అవతలివాళ్ళు తప్పుడు పనిచేసే వాళ్ళు. వాళ్ళ పని చూసీ చూడనట్లు పోతే ఘనంగా లంచం ఇస్తారు. ఇన్ స్పెక్టర్ తో పదే పదే పని వుంటుంది. అలనాటి వాళ్ళు మోసగిస్తారా? మోసగించరు. మరి ఇన్ స్పెక్టర్ ఏ మనిషిని పంపింది. మీ కానిస్టేబుల్ ఫోర్ నాట్ ఫైవ్ ని పంపారు అని చెప్పటం....! ఇదంతా ఎలా జరిగింది?
ఫోర్ నాట్ ఫైవ్ కానిస్టేబుల్ లేడు.
మరి వెళ్ళింది ఎవరు?
ఇన్ స్పెక్టర్ కి ఓ అయిడియా వచ్చింది. వెంటనే అన్నాడు.
"గతాన్ని వదిలేద్దాం. ఆ కేసుకి పదిహేను ఇవ్వండి"
అవతలి వ్యక్తి కాస్త ఆలోచించి ఆమోదం తెలిపాడు.
"మనిద్దరి కళ్ళు కప్పి పదివేలు కొట్టేసిన వాడిని మనం వదలకూడదు." ఇన్ స్పెక్టర్ అన్నాడు.
"ఏం చేద్దామంటారు?"
"మా కానిస్టేబుల్స్ ని మా డిపార్ట్ మెంటు కి సబంధించిన వారిని అందరినీ మీరోసారి చూడండి. మీ దగ్గర కొచ్చి అప్పనంగ పదివేలు అందుకున్న త్రాష్టుడి పోలిక వీళ్ళలో ఎవరికయినా కొద్దో గొప్పో కలుస్తుందేమో చూడండి. అనుమానించదగ్గ వ్యక్తి ఆనవాలు, ఆచూకీ మాకు చెప్పండి. ఆ బాష్టర్ గాడి పని ఆపై నేను చూస్తాను."
"చాలా మంచి అయిడియా! తప్పకుండా అలా చేస్తాను." అవతలి వ్యక్తి సంతోషిస్తూ అన్నాడు.
"ఈ తఫా మనీ..."
"అదీ మీరే చెప్పండి."
"కాస్త ఆలోచించి చెపుతాను. ఇంకా టైమ్ ఉంది కదా?"
"ఆ భారం మీదే మీరెలా చెపితే అలా."
"మంచిది."
"ఇంక వుంటాను."
"మంచిది..."
"అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు."
ఇన్ స్పెక్టర్ రిసీవర్ క్రెడిల్ పై వుంచి దీర్ఘనిట్టూర్పు విడిచి ఆలోచనలో పడ్డాడు.
"జరిగిందేదో జరిగింది పదివేలు బూడిదలో పోసిన పన్నీరు అయింది. నిజంగా వాళ్ళే మోసం చేశారనటానికి ఆధారం లేదు. పదేపదే వాళ్ళకి తనతో పని వుంటుంది. యిది ఎవరో మూడోమనిషి పనివాడుదొరికాడంటే చచ్చాడన్న మాటే పెద్దనేరం నెత్తినమోపి, కటకటాల్లోకి లాగి చిత్రహింసలు పెట్టాలి...
అతని ఆలోచనలు అలా సాగుతున్నాయి.
బన్సీలాల్ దగ్గరనుంచి ఉపాయంగా ఆనందయ్య మనవడిని తీసుకురావటానికై పన్నిన పథకంలో కానిస్టేబుల్స్ రాజు, రమణలు నయానగాని, భయానగాని పని చేశారు. వాళ్ళు డబ్బుఅడగ లేదు...కూపీలాగే ప్రయత్నం చేయలేదు.
శక్తిమాయి తెలివిగా ఇన్ స్పెక్టర్ కి అందాల్సిన డబ్బుని తన దగ్గర మనిషిని కానిస్టేబుల్ వేషంలో ఫోర్ నాట్ ఫైవ్ గా పంపించి ఆ పదివేలుని చేజిక్కించుకుంది. సక్రమంగా పని నిర్వహించినందుకు రాజు రమణలకు చెరి అయిదువేలు పారితోషికం అంటూ పంపించింది.
జరిగింది యిది__
ఈ విషయం అటు అవతలి మనిషికి తెలియదు. ఇటు ఇన్ స్పెక్టర్ కి తెలియదు...అది శక్తిమాయి తెలివి ఎలా అవుతుంది?
ఆలోచించి ఆలోచించి విసిగిపోయిన ఇన్ స్పెక్టర్ ఈ తఫా గతాన్ని వదిలేసి అవతలి వ్యక్తి అందిస్తానన్న పదిహేను వేలని ఎవరి కంట పడకుండా ఎలా అందుకోవాలన్న ఆలోచనలో పడ్డాడు.
ఇంకో కానిస్టేబుల్ కనకలింగం తన భారీకాయాన్ని దొర్లించుకుంటూ వచ్చి ఏదో కేసు వచ్చిందని చెప్పాడు. ఆ కేసు బయట పరిష్కరించాల్సినది...అందువల్ల తీరుబడిగా కాళ్ళూపుకుంటూ ఆలోచిస్తున్న అతను లేవక తప్పలేదు.
కానిస్టేబుల్ కనకలింగం పక్కకు తొలిగి నుంచున్నాడు.
ఇన్ స్పెక్టర్ స్టేషనులోంచి బయటికి వచ్చాడు.
13
"నా ఎత్తు ఫలిచింది" బన్సీలాల్ అన్నాడు.
ఇన్ స్పెక్టర్ కి అర్ధం కాలేదు.
రాత్రి పదినలభై ఇరువురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డ్రింక్ సేవిస్తున్నారు....మాటల మధ్యలో బన్సీలాల్ అన్నాడు.
"ఏమిటా ఎత్తు?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
"అప్పుడే మర్చిపోయారా?" బన్సీలాల్ అడిగాడు. విస్కీని నాలుకమీదనే వుంచుకుని చప్పరిస్తూ.
"ఏది మర్చిపోను లాల్ జీ! మధురవేణికి ఏతొడ మీద పుట్టు మచ్చ వుందీ చెప్పగలను. నీరజాక్షి పెదవుల రుచి ఏ స్వీట్ తో పోలివుంటుందో చెప్పగలను కాని__"
"ఆగారేం చెప్పండి?" బన్సీలాల్ కుర్చీలోంచి కాస్త ముందుకు వంగి ఆత్రుతగా అడిగాడు.