Previous Page Next Page 
మణిదీపం పేజి 17

    "ఈ సినిమావాళ్ళకి, రచయితలకి ఏం పని లేదోయ్! ప్రతిదాన్నీ రంగుటద్డాల్లోనూ, భూతద్దాలలోనూ చూపిస్తారు. నేనూ డాక్టర్నే! నా భార్యతో హాయిగా ఉన్నాను. అటు వృత్తినీ అలక్ష్యం చేయడంలేదు"

    "ఒక్క పడవలో ప్రయాణం నిశ్చింత! రెండు పడవలమీద కాళ్ళుంచి ప్రయాణం చేయడం ఏనాటికైనా రిస్కే!"

    "డాక్టర్ల భార్యలందరూ మీరు చూసిన సినిమాలో హీరోయిన్ లా సిల్లీగా ప్రవర్తిస్తారని ఎందుకనుకొంటున్నాడు? భర్తను అర్ధం చేసుకొని అతడికి కో ఆపరేట్ చేసే నాలాంటి భార్యలూ వుంటారని ఎందుకనుకోరు?" అంది అర్చన.

    "ప్రతీదీ నెగెటివ్ గా ఆలోచించి పొందాల్సిన ఆనందం పొందకుండా మిస్సవుతున్న దురదృష్టవంతుడితడు. ఒంటరితనమే హాయి అనుకొంటున్న వెర్రిబాగులవాడు. జతకూడితే అందులోవున్న అమరసౌఖ్యం..." రామకృష్ణ తమాషాగా అర్చనకేసి కన్నుకొట్టి, "పాపం! ముక్కు మూసుకొన్న ఈ మునిపుంగవుడికి ఏం తెలుస్తుంది?" అన్నాడు.

    "కనీసం మీ అమ్మగారి కోసమైనా మీరు వివాహం చేసుకోవచ్చు కదా? ఆమె బాధ తీర్చడం కొడుకుగా మీ బాధ్యత"

    "ఆవిడ కోసమైనా నేను పెళ్ళి చేసుకోక తప్పదని నాకూ అనిపిస్తూంది. సరే...మీరే గెలిచారు యుద్దంలో. మంచి పిల్లను చూడండి. చేసేసుకొంటాను" బలిపీఠంమీద తలపెట్టి ఇహ వేసేయండి కత్తి అన్నట్టు దీనంగా అన్నాడు అరవింద్.

    "నువ్వు చేసుకోవాలేగానీ మంచి పిల్లలకు ఏం కొదవ? కానీ, ఎదుటి మనిషి మంచి మన మంచితనంమీద కూడా కొంత ఆధారపడుతుందని గ్రహించాలి. ఇంతకీ మంచిపిల్లంటే నీ దృష్టిలో ఎలాంటిది అరవింద్?"

    "కాస్త చదువుకొన్నదీ, అందంగా వున్నదీ, పెద్దవాళ్ళపట్ల మన్ననగా వుండేదీ..."

    "ఉద్యోగస్తురాలు అక్కరలేదా?"

    "ఇంట్లో అమ్మకి సాయంచేసేది అయితే బాగుంటుంది"

    "ఉద్యోగస్తురాలైతే ఇంట్లో పని పాటలు చెయ్యదా ఏం?"

    "నా భార్య ఉద్యోగం చేస్తే నాకేమీ అభ్యంతరంలేదుగానీ ఇంటిపని, బయట పని...ఆమె అంత అలసిపోయి సంపాదించి పెట్టాల్సిన అవసరం నాకు లేదుకదా?"

    "అలా కాకపోయినా చదివిన చదువుకు సార్ధకత వుండాలని ఉద్యోగం చేసే ఆడవాళ్లున్నారు. ఉద్యోగం చెయ్యడం అభ్యంతరం కాదంటే-సంబంధం ఆల్ రెడీ గా వుంది"

    "ఉద్యోగం చెయ్యడం నాకు అభ్యంతరం కాదు"

    అర్చన చెప్పింది- "మా మామయ్య కూతురే వుంది- కాంచన! బాటనీ లెక్చరర్ గా చేస్తోంది. వయస్సు ముప్పై రెండేళ్ళు. అందంగా వుంటుంది. మీకు చక్కటి మ్యాడ్ అవుతుంది. మీ జంటను చూసినవాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకోకుండా వుండలేరు. అంత బాగా సారీపోతుంది మీకు. ఇహపోతే మా మామయ్యది మంచి సంప్రదాయకుటుంబమే! మీరు చూస్తానంటే పిలిపిస్తాను"

    "పిలిపించి...మామూలుగా మన ఇళ్ళలో అవుతాయే పెళ్ళిచూపులు....చాపమీద తలొంచుకొని కూర్చోక తప్పదుగా ఆడపిల్లకు! అది మన సంప్రదాయం కదా?"

    "నాకెందుకో ఈ పద్దతి నచ్చదండీ! ఆడపిల్ల అలా తల దించుకు కూర్చోవడం ఏమిటి ఏదో తప్పు చేసినట్టుగా?"

    "మా కాంచనకి తలెత్తుకొనే కూర్చొమ్మని చెబుతాలెండి"

    "ఉహుఁ నా కెందుకో అలా వచ్చి చూడాలనిపించడం లేదు వదిన గారూ! అలా చూడ్డానికి తనకంటే ఎక్కువ నేను ఇబ్బంది ఫీలవుతాను!"

    "పెళ్ళి చూపులన్నట్టుగా కాకుండా టీ పార్టీకి వచ్చినట్టుగా రండి!"

    "అలా కూడా వద్దు. వచ్చే శనివారం వెంకటేశ్వరస్వామివారి గుడికి తీసుకురండి. అక్కడ చూస్తాను. మా అమ్మగారికి కూడా తీసుకువస్తాను."

    "నువ్వు పెళ్ళికి ఒప్పుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందోయ్!" అన్నాడు రామకృష్ణ.

    "ఈ విషయం మా వాళ్ళకు మీ వల్ల తెలిస్తేనే పద్దతిగా వుంటుందేమో!"

    "సరే. ఈ విషయం మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారితో, నాన్నగారితో మాట్లాడతాము."   

 Previous Page Next Page