Previous Page Next Page 
తుపాన్ పేజి 15

                                                 త్యాగతి కథ
             
                                                                 1
   
    సముద్రంలో ఎక్కడనో ఒక అలపుట్టి,పైకి  ఉబికి, లోతులకు దిగి ప్రపంచ సంచారానికి బయలుదేరినది. మహా నక్షత్రగోళంలోంచి విడివడి ఒక తేజఃఖండము తన ప్రథమ గ్రహస్థితిని పొందినది.గుంటూరు జిల్లా తెనాలి తాలుకా బట్టిప్రోలు గ్రామంలో ఇప్పటికి ముప్పైఏళ్ళ క్రితము ఒక విచిత్ర ముహూర్తములో నా మొదటి యేడ్పులోకము.రాత్రి నక్షత్రాలు విన్నవి. ఆ ఊరు మా మేనమామల ఊరు. మా అమ్మకు నేను నాల్గవ కాన్పు.మూడవ కాన్పు మా స్వంత గ్రామమైన కొల్లిపరలోనే సంభవించినది.కుమారుడు పుట్టి నష్టపడినాడట.కాబట్టి నా జననం మా మేనమామ గారింటనే. జాత తండ్రి గండాన పుట్టినాను కాబోలు! నా మూడవ యేటనే తండ్రి దిక్కులలో లీలమైపోయినాడు.

    సాలుకు ఏడువేల రూపాయ లాదాయము వచ్చే ఆస్థికి  నేనోక్కన్నే కుమారుడను నవడంచేత,జనకుణ్ణి చంపింనవాడనని నన్నందరూ హేళన చేసి నప్పటికినీ నా చిన్నతనం మాత్రం రాజభోగంగా జరిగిపోయింది.నన్ను చూచుకుని మా అమ్మ దుఃఖమంతా దిగమ్రింగి అహల్యాబాయిలా రాజ్య పరిపాలన చేసింది.వీధిలోనికి వచ్చి మొగం చూపించకపోయినా భూములు కౌలు కీయడంలో,తమలపాకుల తోటలు మగతా వసూలు చేయడంలో, మా అమ్మ పడి యెకరాల స్వంత వ్యవసాయము పర్యవేక్షణ చేయడంలో మా అమ్మ గారు వీరనారీమణిలాగే ప్రవర్తించేవారు.నేను నిద్రపోతున్నా నను కొన్నప్పుడు ఒక్కొక్క రాత్రివేళ తన భర్తను తలచుకొని వాపోయిన సమయాలు నేను కని పెట్టినవి ఉన్నవి.అప్పుడు నేను పక్కమీదనుంచి గబుక్కున లేచి మా అమ్మ మెడ కౌగిలించుకొని ''అమ్మా,ఏలవకు, అమ్మా ఏలవకు''అని నేనున్నూ ఏడ్చేవాడనట.

    దూరదూరాన్నుంచి దర్శించిన విగ్రహంలా నా తండ్రిగారు జ్ఞాపకం.ఆయన ఎడమచేతికి నాలుగు ఉంగరాలుండేవి. పొడుగాటి మీసాలు,చెవులకు రవ్వలకమ్మలు, కోలమోము ,చక్కని చామనచాయ,తీక్ష్ణమైన చూపులతో నన్ను చూస్తూ పైకెత్తి ''నాన్నా నీవు పుట్టావు,ఇక నేను వెడతాను''అని ఆయన అన్నమాటలు ఇప్పటికీ నాకు ఏవో వేదమంత్రాలూ తోస్తూ ఉంటవి.

    మా అమ్మ అంత అందమైనది కాదు. కళ్ళల్లో ఉన్న ప్రేమ కాంతులు తప్ప కనుముక్కు తీరుల్లో సౌందర్యము తక్కువ.కాని మాతృదేవతా కాంతులెప్పుడూ ఆమె ముఖంలోంచి ప్రసరిస్తూ ఉంటవి.నాకు జ్ఞానం వచ్చినప్పటినుంచి తెల్లటి వస్త్రము కట్టుకొని ముసుగు వేసుకున్న రూపమే!కాని, సర్వభూషనాలంకృతయై, సౌభాగ్యవంతమైన ఆమె కురులు జడగా ముడిచి,సిగచుట్టుకొని,బనారస్ చీర కట్టుకొన్న ఆమె రూపము నేను మా యింట్లోని ఫోటోలలో మాత్రమే చూచినాను.పూజా పీఠము  ముందు కూర్చొని జపం చేసుకుంటుంటే మా అమ్మ పీతాంబర ధారిణియైన యోగినీ దేవతలా ఉండేది.

    ప్రతి పండుగకీ మా అక్కయ్యలిద్దరూ వస్తుండేవారు.మా పెద్దక్కయ్య నాకన్నా పదేళ్లు పెద్ద. మా రెండో అక్కయ్య నాకన్నా ఏడేళ్ళు పెద్ద.నా నాల్గవయేటను మా పెద్దక్క గారు తన అత్తగారూ రైన బందరుకు కాపురానికి వెళ్ళినది.మా పెద్దక్కగారి పెళ్ళి మా తండ్రిగారే చేసినారట.నాకేమీ జ్ఞాపకం లేదు.నా ఐదవ ఏటను మా చిన్నక్కగారి పెళ్ళి జరిగినది.పెళ్ళివారు గుంటూరునుంచి తరలివచ్చినారు.మా మేనమామ వై పువారు,మా అన్నదమ్ములవారు మమ్మాదుకొని వివాహం అత్యంత వైభవముతో చేసినారు.అప్పుడే నావడుగు కూడా అయింది.

