"ఆయన ఫ్రెండ్ కూతుర్ని....." చెప్పి "ఆ స్కూల్ అడ్రస్ తెలుసాండి...." అని అడిగింది ఇందు.
"తెలీదమ్మా! టి.వీ. సీరియ్స్ డైరెక్టర్ కదా..... సులభంగా తెల్సిపోతుంది....." ఒక్కక్షణం ఏం చెయ్యాలో తోచలేదు. ఆ దగ్గరలో వున్న స్కూళ్ళ వివరాలు తెలుసుకొని, జంక్షన్ లో కొచ్చింది ఇందు.
మూడు గంటలు గడిచాయి.
సుధాకర్ భండారీగారి అడ్రసు దొరకలేదు ఇందుకు. తిరిగి బస్టాండ్ కొచ్చి, ముఖం
కడుక్కుని, క్యాంటీన్ లో టిఫిన్ చేసి ఏం చెయ్యాలో తోచక తన పరిస్థితికి తనమీద తనే జాలిపడుతూ కూర్చుంది ఇందు.
సరిగ్గా అదే సమయంలో ఇందుకు శ్రీమహాలక్ష్మి పరిచయమయింది. శ్రీమహాలక్ష్మికి నలభై అయిదేళ్ళుంటాయి. పొట్టిగా, నల్లగా, ఆకర్షణీయంగా వుంటుంది. మంచో, చెడో లొడలొడ మాట్లాడడం ఆమె అలవాటు.
"బావను వెతకటం కోసం వచ్చావా.... ఇక్కడ చుట్టాల అడ్రస్ కూడా దొరకలేదా? ఇంట్లో చెప్పాచెయ్యకుండా రావచ్చా..... చూడమ్మాయ్! నీలాంటి ఆడపిల్లలు మోసపోయేది ఇలాంటి పిచ్చిచేష్టల వల్లే..... నాతోరా. నిన్ను విజయవాడ బస్సెక్కిస్తాను. మాది అంధ్రానే" అంది శ్రీమహాలక్ష్మి.
"లేదండి! మా బావ నాకు కనిపిస్తాడనే నమ్మకం వుంది" అంటూ మైత్రేయ గురించి అంతా చెప్పింది.
"పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయినోడు మైసూర్ లోనే వుంటాడని ఎలా అనుకున్నావ్ తల్లీ..... ఏ హైదరాబాదో, మద్రాసో వెళ్ళిపోయుంటాడు. నిన్ను చూస్తే నువ్వు, నీ బావను సీరియస్ గా ప్రేమిస్తున్నావని తెలుస్తోంది. వాడిక్కూడా అలాంటి ప్రేమే వుంటే..... జరిగిందంతా నీ దగ్గరికొచ్చి చెప్పును కదా.... ఎంతగా మనక్కావలసిన వ్యక్తయినా మగాడ్ని మాత్రం నమ్మకు" సిన్సియర్ గా సలహా యిచ్చింది శ్రీమహాలక్ష్మి.
మైత్రేయ కలిస్తే, అతనితోనే వుండిపోవాలనుంది ఇందుకు. మరి నందిగామ వెళ్ళాలని లేదామెకు. ఆ విషయాన్నే శ్రీమహాలక్ష్మికి చెప్పింది ఇందు.
ఇందు అమాయకత్వానికి జాలిపడింది శ్రీమహాలక్ష్మి.
"అయితే ఓ పని చెయ్యి.... ఈ పట్నంలొ ఒంటరిగా ఎక్కడుంటావ్? గానీ రెండ్రోజులు మా ఇంట్లో వుండు. నీ బావని వెతుక్కో దొరక్కపొతే మీ ఇంటికి వెళ్ళిపోవాలి. సరేనా?"
అంగీకరించింది ఇందు.
మరో పావుగంటకు బస్టాండ్ నుంచి మైసూర్ లోని ఛామరాజ్ మొహల్లా వెళ్ళే, సిటీబస్సు వచ్చింది. ఇద్దరూ ఎక్కారు. దారిలో తన గురించి చెప్పింది శ్రీమహాలక్ష్మి.
