"ఏమని?"
"ఇది నువ్వే చేశావన్నది గ్రహించాము. మరోసారి వెర్రి మొర్రి పథకాలతో మాకు అడ్డు తగిలావంటే నీవు ఆపై వుండేది ఇంట్లోకాదు, అని లెటర్ రాస్తే ఎలా వుంటుంటారు?"
ఈ ఆలోచన ఇన్ స్పెక్టర్ కి నచ్చలేదు. అలా అని చెప్పలేదు చెపితే అర్ధం చేసుకొకపోగా అపార్ధం చేసుకుంటే కష్టం. అని ముందాలోచన చేసిన ఇన్ స్పెక్టర్ కన్నారావు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో "ఎంత గొప్ప ఆలోచన చేశారు?" అంటూ అభినందించాడు.
"పట్టు బడకుండా మన పథకాన్ని అమలులో పెట్టాలి. ఎలా లెటర్ వ్రాయాలో మీరుచెపితే రేపే పోస్ట్ చేయిస్తాను..."
"ఇలాంటి విష రహస్యాలు మూడో కంటికి తెలియకూడదు లాల్ జీ. మీరో అక్షరం నేనో అక్షరం వంకర టింకరగా రాశి లెటర్ పూర్తి చేద్దాం. ఆ లెటర్ ని నేనే స్వయంగా పోస్ట్ చేస్తాను సరేనా ఇంకా మీరు..." నసుగుతూ ఆగాడు ఇన్ స్పెక్టర్.
"కోరుకోండి. మీ ఇష్టమైంది కోరుకోండి..." ఆనందంగా శలవిచ్చాడు బన్సీలాల్.
"రమణి లేని రమ్ము రంజుగా వుండునా?" అని రాగం తీసి "దీని భావమేమి ధరణికుబేరా!" అంటూ ఇన్ స్పెక్టర్ కన్ను గీటి హుషారుగా ప్రశ్నించాడు.
"రమ్ములాంటి రమణి, రంభలాంటి రమణి పువ్వుల గోవిందమ్మ కూతురు అరివేణిని ఏలూరు నుంచి వారంతిరిగే లోగా రప్పిస్తాను. చాలా!"
"చాలు కడుపు నిండింది." సంతృప్తి చెందుతూ అన్నాడు.
ఆ తర్వాత ఇరువురూ కలసి లెటర్ ని తయారు చేశారు. లెటర్ పూర్తి అయిం తర్వాత కవరులో పెట్టి అంటించి తన షర్టు జేబులో పెట్టుకున్నాడు ఇన్ స్పెక్టర్.
బన్సీలాల్ కి చాలా సంతోషం వేసింది. చాటు లెటర్ రాయటానికి ధైర్యం లేకనే ఈ విషయం ఇన్ స్పెక్టర్ తో సంప్రదిద్దామనుకున్నాడు. ఇన్ స్పెక్టర్ నోటికి తాళం వెయ్యటానికి నాందీగ రమ్ పార్టీ ఏర్పాటు చేశాడు. లెటర్ వ్రాయటంలో ఇన్ స్పెక్టర్ చేయికలిపిందిగాక, స్వయంగా తనేపోస్ట్లో వేస్తాననేసరికి బన్సీలాల్ కి ఆనందంతో వళ్ళూపై తెలియలేదు. ముందు ఇన్ స్పెక్టర్ కుయ్ కుయ్ అని నసిగినా అదంత బాధ కలిగించలేదు.
ఇన్ స్పెక్టర్ ఇంటికి వెళ్ళిం తరువాత లెటర్ ని మర్నాడు పోస్ట్ చేయటానికి ఉంచడని...ఈ రాత్రికేదాన్ని తగలపెట్టేస్తాడని...అణుమాత్రం ఆలోచన ఆ నిముషాన బన్సీలాల్ కి రాలేదు.
ఉన్న సాక్ష్యాధారాలను తారుమారు చేయటం...లేనివి సృస్టించటం! నిరపరాధిని అపరాధి, అపరాధిని నిరపరాది చేయగల డిపార్టుమెంట్ లో పనిచేస్తున్న కన్నారావుకి ఇదో లెక్కా?
మరో గంట తర్వాత__
బన్సీలాల్ దగ్గర శలవు తీసుకుని ఇన్ స్పెక్టర్ ఇంటిదారి పట్టాడు.
12
"నే పంపించకుండా నా మనిషి ఎలా వస్తాడు?" ఇన్ స్పెక్టర్ గట్టిగా అడిగాడు.
"అది మా కెలా తెలుస్తుంది? మా పని సవ్యంగా పూర్తి అయితే మీకు పది వేలు ఇస్తామన్నాము. సవ్యంగా పూర్తి అయింది. సంతోషంగా పది వేలు ఇచ్చాము." అవతలి మనిషి ఫోనులో గట్టిగా అన్నాడు. ఈ విషయంలో అవతలి మనిషి తగ్గదల్చుకోలేదు.
"ఎవరికి ఇచ్చారు?" ఇన్ స్పెక్టర్ మరోసారి అడిగాడు.
"మీరు ఓ కానిస్టేబుల్ ని మా దగ్గరకు పంపారు. అతని నెంబరు ఫోర్ నాట్ ఫైవ్...."
"మా కానిస్టేబుల్స్ అందరి నెంబర్లు వరసబెట్టి చెపుతాను రాసుకోండి." ఇన్ స్పెక్టర్ శాంతంగ అన్నాడు.
"నెంబర్లు మా కెందుకు?"
"ఫోర్ నాట్ ఫైవ్ నెంబరు మా కానిస్టేబుల్స్ లో ఎవరికీ లేదు కాబట్టి."
"ఆ...!"
"ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు విషయం అర్ధమయింది కదా?"
"అర్ధమయింది. కాంది మరొకటి వుంది."
"ఏమిటది?"
"పది వేలు ఇస్తానన్నది నేను. పుచ్చుకుంటానన్నది మీరు. ఈ రహస్యం మూడో మనిషికి తెలియదు. అలాంటప్పుడు మూడో మనిషి ఎక్కడనుంచి వచ్చాడు? మన మధ్య జరిగింది వాడికెట్లా తెలుసు? మీకు తెలియకుండా మీ మనిషి ఎవడన్నా...?"
"అదే...అదే...మాట్లాడ వద్దంటున్నాను. మీ మనిషి ఎవడన్నా చాటుగ విని ఈ పని చేసి వుండవచ్చు కదా?"
"ఇన్ స్పెక్టర్ సాబ్! మనం ఇలా కొట్టుకులాడి లాభం లేదు. నా పనిలో మళ్ళీ మళ్ళీ మీ సాయంకావాలి. అందువలన నేను మిమ్మల్ని పది వేలకి మోసం చేసి లబ్దిపొందేది ఏమీ లేదు. అలా అవి మళ్ళీ పది వేలు ఇచ్చుకోలేను. మరొఇ కేసు రెండు రోజుల్లో వస్తున్నఃది. మీకు ఆ కేసులో పన్నెండు వేలు ఇస్తాను. నన్ను అర్ధం చేసుకుని ఆలోచించండి" అన్నాడు అవతలి వ్యక్తి.
ఇన్ స్పెక్టర్ ఆలోచనలో పడ్డాడు.