అలా చాలాసేపు అతను నడుస్తూనే వున్నాడు. నేను పట్టు విడవక ఆయన్ని అనుసరిస్తూనే వున్నాను. కొంచెంసేపటికి ఆయన నడవటం ఆపి "నువ్వెవరివి నాయనా? నావెంట ఎందుకొస్తున్నావ్" అని శాంత స్వరంతో అడిగాడు. నేను నా పేరు చెప్పి, నా విఫల ప్రేమగాధ ఆయనకి వివరించి "ఊపిరాడక చావుబతుకుల్లో వున్న నన్ను కేవలం చేతిస్పర్శతో ఎలా కాపాడగలిగారు? నాకందని ప్రాణవాయువు మీకెలా అందుతోంది?" అని అడిగాను.
అప్పుడే సాయంత్రమవుతూంది. మబ్బుల్ని చీల్చుకుని వచ్చిన సాయం సూర్యుడు తన కిరణాన్ని ఆ హిమం అంతటా వెదజల్లుతుంటే గొప్ప చిత్రకారుడైన ఆ పరమాత్ముడు లక్షలాది రంగులను మంచు శిఖరాలపై గుమ్మరించాడా అన్నట్లుంది. ఇది అని మాటల్లో వర్ణించలేని మానసికానందం!
యోగి చిరునవ్వుతో ఆ నీరెండలో ముందుకు సాగిపోయాడే కానీ నా ప్రశ్నలకి సమాధానం మాత్రం చెప్పలేదు. నేనతన్ని వదలదలచు కోలేదు. అతనివెంట మళ్ళీ పడ్డాను.
అది జులై మాసం హిమాలయాలలో ప్రయాణానికి- ఆ మాసం అనువైనది. అప్పటికి మంచుతిప్పలు కరిగిపోతాయి. చల్లదనం కూడా ఒంటికి హాయిని కలిగించే స్థాయిలోనే వుంటుంది. కొండచరియలు విరిగిపడటం, హిమపాతం మొదలైన ప్రమాదాలు తక్కువ ఆ విషయాలు నాకు ముందుగా తెలియకపోయినా నా అదృష్టం కొద్దీ ఆ సమయంలోనే నేను హిమాలయాలకు వెళ్ళగలిగాను.
"మరా యోగితో మాటలదారా? అతను మీ ప్రశ్నలకి జవాబు చెప్పాడా?" అడిగాడు అభిరాం.
"చెబుతా! నేను యోగిని అనుసరించి వెళుతున్నానే కానీ, చాలా కష్టంగా వుంది నాకు. అతను మాత్రం ఏ ఎగుడూ దిగుడూ లేని సాఫీ నేలపై నడిచి వెళ్ళిపోతున్నట్లు ఆ పర్వత సానువులపై అతి సునాయాసంగా సాగిపోతున్నాడు. ఇంకతన్ని వెంబడించాటం అసాధ్యమనిపించింది నాకు.
అదే సమయంలో ఆ యోగి ఒక గుహలోకి నడిచాడు. నేనూ అందులోకి ప్రవేసిమ్చాను. ఎట్టయినా బండలాంటి దానిమీద ఆ యోగి కూర్చుని వున్నాడు. నేనతని సమీపంలో నేలపై కూర్చున్నాను. ఆయాసంతో ఒక్కటే రోప్పుతున్నాను నేను. అతను మాత్రం ప్రశాంత దృక్కులతో, ఏ అలుపూ లేకుండా నావైపు చూస్తున్నాడు.
కొన్ని నిముషాలు గడిచాయి. నా అలసట తగ్గింది. అప్పుడు పెదవి విప్పి మాట్లాడాడతను-
"ఏమిటి నాయనా నీ సందేహం?" అని.
"స్వామీ! ప్రాణవాయువు అందక మృత్యువుకి దగ్గరయిన నన్ను మీరలా కాపాడారు? నాకందని ప్రాణవాయువు మీకెలా అందింది?" అని ప్రశ్నించాను.
"హిమాలయం పర్వతాలపై ఇరవై వేల అడుగులలోపే ప్రాణ వాయువు అందుతుంది. ఆ పైన ప్రాణవాయువు వుండదు.
