Previous Page Next Page 
అసావేరి పేజి 17

    "ఎప్పుడో ఎందుకు...ఈరోజు కాలేజీ అయిపోగానే శారదానది ఒడ్డున ఇసుక తిన్నెల మీద..."
   
    "ఓ.కే." చేతుల్ని కలుపుకున్నారు ఒప్పందంలా.
   
    రెండు రాజ్యాల మధ్య, రెండు తెగలమధ్య, రెండు వర్గాల మధ్యా అనాదిగా సాగే పోరాటంలాగే యిక్కడ రెండు స్థాయిల మధ్య రెండు విరుద్డ అభిప్రాయాల మధ్య పోరాటానికి అంకురార్పణ జరిగిపోయింది.
   
    ఇలాంటి పంతాలు ఇప్పటి కాలేజీల్లో కొత్త కాదు. కానీ శంకూ లాంటి అమాయకుడు రెచ్చిపోవటమే అందరికీ వింత....
   
    వెనకటి మనసు కీడు శంకిస్తుంది. దీనికంతటికీ పరోక్షంగా తనే కారణమన్న భావం అప్పటికే బోధపడిపోయింది.
   
    అతడికి తెలిసిన శంకూ ఎప్పుడో చనిపోయి ఎలాంటి రూపమెత్తాడో గుర్తులేదు. కానీ ఈ శంకూ కథ చాలా త్వరలో ముగిసిపోతూంది.
   
    ఇప్పుడు రవి దగ్గర అతడి ఊహలు ఆగిపోవటంలేదు.
   
    పరమ కిరాతకుడయిన రవి బావ రాజేందర్ గురించి ఆందోళన పడుతున్నాడు.
   
                                               *    *    *    *
   
    "సిస్టర్...."
   
    క్లాసునుంచి బయటికి వస్తూ చూసింది. డిగ్రీ కాలేజీకి చెందిన వెంకటి ఓ మూల నిలబడి వున్నాడు.
   
    "అవతల కొంపలు మునిగిపోతున్నాయి."
   
    "ఏమైంది?"
   
    చెప్పాడు ఉదయం మామూలు గొడవగా భావించింది. క్లాస్ రూంకి వెళ్ళిపోయినా సావేరి యిలాంటి మలుపు ఊహించలేదు. ఆమెకు ఆందోళనగా వుంది.
   
    "దీనికంతటికీ కారణం నేనే సావేరిగారూ....ఆకతాయిగా మీ పుస్తకంలో లెటరుంచింది నేనే.... ఇంత గొడవవుతుందని ఊహించలేకపోయాను...."
   
    ముందు ఉలిక్కిపడింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించే స్థితిలో లేదు.
   
    "మా బ్రదర్...." ఆమె గొంతు తడారిపోయింది.
   
    "అప్పుడే వెళ్ళిపోయారు."
   
    సరిగ్గా ఇదే సమయంలో....
   
    శారదానది ఒడ్డుకు చేరుకున్నారు రవి, శంకూలు.
   
    ఒక వినోదం చూడటానికన్నట్టు అప్పటికే వందమందిదాకా విద్యార్ధులు పోగయ్యారక్కడ.
   
    అందరిలోనూ టెన్షన్....
   
    ఒక గాలి సుడిగాలితో పోటీపడటం వింతగా అనిపించిందేమో శంకూ గురించి తెలిసిన శారదానది స్వేదాన్ని కక్కుతూ చప్పుడు చేయకుండా సాగిపోతూంది.
   
    ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యుడు అది చూడలేని నిస్సహాయత పొదిగిన అసమర్ధ శిశువులా పడమటి కొండల్లోకి మెల్లగా జారిపోతున్నాడు.
   
    "రెడీయా.....?" చొక్కా విప్పిన రవి ఛాలెంజ్ శంకూని చూశాడు.
   
    "శంకూ...." అప్పటికీ తన ప్రయత్నం మానలేదు సురేంద్ర! "నా మాట వినరా..."
   
    షర్టు తీసేసిన అతని శరీరం మంచు కురిసిన మొగలిరేకులా మెరిసిపోతూంది. ఇప్పుడు శంకూ ఎవరి మాటలూ వినే స్థితిలో లేడు. ఇందాక అమ్మ గురించి రవి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ తన సంసిద్ధతని వ్యక్తం చేశాడు. సురేంద్రని బలంగా పక్కకునెట్టి....
   
    కాలేజీ డిగ్రీ విద్యార్ధులు మొదలుకుని జూనియర్స్ దాకా అక్కడ మూగివున్నారు.
   
    అందరిలోనూ ఉత్కంఠత....
   
    శంకూపై సానుభూతికన్నా ఇక్కడ తమ పరువు శంకూ నిలబెట్టాలని ఇంటర్ విద్యార్ధులు ఆలోచిస్తుంటే రవి దెబ్బకి శంకు ఎలాగూ నిలబడలేడని తెలిసిన సీనియర్సంతా ఎంత గాట్టిగా తింటాడో చూడాలన్న ఉత్సుకథని ప్రదర్శిస్తున్నారు.
   
