"చాలామంది లవ్ అంటే మామూలు ప్రేమని అనుకుంటారు. అదొక కెమికల్ రియాక్షన్. దీనిని పోజిటివ్ వేలో 'డీల్' చెయ్యాలి. చెయ్యలేకపొతే నీ బతుకు చీకటైపోతుంది. బాగా ఆలోచించుకో. చాలామంది ఇక్కడే పెద్ద తప్పు చేస్తారు. ప్రేమిస్తారు. ఆ ప్రేమను నిలుపుకోవడం ఎలాగో వారికి తెలీదు. వాళ్ళు ప్రేమలో అభిమన్యులన్న మాట. నువ్వు చేయాల్సిన పని ఫస్ట్ ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడుతుందా, లేదా. సెకండ్ - మంచి ఎట్మాస్పియర్ లో 'ఐ లవ్ యూ' అని చెప్పడం. థర్డ్- ఆ ప్రేమ బంధాన్ని పటిష్టం చేసుకోవడం. పోర్త్ పెళ్ళి...... ప్రేమ విషయంలో ఎప్పుడూ ఆలస్యం పనికిరాదు. గుర్తుంచుకో. ఫస్ట్ వర్క్ ఇవాళే పూర్తి చేయడం మంచిది" ఆగి కూల్ డ్రింక్ సిప్ చెయ్యడం మొదలెట్టాడు సుల్తాన్.
వాచీ వేపు చూసుకున్నాడు మధు.
సాయంత్రం అయిదు గంటలు దాటింది.
"ఇప్పుడు అన్విత ఎక్కడుంటుంది!" అడిగాడు సుల్తాన్.
"బహుశా ఇంట్లో....."
"అయితే వెంటనే వెళ్ళు, చెప్పెయ్"
"ఇప్పుడే వెళతాను" ఆవేశంగా అన్నాడు మధు.
"ఇలాగే వెళతావా?" అతను వేసుకున్న డ్రెస్ వైపు చూస్తూ అడిగాడు సుల్తాన్.
"ఏం!"
"ఆడపిల్లల్ని ఇంప్రెస్ చెయ్యాలంటే, నీట్ గా తయారవ్వాలి. ముందు ఇంటికెళ్ళి స్నానం చేసి, లైట్ గా సెంటు రాసుకో. నువ్వు చీకటిపడే టైముకి వాళ్లింటికెళతావు. కాబట్టి డార్క్ కలర్స్ డ్రెస్ వేసుకో. రొమాంటిక్ గా కనిపించాలనుకునే మగవాళ్ళు పగటిపూట లైట్ కలర్ డ్రెస్, సాయంకాలం డార్క్ కలర్ డ్రెస్. అంటే కుర్తా, పైజామా టైపు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, నీ లవర్ ని కలవటానికి నువ్వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి వెళ్ళడం మంచి పద్ధతి.
లేకపోతే నీ సర్ ప్రయిజ్ విజిట్ సమయంలో వాళ్ళు కాజువల్ గా , అప్పలమ్మల్లా వుంటారు. ఆ సమయంలో వాళ్ళలో ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ప్రవేశిస్తుంది. నీతో సరిగా మాట్లాడలేరు" చెప్పాడు సుల్తాన్.
ఇద్దరూ రెస్టారెంట్ లోంచి బయటికొచ్చారు.
ఫోన్ అన్వితే రిసీవ్ చేసుకుంటుందా? రింగవగానే ఎలా విష్ చేయాలి! 'హలో అనాలా! హౌ ఆర్యూ.... అంటే' టెలిఫోన్ బూత్ లోకి అడుగుపెట్టాడు మధు. అతనికి కొంచెం దూరంలో నుంచున్న సుల్తాన్, టెలిఫోన్ పక్కనే కూర్చున్న కుర్రాడ్ని పక్కకి పిలిచాడు.
"ఏం సార్ చెప్పండి." ఆ కుర్రాడు సుల్తాన్ దగ్గరికి వెళ్ళాడు. "ఈ మధ్య ఏ సినిమాలు చూశావ్?" అడిగాడు సుల్తావ్. ఆ ప్రశ్నకు బిత్తరపోయాడు ఆ కుర్రాడు. ఒక అపరచిత వ్యక్తి సడన్ గా పిల్చి సినిమాల గురించి అడగడం ఏమిటి? సుల్తాన్ ఆ కుర్రాడ్ని రకరకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయటం మొదలెట్టాడు.
"ఈ షర్టు ఎక్కడ కొన్నావ్! ఎక్కడ కుట్టించావ్! బటన్సు మెరుస్తున్నాయే" ఇలా సాగుతోంది వ్యవహారం.
ఆ కుర్రాడు దెయ్యం పట్టినవాడిలా అయిపోయాడు.
