"చూడండి! మా తల్లిదండ్రులంటే నాకిప్పటికీ గౌరవం ఉంది. కానీ వారు చేసే పనులవల్ల సమస్య వస్తోంది- మా నాన్నగారికి రోజుకి అయిదొందలు ఖర్చు- అమ్మకి రోజుకి వెయ్యి రూపాయలు దుబారా- ఇంతడబ్బు నేనెక్కడి నుంచి తేను?"
"వాళ్ళంత డబ్బు ఏం చేస్తున్నారు?"
"మా ఫాదర్ రోజుకో ఫుల్ బాటిల్ కొడతారు- మా అమ్మకు మెడికల్ పిచ్చి- రోజుకో స్పెషలిస్ట్ దగ్గరకెళ్ళి వేలకువేలు టెస్ట్ లకూ, ఫీజులకూ ఖర్చు చేయిస్తూంటుంది. మా నాన్నగారు ప్రతాదివారం రేసులాడ్డానికి నేనే డబ్బివ్వాలి"
"కానీ మీ నాన్నగారు సర్వీస్ లో ఉండగా ఇంత ఖర్చు ఎలా మేనేజ్ చేసేవారు?"
"అప్పట్లో ఆయన మత్స్య శాఖలో ఈఈ గా లక్షలు సంపాదిస్తూండేవారు. అందుకని ఆ ఖర్చు ఆ అలవాట్లు వచ్చాయ్-"
"ఓకే రాజూ! రాజేశ్వర్ మిసెస్ ఏమంటున్నారు?"
"ఛాయగారూ! అత్తమామల్ని వెళ్ళగొట్టడానికి మీ మనసెలావప్పింది?"
"వెళ్ళగొట్టకపోతే- నేనూ, నా పిల్లలూ అడుక్కు తినాల్సి వస్తుంది..... ఏం? మీ ఛానెల్ వాళ్ళు పెళ్ళాం బిడ్డల గురించి ఆలోచించరా?"
వెంగమాంబా! ఛాయగారు ఆవేశంలో ఉన్నారు- ఆమెకు బీపీ అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఆమెను ప్రశ్నించటం ప్రస్తుతానికి ఆపి రాజేశ్వర్ తల్లిదండ్రులతో మాట్లాడదాం. శంకరనారాయణగారూ- మీ కొడుకూ, కోడలూ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?"
"వాళ్ళకు కన్నూ మిన్నూ కానరావటం లేదు- పెళ్ళాం మాటలు వినే ఆడంగివెధవ వాడు! కోడలు సరేసరి"
"ఈ పరిస్థితుల్లో మీరు మీ కొడుకు ఇంట్లోకాక వేరే ఉండవచ్చు కదా?"
"వేరే ఉంటాం- డబ్బివ్వమంటే ఇవ్వనంటున్నారు-"
"ఏమండీ రాజేశ్వర్ గారూ! వాళ్ళకు డబ్బివ్వకపోతే వేరే ఇంట్లో ఎలా ఉంటారు?"
"ఎవరివ్వనన్నారండీ! నెలకు ఇరవై వేలిస్తానని చెప్పాను. కానీ నెలకు డెబ్బయ్ వేలు ఇమ్మంటున్నారు-"
రాజేశ్వర్ తండ్రి విరుచుకుపడ్డాడు.
"డెబ్బయ్ వేలంటే ఎక్కువా? నేను సర్వీస్ లో ఉండగా సంపాదించైనా జూబ్లిహిల్స్ లో ఇల్లూ, పొలాలూ, ఫామ్ హౌస్ లూ, బంగారం- వందకోట్ల సొమ్ము-ఏమయిపోయింది? నేను సంపాదించిన డబ్బుతో బ్రతికే హక్కు నాకు లేదా?"
"నీ ఆస్తెక్కడుందింకా? నీ దుబారాకే ఆరిపోయింది. చెల్లెలి పెళ్ళికోసం 70 కోట్లు ఖర్చుపెట్టిందెవరు? వాడెవడో స్వామీజీ వస్తే ఫామ్ హౌస్ లన్నీ రాసిచ్చేశారు కదా!"
"ఇంతకూ ఇప్పుడు మీరీ సమస్యకు పరిష్కారం ఎలా ఉండాలనుకుంటున్నారు శంకర్ నారాయణగారూ?"
"నెలకు డెబ్బయ్ వేలివ్వడానికి వాళ్ళొప్పుకుంటే మేం వేరేఇల్లు తీసుకొని ఉంటాం"
"ఛస్తే ఇవ్వను"
"ఇవ్వకపోతే కోర్ట్ కెళ్తాం! నీ పరువు వీధిలోకీడుస్తాం!" అంది రాజేశ్వర్ తల్లి....
ఇప్పుడో చిన్న బ్రేక్-
"తుగ్లక్ ఛానెల్లో అయిదేళ్ళనుంచీ ధారావాహికంగా వెలువడుతున్న 'కోడలా! నీకు గోరీ కడతా!' ప్రతిరోజూ చూడండి! సీరియల్ ఆఖర్లో మేము వేసే ప్రశ్నకు సమాధానం పంపి బంగారు నాణెం గెల్చుకోండి....."
అంతలో ఒక ఆటో వచ్చి అపార్ట్ మెంట్స్ ముందాగింది. అందులో నుంచి డెబ్బయ్ ఏళ్ల జంట దిగింది. వాళ్ళెవరా అని అందరం ఆశ్చర్యంగా చూస్తున్నాం.
