Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 16

  

        "లేదు మేడమ్... నేరాలు మనకు కన్పించొచ్చు. నేరస్తుడు మనం అబ్బయ్యనాయుడని రుజువు చెయ్యలేం. అంత పకడ్బందీగా నేరాలు చేస్తాడు.
    
    "అబ్బయ్యనాయుడు... ఈసారి అబ్బయ్యనాయుడు కిందకు దిగాక తప్పదు చీఫ్ సెక్రట్రీగారూ ....అబ్బయ్యనాయుడిని అబ్బా అనిపించకాపోతే నా పేరు త్రిభువనేశ్వరీదేవి కాదు. అయ్...విల్...సీ...హిజ్ ....ఎండ్..." శపథం చేస్తున్నట్లుగా అందామె.
    
    టక్ మని డోరు చప్పుడైంది.
    
    తలెత్తి చూసింది త్రిభువనేశ్వరీదేవి. పి.ఎ. అరవింద్... ఆ వెనక బంట్రోతు ట్రేలో కాఫీల్తో.
    
    కాఫీల్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు బంట్రోతు.
    
    "ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ డి.ఎస్.పి. ప్రసాదబాబు...మిమ్మల్ని కలవాలని వెయిట్ చేస్తున్నారు మేడమ్" చెప్పాడు పి.ఎ. అరవింద్.
    
    "ఎందుకట?"
    
    చీఫ్ సెక్రట్రీ వేపు చూస్తూ అడిగింది సి.ఎమ్.
    
    "అయామ్ డామ్ బిజీ నౌ...ఆస్క్ హిమ్ టు కమ్....టుమారో ఒకే..." పి.ఎ. అరవింద్ వెళ్ళిపోయాడు.
    
    "ఎందుకండీ....అతనలా తిరుగుతున్నాడు..." మళ్ళీ అడిగింది సి.ఎమ్.
    
    "ఏం లేదు మేడమ్...స్పెషల్ ప్రొహిబిషన్ సెల్....వెయ్యొచ్చని....ఊహాగానాలు వస్తున్నాయి కదా....అతన్నేవైనా కన్సిడర్ చేస్తారేమోనని...." అసలు విషయం చెప్పాడు చీఫ్ సెక్రట్రీ.
    
    త్రిభువనేశ్వరీదేవి ఆలోచనల్లో పడింది.
    
    "మీ దృష్టిలో ఎవరయినా ఆఫీసర్ ఉంటే చెప్పండి మేడమ్..." అన్నాడు చీఫ్ సెక్రట్రీ.

    "ఉయ్ హేవ్ టు సెర్చ్.... బలమైన రాయిని పైకెత్తేవాడెప్పుడూ ఆ రాయి బలాన్ని అంచనా వేసుకొని ఎత్తడు....యూ నో దట్....అబ్బయ్యనాయుడు బలమైన సోషల్ ఈవెల్...క్రిమినల్....జాకాల్ మన ప్రొహిబిషన్ సెల్ కి హెడ్ గా ఉండాల్సిన వ్యక్తి...ఏ ముఠాలకు తెలిసిన వ్యక్తయి ఉండకూడదు....ఏ రాజకీయ వత్తిడులకూ లొంగనివాడై ఉండాలి.... తన చేతిలోని పవర్ ని శత్రువు మీదే కేంద్రీకరించగలిగే....సిన్సియర్ అండ్ సీరియస్ ఆఫీసర్ అయి వుండాలి...ముఖ్యంగా యంగ్ అండ్ ఎనర్జటిక్ అయి ఉండాలి... పేపర్ వెయిట్ ని తిప్పుతూ చెప్పింది త్రిభువనేశ్వరీదేవి.
    
    సి.ఎమ్. మనోగతాన్ని అర్ధం చేసుకున్న వరదరాజన్ ఏమీ మాట్లాడ లేకపోయాడు.
    
    "ఒకసారి హోం సెక్రట్రీతో మాట్లాడాలి మేడమ్" చెప్పాడు వరదరాజన్ అదే సమయంలో లోనికొచ్చాడు పి.ఎ అరవింద్.
    
    "మేడమ్! ప్రెస్ మీట్..."
    
    గబుక్కున చేతి వాచీవేపు చూసుకుంది త్రిభువనేశ్వరి.
    
    "మిస్టర్ వరదరాజన్.... ఉయ్ విల్ సిట్....ఆఫ్టర్ ప్రెస్ మీట్ ఓ.కే....అంటే మీకో ఒన్ అవర్ టైముంది....ప్లీజ్ ప్రిపేర్ జీ.వో...మనకసలు టైమ్ లేదు....హోం సెక్రట్రీ మీరు.... ప్లీజ్... సెలక్ట్.... ఒన్ ఆఫీసర్....ఈ పనులూ ఈ రోజు సాయంత్రం, ఆరుగంటల లోపల జరిగిపోవాలి" లేచి నిలబడుతూ అంది త్రిభువనేశ్వరీదేవి.
    
                                        *    *    *    *    *
    
    సరిగ్గా 3-30 నిమిషాలు.
    
    నవ్వుతూ లోనికి అడుగుపెట్టిన సి.ఎం. త్రిభువనేశ్వరిని చూసి..రూమ్ లో కూర్చున్న రిపోర్టర్స్ అందరూ లేచి నిలబడ్డారు.
    
    సోఫా మీద కూర్చుని ప్రెస్ పి.ఎ. ప్రసాదరావు వేపు చూసింది త్రిభువనేశ్వరీదేవి.
    
    హేమాద్రిశర్మ దూరంగా కూర్చున్నాడు.
    
