మిత్రా బండిని రోడ్డు ప్రక్కగా పార్క్ చేసి ఆలోచించసాగాడు.
రైన్ కోటు వ్యక్తిని తను చూసే సమయంలో అతనూ బట్టలషాప్ ముందు నిల్చున్నాడు. అతనికా సమయంలో బట్టలు కొనుక్కోవలసిన అవసరం లేదు. కొనుక్కున్నా ఇక్కడ కొచ్చి కొనవలసిన అవసరంలేదు. ఇక మిగిలింది వైన్ షాప్, పాన్ షాప్ వాళ్ళనడిగితే కనీసం అతను ఎటు వెళ్ళింది. వెళ్ళి ఎంతసేపవుతుందనేది తెలిసే అవకాశం వుండొచ్చనిపించి వైన్ షాప్ లోకి వెళ్ళి షాపతన్ని అడిగాడు మిత్రా.
అతని నుంచి సరైన సమాధానం రాకపోవటంతో ప్రక్కనే వున్న పాన్ షాప్ దగ్గరకు వెళ్ళాడు.
అప్పటికి రైన్ కోటు కనిపించి అరగంట కావొస్తుంది. పాన్ షాపతన్ని అడగటం వృధా అనిపించినా, ఎందుకైనా మంచిదని అనుకొని ముందుగా ఒక రెండు కొత్త ఇంగ్లీష్ మాగ్జైన్స్ కొని అసలు విషయంలోకి వచ్చాడు మిత్రా.
"ఇటుగా అరగంట క్రితం ఎవరైనా రైన్ కోటు వ్యక్తిని చూశావా?"
"రైన్ కోటు వ్యక్తికంటే ఎలా తెలుస్తుంది సార్? మీలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు...."
"నేనడిగేది అరగంటా, ఇరవై నిముషాల క్రితం రైన్ కోటు వేసుకొని ఉండే ఒక వ్యక్తి ఇక్కడికి వస్తుంటే చూశాను. అతని మొహం మీద స్పోటకం మచ్చలు కూడా ఉంటాయి." షాపతను ఓ రెండు నిముషాలు ఆలోచించిన తరువాత!
"అలా అయితే ఇందాక ఓ వ్యక్తిని చూశా. రైన్ కోటు చేతిలో ఉన్నట్లు గుర్తు. అతను త్రిబుల్ ఫైవ్ అడిగితే లేదని వేరే సిగరెట్స్ ఇచ్చాను" వివరించాడు షాపువాడు.
"మరయితే ఇక్కడెంతసేపు ఉన్నాడు? వెంటనే వెళ్ళిపోయాడా?" కంగారుగా ప్రశ్నించాడు మిత్రా.
షాపతను ఓక్షణం మౌనంగా ఉండి ప్రక్కనే నవల చదువుకుంటున్న ఓ కుర్రాడిని ప్రశ్నించాడు.
"ఒరేయ్ శ్రీను, ఇందాక నువ్ షాప్ లో వుండగా ఒకతను త్రిబుల్ ఫైవ్ అడిగాడు గుర్తుందా!"
ఆ కుర్రాడికి అర్ధంకాలేదు. కాస్సేపాగి ఏమిటన్నట్లు బుర్రవూపాడు.
"మొహంమీద మచ్చలు వుంటాయి. అతను నీకేదో చెప్పాడు గుర్తుందా..." తిరిగి ప్రశ్నించాడు.
"ఆ అయితే ఏమిటి..."
"రేపు ఎవరో రెండింటికి ఇక్కడకు వస్తారు వుండమని చెప్పారు. ఆ వచ్చే అతని పేరు ఏదో చెప్పాడు గుర్తులేదు." సమాధానం చెప్పాడు శ్రీను అనే కుర్రాడు. 'అది సార్. బహుశ అతను చెప్పింది మీరే అయుంటారు. రేపు రండి. ఇంతకీ పనేంటి' అడిగాడు షాపతను.
'ఆ...ఆ... అతను కలవమంది నన్నే.'
"రేపు రెండింటికి వస్తాను!" తప్పదన్నట్లు చెప్పాడు మిత్రా.
` "ఇంతకీ ఎటు వెళ్ళింది చెప్పలేదు" ప్రశ్నించాడు
షాపులో వున్న కుర్రాడు అతను వెళ్ళిన దిక్కుగా చూపించాడు.
వాళ్ళు చాలా హెల్ప్ చేశారనిపించి ఓ పదినోటు ఆ కుర్రాడి చేతిలో పెట్టి వచ్చేశాడు మిత్రా.
బైక్ ని స్టార్ట్ చేసి వాళ్ళు చూపించిన దిక్కువైపు పోనిచ్చాడు.
అతను బండిని నడుపుతున్నా ఆలోచన్లు మాత్రం రైన్ కోటు వ్యక్తి మీదే వున్నాయి.
పరిచయం లేని షాపు వాడితో రేపు రెండింటికి వస్తానని అతను ఎందుకు చెప్పాడు? అతను కలవబోతున్న వ్యక్తెవరూ? అసలెందుకు కలవాలి.... ఆలోచించేకొలది అనుమానాలేగాని సమాధానం కనిపించలేదు మిత్రాకి.
వీలయినంతవరకూ ఈ రోజు వెతికి రేపు రెండింటికి రైన్ కోట్ వ్యక్తిని కలసి అతన్ని వెంబడించి వీలయితే రేపే అతనికి ఆఖరురోజు కావాలి. ఎలాగైనా రేపతన్ని పట్టుకొని తీరాలని దృఢంగా నిశ్చయించుకొన్నాడు.
రాత్రి రెండున్నరవరకు వీధులన్నిటిని కావలసిన వ్యక్తికోసం వేటాడుతూనే వున్నాడు. ఇక అంతరాత్రిలో ఆ వ్యక్తి దొరకడనిపించి రూమ్ కి చేరాడు మిత్రా.
రాత్రంతా సరిగా నిద్రపట్టలేదు. తెల్లవారు జామున ఎప్పటికో నిద్రపట్టిందతనికి.
మిత్రాకి తెలియంది ఒకటుంది. అతను ప్రమాదానికి ఎంత దగ్గరగా వున్నాడో తెలిసి ఉంటే అన్విత గురించి ఆలోచన్లు మూసుకుని ఉండేవాడు.
* * *
మిత్రా నిద్ర లేచేసరికి ఎనిమిదయింది.
లేచి స్నానం అది ముగించు కొచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
అతనికి గతరాత్రి జరిగింది. ఒక కలరా అనిపించింది. అన్విత అతనితో పందెం కాయటం. రైన్ కోటు వ్యక్తిని చేజ్ చేయటం.
కుర్చీలో లేచి డ్రస్ చేసుకొని ఓ నిర్ణయాని కొచ్చి రెండు వీధులవతల వున్న కొలిగ్ ఒకతనికి అర్జెంట్ గా ఊరెళుతున్నా వారం వరకు రానని చెప్పి వచ్చేశాడు మిత్రా. అతని పాస్ బుక్ తెరచి ఎకౌంట్ లో డబ్బు ఎంత వుందో చూసుకుని తొమ్మిదిన్నర వరకు రూమ్ లోనే గడిపి బ్యాంక్ కి వెళ్ళి ఎకౌంట్ లో ఓ వంద వుంచి మిగతా డబ్బుని డ్రా చేసేశాడు. దాదాపు ఎనిమిదివేలు చిల్లర వుంది.