Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 17

    "డాడీని వదిలేసారు. కేసేమీ లేదు" జరిగిందంతా పూస గుచ్చినట్లు వివరించి మయూష చెపుతుంటే కళ్ళప్పగించి వింటున్నారు శారదాంబ, మాలతి.
   
    ఆరోజు రాత్రి ఇంటిల్లిపాదికీ దీపావళిలా ఉంది. చుట్టుప్రక్కల వాళ్ళంతా విషయం తెలియడంలో పీతాంబరం దగ్గరకొచ్చి ఆనందాన్ని వ్యక్తం చేసి వెళ్ళారు.
   
    అందులో పక్కింటి గాయత్రి మొగుడు కూడా వున్నాడు. అతని పేరు సురేంద్ర అని మాటల మధ్యలో మయూషకు తెల్సింది. గోడచాటు ముద్దులోని సగభాగం పేరు తెలీటం....ఒకింత ఆనందాన్ని కలిగించింది మయూషకు.
   
                                          *    *    *    *
   
    మర్నాడు మయూష కాలేజీకి వెళ్ళలేదు.
   
    తండ్రి కేసు నుంచి తప్పించుకుంటే షంషాబాద్ ధర్మసాయి గుడికి వస్తాననీ తల్లి మొక్కుకోవడంతో తల్లి, వదిన, మయూష అక్కడకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు.
   
    ఉదయం తెల్లవారిన దగ్గర్నుంచి పీతాంబరం ఆఫీసు స్టాఫ్ వరుసగా వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తంచేసి వెళుతున్నారు. ఆరోజు కొన్ని పేపర్లు ఎ.సి.బీ ఆఫీసర్ ప్రకటనను ప్రకటించాయి.
   
    ఇంట్లో ఆడవాళ్ళు సరిగ్గా పదకొండు గంటలకు షంషాబాద్ కు బయల్దేరారు.
   
    పీతాంబరం భోజనం చేసి కాసేపు పడుకొని లేచేసరికి మూడయింది, కిచెన్ లోకి వెళ్ళి కాఫీ చేసుకుని తాగుతున్నప్పుడు-
   
    కాలింగ్ బెల్ చప్పుడు వినిపిస్తే వెళ్ళి తలుపు తెరిచాడు.
   
    ఎదురుగా భుజంగపతి.
   
    "రండి....రండి....మీకోసమే చూస్తున్నాను" అన్నాడు పీతాంబరం కృతజ్ఞతగా.
   
    డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు ఇద్దరూ ఇంట్లో పీతాంబరం తప్ప మరెవరూ లేరని అప్పటికే నిర్దారించుకున్నాడు భుజంగపతి.
   
    "పీతాంబరం గారు అదృష్టం ఏరికోరి వెతుక్కుంటూ రావడమంటే ఇదే మీ కుటుంబం మంచికోరి ఈ ప్రపోజల్ తెస్తున్నాను" అంటూ చెప్పడం ప్రారంభించాడు భుజంగపతి.
   
                                             *    *    *    *
   
    సిటీ నుంచి బయలుదేరిన షంషాబాద్ బస్సు చాలా రద్దీగా వుంది.
   
    "మనుషులకు శుచీ, శుభ్రం ఉండదు. చూడు ఎంత చెప్పినా ఎలా మీద పడిపోతున్నరో?" విసుక్కుంటోంది శారదాంబ.
   
    "నువ్వు దేవుడి గుడికెళుతున్నావని వాళ్ళని దూరంగా ఉండమంటే ఎలాగమ్మా" నవ్వుతూ అంటూ కొంచెం దూరంలో నుంచున్న ఇద్దరమ్మాయిల వేపు చూసింది మయూష. ఇద్దరికీ ఇరవై ఏళ్ళలోపు వయసుంటుంది. చిరంజీవి సిన్మా  గురించి చర్చించుకుంటున్నారు. ఆ ఇద్దరి అమ్మాయిలకు కొంచెం దూరంలో ఒక కుర్రాడు నిలబడి వున్నాడు.
   
    అతగాడు కూడా పల్లెటూరి కుర్రాడే.
   
    ఆ అమ్మాయి ఒక చేత్తో పక్కనే వున్నా ఐరెన్ రాడ్ ని పట్టుకుంది. ఆ కుర్రాడి కుడి చేయి ఆమె చేతికి కొంచెం దూరంలో వుంది.
   
    బస్సు గతుకుల్లో ప్రయాణిస్తున్నపుడల్లా అతగాడి చేయి నెమ్మది నెమ్మదిగా కిందకు దిగుతోంది. మొదట అతగాడి చిటికెన వేలు ఆ తర్వాత చూపుడు వేలు తర్వాత మిగతా వేళ్ళన్నీ ఆ అమ్మాయి చేతిని తాకుతున్నాయి.
   
    మయూష ఆ అమ్మాయి ముఖంలోకి చూస్తోంది. ఆ పల్లెటూరి అమ్మాయి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోనట్లుగా వుంది.
   
    మయూషకు ఒకపక్క ఎగ్జయిటింగ్ గా ఇంకో పక్క ఇలాంటి బస్ రోమియోలకు బుద్ది చెప్పాలన్నట్లుగా వుంది.
   
    అయిదు నిమిషాల సేపు అలాగే కళ్ళార్పకుండా ఆ దృశ్యాన్ని చూస్తూనే వుంది మయూష.
   