ఏ ప్రాణి అయినా సరే ఆ ఎత్తుకి వెళితే మృత్యువుని చేరుకున్నట్లే నీకా సంగతి తెలియక ఆ దుస్సాహసానికి ఒడిగట్టావ్. ప్రాణంమీదకు తెచ్చుకున్నావ్ అని వివరించాడతను"
"మరి అంత ఎత్తులో మీకందని ప్రాణవాయువు అతనికెలా అందిందో వివరించలేదా?" వరప్రసాదం చెప్పడం ఆపేయడంతో గబగబా అడిగాడు అభిరాం.
"అదీ అడిగా.... దానికతడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాడు- 'స్త్రీ పురుషులు శిశువులుగా జన్మించినప్పుడు కొందరు శిశువులు మృతులై పుడతారు.
దీనిక్కారణం ఆ శిశువుకి బొడ్డునందు శ్వాసలేకపోవడమే. పుట్టిన ఆరుగంటలకు శిశువు మరణిస్తే ఆ శిశువుకు అయిదువేల నాలుగు వందల శ్వాసలు బొడ్డులో వున్నాయన్న మాట. ఆ ఆరుగంటలలో ముక్కు ద్వారాల నుంచి, నడిచి, నడిచి ఆ శ్వాస అంతా ఖర్చయి ఆ శిశువు మరణిస్తుంది.
ఇక ఇరవై నాలుగు గంటలు జీవించి పిదప మరణించిణ శిశువుకు ఇరవై ఒక్కవేల ఆర్య్వందల శ్వాసలు మాత్రమే వుండి అవి ఖర్చయి పోతే ఆ శిశువు మరణిస్తుంది. మూడు నెలలు జీవించి మృతి చెందిన శిశువుకి పందొమ్మిది లక్షల నలభై నాలుగువేల శ్వాసలుంటాయి.
అయిదు నెలలు జీవించి మృత్యువాత పడిన శిశువుకి ముఫ్ఫై రెండు లక్షల నలభై వేల శ్వాసలుండి అవి ఖర్చయిపోయిన మరుక్షణం ఆ శిశువు మరణిస్తుంది. పది సంవత్సరాలు జీవించి మృతి చెందిన వారికి ఏడుకోట్ల డెబ్బై ఏడు లక్షల అరవై వేల శ్వాసలు నలభై ఏళ్ళు జీవించి మృతిచెందిన వారికి ముఫ్ఫై ఒక కోటి పదిలక్షల నలభై వేల శ్వాసలుంటాయి.
ఎనభై ఏళ్ళు జీవించి మృతి చెందిన వారికీ అరవై ఆరుకోట్ల తొమ్మిది లక్షల అరవై వేల శ్వాసలుంటాయి.
ఈ శ్వాస నివసించు స్థానము 'నాభి' మానవుల ఆయువుకి ప్రమాణము. జ్యోతిష్యులూ, హస్తసాముద్రికవేత్తలు గుణించి చెప్పే సంవత్సరమూలా లెక్క కాదు. మన నాసికా ద్వారముల గుండా నడుస్తున్న శ్వాసే.
అన్ని జీవరాశుల యొక్క హృదయకమలంలో నివసించుచున్న ఆత్మ అనే దేవుడు ఆయా వ్యక్తులు ఎంతకాలము జీవించవలెనో అంత వరకూ కావలసినంతవరకూ శ్వాసను బొడ్డులో చుట్టగా చుట్టి వుంచుతాడు.
ఈ బొడ్డును 'కుండలినీ శక్తి' అని అంటారు. బొడ్డులో చుట్టగా చుట్టబడిన శ్వాస ప్రతిదినమూ, దివారాత్రులు కూడా క్షణమైనా విశ్రమించక మనం ఉచ్చ్వాస నిశ్వాసాలు ద్వారా విడువబడినపుడు కుడి నాశికంలోంచి వచ్చినపుడు ఎనిమిది అంగుళముల పొడుగంత శ్వాస వెలుపలికి వచ్చి, అందు నాలుగు అంగుళముల పొడవంత శ్వాస బయట నష్టమై, మిగిలిన నాలుగు అంగుళముల పొడవుగల శ్వాస బయటనున్న మంచిగాలిలో కలిసి తిరిగి నాభిలో నున్న శ్వాస నుంచి నాలుగంగుళమూలా పొడవంత శ్వాసతో కలిపి ఎనిమిది అంగుళముల పొడవు శ్వాసను తీసుకొని వెలుపలికి వస్తుంది.