Previous Page Next Page 
ముగ్ధ పేజి 16

  

      ఒక దేశానికో, రాష్ట్రానికో సరిహద్దు ఎలాంటిదో మనిషి శరీరానికి ఈ స్పేస్ అలాంటిది. మనిషి పెరిగిన వాతావరణం తిరిగే పరిస్థితులు ఆయా మనిషి స్పేస్ ని నిర్దారిస్తాయి. జపాన్ లో జనాభా ఎక్కువ కాబట్టి అక్కడ ఆ పర్సనల్, స్పేస్ తక్కువగా వుంటుంది. మిగతా దేశాల్లోని ప్రజల్ని గమనిస్తే జనాభా, ప్రాతిపదిక్గా ఆ స్పేస్ పెరుగుతుందని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు.
    
    ఈ పర్సనల్ స్పేస్ ఒక వ్యక్తికి, ఇంకో వ్యక్తికీ మధ్య దూరాన్ని నిర్ణయిస్తుంది. ఈ పర్సనల్ స్పేస్ లో ప్రధానంగా నాలుగు విభాగాలుంటాయి.
    
    ఇంటిమేట్ జోన్, పర్సనల్ జోన్, సోషల్ జోన్, పబ్లిక్ జోన్.
    
    మనిషి చుట్టూ ఇంటిమేట్ జోన్ పదిహేను నుంచి నలభై అయిదు సెంటి మీటర్లు వుంటుంది. ఒక మనిషి ఈ వ్యక్తిగత పరిధిలోకి తన ప్రియులను (ప్రేయసి లేదా ప్రియుడు) తల్లిదండ్రులను, పిల్లలనూ భార్య లేదా భర్తలను మాత్రమే ప్రవేశించదానికి అనుమతిస్తాడు. పర్సనల్ జోన్ పరిధి నలభయ్ ఆరు నుంచి 1.22 మీటర్ల వరకూ వుంటుంది. మనం ఒక వ్యక్తికి, ఇంకో వ్యక్తికి మధ్యనున్న ఈ దూరాన్ని ఆఫీసుల్లోనూ, ఫంక్షన్స్ లోను, బార్లలోను, సినిమాహాల్లలోనూ కలిసి మాట్లాడుకునే స్నేహితుల్లోను చూడొచ్చు. మూడవది సోషల్ జోన్ దీని పరిధి 1.22 నుంచి 3.6 మీటర్ ల వరకూ వుంటుంది. అపరిచిత వ్యక్తులు, మనింటికొచ్చే పోస్టుమాన్, దుకాణదారుడు, మనింటికి గ్యాస్ సిలెండర్ తెచ్చేవ్యక్తి, ఆఫీసులో కొత్తగా చేరే వుద్యోగి ఇలాంటివాళ్ళు ఈ పరిధిలో కొస్తారు. నాలుగోది పబ్లిక్ జోన్ దీని పరిధి 3.6 మీటర్లు వుంటుంది. బహిరంగ సభలు దీనికి ప్రధానమయిన ఉదాహరణ. అక్కడ ఉపన్యాసకులకు, శ్రోతలకు మధ్యవుండే దూరాన్ని చూస్తే మనకీ పరిధి స్పష్టంగా తెలుస్తోంది.
    
    మన ఇంటిమేట్ జోన్ లోకి సాధారణంగా రెండు ప్రధానమైన కారణాల వల్ల మనుషులు ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి సన్నిహితుడుగానీ, స్నేహితుడుగాని అయివుంటారు. ప్రేమించే వ్యక్తులయినా అయివుంటారు. లేదా మనల్ని అధిగమించడానికి ప్రయత్నించే వ్యక్తులయినా అయివుంటారు.
    
