జాబిల్లి వంకలో చదలేటి ఊటలున్నవి. చుక్కల వెలుగులో మక్కువగల మహిమలున్నవి. పండుగలే ప్రపంచ రాజకీయాలు.ఆటలే జీవితపు గాఢకష్టాలు.ఆనందమే జీవిత పరమావధి.ఆ రోజులలో చేయి కలుపువారు బాలకృష్ణుడు,బాలరాముడు.మంచినీటికై మబ్బుల జంతువులు.అవి ఆవులో తేనెల ప్రోవులో !
ఓ చిన్న బాలికా!నీ చిన్ని అందాలచేతులే ఆనాటి నా మొరకు చేతులను పట్టుకొని నన్ను నెమ్మదిగా నడిపించినవి.మా దొడ్డిలోని గులాబి మొగ్గల ఎరుపులను సేకరించుకొని వంకారులు తిరిగిన నీ చిన్ని పెదవులు,ఆనాడు దివ్యమంత్రముల నెన్నో ఉపదేశించినవి.సోగలై దివ్యత్వమునే కూర్చుకొన్న అద్బుతములైన నీ కళ్ళ కాంతులు ఈ సృష్టిలోని ఏవో రహస్యాలను వెలుగులతో దూరదూరాన చూపించినవి.
2
చిన్ననా డో జేమచెట్టున
చిట్టచివరకు ఎక్కి పళ్ళను
చిలకలా తింటున్న నన్నూ
చిట్టిదానవు చూచి గంతున
చేరగా పరుగిడుచు వస్తివి.
నీలిపావడ కూర్చు కుచ్చులు
గాలిలో నర్తించే శంపా
లీలలో!
పసిడి దేహం తొనలు మెరిసెను
పాణికీ బంగారు గాజులు,
పిల్లకాసుల పేరు గల గల
కంఠమున గొలుసుల్లు పేటలు
చిక్కుపడి పులిగోరుతోనే
చేదిరియాడెను హృదయసీమను.
దువ్వపోయే కురులు గోటను
తొలగచేస్తూ పరుగవస్తివి.
ఘల్లుమన్నాయ్ కాళ్ళగజ్జలు
ఝల్లుమన్నది చిన్న గుండె.
చెట్లపళ్ళూ కోయనన్నూ
''చిన్నబావా,చూడు చూడూ
దోరపండు ఒకటి ఇయ్యవ్
మారు పెడతా తాయిలమ్మూ
మాట నిజ ''మన్నావు.
''తాయిలమ్మా నాకు వద్దూ,
మాయమాటలు నేను విన్నూ
పెళ్ళి ఆడ్తా బావ నిన్నని
వేయి చేతిలో చేయి ''అన్నా.
మాటలో అర్ధాలు తెలియదు
మాటలో మంత్రాలు ఎరగము
మిన్ను మొగమై చూచు కన్నుల
చిన్ని సిగ్గులు నాట్యమాడెన్.
చెట్టునుంచీ దుమికి, చెంగున
జేరి నిన్నూ బాలరాణిని,
చేర్చితిని నా చిన్న హృదయం,
లజ్జపడి, గద్గదిక మైతిని.
జేబులో ఉన్నటి పళ్ళూ
చేతిలో ఉన్నటి గుటకలు
మోకరిల్లి దోసిళ్ళు పట్టితి
మోమువంచితి శోకహృదినై.
చిట్టి చూపులు చిన్ని చేతులు
చెంప లట్టీ మోము నెత్తీ
''చిన్న బావా నిన్నెపెళ్ళి
మాటయిస్తా మాట తప్పను
పళ్ళకోసమే కాదు నిజమూ
పళ్ళచెట్లూ సాక్ష ''మన్నావూ!
కళ్ళలో ఆడేను చుక్కలు
గళములో చేరాయి బరువులు
బాల హృదయం మధురమౌతూ
కలలు కన్నాదీ!
నేను హైస్కూలు క్లాసులు మూడూ,గుంటూరులో టౌను హైస్కూలులో చదివినాను. గుంటూరులో మొదట నేను చేరినప్పుడు అరండల్ పేటలో మేము కాపురమున్న చోటునుండి హైస్కూలుకు చాలా దూరమవడం చేత మా అమ్మ నాకొక చిన్న సైకిల్ కొనిపించి ఇచ్చింది. నా సైకిల్ బి.ఎస్.ఎ.తళతళలాడుతూ వేటకుక్కలవలెనున్న నా సైకిల్ ను చూస్తే నాకెంతో గర్వంగా ఉండేది. లాంతరు,గంట,క్యారియర్,స్టాండ్ మంచి ఖరీదు గలిగిన లూకాస్ కంపెనీవారివి.గుఱ్ఱపు జీనులాంటి జీను-బ్రూక్స్ సాడిల్, ఇంకా ఇతర అంగసౌష్టవాలు కలిగి పందేనికి ఉరక బొయ్యే అరబ్బీ గుఱ్ఱంలా, ఉండేది.ఆ బండిమీదే తొక్కడం నేర్చుకొన్నాను. ఒక్క రోజులో వచ్చిందా విద్య నాకు అప్పటికింకా పొట్టిగానే ఉండేవాణ్ణి అయినా ఆ సైకిల్ మా ఇంటికి వచ్చిన మరుసటి క్షణంనుంచి, నాకూ, దానికీ గాఢ స్నేహం కలిగింది.నా మనస్సులోని భావం గ్రహించి నడిచేది.వెళ్ళితే మేఘాలమీద పరుగు,లేకపోతే వెనక్కు నడిచినట్టు నడక. నాకే ఎదురు సలహా చెప్పేది. ఎంతటి జనసమ్మర్ధమైనా, దారి ఎంత ఉక్కిరి బిక్కిరిగా ఉన్నా,బళ్ళూ,జట్కాలు, కార్లు వత్తిడి ఎంత ఎక్కువగా ఉన్నా,అతి నేర్పుతో వట్టిగించుకొంటూ నన్ను తేల్చుకొని పోయేది.నేను మీద చేయి వేస్తే ప్రేమతో ఉప్పొంగేది.రాత్రిళ్ళప్పుడు నేను సైకిల్ తొక్కి వెళ్ళుతుంటే ఏదైనా గొయ్యికాని, రాయికాని ఎదుట ఉన్నప్పుడు, టాను బ్రేకు పడినట్లు ఆగిపోయేది. ఎప్పుడూ సైకిల్ ను బాగుచేసుకునేవాణ్ణి. బాగుచేసు కొన్నప్పుడు సైకిల్ పకపకమని నవ్వేది.