"వీరభద్రయ్యంటే నీకు భయమా?"
"ఆణ్ణిసూత్తే నాకేం భయం బాబూ? దయ్యాలకే భయపడనోణ్ణి....మనిషంటే భయం ఎందుకూ?"
"స్కౌండ్రల్ మళ్ళీ వీడు మొదటికొచ్చాడు.
"ఇప్పుడు నువ్వే అన్నావుగా?"
"ఏంటని బాబూ?"
"అది ఈ వీరభద్రయ్యగాడి పనేనని...."
"ఏ పని బాబూ?"
"మెట్లమీద గెంతడం....."
"అయితే ఆ జువ్వి చెట్టుకింద కాగడాలు పట్టుకుని గెంతడం కూడా ఈడి పనేనంటారా. డాక్టర్ బాబూ?"
అడివయ్య అమాయకత్వం వెనకాల సానపట్టిన కత్తుల మెరుపులు కన్పించాయి ఉదయ్ చంద్రకు.
గొంతుకు ఏదో అడ్డుపడ్డట్టు అయింది. నోరు పెగల్లేదు.
"సదువుకున్నోరు డాక్టర్ బాబూ! తవరు సెప్పాలి మేం ఇనుకోవాలి.ఈ వీరభద్రుడుకూడా దెయ్యమేనంటారా?"
అడివయ్య కంఠంలో ధ్వనించిన వ్యంగ్యం ఉదయ్ గుండెలోకి బాకులా దిగబడింది.
"అడివయ్యా?"
"బాబూ!" అమాయకంగా చూశాడు.
"నువ్వెళ్ళి బయటపడుకొ."
ఉదయ్ కంఠంలోని తీవ్రతకు అడివయ్య బెదిరిపోయాడు.
"బాబూ....మీరు....?"
"అవును ఒంటరిగా నేపడుకొంటాను. నాకు తోడు అవసరం లేదు."
"మీకంత గుండె నిబ్బరంగా వుంటే...."
"ఏం? ఏం? నా గుండెకేమైంది? నేనంత పిరికివాణ్ణి అనుకుంటున్నావా? అదుపు తప్పుతున్న మనసును కూడదీడుకొని అడివయ్య ముఖంలోకి చూశాడు.
"మీ ఇష్టంబాబూ!" కిందకు వంగి నేలమీద పరచివున్న పంచె తీసుకొని భుజాన వేసుకుంటూ ఉదయ్ ముఖంలోకి చూస్తూ "మనిషికి మనిషి తోడుంటే పిరికి మనిషికి కూడా దైర్యంగా వుంటుంది." కనుబొమలు ఎగరేశాడు.
"అందుకని?" ఉదయ్ కలవరంగా చూశాడు.
తగలరానిచోటే దెబ్బ తగిలింది. కదలకూడనిదేదో తనలో కదులుతున్నట్టుగా అన్పించింది అతనికి.
"అంటే నీ ఉద్దేశ్యం నేను పిరికివాణ్ణిని....."
"బాబూ! చమించాలి. దండం పెడతా. అంతమాత తవర్ని అంటానా? కొండంత దైర్యంవున్న మనిషికూడా ఒంటరిగా వుంటే జావకారిపోతాడంటారు. అందుకని..."
"ఇహ చాల్లే ఆపు." అడివయ్యాను కసిరేడే కాని లోపల ఏదో కరిగిపోతున్నట్టుగా ఉంది ఉదయ్ చంద్రకు.
అడివయ్య ప్యూర్ సైకాలజీ మాట్లాడాడు.
అతడన్నది అక్షరాలా నిజం.
మనిషి వంటరిగా వుంటే...
పాషాణ హృదయంకూడా పగులుతుంది. రాతిగుండె కరుగుతుంది.
క్రూరాతిక్రూరమైన నేరాన్ని చేసినవాళ్ళను వంటరిగా ఎందుకు బందిస్తారో తనకు తెలుసు. మనసుకు స్వేచ్చ లేకపోతే అది కృశిస్తుంది. ఏనాడో చదివిన పుస్తకాలు కళ్ళముందు తిరగసాగాయి.
"ఉండమంటారా బాబూ?"
ఉలిక్కిపడ్డాడు ఉదయచంద్ర.
ఇనుము కరగడం చూసి సుత్తిదెబ్బ వేశాడు అడివయ్య.
ఆఫ్టరాల్ ప్రతివ్యక్తీ ఒక పుస్తకం....అధ్యయనం చేస్తే.
"అవసరంలేదు. వెళ్ళు."
"మీ ఇష్టం బాబూ?"
తలుపుదాకా వెళ్ళి వెనక్కు తిరిగి చూశాడు.