రిసీవర్ అందుకుని చూపుడువేలితో ఒక్కొక్క నెంబర్నీ ప్రెస్ చేస్తున్నాడు మధు.
ఒక్క క్షణం తర్వాత ఫోను రింగవుతున్న చప్పుడు గుండెల్లోనే రింగవుతున్నట్లుగా వుంది.
"ఏదో తెలీని సంచలనం..... అలజడి. ఉచ్చ్వాస, నిశ్వాసల్లో పెరుగుతున్న వేగం, ఎవరో రిసీవరు అందుకున్న ధ్వని.
"హలో....." ఆ గొంతు సన్నగా వుంది. అన్విత గొంతును ఫోన్ లో వినటం అదే మొదటిసారి.
"హలో...."
"ఎవరు కావాలండి?" ఆ గొంతు అన్వితది.
ఆమె గొంతును గుర్తుపట్టగానే అనవసరమైన కంగారుకు లోనయ్యాడు మధు.
'మేడమ్...... మే..... డమ్...." ఎలా వచ్చిందో ఆ పదం వచ్చేసింది.
"వుండండి పిలుస్తాను."
రెండు క్షణాల నిశ్శబ్దం.
"హలో..... ఎవరు?" అటువైపు నుంచి అన్విత నాయనమ్మ లైన్ లోకి వచ్చింది.
"నేనే" అన్నాడు మధు.
"నేనే అంటే.... ఎక్కడ్నుంచీ?"
"ఏలూరు నుంచే..... సెలూన్ పక్కన టెలీఫోన్ బూత్."
"ఏమిటి?"
"నేను మిమ్మల్ని మీట్ కావచ్చా?"
"వైనాట్..... ఎందుకు కాకూడదూ? కావచ్చు. ఏ పంక్షనూ?"
"ఫంక్షనంటే..... కాలేజీ..... జీ....."
"కాలేజీ ఫంక్షనా..... అయితే కొట్టిన పిండే. ఇంకెవరెవర్ని పిలుస్తున్నారు?"
అప్పుడర్ధమైంది మధుకి. ఆ గొంతు అన్వితది కాదని, వాళ్ళ నాన్నమ్మదని.
సరిగ్గా అదే సమయంలో మెట్లు దిగుతున్న అన్వితను ;కాలేజీ' అని విన్పించగానే "నానమ్మా ఆ ఫోన్ నాకేమో" అనంటూ రిసీవర్ అందుకుని-
"ఎవరు?" అంది.
ఆ గొంతును గుర్తుపట్టాడు వెంటనే మధు. వేయి విద్యుత్ జలపాతాల సంగమం ఆ గొంతులో ధ్వనించాయి.
"నేనే మధుని."
"హలో..... వాటే సర్ ప్రయిజ్...."
"అవును సర్ ప్రయిజే" అప్పుడే పక్కకొచ్చిన సుల్తాన్ మధు చెవిలో "వెంటనే విషయం చెప్పెయ్.... లేట్ చేయకు" చెవిలో చెప్పాడు.
"లేట్ చేయను..... చెప్తానుగా" బయటికే అనేశాడు మధు.
"ఏమిటీ లేట్ చేయనంటున్నారు?" అడిగింది అన్విత.
"నేను మీ యింటికొస్తున్నాను" గబగబా అనేశాడతను.
"వెల్ కమ్...... నాక్కూడా బోర్ కొట్టేస్తోంది" అంది అన్విత.
"సీయూ" ఫోన్ పెట్టేసి కరెంటు షాక్ కొట్టినవాడిలా నిలబడిపోయాడు.
"ఏమంది? రమ్మందా?"
"బోర్ కొట్టేస్తోందట రమ్మంది" నీరసంగా అన్నాడు మధు. టెలిఫోన్ వాడికి రూపాయినోటునిచ్చాడు సుల్తాన్.
"ప్రైవేట్ టాక్ అని చెపితే నేనే అక్కడెక్కడో వెళ్ళిపోయేవాడ్ని కదండీ. అడ్డమైన ప్రశ్నలూ వేసి, నా బుర్ర తినేశారు. బాటా బూట్లు ఎవరు కనిపెట్టారు? హనుమాన్ జంక్షన్ కి ఆ పేరెవారు పెట్టారు? చంద్రబాబు రోజుకి పెద్దనిమిది గంటలు ఎలా పనిచేయగలగుతున్నాడు! ఎస్.టి.డి.ని ఎవరు కనిపెట్టారంటే నాకేం తెలుస్తూందండీ?" అన్నాడతను దీనంగా కళ్ళవెంట నీళ్ళెట్టుకుంటూ.