    గోదాలో దిగిన రెజిలర్స్ లా శంకూ, రవి అదనుకోసం చూస్తూ చుట్టూ తిరుగుతుంటే కేరింతలతో, కేకలతో కంచెలా నిలబడ్డ విద్యార్ధులు వార్ని ఉత్సాహపరుస్తున్నారు.
   
    ముప్పై సెకండ్లు గడిచాయి.
   
    రవి కలియబడలేదు. కానీ నెలకున్న ఇసుక శంకూ కళ్ళల్లో పడేట్టు పాదంతో తన్నాడు.
   
    ఇలాంటిది ఊహించని శంకూ కళ్ళల్లో ఇసుక పేరుకోగా చేతుల్తో కళ్ళు మూసుకున్నాడు.
   
    అదే అవకాశమైంది రవికి.
   
    చాచి గుండెలపై తన్నాడు.
   
    "అ....మ్మా" అసంకల్పితంగా అమ్మని గుర్తు చేసుకుంటూ వెల్లకిలా పడ్డాడు శంకూ.
   
    సీనియర్ విద్యార్ధుల్లో చెప్పలేనంత ఆనందం చప్పట్లు కొడుతూ "కీపిట్ అప్ రవీ" అన్నారు ఉద్వేగంగా.
   
    పైకి లేవబోయిన శంకూ పెదవిని మరోసారి తాకింది రవి కాలుబలంగా.
   
    వద్దనుకున్నా మళ్ళీ అమ్మనే పదమే అతని గొంతుదాకా వచ్చి సమాధి అయిపోయింది.
   
    పుష్టిగా వుంటే మాత్రం శంకూ శరీరం ఎక్కడ రాటుతేలిందని.
   
    అమ్మని అందరిమధ్య తూలనాడుతుంటే కసితో పోరాటానికి సిద్దమయ్యాడుగాని రవి ఇక్కడా ఇసుకకళ్ళలోకి నెట్టి అధర్మయుద్దాన్ని ప్రారంభిస్తాడని వూహించలేకపోయాడు.
   
    "ఎలా వుందిరా బా....స్ట...ర్డ్" పైశాచికంగా రెచ్చగొట్టాడు రవి.....కాళ్ళు విరిగిన మేకని చూస్తూ పులి కళ్ళలో మెరిసే ఆటవికమైన ఆనందంతో "గెటప్.... బాస్టర్డ్...." అన్నాడు రవి. 'బాస్టర్డ్' అన్న పదం మరోసారి ఒత్తిపలుకుతూ.
   
    అదే శంకూలో సహనపు ఆఖరిపొరని చిట్లిపోయేట్టు చేసింది.
   
    చివుక్కుమన్న మనసు ఎక్కుపెట్టిన విల్లుగా మారింది.
   
    రెండు క్షణాలపాటు నిశ్శబ్దం...అది బలాన్ని కూడగట్టుకోడానికి అని రవి వూహించలేకపోయాడు.
   
    అంతే....
   
    ఒక్క ఉదుటున శబ్దభేరిలా మారిన శంకూ తల రవి మొహాన్ని తాకింది.
   
    డబ్బున నేలపడ్డ రవి కళ్ళు ముందు బైర్లు క్రమ్మాయి. వెనువెంటనే రక్తం నాసికా రంధ్రాలనుంచి ఫౌంటెన్ లా బయటికి చిమ్మింది.
   
    కళ్ళల్లో ఇసుక పడినందుకు కారుతున్న నీళ్ళో తన అమ్మని తూల నాడినందుకు దుఃఖమో శంకూ కళ్ళనుంచి నీళ్ళు ఆగకుండా స్రవిస్తున్నాయి. అంతటితో ఆగలేదు శంకూ....డేగను తాకిన పావురంలా పైన బడ్డాడు. నీకులేని ధర్మవిచక్షణ నాకేమిటి అనుకున్నాడేమో....గుప్పిట్లతో ఇసుకని తీసి రవి మొహంపై పోశాడు.
   
    ఇంకా తీరని కసితో గాయమైన తలని, చెంపనీ సమ్మెటగా మార్చి రవి గుండెలపై గుద్దుతున్నాడు.
   
    ఇప్పుడు కేకలు, కేరింతలు జూనియర్ల వంతైంది.
   
    నీరు నిప్పయ్యింది. నిప్పుమంటయ్యింది. రవి లేవలేకపోయాడు. అసలు లేచే ప్రయత్నమూ చేయలేక నిస్సహాయంగా మూలుగుతున్నాడు.
   
    మరో నిమిషం గడిస్తే రవి ప్రాణాలు ఏమయ్యేవో....
   
    సరిగ్గా అప్పుడు పడింది అతని భుజంపై ఓ చేయి...
   
    అంతటితో ఆగనట్టు బలంగా వెనక్కి లాగింది.
   
    "నన్నాపొద్దు....నేను బాస్టర్డ్ ని....మా అమ్మ లం....అంటున్న వీడ్ని చంపేసి...." తనను వారిస్తున్నది ఎవరో తెలీని మొండితనంతో చెబుతూ రొప్పుతున్నాడు.
   
    "మిస్టర్ శంకర్....."

 Previous Page Next Page