సరిగ్గా రాత్రి తొమ్మిదీ నలభై నిమిషాలు.
హరిహరన్ తో పాటు చీకటి దారుల్లో నడుస్తున్నాడు అభినవ్.
పది నిమిషాల నడక ఆ తర్వాత రోడ్డు మలుపు తిరిగిన అభినవ్ కి, దూరంగా ఒక ఇల్లు దగ్థమవుతున్న దృశ్యం కనిపించింది హఠాత్తుగా.
"రక్షించండి..... రక్షించండి" ఎవరో అరుస్తున్న దృశ్యం.
పల్లె జనం హాహాకారాలు చేస్తున్న దృశ్యం.
ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న నాలుగేళ్ళ పాపను ఆ మంటల్లోకి కసిగా విసిరేయబోతున్న దారుణ దృశ్యం.
మంటల్లోకి విసిరేసిన పాపను రక్షించుకోడానికి ఓ పధ్నాలుగేళ్ళ కుర్రాడు పరుగు పరుగున వెళుతుండగా ఎవరో అడ్డుకోవడం.
దూరం నుంచి ఆ దృశ్యం చాలా భీభత్సంగా, హృదయవిదారకంగా వుంది. గబగబా పరుగు పరుగున ముందుకెళ్లాడు అభినవ్.
"ఏం సార్? ఏమిటది? ఏ ఒక్కరూ ఆ ఇంటిని ఆర్పడానికి గానీ నిప్పుల్లోకి పిల్లను విసిరేస్తున్న ఆ వ్యక్తిని అడ్డుకోడానికి గానీ ప్రయత్నించడం లేదేం? పోలీసులూ, ప్రజలూ అందరూ వింతను చూస్తున్నట్టుగా చూస్తున్నా రేమిటి సార్?" కోపంగా అడిగాడు అభినవ్.
ఎవరూ అతనికేసి చూడలేదు. ఎలాంటి సమాధానం చెప్పలేదు.
ఒక పక్క ఎర్రటి మంటలు నల్లగా మారుతూ నింగినంటుకుంటున్నాయి.
"చెల్లీ..... చెల్లీ" పధ్నాలుగేళ్ళ కుర్రాడు అరుస్తున్నాడు. గింజుకుంటున్నాడు. ఆ కుర్రాడి దగ్గరకు పరుగు పరుగు వెళ్ళాడు అభినవ్.
మంటల్లో పడిపోయి కాలిపోతున్న ఆ పాప దగ్గరకు పరిగెడుతున్న ఆ కుర్రాడ్ని బలవంతంగా ఆపబోయాడు. అది అతనికి సాధ్యం కావడం లేదు.
మళ్ళీ వెనక్కి పరుగు పరుగున వచ్చాడు అభినవ్.
తీరుబడిగా సిగరెట్ కాల్చుకుంటున్న హరహరన్ వైపు చూశాడు.
"ఇంత ఘోరం మీ కళ్ళెదుట జరుగుతుంటే పట్టించుకోవడం లేదేంటి సార్?" అభినవ్ సున్నితమైన హృదయం ఆ దృశ్యానికి నిజంగా చలించి పోయింది.
"లైట్సాన్" ఎవరో గట్టిగా అరవడంతో అంతవరకూ చీకటిగా వున్న ఆ ప్రాంతం ఒక్కసారి విద్యుత్ వెలుగుతో నిండిపోయింది.
తెల్లబోయాడు అభినవ్.
అభినవ్ వైపు చూసి నవ్వాడు హరిహరన్.
జరుగుతున్న చిత్రమైన సంఘటనలు వైపు విచిత్రంగా చూస్తున్నాడు అభినవ్. ఎవరో మంటల మీద నీళ్ళు జల్లుతున్నారు.
గ్రామ సర్పంచ్ అక్కడ గుమిగూడిన వ్యక్తులకు, పాపను మంటల్లోకి విసిరేసిన వ్యక్తికి, ఆ పధ్నాలుగేళ్ళ కుర్రాడికి జేబులోంచి తీసి కొంత డబ్బు నిస్తుండడం అంతా ఆశ్చర్యంగా వుంది అభినవ్ కి.
హరిహరన్ అభినవ్ భుజమ్మీద చేతులు వేసి ముందుకు నడిచాడు.
* * *
"ఇప్పుడు నువ్వు ఆ దృశ్యాన్ని ఒక పెయింటింగ్ గా మలచగలవు కదూ?" సూటిగా అభినవ్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు హరిహరన్.
వాస్తవం కన్నా ఊహలోనే అద్భుతమైన జీవితం వుంది..... చెప్పడము ప్రారంభించాడు హరిహరన్.