    రిపోర్టర్స్ అందర్నీ కలియజూస్తోంది త్రిభువనేశ్వరీదేవి.
    
    అప్పటివరకూ ఆమెలో వున్న ప్రసన్నత చటుక్కున మాయమై పోయింది.... నిగూఢమైన గంభీరత చోటు చేసుకుంది.
    
    దానిక్కారణం....ఆ రిపోర్టర్లలో ఎక్కడా సమాజం రిపోర్టర్ మధూలి కనిపించకపోవడమే!
    
    గాఢంగా నిట్టూర్చింది త్రిభువనేశ్వరీదేవి.
    
    "మేడమ్...మీరు ఇంత అర్జంటుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చెయ్యడానికి కారణం ఏమిటి?" ఆంద్రప్రభ రిపోర్టర్ అడిగాడు.
    
    "మీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆస్తుల, అక్రమ వ్యవహారాల మీద సమాజం పేపర్లో వచ్చిన వార్తకు కార్లిఫికేషన్ ఇవ్వడానికేనా మేడమ్" ఆంద్రజ్యోతి రిపోర్టర్ ప్రశ్నించాడు.
    
    వరసగా అయిదుగురు రిపోర్టర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. అన్ని ప్రశ్నల్నీ విన్నాక ప్రెస్ పి.ఎ. ప్రసాదరావు వేపు చూసింది త్రిభువనేశ్వరి.
    
    ప్రసాదరావు చేతిలో అప్పటికే సమాజంలో వచ్చిన వార్తకు సంబంధించి రిజాయిండర్ జెరాక్స్ కాపీలు సిద్దంగా ఉన్నాయి.
    
    వాటినన్నిట్నీ అందరికీ సర్వ్ చేసాడాయన.
    
    "ప్రెస్ మీట్" అయిపోయినట్టేనా మేడమ్" ఆ జిరాక్స్ కాపీ చూస్తూ జోక్ వేసాడొకాయన.
    
    అందరూ నవ్వారు.
    
    "సమాజం రిపోర్టర్ రాలేదా" ప్రసాదరావు వేపు చూస్తూ అడిగింది త్రిభువనేశ్వరి.
    
    "లేదు మేడమ్."
    
    "మాకు జిరాక్స్ కాపీలు...సమాజం రిపోర్టర్స్ కు....పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తారా మేడమ్" ఇంకో రిపోర్టర్ జోకు వేసాడు.
    
    "నో...నో...నాట్ లైక్ దట్....చూడండీ..." గొంతు సవరించుకొంది త్రిభువనేశ్వరి.
    
    మొత్తం అంతటా ఒకక్సరి నిశ్శబ్దం అలుముకుంది.
        
    "నేను అధికారంలోకి వచ్చి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున నా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆస్తి వివరాల్ని ప్రకటిస్తానన్న మాట నిజమే. కానీ.... నిజానికి.... ఆ విషయంలో నేను పూర్తిగా ఫెయిలయ్యాను. సమాజం డైలీలో వచ్చిన వాశ్ర్త నిజా నిజాలు నాకు తెలీదు.... అవినీతి ఏ స్థాయిలో ఉన్నా దానిమీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే....మంత్రుల, ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి, సి.బి.సి.ఐ.డీ చేత ఎంక్వయిరీ చేయించడానికి చర్యలు తీసుకొంటున్నాం..."
    
    "మరి.... ఎక్సయిజ్ మినిస్టర్ గారికీ కళ్ళు కాంపౌండ్ లున్నాయన్న ఆరోపణపై ఏం చేస్తున్నారు మేడమ్..."
    
    "దానిమీద కూడా సిబిసిఐడీ చేత ఎంక్వయిరీ చేయిస్తారేమో" జోగ్గా అన్నాడు ఇంకో రిపోర్టర్.
    
    "సీనియర్ మినిస్టర్ రాజ్యగారి మీద మీరు చర్యలు తీసుకోగలరా మేడమ్."
    
    "ఆరోపణలు రుజువైతే.... ఎవరిమీదనైనా చర్యలు తీసుకోడానికి ప్రభుత్వం సిద్దంగా వుంది."
    
    "చర్యలంటే ఏం చేస్తారు మేడమ్..." ఒక రిపోర్టర్ కొంటెగా అడిగాడు.
    
    ఆ వెక్కిరింతకు కోపం వచ్చింది సి.ఎమ్.కు.
    
    "నా మంత్రివర్గంలోని ఏ మినిస్టరైనా అవినీతికి పాల్పడినట్టు రుజువయిన పక్షంలో ఆ మంత్రుల్ని నేను...మంత్రివర్గం నుంచి తొలగిస్తాను" సీరియస్ గా చెప్పింది త్రిభువనేశ్వరీదేవి.
    
    "ఆ ఆరోపణలు రుజువౌతాయంటారా?"
    
    ఆ ప్రశ్నకు మరింతగా కోపం వచ్చింది సి.ఎమ్.కు. తనను తాను నిగ్రహించుకోడానికి ప్రయత్నిస్తోందామె.
    
    "లిక్కర్ మీద ప్రొహిబిషన్ విధిస్తారన్న రూమర్స్ వస్తున్నాయి మేడమ్...నిజంగా విధిస్తారా మేడమ్"
    
    ఎందుకో త్రిభువనేశ్వరీదేవిలో అంతవరకూ ఉన్న ఉత్సాహం, చప్పున చల్లారిపోయింది. దానిక్కారణం అంతకుముందు రిపోర్టర్లు వేసిన తికమక ప్రశ్నలే కారణం కావచ్చు.

 Previous Page Next Page