Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 15

    "కమాన్, గెటప్...స్టాండప్ ఆన్ ది సిమెంట్ బెంచ్!"

    ముగ్గురూ బెంచ్ ఎక్కి నిలబడ్డారు.

    "కిరణ్ బేడీకన్నా, నేను చాలా స్ట్రిక్ట్- ఆ విషయం ఫస్ట్ డే నాదే చెప్పాను. నన్ను మీరొక బఫూన్ నని, వాజమ్మనని, వెర్రి వెంగళప్పనని, అనుకుంటున్నారని నాకు తెలుసు. కొత్త ఖైదీల్ని టెస్ట్ చెయ్యడానికి కొన్నాళ్ళపాటు నేనలా నటిస్తానన్నమాట! అండర్ స్టాండ్- మిమ్మల్ని పట్టేసాను చూశారా!

    మీ నేరాలోచన్ని మొగ్గలోనే తుంచెయ్యాల్సిన రెస్పాన్స్ బులిటీ నాకుంది. మీరు చేస్తున్న తప్పుడు ఆలోచనకి, ఇప్పుడే శిక్ష విధిస్తాను కమాన్ - ముగ్గురూ ఈ చెట్టెక్కి, జాంకాయలు కొయ్యండి!" అని సీరియస్ గా ఆర్డరు జారీ చేశాడు జైలరు.

    "ఓస్...ఇంతేనా...?" అనుకొంటూ గబగబా చెట్టేక్కేశారు ముగ్గురూ.

    ఫస్టు ఫస్టున చెట్టు కొమ్మల్లోకేల్లిపోయిన పోతురాజు ఆ చెట్టు మామిడి చెట్టులా కనబడటంతో-

    "సార్! ఇది మామిడి చెట్టులా ఉంది సార్ - దీనికి జాంకాయ లుండవు సార్!" అరిచాడు.

    "ఎస్....ఆ విషయం నాకు తెలుసు - మామిడి చెట్టుకి జంకాయ లుండవని తెలుసు. తాటి చెట్టుకి పనస కాయలుండవని తెలుసు....నాకు ఇలాంటి విషయాలు చాలా తెలుసు. మర్యాదగా చెప్పింది చెయ్యండి- ఇక్కడే కూర్చుంటా...అరగంటలో నాకు జాంకాయలు కావాలంతే!"

    బండరాయి మీద కూర్చుంటా అన్నాడతను.

    "ఈ జైలరు పీనుక్కి చాదస్తమే కాదురా - పిచ్చి కూడా ఉంది. మామిడి చెట్టుకి జాం కాయలెలా కాస్తాయి?" అంటూ దూరంగా గేటు తెరచుకుని లోనికోస్తున్న ఆడమనిషిని చూసి, చెట్టు కొమ్మని వదిలేసి, దబ్ మని కిందకు గెంతేశాడు వీర్రాజు.

    కిందకొమ్మ పైకెళ్ళి దడ్ మని తగలడంతో సేతురాజు కూడా కింద ఇసుకలో పడిపోయి, లేచి దుమ్ము దులుపుకుంటూ గేటువేపే చూడసాగాడు కళ్ళప్పగించి.

    గేటు తెరచుకొని వస్తున్న ఆ ఆడమనిషికి పాతికేళ్ళుంటాయి. ఎర్రగా, పొడవుగా, అరబ్ జాతి గుర్రంలా, పొంకంగా సెక్సీగా ఉంది. ఆమెను గుర్తుపట్టగానే__

    "జగదా...! నా జగదా" అంటూ ముందుకు పరిగెత్తాడు వీర్రాజు.

    అతడ్ని గుర్తుపట్టిన జగదాంబ__

    "వీరు- మైడియర్ వీరు" తొమ్మిది నెలలుగా ఎటెళ్ళిపోయావు వీరూ" అంటూ ఆమె వీర్రాజును గట్టిగా కౌగలించేసుకుంది.

    ఒక్క ఉదుటునలేచి, ఆందోళనరావు వాళ్ళిద్దర్నీ, అతి బలవంతంమ్మీద విడదీసి__

    "ఒరేయ్ వీరు! నువ్వేదో పొరబడుతున్నావు. ఈవిడ మా రెండో ఫామిలీస్- నీకు గురుపత్ని- గురుపత్ని ఆడదేవత్తో సమానంరా" అంటూ అరుస్తున్నాడు.