"మాదీవూరు కాదులే. జగ్గయ్యపేట దగ్గర పల్లెటూరు. పదేళ్ళక్రితం పొట్ట చేత్తో పట్టుకుని నేనూ, మా ఆయనా ఈ ఊరొచ్చేశాం. ఛామరాజ్ మొహల్లాలో పాన్ షాపు పెట్టుకున్నాం. ఈ వురొచ్చిన అయిదేళ్ళకు బస్ ఏక్సిడెంట్ లో మా ఆయన చనిపోయాడు. ఒక్క కొడుకు. పదో తరగతి చదువుతున్నాడు" దారంతా ఆ విషయాలు, ఈ విషయాలు చెప్తూనే వుంది శ్రీమహాలక్ష్మి ఆమె అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది ఇందుకు.
మెయిన్ సర్కిల్ కి పాతిక గజాలదూరంలో వుంది శ్రీమహాలక్ష్మి ఇల్లు. రెండు గదుల పాతకాలం నాటి ఇల్లు.
"రా ఇందూ..... రా..." ఇంట్లోకి నడిచింది శ్రీమహాలక్ష్మి.
అరుగుదాటి లోనికి వెళ్ళబోయిన ఇందు, లోనగది మధ్యన ఈజీఛైర్లో కూర్చుని సిగరెట్ తాగుతున్న వ్యక్తిని చూసి ఆగిపోయింది ఒక్కక్షణం.
ఆ వ్యక్తి పొడవుగా, దృఢంగా వున్నాడు. 'ఎవరా కొత్తమనిషి' అన్నట్టుగా కళ్ళార్పకుందా ఇందువేపే చూస్తున్నాడతను.
"సిన్మా విలన్ లా వున్నాడని భయపడకు. లోపలికి రా ఇందు...." అని, ఆ మగాడివైపు తిరిగి "ఇందని నాకు తెల్సిన వాళ్ళమ్మాయి. చిన్నపనుండి వచ్చింది. బయటికెళ్ళి రెండు టీలు తీసుకురా" అని చెప్పింది శ్రీమహలక్ష్మి. అనుమానపు చూపుల్తో ఇందునే చూస్తూ ఆ మగవ్యక్తి బయటికెళ్ళాడు.
"వాడి చూపులు చూసి భయపడుతున్నావా? ఏం భయం లేదులే..... మనిషి మంచోడే. రెండు పెగ్గులు వేసుకున్నప్పుడు మాత్రమే వాడలా చూస్తాడు అంతే" చీర మార్చుకుంటూ చెప్పింది శ్రీమహాలక్ష్మి.
"ఎవరాయన?" అడిగింది ఇందు.
"మహాపట్టణాల్లో ఆడది ఒంటరిగా బతకలేదు గదమ్మాయ్. అందుకే ఒక దిజ్జుగా వుంటాడని నేనే వుంచుకున్నాను...." నవ్వుతూ చెప్పింది శ్రీమహాలక్ష్మి.
"అంటే మీ భర్తా! రెండోపెళ్ళి చేసుకున్నారా?"
"ఉంచుకున్నాడంటే పెళ్లాంటావేంటి.... ఇలాంటి మాటలు నువ్వెప్పుడూ వినలేదా? ఆడికి వేరే స్వంత పెళ్ళాం, పిల్లలూ బృందావన్ గార్డెన్స్ కి వెళ్ళేదారిలో వున్నారు. నేనంటే మోజుపడ్డాడు. కుక్కలా నాకోసం పడిగాపులు కాసేవాడు. నాక్కూడా అభిమానం ఏర్పడిందిలే" ముసిముసిగా నవ్వుతూ అంది శ్రీమహాలక్ష్మి.
"అయితే మీ ఇద్దరూ ప్రేమించుకున్నారా?" ఇందుకి ఆ యిద్దరి విషయం చాలా ఇంట్రెస్టుగా వుంది.
"అయిదేళ్ళక్రితం సంగతి..... ణా మొగుడు పోయాడు. నేను, నాకొడుకు..... కిళ్ళీబడ్డీ.... ఇక్కడ నాకెవరున్నారు? స్వంత వూరు వెళ్ళిపోదామనుకున్నాను. ఆ మాత్రం బతకలేనా అని మళ్ళీ ఓ ధైర్యం.... ఒంటరిగా బతకాలనుకునే ఆడవాళ్ళకు ముఖ్యంగా వుండాల్సింది వాళ్ళమీద వాళ్ళకు ధైర్యం, నమ్మకం. ఆ నమ్మకంతోనే కిళ్ళీబడ్డీ నడుపుతుండేదానిని.... ఒకరోజు ఈ మగాడు సిగరెట్ల కోసం షాపు దగ్గరికొచ్చాడు. మాటా, మాటా కలిపాడు. అప్పట్లో లారీ డ్రైవర్ గా పనిచేస్తుండేవాడులే. రోజూ ఉదయం, సాయంత్రం వచ్చేవాడు, బడ్డీముందు కూర్చునేవాడు. కబుర్లు చెప్పేవాడు.
