Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 18

   

     "నీకా డౌటొద్దు.మయూష ను తను పెళ్ళి చేసుకోడానికి అభ్యంతరం లేదని నిన్ను వప్పిస్తానని చెప్పాకే ఆయన తన పలుకుబడిని ఉపయోగించి నిన్ను విడుదల చేయించారు. అందుకే నీ దగ్గర నేను వాగ్దానం తీసుకున్నది. ఆలోచించు"
   
    పీతాంబరం ఏమీ ఆలోచించలేకపోతున్నాడు. అదృష్టం మీద అతనికి బాగా నమ్మకముంది తన కూతురికి అలాంటి రాజయోగం పడుతుందని అతనికెపుడో జ్యోతిష్యం ద్వారా తెలుసు.
   
    "ఆ కుర్రాడు ఎక్కడుంటున్నాడు?" సంతోషంగా అడిగాడు పీతాంబరం.
   
    "ఎక్కడుంటాడో ఎలా వుంటాడో తర్వాత ముందు ఓ కె. అని నువ్వు ఒక్క మాట అనేసావనుకో....."
   
    "ఇంటావిడతో ఒక మాట అనాలిగదయ్యా పిల్ల ఇష్టా ఇష్టాలు కనుక్కోవాలా?" చాల సంతోషంగా అన్నాడు పీతాంబరం.
   
    "మీ వాళ్ళు నిన్ను కాదంటారా చెప్పు. ఆ కుర్రాడు రెండ్రోజుల్లో బిజినెస్ పని మీద అమెరికా వెళుతున్నాడు. రం రోజుల్లో అతగాడు తిరిగొస్తాడు. ఈ లోపల ముహూర్తం పెట్టేస్తే పెళ్ళయి పోతోంది. తన వాళ్ళందర్ని కనుక్కుని తీరిగ్గా నిన్ను ఏంటీ కరప్షన్ నుంచి విడిపించాడా? అయినా నువ్వు నిర్దోషిగా విడుదలయి ఆరోగ్యంగా తిరిగి రాబట్టేగదా నీ భార్యా కూతురు సంతోషంగా వుంది. నువ్వు గట్టిగా అనుకోవాలేగాని నీ మాట వాళ్ళు కాదంటారా?" చకచకా చెప్పుకు పోతున్నాడు భుజంగపతి.
   
    "ఇంత అర్జంటుగానా?" ఆశ్చర్యపోతూ అడిగాడు పీతాంబరం.
   
    "ఇంలాంటి పనులన్నీ త్వరగానే  జరిగిపోవాలి. ఆలస్యం ఎందుకూ రానున్నది పెళ్ళిళ్ళ సీజన్. అల్లుడు అందగాడయిన కోటీశ్వరుడు."
   
    "సీజన్ మాట సరేసరి. పెళ్ళంటే ఎన్ని ఖర్చులు...... ఎంత హైరానా?"
   
    "మీరు ఓ.కె. అనండి పన్నులన్నీ వేటికవే జరిగిపోతాయి.....అబ్బాయికి ఒక్క పైసా కట్నం అక్కర్లేదు. పెళ్ళి ఖర్చులన్నీ  అతడే భరించి మరీ మూడు ముళ్ళేస్తాడు. ఇష్టపడిన అందమైన అమ్మాయిని పెళ్ళిచేసుకోవడం అంటే మాటలా. అతని చేత పెళ్ళి ఖర్చులకని కొంత డబ్బు ఇప్పిస్తానుగదా."
   
    "నాకేంటో అంతా మాయలా వుంది. పతిగారూ" ఉబ్బితబ్బిబ్బవుతూ అన్నాడు పీతాంబరం.
   
    లేచి నిలబడ్డాడు భుజంగపతి.
   
    "రేపట్నుంచీ మీరు ఆఫీసుకెళతారుగదా. రేపు సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి__ ఓ కె. అని మీరనేసారనుకోండి మిగతా పనులన్నీ ఆటోమేటిగ్గా జరిగిపోతాయి" గుమ్మం వరకూ వెళ్లాడు భుజంగపతి.
   
    "మరి అబ్బాయిని ఒకసారి చూడాలంటే__" నసిగాడు పీతాంబరం.
   
    "అయ్యో మరిచేపోయాను. ఇదిగో అబ్బాయి ఫోటో. విత్ డిటైల్స్ ఆయనే ఇచ్చాడు మీకివ్వమని. ఫోటో చూస్తే మరీ అదిరి పోతారు" అంటూ జేబులోంచి ఒక కవర్ తీసి పీతాంబరం చేతిలోపెట్టి బయటకెళ్ళి కార్లో కూర్చునాడు. వెంటనే కారు కదిలింది."
   
    "వుంటాను మరి. రేపు ఫోన్ చేస్తాను" కారు వీధి మలుపు తిరిగే వరకూ అక్కడే అచేతనంగా నిలబడిపోయాడు పీతాంబరం.
   
    కాసేపయ్యాక లోనికొచ్చి ఆత్రంగా కవరువిప్పి లోన్నించి కార్డు సైజు కలర్ ఫోటోని చూసి నిర్ఘాంతపోయాడు.
   
    స్ఫురద్రూపం చాలా అందంగా, చక్కగా, సినిమా యాక్టర్ లాగా వున్నాడు కుర్రాడు. ఫోటోతోపాటు వున్నా అందమైన బ్లూ పేపర్ మీద ఎలక్ట్రానిక్ టైప్ రైటర్ మీద టైపు చేసిన అందమయి అక్షరాలు.
   