    జైలర్ అరుపుల్ని ఒకప్పటి ఆ ప్రేమజంట వినిపించుకోవడం లేదు.
   
                                                                      ౦    ౦    ౦

    సాయంత్రం అయిదు, ఆరు గంటల మధ్య__

    పడమటి దిశలో దాక్కోవడానికెళుతున్న సూర్యుని వింత వింత వన్నెలన్నీ మేఘాలపైపడి, ఆ మేఘాలు నెమలి పించాల్లా మెరుస్తున్నాయి.

    స్విమింగ్ ఫూల్ పక్కన కొంచెం దూరంలో ఉన్న__ లాన్ లో, బొంబాయినుంచి ప్రత్యేకంగా తండ్రి తెపించిన రకరకాల టాయస్ తో ఆడుకుంటున్నాడు తేజ.

    ఈజీ చెయిర్ లో కూర్చుని కొడుకు చేస్తున్న చిత్రాలన్నిటినీ గమనిస్తోంది సుదేష్ణాదేవి.

    తేజ చేతుల్లోకి తీసుకుని, దూరంగా విసిరేస్తున్న బొమ్మల్ని దగ్గరగా తెస్తోంది బ్రౌనీ.

    కాసేపయ్యాక బాబు బొమ్మల ధ్యాసలోంచి మరలి, అటూ ఇటూ పాకారుతున్నాడు.

    మంచి యాంగిల్ కనిపించినప్పుడల్లా పక్కనవున్న కెమెరాను తీసుకుని ఫోటో తీస్తోంది సుదేష్ణాదేవి.

    చిన్నారి తేజ, ప్రతి చేష్టనీ, ఫోటోలుగా తీసి, ఆల్బమ్ లో భద్రపరచాలని ఆ తల్లి ఆశ.

    ఇప్పటికి ఎన్ని ఫోటోలు తీసిందో లెక్కలేదు.

    "ఆఖరికి నీ దిష్టే తగిలేటట్టుగా ఉంది నా కొడుక్కి" రెండుమూడు సార్లు నవ్వుతూ కాళేశ్వరప్రసాద్ అన్నప్పుడల్లా__

    "మీ కొడుకట మీ కొడుకు. తొమ్మిదినెలలుమోపి నొప్పులన్నీ భరించి పెద్ద కన్నట్టు" వెక్కిరించేది సుదేష్ట.

    "మీలా మేం నొప్పులు పడక్కర్ల - మీ ఆడవాళ్ళు హాస్పిటల్లో నొప్పులు పడుతుంటే ఆ టైమ్ లో భర్తపడే మానసికబాధ పురుటి నోపుల కేం తీసిపోవు" ఆ మాటను అతను సీరియస్ గా అన్నాడు.

    తనపట్ల అంచంచలమయిన ప్రేమ, తన కొడుకుపట్ల అవ్యాజమైన ప్రేమను కురిపించే కాళేశ్వరప్రసాద్, తన భర్తగా లభించడాన్ని తలచుకుని గర్వంగా అనుభూతి చెందుతుంది సుదేష్ణాదేవి.

    చిన్న దృశ్యం చప్పున కళ్ళముందు మెదిలి మాయమైపోగా, తన కాళ్ళను పట్టుకుని నిలబడడానికి ప్రయతిస్తున్న తేజను అందుకొని__బ్రౌనీవేపు చూసిందామె.

    అక్కడ గుంపుగా పడేసివున్న బొమ్మల్లో కుక్కపిల్ల తోకను నోటితో కరిచిపట్టుకుని పరిగెట్టి, మట్టిలో డాన్ని కిందపడుకోబెట్టి, తన కాళ్ళతో దాని పొట్టను చీల్చడానికి ప్రయత్నిస్తోంది బ్రౌనీ.

    "ఏయ్ బ్రౌనీ!" అందమయిన బొమ్మ పాడయిపోవడం ఇష్టంలేక దూరంనుంచే అరుస్తోంది సుదేష్ణాదేవి.

 Previous Page Next Page