    మన వ్యక్తిగత పరిధిని మనం ఎప్పుడూ సంరక్షించుకుంటూనే వుంటాం. మనగది, మనబెడ్, మనం రాసే పెన్ను, మనటేబుల్, మన కుర్చీ, మనం తుడుచుకునే టవల్ ఇవన్నీ ఉదాహరణలే మనగదిలోకి ఎవరయినా ఒక అపరిచిత వ్యక్తి చొచ్చుకుని వచ్చాడనుకోండి మనకెంతో కోపం వస్తుంది. మొట్టమొదటిసారిగా కల్సిన ఒకవ్యక్తి రెండోసారి కల్సి అతి చనువును ప్రదర్శించాడనుకోండి. ఎంతో కోపం వస్తుంది మనకు. విసుక్కుంటాం. ఇది ప్రతివాళ్ళకీ అనుభవమే ఆ సమయంలో ప్రతి భాగంలోనూ ఎన్నో రసాయనిక మార్పులు అసంకల్పితంగా జరుగుతాయి. అవి మామూలుగా మనకు తెలియవు.
    
    నుహ్డురు, కళ్ళు, చెవులు, చేతులు, చెంపలు, ముక్కు, గెడ్డం, కాళ్ళు, వేళ్ళు వీటి ప్రతి కదలికను సందర్భాన్నిబట్టి అబ్జర్వ్ చేస్తే మనిషిని ఎక్స్ రే తీసినట్టు అతని ప్రవర్తన మనకు చాలా సులభంగా అర్ధమైపోతుంది. ఒక వ్యక్తి ఇవాల్టి ప్రవర్తనద్వారా రేపు అతనెలా ప్రవర్తిస్తాడో మనం నిర్ణయించగలం.
    
    వ్యక్తుల కదలికలు ఆయా వ్యక్తుల స్వభావాలకు నిదర్శనం అయితే ఆయా వ్యక్తులమధ్య దూరం వాళ్ళ సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది.
    
    ఒకబ్బాయి, ఒకమ్మాయి ఒక పార్కుకు మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళమధ్య దూరాన్ని గమనిమ్చమ్డి. రెండోరోజు వాళ్ళమధ్య దూరాన్ని గమనించండి. అయిదవరోజు దూరాన్ని గమనించండి. ఒక నెలరోజుల తర్వాత దూరాన్ని గమనించండి. రోజు, రోజుకూ ఆ దూరం తగ్గుతుంది.
    
    అదే - జంటను పెళ్ళయ్యాక గమనించండి.
    
    కొత్తలో ఎక్కడ చూసినా వాళ్ళే కన్పిస్తారు. రెండు నెలల తర్వాత అతనొక్కడే కన్పిస్తాడు. ఆ తర్వాత ఎప్పుడో మూడు నెలలకు, నాలుగు నెలలకు వాళ్ళిద్దరూ బయటికొస్తారు. ఇంతకు పూర్వం వాళ్ళిద్దరూ కల్సి బయట తిరిగినప్పటి ఆనందం, ఇప్పుడు వాళ్ళల్లో కనిపించదు. నవ్వులుండవు, జోకులుండవు స్పర్శలో మాధుర్యం వుండదు. ఏదో నిర్లిప్తత.
    
    ఆడైనా, మగైనా ఒక వ్యక్తి ముఖాన్ని, అతని ప్రత్యేక కదలికల్ని బట్టి అతను లేదా ఆమెకు పెళ్ళయిందో లేదో చెప్పెయొచ్చు.
    
    అలాగే సిన్మా హాళ్ళలో భార్య, భార్త పక్క పక్కన కూర్చున్నప్పుడు కుర్చీలో వాళ్ళు ఎవరివేపు ఎవరో ఒదిగి కూర్చున్నారో గమనిస్తే ఎవరు ఎవర్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో మనకు తెలుస్తుంది.
    
    అలాగే ఒకర్ని, ఇంకొకారు పలకరించుకోవడాన్ని కూడా గమనిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఒక వ్యక్తి దూరం నుంచే చెయ్యెత్తి పలకరిస్తాడు. వేరొకడు వుత్తినే పెదవులతోనే నవ్వుతాడు. మరొకడు దగ్గరగా వచ్చి షేక్ హేండ్ ఇస్తాడు. ఆ షేక్ హేండ్ ఇవ్వడంలో కూడా ఒకడు గట్టిగా నొక్కితే, ఇంకొకడు అంటీ ముట్టనట్టు పట్టుకుంటాడు. ఇంకోవ్యక్తి కేవలం భుజాలు మాత్రమే ఎగరేస్తాడు.
    