"పుష్పరాజ్ జీవితంలో పాతికేళ్ళ క్రితం జరిగిన అతి ముఖ్యమైన ఇన్ సి డెంట్ ఇది. తండ్రిమీద కక్షతో పెద్ద తండ్రికి చెందిన మనుషులు ఇల్లు కాల్చేశారు. ఆ మంటల్లో తండ్రి జయరాజ్, సవతి తల్లి మాది మసై పోవడం కళ్ళారా చూశాడు పుష్పరాజ్ చెల్లిని మంటల్లోకి విసిరేయడం కళ్ళారా చూశాడు పుష్పరాజ్.
పుష్పరాజ్ క్రిమినల్ గా మారడానికి ఇదే బలమైన కారణమని నా ఉద్దేశ్యం. ప్రస్తుతానికి మనకు తెలిసన ఆధారం ఇదొక్కటే. అందుకని బలమైన ముద్రకోసమే సజీవమైన ఈ సంఘటనను సృష్టించాం. ఇప్పుడు నీ దగ్గర్నించి అద్భుతమైన పెయింటింగ్ వస్తుందని నా నమ్మకం" ఆ కృత్రిమ సృష్టి వెనక కారణాలను విశదీకరించాడు హరిహరన్.
"అంటే...... ఆ నిప్పుల్లోకి విసిరేసిన పాప?!"
"ఇట్స్ ఏ డాల్! బొమ్మ. వాళ్ళిద్దరూ మేకప్ అఖ్ఖర్లేని సహజమైన నటులు"
గాఢంగా విశ్వసించాడు అభినవ్. కొద్దిసేపయ్యాక......
"ఆర్యూ ఎక్స్ పెక్టింగ్ సమ్ థింగ్ ఫ్రమ్ దిస్ ఫైర్ ఆక్సిడెంట్. ఈజ్ పుష్పరాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫైర్ ఫోబియా" అభినవ్ లో అద్భుతమైన జీనియస్ వున్నాడని మొట్టమొదటిసారి తెలిసింది హరిహరన్ కి.
"ఎస్" పుష్పరాజ్ గురించి తనకు తెల్సిన విషయాలన్నీ చెప్పాడు అభినవ్ తో హరిహరన్.
అదే రోజు రాత్రి టాక్సీలో వస్తున్న సమయంలో అడిగాడు అభినవ్.....
"పెయింటింగ్ మీకెన్ని రోజులకు కావాలి?"
"విత్ ఇన్ ఎ వన్ వీక్."
"ఇస్తాను. కానీ నాడో డౌట్. నేను చూసిన దృశ్యాన్నీ యథాతథంగా కాన్వాస్ మీద ప్రెజెంట్ చెయ్యగలనన్న నమ్మకం నాకుంది. కానీ ఆ పెయింటింగ్ ద్వారా క్రిమినల్ పుష్పరాజ్ ను మీరెలా పట్టుకోగలరు?"
"కొన్ని విషయాలు ముందుగా చెప్పకూడదు. ముఖ్యంగా పుష్పరాజ్ కి సంబంధించి" నవ్వుతూ అన్నాడాయన.
పెయింటింగ్ పూర్తి కావడానికి సరిగ్గా ఆరు రోజులు పట్టింది.
ఆ ఆరు రోజులూ హైద్రాబాద్ లోనే వున్నాడు హరిహరన్.
* * *
ఆ పెయింటింగ్ 75x90 కొలతల్లో వుంది.
ఆ పెయింటింగుని చూడగానే నోటమాట రాకుండా నిశ్చేష్టుడైపోయాడు హరిహరన్.
బ్లాక్, రెడ్ , ఆరంజ్ అండ్ ఎల్లో మిక్స్ డ్ కలర్స్ కాంబినేషన్లో కళ్ళెదురుగా ఒక పైర్ ఏక్సిడెంట్ జరుగుతున్నాట్లుగా వుంది.
పసి పాపను నిప్పుల్లోకి విసురుతున్న దృశ్యం...... ఆ పాపను రక్షించడానికి ముందుకు వెళ్ళకుండా నిరోధిస్తున్న వాళ్లను, విడిపించుకోడానికి ఒక బాలుడు చేసే ప్రయత్నం.
ఆ దృశ్యం సజీవంగా రంగస్థలం మీద ప్రదర్శిస్తున్న సంఘటనలా వుంది.
అభినవ్ లోని సహజమయిన ప్రతిభను మొట్టమొదటిసారి తెలుసుకున్న హరిహరన్ అతన్నెలా అభినందించాలో తెలియలేదు.
"ఈ పెయింటింగ్ కాపీరైట్ ను మీకే యిస్తున్నాను" నవ్వుతూ అన్నాడు అభినవ్.