"ఎందుకు నిలబడ్డావ్?"
"ఏం లేదు బాబూ. తవరికి చెప్పాలంటే బెరుగ్గా వుంది."
"చెప్పింది చాలు. ఇకనడువ్."
అడివయ్య అదోలా నవ్వాడు.
ఉదయ్ చంద్రకు వంటిమీద ఏదో చల్లగా పారాడినట్టు అయింది.
"ఇంకా ఏం చెప్తావ్?" అప్రయత్నంగా అనేశాడు."
"మనిసే తనకు ఇష్టంలేనివైతే ఎలా చెయ్యగలుగుతాడు? ఇష్టాయనుకోవాలి?
నో! అది అశాస్త్రీయమైన ఆలోచన. సో....మనసులో మరో మనసువుంది. మనసులో మనసు. యూ అండర్ స్టాండ్?" ఒకనాడు క్లాసురూంలో విన్న ప్రొఫెసర్ గౌరీశంకర్ కంఠం, ఆ క్షణంలో ఉదయచంద్ర కర్ణపుటాల్లో ప్రతిధ్వనించింది.
"లోపల గడి....."
"వేసుకుంటాలే...అడివయ్య మాటను మధ్యలో అందుకొని అన్నాడు. అడివయ్య ముఖంలోకి చూస్తూ మళ్ళీ అన్నాడు. "ఆ మాట ఖంమీద గుద్దినట్టు అన్నాడు.
"నన్నయితే ఆపగలుగుతారు బాబూ. దాన్ని ఆపలేరుగా?"
"దేన్ని?" తన గొంతు తనకే వింతగా విన్పించింది.
"ఏంటి మాబాబు. మీది మరీ ఇచిత్రంగా వుంది. సరే! మీ యిష్టం. అట్టాగే గదేసుకోండి. అప్పుడు తెరవాలంటే మీవల్లకాదు. అది మిమ్మల్ని తెరవనివ్వద్దు. అదుగో! ఆడతలుప్పక్కన నడవాలో పడుకుంటాను."
ఉదయచంద్ర ఒక్కసారి ఎగాదిగా చూసి బయటికి వెళ్ళి పోయాడు అడివయ్య.
ఉదయచంద్ర తలుపు మూశాడు. బోల్టుమీద చెయ్యివేసి ఆగిపోయాడు. ఆలోచనలో పడ్డాడు.
బోల్టు వెయ్యకపోతే ఏమౌతుంది? వాడు చెప్పినట్టు తనకొచ్చిన నష్టం ఏమిటి? అంటే వాడు చెప్పిందంతా నమ్ముతున్నాడా? తన మనసు తన స్వాధీనం తప్పుతున్నడా? అడివయ్య నూరిపోసిన మందు తనలో పనిచేస్తున్నాదా? ఏం చెప్పాడు.
అప్పుడు తలుపు తెరవాలంటే వీలు కాదనా? ఎప్పుడు వీలుకాదు? అది లోపలకు వచ్చాకా? అది అంటే అదే!అదే! దెయ్యం.
దెయ్యమేమిటి?
అంతా ఆభూత కల్పన.
వెర్రివాడి ఊహచిత్రం.
మనసు చెదిరిన మనిషి భావరూపం.
మరి ఇంతవరకూ తను చూసిందో? అంటే తన మనసు.....తను వెర్రివాడా? పిచ్చివాడా? తన మనసు చెదిరిందా? ఎక్కడో ఎవరో పగలబడి నవ్వినట్టుంది.
ఎవరది? అడివయ్యకాదు. వీరభద్రుడు. కాదు. అది....అదా? దెయ్యమా? ఏదీ ఎక్కడా కన్పించడంలేదే? కాని నవ్వు మాత్రం విన్నాడు. ఎవరిది? ఎక్కడ్నుంచి వచ్చింది? తన లోపలనుంచా? తనే నవ్వు కొన్నాడు.
తన మనసు తన వశం తప్పుతుంది. దాన్ని జోకొట్టాలి. నిద్ర పుచ్చాలి. ఎలా? ఎలా? కలత చెందిన ఎన్నో మనసులకు తను విశ్రాంతిని ఇచ్చాడు. సలసలా కాగే మస్తిష్కాలను చల్లార్చి సేద దీర్చాడు. ఇప్పుడు తనూ అదే.....
లేచి మెడికల్ కిట్ తీసి ట్రాంక్విలైజర్ ఒక టాబ్లెట్ తీసి వేసుకొన్నాడు. అది తనకు ఎక్కువడోస్. అయినా ఇప్పుడున్న స్థితిలో అంతకు తక్కువ మోతాదు పనిచెయ్యదు. గ్లాసుడు నీళ్ళు గటగటా తాగిపక్కమీద వాలాడు.
కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. బలవంతంగా రెప్పలు ఎత్తి చూశాడు. తలుపు గడియవేయలేదు. లేచిగడియ వెయ్యాలనిపించింది. కాని లేవలేడు. ఎందుకని? అడివయ్య చెప్పాడనా? కాదు....కాదు....లేవలేడు కనుక....లేస్తే ఏం? గడియ....వెయ్యక....పోతే..
12
"బాబుగారూ! బాబుగారూ!" దూరంనుంచి విన్పిస్తోంది.
"ఎవరూ?" బరువుగావున్న రెప్పల్ని కష్టంగా తెరిఛాడు.
అడివయ్య ముఖం మసాక్ మసగ్గా కన్పించింది.
భారంగాలేచి వళ్ళు విరుచుకొన్నాడు.
"తమరికోసం అయ్యగారూ, అమ్మాయిగారూఎదురుచూస్తున్నారు.
"ఎందుకూ?" అనాలోచితంగా అడిగాడు.
"ఎందుకేమిటి బాబూ? ఫలహారం చెయ్యకుండా తమరికోసం......"
` "ఓ అదా? వస్తున్నా పద."
ఉదయచంద్ర టైం చూసుకొన్నాడు. పదింబావు అయింది. ఇంత పొద్దెక్కిందాకా తను నిద్రపోయాడా? రాత్రి తను వేసుకొన్న నిద్రమాత్ర గుర్తొచ్చింది. రాత్రి సంగతులన్నీ కలగాపులగంగా అలికినట్టుగా గుర్తొచ్చాయి.
బాత్ రూంలోంచి బయటికి వచ్చేసరికి అడివయ్య కాఫీకప్పు తెచ్చి పెట్టాడు. కాఫీ తాగి, స్నానంచేసి కిందకివస్తూ పదమూడో మెట్టుదగ్గర ఆగి కిందకు చూశాడు. కుడికాలుతో చెక్కమెట్టును తొక్కిపట్టి పరీక్షగా చూశాడు.
"అయ్యగారూ! మీ అనుమానం తీరలేదా?" ఉదయ్ తృళ్ళిపడితలెత్తి చూశాడు. ఎదవ మెట్టుమీద నవ్వుతూ నిలబడి కన్పించాడు వీరభద్రుడు.
"రాత్రి ఈ మెట్లమీద పెద్దగా చప్పుడుచేస్తూ పరిగెత్తావుగాదూ?"
"నేనా బాబూ?" వీరభద్రుడి గుబురు కనుబొమలు ముడిపడ్డాయి.
"మరెవరు?"
"నా మాటమీద నమ్మకంలేదుగా? రాత్రికి మీరే స్వయంగా చూడండి బాబూ."
ఉదయ్ వళ్ళు జలదరించింది.
ఏమిటి వీడి ఉద్దేశ్యం? ఈ రాత్రికూడా.....
"ఏం దెయ్యాలాట ఆడదామనుకుంటున్నావా?"
"ఆటా?"
వీరభద్రుడి కనుగుడ్ల గుండ్రంగా తిరిగాయి.
అదోలా అన్పించింది ఉదయ్ కు.
"డాక్టర్ గారూ. అక్కడే నిలబడిపోయారూ?"
వీరభద్రుడి భుజంమీదగా చూశాడు ఉదయ్.
"ఒరేయ్ ఏమిట్రా భద్రిగా....డాక్టర్ గారికి అడ్డంగా నిలబడి అక్కడ నువ్వేం చేస్తున్నావ్?"
"అయ్యగారేదో అడుగుతుంటే...."
"ఏడ్చావులే....నువ్వెళ్ళి నీ పని చూసుకో" శివరామయ్య గద్దించాడు.
వీరభద్రుడు పక్కకు తొలిగి నిలబడ్డాడు.
"రండి. డాక్టర్ గారూ. మానసి మీకోసం ఎదురుచూస్తూకూర్చుంది. మీరొస్తేగాని టిఫిన్ చెయ్యదట."
ఉదయ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి మానసి లేచి నిలబడి సాదరంగా ఆహ్వానించింది.
పెసరట్టులో ఉప్మా పెట్టి ప్లేటు ముందు పెట్టింది.
"ఇది మీ కిష్టమేనా? బ్రేక్ ఫాస్టులో మామూలుగా మీరు ఏం తీసుకుంటారో తెలియదు."
"చాలా చిన్నప్పుడెప్పుడో తిన్నగుర్తు. పెసరట్టంటే నాకు చాలా యిష్టం."