Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 16

ఆయన శివమెత్తినవాడిలాగా, "తెగనీలుగుతున్నావే! నాయిష్టప్రకారం ఉండకపోతే నాయింటిలో ఉండడానికి వీల్లేదు."
"నువ్వు ఉండమన్నా ఉండను."
మావయ్య పిన్నుతో గుచ్చిన బెలూన్లాగా వేళ్ళాడిపోయాడు.
"ఎక్కడికెళతావ్?" అన్నాడు తెచ్చిపెట్టుకున్న బింకంతో.
దిక్కులేని ఆడపిల్ల. అలా తనని ఎదిరించి వెళ్ళిపోతుందని ఆయన వూహించలేదు.
ఆయన్ని దహించేటట్లు, శపించేటట్లు చూస్తూ, "నీలాంటివాళ్ళు లేని చోటికి!" అంది.
పేరంటానికెళ్ళిన అత్తయ్యావాళ్ళు తిరిగిచ్చేసరికి లత వస్తువు ఒక్కటీ ఆ ఇంట్లో లేదు - తను తొందరలో మర్చిపోయి వదిలేసిన సోప్ బాక్స్ తప్ప!
లత కూడా లేదు!
నోట్లో పెట్టుకోబోతున్న చాక్లెట్ జారి కింద మట్టిలో పడిపోతే దిగాలుపడిపోయిన పిల్లాడిలా కూర్చుని ఉన్న మామయ్య, కాసేపటి తరవాత లత వదిలేసిన సోపుని గమనించి దాన్ని అపురూపంగా తన పెట్టిలో, తన 'పుస్తకాల కలెక్షన్'తో బాటు భద్రం చేసుకున్నాడు.  
                                                                 * * *
    
శ్రీకాంత్ కానిస్టేబుల్ని కొట్టిన తరువాత జైలులో చాలా పెద్ద గొడవే అయింది.
క్షణాలమీద విజిల్స్ వినబడ్డాయి. ప్రమాదాన్ని సూచిస్తూ సైరన్ మోగింది. హడావిడిగా కానిస్టేబుల్స్ కొంతమంది పరిగెత్తుకొచ్చి శ్రీమంత్ మీద పడి, పెడరెక్కలు విరిచిపట్టుకున్నారు.
జైలు వార్డెన్ గబగబ వచ్చాడు.
"ఏమైంది" అన్నాడు పరిశీలనగా అందరినీ చూస్తూ.
"టూనాట్ వన్ ని కొట్టాడు సార్ ఈ సైతాన్!"
"ఏమిరా? తలగానీ తిరుగుతోందా?" అన్నాడు వార్డెన్ కర్కశంగా.
"మళ్ళీ అదే! అలా 'రా' 'గీ' అని మాట్లాడొద్దని మీవాడికి చెబుతుంటేనే ఇంత గొడవైంది. ఎగైన్ యూ ఆర్ టాకింగ్ ఇన్ ద సేమ్ బ్లడీ రాటెన్ వే! అలా మాట్లాడడానికి మీకు హక్కు..."
వెంటనే వార్డెన్ మొహంలో చూపు మారిపోయింది. కోపం, రౌద్రం కనబడడం లేదు ఇప్పుడా కళ్ళల్లో అసహజంగా, అతిచల్లగా మారిపోయిందా చూపు.
పాతకేడీలకు మంచుముక్కల్లా ఉన్న ఆ కళ్ళల్లోని భావమేమిటో తెలుసు!
ఆయన అలా చూడగానే వాళ్ళ మనసు గడ్డ కట్టుకుపోతుంది.
వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది.
ఆయన కళ్ళలోని రౌద్రాన్ని సంతోషంగా ఎదుర్కోగలరు రౌడీలు - ఒళ్ళు చల్లబడిపోయేలా చేసే ఆ చూపుకంటే.
మహేష్, అతని ఇద్దరు మిత్రులూ, నోరు తెరుచుకుని జరుగుతోంది చూస్తున్నారు.
"ప్లీజ్ కమ్ ఎలాంగ్ విత్ మీ!" అన్నాడు వార్డెన్ శ్రీమంత్ తో అతి మర్యాదగా, వినయాన్ని అభినయిస్తున్న నటుడిలా -
"దట్స్ రైట్! నౌ యూ ఆర్ బిహేవింగ్ యువర్ సెల్ఫ్! అలా మర్యాదగా మాట్లాడితే అసలు పేచీనే లేదు."
"రండి!" అని దారి తీశాడు వార్డెన్.
చాలా నిర్దుష్ట]మైన ఇంగ్లీషు వుచ్చారణతో, మంచినీళ్ళు గడగడ తాగేసినట్లు మాట్లాడుతూ, జైల్లో ఇప్పుడున్న వాతావరణం గురించీ, ఉండవలసిన వాతావరణం గురించీ అనర్గళంగా లెక్చరిస్తూ ఆయన వెనక నడిచాడు శ్రీమంత్.
సరిగ్గా పదినిముషాలతర్వాత, ఒళ్ళు జలదరించేటట్లు, చెట్టంత మొగాళ్ళకి, రాటుదేలిన రౌడీలకూ కూడా గుండె నీరయిపోయేటట్లు.
"మ్ మ్ మ్మా!" అని కేక వినబడింది. అది శ్రీమంత్ గొంతు.
దుర్భరమైన బాధని భరించడానికి విశ్వప్రయత్నం చేస్తూ, ఓడిపోయిన మనిషి ఆర్తనాదంలా వుంది. బిగించిన పళ్ళూ, కళ్ళూ, పెదిమలూ ఆ శబ్దాన్ని ఇంకా భయంకరంగా చేశాయేగానీ, ఆపలేకపోయాయని అర్ధమవుతోంది.
"మ్మ్...మ్మా!"
అతని అమ్మ ఎవరో గానీ, అతని పిలుపు వినబడనంత దూరంలో ఉంది కాబట్టి అదృష్టవంతురాలైపోయింది. కొడుకు పెట్టిన ఆ కేక వింటే ఆ తల్లి...
"మ్మా..."
తరవాత అరగంట దాకా ఆ సోలిటరీ సెల్ నుంచి, మనిషి మనిషిమీద చూపించగల క్రౌర్యానికి నిదర్శనంగా కేకలు!
    
