెస్ లో పాల్గొని విజయపరంపరను స్వంతం చేసుకున్న యోధుడు, ఓటమి అంటే తెలీకుండా కేవలం విజయాలతోనే రిటైరయినవాడు అమెరికాలో మొట్టమొదటిసారి నింజా సిస్టమని ప్రవేశపెట్టిన వీరుడు. నాలుగు ప్రతిష్టాత్మక ప్రపంచ విజయాల్ని స్వంతం చేసుకున్నవాడు. నీళ్ళలో ఈదులాడే చేపపిల్లను గుప్పిటలో బంధించగల ఒడుపు, వేగం కలిగినవాడు. కళ్ళు మూసుకొని ప్రత్యర్ధి జాడని పసిగట్టగల యోధాను యోధుడు...." తన్మయంగా అన్నాడాయన.
   
    వికాస్ కి ఫ్రాంక్ ఎవరనంది అప్పటివరకూ కనీసంగానైనా తెలీదు. అతని గురించి ఈయనెందుకు చెబుతున్నాడో అసలే అర్ధం కాలేదు.
   
    "నేటి నీలాంటి యువ పారిశ్రామికవేత్తలు అంత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే పొలిటికల్ జాకాల్స్ ... ఓల్డ్ ఇండస్ట్రియలిస్ట్స్ తొక్కేస్తారు. విదేశాల్లో సెలైన్, డెక్ స్ట్రోజ్ పాలిథిన్ సీల్డ్ బాటిల్స్ ద్వారా వస్తున్నాయి. హైజెనిక్ గా తీసుకువస్తున్నారు. మనదేశంలో ఆ ప్రయత్నం చేస్తే గ్లాన్ ఫ్యాక్టరీల యజమానులు సమాధుల్ని సిద్దం చేస్తారు? అలాగే ప్రతిదీనూ....బూజుపట్టిన సాంకేతిక పరిజ్ఞానంతో వస్తువుల్ని ఉత్పత్తి చేసి వినియోగదారులకు గతిలేని స్థితిని కల్పించేవాళ్ళు మీలాంటి యువకులు, ఎంటర్ ప్రెన్యూర్స్ కొత్త ప్రయోగాలతో, నాణ్యత, తక్కువ ధరతో ముందుకు వస్తే చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు. మరి డానికి నువ్వు సిద్దమేనా? నీ కాలంలో సగభాగాన్ని, ఆలోచనల్లో ముప్పాతిక భాగాన్ని ఆ వృద్ద జంబుకాలు విసిరే పాచికల్ని ఎదుర్కోవటానికి ఖర్చు పెట్టాలి. సిద్దమేనా?" బాటిల్ ని ఎత్తేస్తూ అన్నారాయన.

 Previous Page Next Page