"శశీ! అన్నిటినీ చక్కబరిచే బాధ్యత నాది. నువ్వు ఎలాంటి దిగులూ లేకుండా హాయిగా వుండు" అని దైర్యం చెప్పింది. ఎలాగయినా వాళ్ళిద్దర్నీ తిరిగి కలపాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది.
కేవలం మానవతా దృక్పధంతో శశి కాపురాన్ని బాగుచేయాలని ఆమె కంకణం కట్టుకున్న అదే సమయంలో ఆమెను ఎలాగయినా దెబ్బ తీయాలని భూపతిరెడ్డి దామాచారితో కలిసి ఓ దుష్ట పథకం పన్నుతున్నాడు.
అప్పుడు టైమ్ రాత్రి ఎనిమిది గంటలైంది
ఆకాశంలో ముప్పాతిక చంద్రుడు ఉగ్గుపాలు పోసే పొలాడిలాగా వున్నాడు. అందులోంచి పాలు ఒలికిపోతున్నట్లు వెన్నెల కురుస్తోంది. నిద్రపోయేముందు జనానికి గుడ్ బై చెప్పడానికి వచ్చినట్లు గాలి ఒంటినంతా రాసుకుని పోతోంది. ఆకాశంలో అక్కడక్కడా మేఘాలు చేరి కబుర్లు చెప్పుకుంటున్నట్లు గుంపులు గుంపులుగా వున్నాయి.
చంద్రరేఖ పైకి ఓసారి చూసి " ఏరా చిట్టి! అప్పుడే పడకలు బయటేస్తున్నావు. వర్షం వచ్చేటట్లుందే" అంది.
"వస్తే రానీలే అక్కా - లోపలికెళ్ళిపోదాం" ఇక ఓపిక లేనట్లు చిట్టి మంచంమీద వాలిపోయాడు.
చంద్రరేఖ కూడా లోపల పడుకుందామన్న ఆలోచన మానుకుని బయటేపడుకోవడానికి ఉపక్రమిస్తుండగా ఒక్కసారిగా ఊరు ఊరంతా మేల్కొన్నట్టు గగ్గోలు బయల్దేరింది.
చిట్టి ఉలిక్కిపడ్డట్లు లేచి కూర్చున్నాడు.
"ఎంచక్కా బయట గలాటా?" తనలో తాను అనుకున్నట్టు అడిగాడు.
"ఏమోరా! నాకు మాత్రం ఏం తెలుసు?"
ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఉత్సాహం వున్న వాళ్ళు అప్పుడే పరుగులాంటి నడకతో శబ్దాలు వస్తున్న దిశగా వెళుతున్నారు.
"ఆ పక్కవీధిలో కాబోలు" అని తనూ బయల్దేరింది చంద్రరేఖ. ఒక్కడికి భయమేసి చిట్టి కూడా ఆమెతోపాటే అడుగు ముందుకేశాడు.
వాళ్ళిద్దరూ సందులో దూరి రెండో వీధిలోకి వచ్చేసరికి రఘురామయ్య ఇంటి దగ్గర అప్పటికే జనం గుమిగూడి వున్నారు.
"ఏమైంది?" అంటూ ఎదురుగా వస్తున్న ఒకతన్ని ఆపి అడిగింది ఆమె.
"ఊర్మిళను టౌన్ నుంచి తీసుకొచ్చారు" ఆ వ్యక్తి అంతవరకే చెప్పి ఆపైన చెప్పడానికి తనకేమీ ఇంట్రెస్ట్ లేనట్లు వుండిపోయాడు.
ఎలానూ ఇంతదూరం వచ్చాం కనుక ఆ కొద్దిదూరమూ వెళ్ళి విషయం ఏమిటో తెల్సుకుందామని నాలుగడుగులు వేశారు.
రఘురామయ్య ఇంటిలో విషాదం తిష్టవేసినట్లు అందరూ విషాదంగా వున్నారు.
అక్కడికెళ్ళాక "ఏమైంది?" అనడిగింది చంద్రరేఖ రఘురామయ్యను.
ఆయనకు పెద్ద వయసు. ఆ ప్రశ్న అడిగింది ఎవరా అని పరిశీలించి, చంద్రరేఖను గుర్తించి - "ఏం చేయమంటారమ్మా?" డాక్టర్లు లాభంలేదని చెప్పడంతో గుండె రాయి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేశాను ఊర్మిళను దాన్ని చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది" అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ.
ఊర్మిళను చూడటానికి లోపలికెళ్ళిందామె.
పడకమీద అలా నిస్తేజంగా పడుకుని వుంది ఊర్మిళ. ముప్పై యేళ్ళ వయసులో అంత పెద్దజబ్బు రావడం బాధాకరమైన విషయం.
మనిషి సంవత్సరం క్రితంవరకూ బాగానే వుంది. సడన్ గా జబ్బు చేసింది. మొదట్లో ఏమిటేమిటో మాట్లాడేది. ఆ తర్వాత కాళ్ళనొప్పులు ప్రారంభమయ్యాయి అప్పుడు పక్క వూర్లోని నాటువైద్యుడి దగ్గరికి పరిగెత్తారు. ఆ డాక్టర్ ఏవో మందులిచ్చాడుగానీ తగ్గలేదు. ఆ తర్వాత ఒళ్ళంతా పొక్కులు వచ్చాయి. కాళ్ళు నడవడానికి సహకరించేవికావు. కొన్ని రోజులకు కాలు కిందపెట్టలేని స్థితికి వచ్చింది. వీటన్నిటికి తోడు కడుపునొప్పి.
తమ తాహతుకు మించిన పనయినా నెలక్రితం టోన్ లో పేరు మోసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ తన ప్రయత్నం ఏదో చేశాడుగానీ ఫలించలేదు. చివరికి ఆరోజు ఉదయం "జబ్బేమిటో అర్ధం కాలేదు. అన్ని సిస్టమ్స్ బాగానే వున్నాయి. మరి లోపం ఎక్కడో తెలియడంలేదు. నా నర్సింగ్ హోమ్ లో మాత్రం వద్దు ఇంకెక్కడికయినా తీసుకెళ్ళండి" అని డాక్టర్ తేల్చి చెప్పేయడంతో ఇక యింటికి తీసుకువచ్చేశారు.
ఊర్మిళ జబ్బు మానసికమైంది అని చంద్రరేఖకి మొదట్లో అనుమానం కలిగింది. కేవలం అనుమానంతో ఆమెకు చికిత్స చేయడం అంత మంచిది కాదనిపించింది. అందుకే టౌన్ కి తీసుకెళతానని రఘురామయ్య చెప్పినప్పుడు మౌనంగా తలూపింది.