రెండు, మూడుసార్లు ఇంటికొచ్చాడు. ఒకరోజు చీర కొని తెచ్చిచ్చి, నా చేతిలో పెట్టి, "నువ్వంటే నాకిష్టం. నిన్ను పెళ్ళి చేసుకుంటా'నన్నాడు. నేను నమ్మేశాను.
ఒకరోజు రాత్రి బాగా తాగొచ్చాడు. వస్తూ వస్తూ ఒకావిడను తీసుకొచ్చాడు. వాళ్ళావిడను పరిచయం చేశాడు. ఆవిడెదురుగా నాతో మళ్ళీ చెప్పాడు. నేనంటే ఇష్టమని...."
నేను ఆవిడ అభిప్రాయం అడిగాను.
"నన్నూ, నా పిల్లల్నీ గాలికి వదిలేయకుందా చూసుకుంటే ఆయన ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను" అందామె.
కేసు సెటిలైపోయింది. నాకో మగదిక్కు దొరికింది. మా గణేష్ రాత్రంతా ఆటో నడుపుతాడు. పగలు షాపు దగ్గర నాకు సహాయం చేస్తాడు. మగాడి కుండాల్సిన బుద్ధులన్నీ వున్నాయిగానీ, మా గణేష్ నా దగ్గర జాగ్రత్తగా వుంటాడులే" కథంతా చెప్పుకొచ్చింది శ్రీమహాలక్ష్మి.
"భలే వుంది మీ ప్రేమకథ" నవ్వుతూ అంది ఇందు.
"మాది ప్రేమ కథేంతే తల్లీ.... ఎడ్జస్ట్ మెంట్ అని అంటారే..... అలాంటిదే.... ప్రేమ కథంటే నీది. బావ మర్డర్ చెయ్యడం, పరారీలో వుండడం బావని వెతుక్కుని నువ్వు రావడం..... ప్రేమకథంటే నీది" శ్రీమహాలక్ష్మి ఆ మాట అంటుండగానే రెండు టీ కప్పులో లోపలికి వచ్చాడు గణేష్. ఆ కప్పుల్ని అందుకుని ఒక కప్పుని ఇందు చేతికందించింది.
"పెరట్లో స్నానం చేసిరా, భోంచేద్దాం. ఈలోపల మావాటితో కూడా నీ విషయం మాట్లాడుతాను" అంది శ్రీమహాలక్ష్మి.
టీ తాగాక, సూట్ కేస్ లోంచి బట్టలు తీసుకుని పెరట్లో వున్న బాత్ రూమ్ వేపు నడిచింది ఇందు.
సిగరెట్ వెలిగించుకుంటూ, అలా ఆమెవేపే చూస్తున్నాడు గణేష్.
* * *
చేతికందిన అలారం పీస్ ని గోడకేసి కొట్టాడు వెంకటయ్య.
"ఇలాంటి వెధవ బుద్ధులొస్తాయనే, ఎదిగిన ఆడపిల్లను చదవించవద్దన్నారు పెద్దలు. ఏమయింది? ఇప్పుడేమయింది. బస్టాండ్ వెతికాం, రైల్వేస్టేషన్ వెతికాలం..... ఫ్రెండ్స్ ఇళ్ళు, చుట్టాలిళ్ళు..... ఏదీ..... ఎక్కడికెళ్ళిపోయింది. ఎందుకెళ్ళిపోయింది, అదెక్కడికెళ్ళిందో నీకు తెలీదంటే నన్ను నమ్మమంటావ్ అంతేనా?"
"మీ మీదొట్టు! దేవుడి మీదొట్టు.... నాకే విషయం తెలియదండీ.... నన్ను నమ్మండి" ఏడుస్తూ చెప్తోంది సావిత్రమ్మ.
గోడవారగా నిల్చుని, బిక్కమొహం వేసుకుని ఆ దృశ్యాన్ని చూస్తోంది సరోజ.
"మీ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్! ఇందు ఏ విషయం నీ దగ్గర దాయదని నాకు తెలుసు. దయచేసి చెప్పమ్మా... అది చచ్చిందో, బతికుందో చెప్పు...." వెంకటయ్య కళ్ళంట ఉబికి వచ్చిన కన్నీళ్ళని చూస్తోంది సరోజ.