    నవనీత్ కుమార్.
   
    అందమైన పేరు అనుకున్నాడు పీతాంబరం.
   
    కిందనున్న డిటైల్స్ ను గబగబా చదివాడు.
   
    ఎమ్. బి. ఎ (అమెరికా)
   
    బిజినెస్ టర్నోవర్ 1500 కోట్లు.
   
    కుమార్ షూటింగ్ అండ్ షర్టింగ్స్ ఎక్స్ పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్.
   
    హైదరాబాద్ ఎడ్రస్.
   
    రోడ్ నెం 61, బంజారాహిల్స్, హైదరాబాద్.
   
    అమెరికా ఎడ్రస్ :
   
    1197, గ్రీన్ విల్లా, న్యూయార్క్ (సౌత్) అమెరికా.
   
    తనకు కాబోయే అల్లుడు 1500 కోట్లకు  అధిపతి.....అందగాడు- అది ఊహ కాదు. నిజమని తనని తాను సమాధాన పరచుకోవడానికి చాలా సమయం పట్టింది పీతాంబరానికి.
   
    ఆయన ఒకచోట నిలవలేకపోతున్నాడు.
   
    నవనీత్ నిజంగా తన కూతురు మయూషకు తగిన వరుడు.
   
    తన సెలక్షన్ ను, తన కూతురుగానీ, తన భార్యగానీ, ఇంట్లో మిగతా వాళ్ళెవరయినా కాదనరు. పీతాంబరం అదృష్టానికి ఒక పక్క మాత్రమే ఆలోచిస్తున్నాడు తప్ప రెండో పక్క ఆలోచించడం లేదు! ఆ రెండోవేపే దురదృష్టముండేది.
   
    ఆ ఆలోచన కూడా అతనికి రావడం లేదు.
   
                                                               *    *    *    *
   
    సాయంత్రం అయిదుగంటలయింది.
   
    ఇంటి ముందు ఆటో ఆగడంతో డ్రాయింగ్ రూమ్ లోంచి బయటికెళ్ళాడు పీతాంబరం.
   
    లోనికొస్తున్న భార్య శారదాంబ చేతిని పట్టుకుని బెడ్ రూమ్ లోకి లాక్కెళ్ళాడు.
   
    పట్టపగలు తన మామగారు అలా ప్రవర్తించడంతో తనలో తాను సిగ్గుపడిపోయి మాట్లాడకుండా తన గదిలోకెళ్ళిపోయింది మాలతి. ఆ సమయంలో ఆటో ఫేర్ ఇచ్చే బిజీలో వుంది మయూష.
   
    "ఏవిటండీ ఇది.....మరీనూ....వెనక కోడలుపిల్ల వుంది చూడలేదా?" బెడ్ రూమ్ లో కెళ్ళగానే విసుక్కుంటూ అంది శారదాంబ ఆ విసుగులో నిజమైన అసహనం లేదు. ప్రేమ వుంది.
   
    "అయ్యో మొద్దు మొఖమా" అనబోయి తన కంగారుని కోడలు ఇంకో రకంగా అర్ధం చేసుకోవచ్చని ఆలోచన కలిగిన పీతాంబరం__
   
    "నిన్ను తీసుకొచ్చింది ఎందుకనుకున్నావ్. సంసారానిక్కాదే బాబూ ఇందుకు. మీ అల్లుడి ఫోటోను మొట్ట మొదట నువ్వు చూసుకుంటావని చూసి ఎలా వున్నాడో చెప్పు" ఆ ఫోటోని చేతిలో పెట్టాడు పీతాంబరం.
   
    ఆ ఫోటోలో చక్కగా కన్పిస్తున్న నవనీత్ అందాన్ని చూసి బుగ్గలు నొక్కుకుంటూ ఆశ్చర్యపోయింది శారదాంబ.
   
                                           *    *    *    *
   
    "డ్రామా సరీగ్గానే ఆడుతున్నావా? వాళ్ళకి అనుమానమేమీ రావటంలేదు గదా?" సందేహిస్తూ అడిగాడు జ్వాలాముఖిరావు.
   
    "నేను డ్రామా నటుడ్నో, టి.వి. నటుడ్నో, సినిమా నటుడ్నో కాదు. నిజ జీవితంలో నటించే నిజమైన నటుడ్ని" అన్నాడు భుజంగపతి గర్వంగా.
   
    మెల్లగా తనలో తానే నవ్వుకున్నాడు జ్వాలాముకిరావు-మయూషని తలుచుకుంటూ.
   
                                            *    *    *    *
   
    "కుర్రాడు అందగాడు. కోటీశ్వరుడు మరీ డైరెక్ట్ గా ఒకసారి చూసి మాట్లాడండి. ఏవంటారు" ముందు రోజు రాత్రి భార్య హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది పీతాంబరానికి.
   
    అదే విషయం ఫోనులో మాట్లాడిన భుజంగపతికి చెప్పాడు.
   
    "మీరన్నది నిజమే నవనీత్ తో మాట్లాడతాను. రేపు ఉదయం మనం సరిగ్గా పదకొండు గంటలకు సెక్రటేరియట్ ఎదురుగా వున్న హోటల్లో కలుసుకుందాం" ఫోన్ పెట్టేసిన భుజంగపతి నవ్వుతూ జ్వాలాముఖిరావు వేపు చూసాడు.
   
                                                                       *    *    *    *

 Previous Page Next Page