వాళ్ళను వాచ్ మెన్ తిన్నగా మా దగ్గరకు తీసుకొచ్చాడు.
"అదే బాబూ- ఆ తుగ్లక్ ఛానెల్ రాజూ మా అబ్బాయే. వాడు రెండు గంటలనుంచీ కెమెరా ముందు వాగుతోందంతా విని ఉండబట్టలేక వచ్చాం"
వాళ్ళను చూడగానే అంతవరకూ తల్లిదండ్రులను బయటకు గెంటుతున్న కొడుకులు కోడళ్ళ గురించీ లెక్చర్ ఇస్తోన్న రాజుకి ఒక్కసారిగా మాట పడిపోయింది మొఖంలో నెత్తురు చుక్కలేదు.
"కెమెరా ఆఫ్ చేసేయ్- ఆఫ్ చేసేయ్..." అంటూ అరుస్తున్నాడు.
"వెంగమాంబా! అనివార్య కారణాలవల్ల కెమెరా స్విచాఫ్ చేయిస్తున్నా" అంటూంటే శంకరమూర్తి అడ్డుపడ్డాడు.
"ఇదిగో కెమెరామెన్నూ! మీ జర్నలిస్ట్ రాజు తల్లిదండ్రులిక్కడికి ఎందుకొచ్చారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో- చెప్పాల్సిందే- కెమెరా స్విచాఫ్ చేస్తే దాన్ని పౌడర్ చేస్తాం" అన్నాడు.
కెమెరామెన్ కంగారుపడ్డాడు.
"కానీ కెమెరా ముందు మాట్లాడేందుకు రాజు ఒప్పుకోవటం లేదు కదండీ!"
"అతను మాట్లాడకపోతే మేము మాట్లాడతాం" అంటూ రాజు చేతిలో నుంచి మైక్ లాక్కున్నాడు విజయ్ యాదవ్.
వెంగమాంబా! నేను రామ్ భరోసా అపార్ట్ మెంట్స్ నుంచీ విజయ్ యాదవ్ ని మాట్లాడుతున్నా! ఇప్పుడే మీ తుగ్లక్ టీవీ జర్నలిస్ట్ రాజు తల్లిదండ్రులు ఇక్కడికొచ్చారు-వాళ్ళు మీ ప్రేక్షకులకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారు.
"మా జర్నలిస్ట్ కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడ్డానికీ, మాట్లాడించడానికీ మా ఛానెల్ రూల్స్ వప్పుకోవు విజయ్ యాదవ్-"
వెంగమాంబా! మా అపార్ట్ మెంట్ కొచ్చిన ఏ టీవీ ఛానెల్ అయినా మేము చెప్పినట్లు వినాల్సిందేనని మా సొసైటీ రూల్స్ ఉన్నాయ్! మీరు మా మాట వినకపోతే మీ కెమెరాను ధ్వంసం చేసే హక్కు మాకుంటుంది అంచేత అన్నిటికీ మేము రడీ- ఓవర్ టూ షైనీ-"
వెంటనే షైనీ మైక్ అందుకుని వారిని ఇంటర్ వ్యూ చేయటం మొదలుపెట్టింది.
"మీరు రాజు తల్లిదండ్రులా? ఇప్పుడిక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది?"
"ఎందుకేంటమ్మా! మా అబ్బాయ్ రెండు గంటలనుంచీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన కొడుకుల గురించీ, అత్తమామలను వెళ్ళగొట్టిన కోడళ్ళ గురించి నిప్పులు చెరుగుతున్నాడు- వాడి చెత్తవాగుడు చూసి ఇంక ఉండబట్టలేక ఇక్కడికొచ్చాం!"
"ఇంతకూ మీరేం చెప్పదల్చుకున్నారు?"
"టీచరు ఉద్యోగం చేసుకుంటూ నానా అవస్థలూపడి వీడిని పెంచాను, ఈ వృద్దాప్యంలో మమ్మల్ని కనిపెట్టి ఉంటాడని ఆశపడ్డాం! కానీ పెళ్ళాం మాట విని మమ్మల్ని ఇంటినుంచి గెంటాడు. నెలకు అయిదొందలిస్తాను- ఎక్కడైనా ఛావండి- అన్నాడు. మేము మాకొచ్చే అరకొర పెన్షన్ తో నానా చావూ ఛస్తూ తోడూనీడా లేకుండా గడుపుతున్నాం! డబ్బు చాలక నేను ఈ వయసులో వాచ్ మెన్ ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య నాలుగిళ్ళలో అంట్లు తోముతోంది. ఇలాంటి వీడు టీవీలో తల్లీదండ్రీ ప్రత్యక్షదైవాలు అంటుంటే నరికి పారేయాలన్నంత కోపం వచ్చింది ఇలాంటి డబుల్ స్టాండర్డ్ వెధవల్ని చెప్పుతీసుక్కొట్టాలని వచ్చాం" అంటూ చెప్పు చేతిలోకి తీసుకుని రాజు వెంటపడుతోంటే, రాజు జనం మధ్యలోనుంచి పరుగెడుతున్నాడు.
అందరూ స్టన్ అయిపోయారు.
అప్పుడే తుగ్లక్ ఛానెల్ కింద స్క్రోల్ అవుతున్న 'బ్రేకింగ్ న్యూస్' కనిపించింది.
"తుగ్లక్ టీవీ న్యూస్ రీడర్స్ వెంగమాంబ అత్తమామల ఆత్మహత్య! కోడలు వెంగమాంబా వేధింపులే కారణమని లేఖలో ఆరోపణ!"