"నా దగ్గర ఇంకా చాలా ప్రశ్నలున్నాయి. ఈసారి వేస్తాను" అని చెప్పి మధు వెనక నడిచాడు సుల్తాన్. ఆ టెలిఫోన్ కుర్రాడు సుల్తాన్ వైపు చూశాడు చలిజ్వరం వచ్చినవాడిలా.
* * *
స్కై బ్లూ కలర్ జీన్స్ పాంట్, షర్టూ, గాగుల్స్, వంటికి రాసుకున్న స్ప్రే, ఉడ్ లాండ్ షూస్, లేటెస్ట్ మోడల్ టైటాన్ వాచ్- ఇంట్లోంచి బయటికొచ్చిన మధుకిరణ్ వైపు, కొత్తవ్యక్తిని చూస్తున్నట్లుగా చూశాడు సుల్తాన్.
"ఇంతవరకూ నిన్ను పెద్దగా పట్టించుకోలేదు కానీ..... టీవీ.లో కన్పించే మోడల్ ళా వున్నావు" అన్నాడు సుల్తాన్ ఆటో ఎక్కుతూ.
ఆటో ఏలూరు మెయిన్ రోడ్డుమీద పరుగెడుతోంది.
"సంభాషణ ఎలా స్టార్ట్ చేయాలిరా!"
"అన్విత సాప్ట్ డ్రింక్ ఆఫర్ చేస్తుంది. చెప్పండి అని ఎదురుగా కూర్చుంటుంది. సరదాగా కొన్ని కబుర్లు చెప్పు. నువ్వేం చెప్పినా. ఆ అమ్మాయి వింటోందా! లేదా గమనించు. నువ్వు చెప్పే విషయంపట్ల ఆ అమ్మాయి ఆసక్తిగా ఉందో లేదో చూడు. వెంటనే టాపిక్ మార్చెయ్. మధ్యలో ఆవిడ్ని పొగుడు."
"ఉత్తినే అకారణంగా పొగిడిటే టీ.వి.లో అడ్వర్ టైజ్ మెంట్ ళా వుండదూ!"
"ఈ సర్ఫ్ నే వాడండి టైపులో పొగడకూడదు. సందర్భం చూసుకో. నీపట్ల ఆమెకు ఇంట్రెస్ట్ వుందా లేదా? అన్న పాయింట్ ముఖ్యం. ఇంకో పాయింట్ నువ్వు వచ్చే ముందు- మళ్ళెప్పుడొస్తారు అని అడుగుతుంది. ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడుతోంది అన్న దానికి అదే సింబల్. అర్థమైందా!"
ఆటో పోష్ కాలనీ మెయిన్ రోడ్ లో ఆగింది.
"నేనీ రెస్టారెంట్ లో కూర్చుంటాను...... ఆల్ ది బెస్ట్" అన్నాడు సుల్తాన్. పక్కనున్న రెస్టారెంట్ వైపు నడుస్తూ.
ముందుకు నడిచాడు మధు - లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ.
* * *
నీలాకాశంమీద, నల్లటి పెయింటును పూసినట్టు మసక చీకటి. మెయిన్ గేటు తీసుకుని లోనికి అడుగుపెట్టిన మధుకి, పూలపరిమళం ఒక్కసారిగా ముక్కుపుటాలకు తగిలింది.
చల్లనిగాలి.....
నేలమీద రాలిన తురాయి పూలమీంచి నడుస్తున్నాడు. అతని కోసం అప్పటికే వెయిట్ చేస్తోంది అన్విత.
పోర్టికో దగ్గరికో వెళ్ళి, మెడపైకెత్తి చూశాడు.
"హలో.....కుక్కను చూసి భయపడతారని నిలబడ్డాను" అందామె.
"కుక్క కోసమో, ప్యూన్ కోసమో నిలబడ్డం ముఖ్యం" మనసులో అనుకున్నాడు మధు.
డ్రాయింగ్ రూమ్ లోకి నడిచాడు.
సోఫా మీద కూర్చున్నాడు. ఆ సోఫా పూలరెక్కలతో చేసినట్లుగా మాత్రం ఉంది.
ముట్టుకుని చూసి "చల్లగా వుంది" అన్నాడతను.
"ఫ్రిజ్ లో ఉంటే అంతే..... కదా?"
"అంతే ఫ్రిజ్ లో ఏమున్నా అంతే" అన్నాడతను.
"మీరీవేళ కాలేజీకి రాలేదు" అన్నాడు మధు.
"అవును రాలేదు. మా నానమ్మ సిక్ అయితే"
"నానమ్మగారికేమైంది?"
"అప్పుడప్పుడు కీళ్ళు పట్టేస్తుంటాయి. ప్రకృతివైద్యం చేయించాలి."
"అవును! నేచురోపతి చాలామంచిది. నాక్కూడా ఇష్టమే."
"మీక్కూడా కీళ్ళనొప్పులున్నాయా?"