                                                                   * * *
    
నాలుగురోజుల తర్వాత శ్రీమంత్ నీ, మహేష్ నీ తన రూమ్ లోకి పిలిపించాడు వార్డెన్. కావాలనే శ్రీమంత్ ని నిర్లక్ష్యం చేసి, అసలు అతన్ని పట్టించుకోకుండా, అతని ఉనికిని గమనించకుండా మహేష్ వైపు తిరిగాడు.
'మేకపోతు గాంభీర్యం' అనుకున్నాడు శ్రీమంత్ మనసులోనే నవ్వుకుంటూ.
"ఏమిరా! ఇంకా దందాలు చేస్తున్నావా?" అన్నాడు వార్డెన్.
"లేద్సర్! మానేసినాను" అన్నాడు మహేష్ అతి వినయంగా.
"కవాడిగుడాలో గేంబ్లింగ్ డెన్ నడిపిస్తున్నవంటనే!"
"లేదు సర్!" అన్నాడు మహేష్ రాని నవ్వు తెచ్చుకుంటూ.
"మళ్ళీ డీ.సీ.పీ. సాబ్ కళ్ళబడకు! తోలు తీస్తాడు జాగ్రత్త! మంచిగా బ్రతకరా! పో!" అన్నాడు వార్డెన్.
తర్వాత శ్రీమంత్ వేపు తిరిగి, "నువ్వు కూడ వెళ్ళొచ్చు. జాగ్రత్తగా ఉండు. మళ్ళీ పిలిచినప్పుడు వచ్చి కనబడాలి. "తెల్సిందా!" అన్నాడు ఉదారంగా గొంతు పెట్టి.
"మీరు' అనడం మర్యాద! మైండ్ యూ! మీ సంగతి నాకు తెలీదు. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ని!" అని "నన్ను రిలీజ్ చెయ్యమని ఆర్డర్స్ వచ్చాయా? నా బెయిల్ అప్లికేషన్ తొందరగానే కన్ సిడర్ చేశారన్నమాట!" అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ.
దొంగాటలో దొరికిపోయిన పిల్లాడిలా చూశాడు వార్డెన్.
"మీరు నన్ను దయా ధర్మంగా వదలడంలేదు. బెయిలుకి అప్లయి చేశాను. బెయిలు దొరికింది. జెయిల్లోంచి వెళ్ళిపోతున్నాను. అవునా?" అన్నాడు శ్రీమంత్.
వార్డెన్ నిశితంగా చూశాడతన్ని.
"సీ యూ!" అని వార్డెన్ తో చెప్పి, అంతలోనే, "సారీ! ఐ డోంట్ వాంట్ టు సీ యూ ఎగైన్." అని బయటికి నడిచాడు.
వార్డెన్ కి దండంపెట్టి మహేష్ కూడా కదిలాడు.
బయటికి రాగానే ఒకసారి వెనక్కు తిరిగి చూశాడు శ్రీమంత్.

 Previous Page Next Page