    గగన్ పహాడ్ బస్టాపులో బస్సాగి మళ్ళీ కదిలింది.
   
    ఆ కుర్రాడి పూర్తి అరచేయి ఆ యువతి అరచేతి మీద పడింది.
   
    మరి మౌనంగా ఊరుకోదల్చుకోలేదు మయూష గబుక్కున లేచి "ఏయ్ నిన్నే ఏంటా పని. ఆ అమ్మాయి చేతి మీంచి చెయ్యితియ్" అని అంది సీరియస్ గా.
   
    ఆ మాటకు ఆ కుర్రాడు గబుక్కున చేయి తీసేసాడు. ఆ అమ్మాయి మాత్రం కొంచెం కోపం కలబోసిన చూపుతో మయూష వేపు చూసి__
   
    "మావోడే....ఏంటట....కత" అని అడిగేసరికి మయూషలో ఆవేశం చప్పున చల్లారిపోయింది.
   
    అంటే ఈ బహిరంగ రహస్య శృంగారానికి ఆ అమ్మాయి ఆనందిస్తూనే వుందన్న మాట!
   
    ఈ ముచ్చటనంతా చూస్తున్న మాలతి చిన్నగా నవ్వింది. ఉక్రోషంగా వదినవేపు చూసి కిమ్మనకుండా కూర్చుండిపోయింది మయూష.
   
    షంషాబాద్ బస్టాండ్ లోకి బస్సు మలుపు తిరుగుతోంది-
   
    అప్పుడు-
   
    మయూష ఆ అమ్మాయి, ఆ అబ్బాయి చేతి వేళ్ళ స్పర్శ వ్యవహారంలోని అసలు సంగతి తెల్సుకోగలిగింది.
   
    పెళ్ళయిన భార్యా భర్తకే బాత్రూమ్ దగ్గర, దొంగచాటుగా ముద్దులు పెట్టుకుంటుంటే పెళ్ళి కాని ఈ జంట ఈ మాత్రం ఈ దొంగ స్పర్శకు ఆశపడడం తప్పులేదేమో.
   
    రేపు తన కాబోయే భర్త కూడా తననీ విధంగా స్పర్శించడానికి ప్రయత్నిస్తాడా? మయూషలో ఒక మధురమయిన ఊహ అస్పష్టంగా కదలాడింది.
   
                                           *    *    *    *
   
    "మిస్టర్ పీతాంబరం. నువ్వు ఎవరివల్ల అరగంటలో విడుదలయ్యావో తెలుసా? అందుకు కారణం ఎవరో తెలుసా?"
   
    భుజంగపతి ముఖంలోకి ఆశ్చర్యంగా చూసాడు పీతాంబరం.
   
    "ఎవరు...." విస్మయంగా ప్రశ్నించాడు పీతాంబరం.
   
    "ఇంకెవరు నీ కూతురు మయూష."
   
    "మయూషా....నేను విడుదల కావడానికి కారణం మయూషా.....ఆశ్చర్యంగా వుందే. నాకు తెలీదే" అతని కళ్ళల్లో ఏదో సంభ్రమం.
   
    "నీ కూతురు మయూషలోని గొప్పదనాన్ని తండ్రిగా నువ్వు గమనించకపోవచ్చు. చదువు సంధ్యలు, వినయం, తెలివితేటల్తోపాటు నీ కూతురు అద్భుతమైన సౌందర్యరాశి. ఇవాళ అందానికి ప్రపంచంలో పట్టం కడుతున్నారయ్యా బాబు. యాభయ్ వెలు ఖర్చు పెడితేనే గానీ విడుదల కాని నువ్వు ఒక ఫోన్ కాల్ తో విడుదల అయ్యావంటే దానికి కారణం మయూష అందం."
   
    "ఇంతకీ జరిగిందేవిటో చెప్పండి" ఆత్రుతని అణచుకుంటూ అడిగాడు పీతాంబరం.
   
    "అదే పాయింట్ కొస్తున్నాను. అనగనగా పాతికేళ్ళ కుర్రాడు అమెరికాలో ఎం.బి.ఏ. చదివాడు. కోట్ల రూపాయల ఆస్తి వుంది. ఇంకా చాలా బిజినెస్సులు ఉన్నాయి. కుర్రాడు ఎలా ఉంటాడో తెలుసా? రోజా సినిమాలో హీరోని చూసావా? అరవింద్ స్వామి ఆ లెక్కన వుంటాడు. ఓ రోజు యూనివర్శిటీ బస్టాపులో తన కారులోంచి నీ కూతురు మయూషను చూసాడు. అంతే. పెళ్ళి చేసుకుంటే మయూషనే చేసుకుంటానని కూర్చున్నాడు. హైలెవల్ సర్కిల్స్ లో చాలా పవర్ ఫుల్ నీ విషయంలో అసలు కేసు లేకుండా చేసింది ఎవరనుకున్నావ్......?ఆయన...."
   
    భుజంగపతి చెపుతున్నదంతా అనూహ్యంగా వుంది. ఒక కోటీశ్వరుడు తన కూతుర్ని ప్రేమించాడా? పెళ్ళి చేసుకుంటానని భీష్మించుకు కూర్చున్నాడా?? నిజమే?!!

 Previous Page Next Page