పగలంతా శ్రమపడిన సూర్యభగవానుడు విశ్రాంతి తీసుకోటానికి అనురాగవతి యైన అర్ధాంగిని కలుసుకోవటానికి వెడుతున్నాడు.
చైత్రమాసం చివరి రోజులు.
చైత్రవైశాఖ మాసాల సంధిరోజులు.
గాలిఏమీ ఆడటం లేదు.
వాతావరణం చాలా పొడిగా వుంది.
బూడిదరంగు మబ్బులు మసిపూసినపాత్రల్లా బోడిగా, బోసిగా ఉన్నాయి. పొలాలన్నీ కోతలుపడిభూమాతవిశ్రాంతి తీసుకుంటున్నట్లుంది.
మామిడిపళ్ళు అప్పుడప్పుడే మాగిఓవిధమైన మధురపరిమళాన్ని వెదజల్లుతున్నాయ్.
అక్కడక్కడ బావుల క్రిందవేసిన పండ్ల తోటల్లోని పండ్లు మాగి ఓ విధమైన పరిమళంలో నింపుతున్నాయ్. సంత మావిడితోపులో కూర్చుని సారధికై ఎదురుచూస్తోంది గీతాంజలి.
కెనాల్ క్రింద వరిసాగు అంతా అల్లుకుడు మాయమై పోయిందిపొలం. ఎక్కడా పళ్ళతోటలు అధికంగా లేవు. ఎక్కడో నీరు వాసనా కూడా తగలనిస్థలాల్లో నారింజతోటలు మామిడితోటలు ఉన్నాయ్.
"ఎందుకోసాయంకాలం త్వరగా వచ్చి కలుసుకోమన్నవాడు ఆరుగంటలు అయినా ఇంకా రాలేదేమిటి?" అనుకుంటూ అటూ ఇటూ చూస్తున్నది గీతాంజలి.
కూతవేటుదూరంలో కనుచూపుమేరలో మనిషి అలికిడిలేదు.
గంటనుంచీ ఎదురుచూస్తోన్న గీతాంజలి ఆవేదన ఆరాటమూ అధికం కాసాగాయి.
"ఎందుకని ఇంకా రాలేదా?" అనే ప్రశ్న ఆమె మనసులో మెదలుతూ వుంది.
ఉన్నట్టుండి హఠాత్తుగా ఎవరోకళ్ళు మూశారు.
ఉలిక్కిపడికేక వేయబోయి, హఠాత్తుగా కళ్ళుమూసేవారు ఎవరా అని ఒక్కక్షణం ఆలోచించి తనకళ్ళన మూసినచేతులని తడిమిచూసింది. స్పర్శ వినూత్నంగా వుంది.
"ఇవి! ఇవి! సారధి చేతులుకావే"
ఆ మాటమనసులో మెదుల్తూనేవళ్ళంతా జలదరించినట్లయింది.
"ఆ! ఆ! అదీ! కనుకున్నావన్నమాట! మరి నా పేరు ఏమిటో? అదికూడా చెప్పుకో?"
"ఎవరు? ఎవరు?"
అర్ధంకాక గాబరాతో అడిగింది.
"అదే అడుగుతున్నాను విరిబోణీ! అతని ఆగమనానికై అరవిచ్చిన మందారంలా ముద్దబంతిలా అలకరించుకుని యెదురు చూస్తోన్నదెవరా? అనుకున్నాను"
గీతాంజలి అర్ధమైంది ధోరణి.
"చేతులు తీయ్ గురుదేవ్"
"నా పేరుకి అర్ధంకాదే చిన్నదానా అడిగేది. నా పేరు అడుగుతున్నాను చెప్పు?"
కళ్ళమీద చేతులు తీయనేలేదు. విడిపించుకోటానికి ప్రయత్నిస్తూ అంది.
"గురుదేవ్.....విడిచిపెట్టు.......ప్లీజ్"
"అదిగో అక్కడే పప్పులో కాలువేస్తున్నావ్. నా పేరు గురుదేవ్ కాదు.....రవీంద్రనాధ్ టాగూర్ పలుకరవీంద్రనాధటాగూర్"
"ర.....వీం.....ద్ర......నా.....థ.......టా........గూ.........ర్........"
కళ్ళమీద నుంచి చేతులు తీశాడు. కళ్ళువిప్పుకుంది బరువుగా మూయటంవల్ల కనులు కొద్దిగా నొచ్చినాయ్.
మసకమసకగా వుంది చూపు.