ఆమెక్కూడా కళ్ళవెంట నీళ్ళొచ్చేశాయి. వెక్కి వెక్కి ఏడుస్తోంది.
"అంకుల్! నేనెంత చెప్పినా, ఎంత బతిమిలాడినా ఇందు వినిపించుకోలేదు. అంకుల్, నిన్నరాత్రి పదిగంటల బస్సులో....." జరిగిందంతా చెప్పింది సరోజ.
అంతా విన్నాక సావిత్రమ్మ బావురుమంది.
"ఆ ముదనష్టపు గాడిదకొడుకుని వెతుక్కుని, ఈ దిక్కుమాలింది వెళ్ళిందా? వాడేం మైసూర్ బస్టాండ్ లో ఎదురుచూస్తుంటాడా? ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళను. ఎక్కడ వెతకను? దాని బదులు ఏ నుయ్యో, గొయ్యో చూసుకుని చస్తే పీడా విరగడైపోను" కుర్చీలో కూలబడిపోయాడాయన.
"మీ ఫ్రెండెవరో సుధాకర్ భండారీగారని ఉన్నర్ట కదా...." సరోజ నోటిలోంచి ఆ మాట రాగానే తలెత్తి సూటిగా ఆమెవైపు చూసాడు వెంకటయ్య.
"అక్కడికే వెళతానని చెప్పిందా" ఆత్రంగా అడిగింది సావిత్రమ్మ.
"అవునాంటీ.... అక్కడికే వెళుతుంది."
"అక్కడినుంచి ఇంకెక్కడికీ వెళ్ళిపోకుండా, అర్జంటుగా ఫోన్ అయినా చెయ్యండి" బతిమిలాడింది సావిత్రమ్మ.
"వెళ్ళాల్సిందే. సూట్ కేస్ లో బట్టలు సర్దు" చిరాగ్గా అన్నాడు ఆయన.
సావిత్రమ్మ లేచి బెడ్ రూమ్ లోకి పరుగెత్తింది.
* * *
బర్కిలీ సిగరెట్ తీసి, వెలిగించి గుండెల నిండా పొగ పీల్చి, మళ్ళీ ఆ పొగను బయటకి వదులుతూ శ్రీమహాలక్ష్మి ముఖంలోకి చూశాడు గణేష్.
"ఆ పిల్ల చెప్పింది కాకమ్మకతలా వుంది తప్ప, నమ్మబుద్ధి కావడంలేదు" అన్నాడతను.
"ఆ పిల్ల పెద్దింట్లో, పుట్టినపిల్ల..... కనిపించడంలేదూ, బజారుపిల్లలా కనిపిస్తోందా నీ కళ్ళకు" కోప్పడింది శ్రీమహాలక్ష్మి.
"అయితే ఇప్పుడేం చెయ్యమంటావ్?"
"మీ ఆటోవాళ్ళకి పోలీసులతో పరిచయాలుంటాయి కదా.... నాలుగు పోలీస్ స్టేషన్ల లోనూ వాకబు చేస్తే ఆ అబ్బాయి గురించి తెలుస్తుంది కదా. ఆడకూతురికి సాయం చేస్తే పుణ్యం" అంది శ్రీమహాలక్ష్మి.
"అసలే మర్డర్ కేసు! పోలీసుల గురించి నీకు తెలీదు. వాళ్లకి కేసు కావాలంటే నడుస్తున్న ఆటోని జంక్షన్లో మాయం చేసేస్తారు. మనుషులో లెక్కా. రేపు కనుక్కుంటాలే" తాపీగా చెప్పాడు గణేష్.
* * *
మర్నాడు ఉదయం-
ఎనిమిదిగంటల సమయం-
బస్ కాంప్లెక్స్ దగ్గర ఆటోస్టాండ్ లో ,ఆటో పక్కన నుంచున్నాడు గణేష్
త్రీ టవున్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సర్రున సైకిల్ మీద వెళ్ళిపోతూ కన్పించాడు. ఆయనతో పరిచయముంది గణేష్ కి.
"హెడ్డుగారూ! చిన్నమాట" టక్ మని బ్రేకు వేసి " ఏంటి కత గణేషూ! ఈయాళ పగలు డ్యూటీ ఏటీ..... నిన్న రాత్రి డ్యూటీలో రంగు, రంగుల పిట్టలేవీ తగల్లేదేటి?" బోసినవ్వు నవ్వాడు హెడ్డు.