    మా అమ్మ నా చదువుకొరకు రేపల్లెలో కాపురము పెట్టినది.అక్కడా మాకు పెద్ద కామాటంగానే ఉండేది.మా క్లాస్ మాస్టరే నాకు ప్రయివేటుగా చదువు చెప్పేవాడు.క్లాస్ లో మొట్ట మొదటిగా ఎప్పుడూ ప్యాసవుతూ ఉండేవాణ్ణి.సెలవలకు ఇంటికి రావడమంటే ఎంతో సరదాగా ఉండేది.తోటల వెంట తిరగడం,పోలాలవెంట తిరగడమంటే  నా చిన్న హృదయం ఎగిర గంతువేసేది,నాకు కమ్మవారబ్బాయిలు,రెడ్లబాలకులు,బ్రాహ్మణార్బకులు చాలామంది స్నేహితులుందేవారు.వీళ్ళందరికీ నాయకుణ్ణి నేను. తెనాలిలో సెకండుఫారం చదువుతున్న సూరపరెడ్డీ,వెంకట్రామయ్యచౌదరీకూడా నా మాటంటే గీచినగీటు దాటేవారుకారు.నా కోసం మా అమ్మ ఎప్పుడూ ఏదో చేస్తూనే ఉండేది.మినపరొట్టో,చేగోడీలో,పకోడీలో,జంతికలో ఏవో అవి మూటలు పట్టుకొచ్చి,నా స్నేహితులకు విందులు,ఫలహారాలు పెట్టేవాణ్ణి. ఏ స్నేహితినింటికి వెళ్ళినా  ఆ స్నేహితుని పెద్దలందరూ ఎంతో ప్రేమతో నన్ను పలకరిస్తుండేవారు.

    ఆ రోజుల్లో కూడా ఢుంటి వినాయకరావుగారు నేనంటే చూపించే ఆపేక్ష నిరుపమానమైంది. ఆయనకూ,మా తండ్రికి పరమ స్నేహము.ఆయనకు పిలక ఉండేది.పద్దతి నియోగ మంటే అపరిమితమైన ప్రేమ.నందిరాజు దీక్షితుల వారంటే ఎంతో భక్తి.నియోగ మహాసభలకు వేలకు వేలు ఖర్చు చేస్తుండేవారు.మా తండ్రిగారికి పద్దతియందు నమ్మకముండేది కాదట.మా నాయనగారిని శ్రీ దై వాద్వైతమతస్థాపక దీక్షితులు గారెప్పుడూ  హెచ్చరిస్తుండేవారట.పద్దతి నవలంబించిన వినాయకరావుగారికిని,పద్దతి నవలంబించని మా తండ్రిగారైన శేషాచలపతిగారికిన్నీ కృష్ణార్జునుల మైత్రివంటి గాఢ స్నేహమని పెద్దలు చెప్పుతుండేవారు.

    ఢుంటి వినాయకరావుగారు నేను కనబడగానే ''ఒరే మూర్తీ!''అని దగ్గరకు పిలిచి,ఒళ్లో కూర్చో పెట్టుకొని,నా తలను వ్రేళ్ళతో సవరిస్తూ ''నీకు మీ అమ్మగారి పోలికలు,మీ నాన్నగారి తెలివితేటలన్నీఉన్నాయిరా.పరీక్షలన్నీ ఫస్టుగా ప్యాసై గొప్పవాడి వై లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకో '' అని అనేవారు. ఈ ముక్కలు ఎన్ని వేలసార్లన్నారో  ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే వుంటవి.

    నా చిన్నతనంలో చంటిబిడ్డలంటే అసహ్యం.వాళ్ళు బట్టలు మలినం చేస్తారని పెద్దక్కగారి బిడ్డల్ని ఎప్పుడూ ఎత్తుకునేవాణ్ణికాను.దూరంనుంచి ఒక వేలుతో ముట్టుకునేవాణ్ణి.మేనమామగారి బిడ్డల్ని అంతే.అలాంటి నా చిన్న హృదయానికి ఒక బాలికంటే అదేదో విపరీతమైన అనురాగముండేది.ఆ బాలిక పుట్టినప్పటినుంచి ''నీ పెళ్ళాము నీ పెళ్ళా ''మని వాళ్ళ అమ్మా,నాన్నా కూడా నన్ను వేళాకోళం చేసేవారు. ఆ చిన్నప్పటిమాటే నాకు పరమవాక్కయినది. నా అయిదవ ఏటను ఆ బాలిక జన్మతాల్చినది.పాలబుగ్గలపైన వున్న ఆనాటి నా కళ్ళకే,పొత్తిళ్ళలోని ఆ వెన్న ముద్దల బాలిక సర్వ సౌందర్యాలకు నిధి అని తోచేది. ఆ బాలిక తల నిలపడం వచ్చిన అయిదోనెలనుంచి కూడా నే నెక్కడ పడవేస్తానో అనే భయంతోనే ఎత్తుకుంటుండేవాణ్ణి.ఎంత ఏడ్పులో ఉన్నా ''ఏడవకు '' అని నేననగానే ఆ పాప ఊరుకునేది.ఆ అమ్మాయి వినాయకరావుగారి  ప్రథమ సంతానం.
 

 Previous Page Next Page