    చెయ్యెత్తి పలకరించే వ్యక్తి 'హర్రీ బర్రీ' గా వున్నట్టు అర్ధం. పెదవులతో నవ్వే వ్యక్తికి పెద్దగా అవతలి వ్యక్తితో సాన్నిహిత్యం వుండదు. దగ్గరికి వచ్చి గట్టిగా షేక్ హాండ్ ఇచ్చే వ్యక్తి అవతలి వ్యక్తిని అభిమానిస్తున్నట్టు లెక్క మెల్లగా షేక్ హేండ్ ఇస్తున్న వ్యక్తి అవతలి వ్యక్తితో రిలేషన్ కోరుతున్నట్టు లెక్క, భుజాలెగరేసి పలకరించే వ్యక్తి అవతలి వ్యక్తితో రిలేషన్ కూడా అలాగే వుంటుంది అంటీ ముట్టనట్టుగా.
    
    మానవ శరీర భాగాలను పరిశీలిస్తే ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.
    
    ఒక కుక్కను గమనించండి- అది యజమాని దగ్గర వున్నప్పుడు నాలుకను బయటపెడుతుంది. అంటే అది తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్టు లెక్క అలాగే మనిషి కూడా ఒక వ్యక్తి మాయామర్మం తెలీని వాడనుకోండి అతను పూర్తిగా నమ్మకమైన వ్యక్తనుకోండి. అందుకు సాక్ష్యం అతని చేతులే. ఒక వ్యక్తి రెండు చేతుల్ని చాచి, మీకో విషయం చెప్పడానికి ప్రయత్నించా డనుకోండి ఆ వ్యక్తి అరచేతులు రెండూ పూర్తిగా తెరచి వుంటాయి. అదే నిదర్శనం. అరచేయి కొంచెం కిందకు వేలాడినట్టు వుంటే ఆ వ్యక్తి అణుకువ స్వభావాన్ని తెలియజేస్తుంది. వేళ్ళన్నీ దగ్గరగా వుంది, బొటనవేలు కొంచెం దూరంలో వుండే పొజిషన్ గా చూస్తే, ఆ వ్యక్తి అందరికంటే గొప్పవాడిగా గుర్తిస్తున్నట్టు లెక్క చూపుడు వేలు ఒక్కటే ముందుకొచ్చి, మిగతా నాలుగు వేళ్ళూ మడతబడి వుంటే అతనిక్కొంచెం కోపం ఎక్కువని తెలుస్తుంది.
    
    అలాగే ఇద్దరు వ్యక్తుల షేక్ హేండ్స్ గమనించండి. వారి స్వభావాన్ని తెలుపుతాయి.
    
    పొలిటీషియనలు షేక్ హేండ్స్ లో మృదుత్వం తక్కువ. రచయితలు కళాకారులు మృదువుగా చేతుల్ని కలుపుతారు. కొంతమంది రెండు చేతులతో అవతలి వ్యక్తిని చేతిని కలుపుతారు. కొంతమంది రెండు చేతులతో అవతలి వ్యక్తిని చేతిని పట్టుకుని పలకరిస్తారు. దీనర్ధం అవతలి వ్యక్తి స్నేహాన్ని పూర్తిగా తను కోరుతున్నానని కొంతమంది వ్యక్తులు షేక్ హేండ్ ఇచ్చినపుడు, అవతలివ్యక్తి చేతిని పట్టుకొని బొటనవేలితో నొక్కుతారు. అలాంటి వ్యక్తులు వ్యక్తిగత పరిధిలోకి మనం వెళ్ళదానికి చాలాకాలం పడుతుంది.
    
    కొంతమందికి అరచేతుల్ని రాసుకోవడం అలవాటు. ఈ అలవాటు ఆయా వ్యక్తుల పాజిటివ్ థింకింగ్ కు నిదర్శనం. ఒక వ్యక్తి తరుచూ తన చేతుల్ని వెనక్కి పెట్టుకొని నడుస్తాడనుకోండి. అది అతనిలోని సుపీరియారిటీ కాంప్లెక్స్ కి నిదర్శనం."

 Previous Page Next Page