కళ్ళునులుముకుని చూసింది ఎదురుగా సారధీ!
ఆశ్చర్యపోయి అంది 'యేమిటి నాటకం?'
ఆమెపడే భ్రమకునవుకుంటూ అన్నాడు "నేను కాదులే గీతా-అడుగో నీ వెనకాలే వున్నాడు కథనాయకుడు.....లే"
వెనుతిరిగి చూసింది ఠీవిగా చేతులు నడుముపై వేసుకుని పొడుగాటి షర్టు, పేంటువేసుకుని పిచ్చికలగూడుని గడ్డంలా కట్టుకుని నిలబడ్డాడు గురుదేవ్-
అతని కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయ్ ఆమెని.
"అయిందా నీ పర్యవేక్షణ?"
"........"
"లే--అడ్డంతొలుగు--మనకథలో విలన్ ప్రవేశించాడు--వాడిని హత్యచేయాలి-రసపట్టులో ప్రవేశించి కథాగమనానికి అడ్డు తగులుతున్న ఈ పిరికి వెధవ పని చెప్పాలి" గీతాంజలిని కాస్త అడ్డం తొలిగించి సారధికి ఎదురుగా నిలబడ్డాడు.
ఒక్కక్షణం ఎగాదిగా చూసి అన్నాడు.
"ఏంటోయ్ పిచ్చిపుల్లాయ్! ఈ చేష్టలు మారుమాట్లాడకుండా వచ్చినదారినేవెళ్ళు-ప్రేమికులమధ్య ఎవరూ ప్రవేశించరాదోయ్ పిచ్చివాడా!"
ఒక్కసారి మళ్ళీ అటూ ఇటూ చూసి అన్నాడు.
"మాకు ప్రశాంతత కావాలి ఎలాంటిదో తెలుసా?"
"వేర్ ది మైండ్ ఈజ్ విథౌట్ ఫియర్.
వేర్ నాలెడ్జి ఈజ్ ఫ్రీ-
ఇంటుదట్ ల్యాండ్-
"ఊరెళ్ళు-"
సారధి అయోమయంగా చూశాడు.
"నిన్నే--వెళ్ళిపో"
గీతాంజలి మెల్లిగా సైగ చేసింది. సారథి మౌనంగా నడిచి ఓ చెట్టు చాటున దాక్కున్నాడు.
అతను వెళ్ళాక అన్నాడు.
"అమ్మాయ్"
"ఏమిటన్నట్లు అతని వేపు చూసింది"
"ఓపాట పాడు"
"రాదు"
"కనీసం ఆడు"
"అదీరాదు"
"పోనీ ఆడుతూ పాడు"
"ఊహూ"
"ఆడనూ పాడను రాని ఆడదానివి నీవేం ప్రణయానికి పనికి వస్తావు.....ఛెట్......వెళ్ళు" కదలిపోబోయింది.
"కదిలావంటే కాల్చేస్తాన్" నిలబడిపోయింది.
అతనివేపు చూసింది చేతిలోకర్ర పట్టుకుని దాన్నితుపాకిలా బారు చేశాడు.
"ఏమ్మోపిచ్చివాని చేతిలోనిరాయి.....తగిలినా తగలవచ్చు....." భయమేసి ఆగిపోయింది.
"నిలబడు"
"......"
"దాగుడుమూతలాడదామా?" సంతోషం ఒప్పుకుంది.
"ఊదాక్కోపో" కళ్ళు మూసుకుంటూ అన్నాడు
మెల్లిగా సారధివున్న చెట్టుచాటుకివెళ్ళింది. వెళ్ళేప్పుడుకన్ను ఓరగా తెరిచిచూశాడు.
కోపం పెట్రేగిపోయింది.
"హీరోని కాదని విలన్ వెంటతిరిగే అర్భకురాలా?
నీవేం హీరోయిన్ వి.......నిన్ను తీసివేస్తాన్.......చంపేస్తాన్" వేగంగా పరుగెత్తాడు. పొరపాటున ఆ వేగంలో చెట్టుకి తలవేసి కొట్టుకున్నాడు.
అంతే!
అలాగే నేలమీద కూలాడు. కంగారు వచ్చి చూసిన సారధికి రక్తం కారుతున్న నొసటితో స్పృహలేకపడున్న గురుదేవ్ కనిపించాడు.
భయంతో భుజం మీద అతన్ని వేసుకుని టౌన్ హాస్పిటల్ కి ఆ సంజ వెలుగులో బయలుదేరాడు.