"అందాకా వుంచక తప్పదు. రేపు పగలు అతన్ని తప్పించుకు తిరుగు. నీవు చేయవలసింది అంతే."
"అలాగే."
"ఇంక లోపలికి వెళ్ళు. నాకున్నది వెయ్యి కళ్ళు కాదు లక్ష సరీగా లక్ష కళ్ళు. కోటి ముందాలోచనలు. నీవు ఏ మాత్రం పిచ్చిపని చేసినా అరక్షణంలో నాకు తెలుస్తుంది. బీకేర్ ఫుల్."
"ఆడినమాట ఆ భగవంతుడన్నా తప్పుతాడేమోగాని ఈ భగవాన్ తప్పడు" గాంభీర్యంగా అన్నాడు భగవాన్.
"నేను వెళతాను." అమల అంది.
"మంచిది." ముక్తసరిగ అన్నాడు భగవాన్.
ఆడినమాట తప్పేవాడే ఈ భగవాన్ అని అమల రవంతగా కూడా వూహించలేకపోయింది. ఆ నిమిషం నుంచే మృత్యువుకు దగ్గర అవుతున్నాడు కృష్ణ.
తృప్తిగా అమల లోపలికి దారితీసింది.
కొత్త ప్లాన్ ఆలోచిస్తూ భగవాన్ చెట్లచాటుకి దారి తీశాడు.
12
అమల తన గదిలో కూర్చుని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నది. తలుపు గడియపెట్టి ఓ లెటర్ రాసింది. చివరికి ఓ స్థిర నిర్ణయం తీసుకునే ఈ పని చేసింది.
కృష్ణ ఈ రాత్రికి ఊరికి వెళ్ళిపోతాడు. ఇది భగవాన్ మాయ. అది ఎలా అన్నది ఆ భగవంతుడికే తెలియాలి. కృష్ణ వెళ్ళేలోపల కృష్ణకి తెలియకుండా అతని బ్యాగ్ లో గాని కోటు జేబులో గాని తను రాసిన లెటర్ పెట్టాలి. కృష్ణ ఆ తర్వాత ఆ లెటర్ చూసుకుని తప్పక చదువుతాడు.
చదివి....?
రంగంలోకి దిగుతాడు.
దిగకపోతే!
తన ఖర్మ.
ఇలా కాసేపు పిచ్చిగా ఆలోచించి తను రాసిన లెటర్ మరోసారి చదివింది.
కృష్ణగారికి.
ఈ లెటర్ ఎవరు రాశారు! ఎలా నా దగ్గరకొచ్చింది అని ఆశ్చర్యపోతున్నారు కదూ! సాంతం చదవండి మీకే తెలుస్తుంది. నే రాసిన ప్రతి అక్షరం అక్షర సత్యం. మీరు నన్ను నమ్మి రంగంలోకి దిగగలరని నా ఆశ ఆకాంక్ష.
మీరు తెలివిగా రంగంలోకి దిగితే అటు మీ మామయ్యగారు వారి ఆస్తీ రక్షించబడుతుంది. ఇటు నేను క్షేమంగా మా వాళ్ళని చేరగలను. మూడు మోసగాళ్ళ ఆటలు అంతమవుతాయి.
ఓహ్. ఎంత పిచ్చిదాన్ని. అసలు విషయం వదిలేసి ఎవరిమాటలు ముందురాస్తున్నాను. ఇంక చదవండి.
నేను మా అమ్మా నాన్నగారికి వక్క అమ్మాయిని. నా అసలు పేరు అమల. మా అడ్రస్ యిది.....
నేను బి ఏ చదువుతూ తెల్లారితే పరీక్షలని మా అమ్మ వాళ్ళతో మ్యరేజికి వెళ్లక యింట్లో వంటరిగా వున్నాను. అప్పుడు ఓ మోసగాడు మాయలమారి భూతం. అన్నింటికీ తెగించిన నరరూప రాక్షసుడు నన్ను ఎత్తుకువచ్చాడు. వాడి పేరు భగవాన్ ట.
మీ యింట్లో ప్రభాకర్ మరణం కారణంగా సరోజకి మతి చాలించటం యింట్లొంచి వెళ్ళటం కొంత విషయం భగవాన్ వల్ల తెలిసింది. రోజా పోలికలు నాలో వున్నాయిట అదే రూపంగల నా ఫేస్ కాస్త మార్చి రోజా స్థానంలో ఈ యింట్లోకి నన్ను చేర్చాడు భగవాన్ గాడు.
భుజంగరావుగారికి ఓసారి హార్ట్ ఎటాక్ వచ్చిందని మళ్ళి రావచ్చని డాక్టర్లు అన్నారని. ఆస్తి రోజాకి గాని లేక అనాదాశ్రయాలకిగాని వారి తదనంతరం చెందుతుందని తెలిసి భగవాన్ ప్లాన్ పన్ని నన్ను యిక్కడ చేర్చారు.