Previous Page Next Page 
మనస్విని పేజి 15

 

    "రాస్తే చాలదా?"
    
    "ఎందుకనో?"
    
    "రాబోయే పరీక్షలకి తట్టుకోవటానికి"
    
    "అలాగైతే ఈ పరీక్షల్లో జయంపొందితీరుతావా?"    

 

    "అవును"    

 

    "నా మాట వినండి"    

 

    "వింటాను"
    
    "తప్పక"
    
    "తప్పక"
    
    అలా ఏకబిగిని మాట్లాడేస్తున్న గీతాంజలి మధులవైపు ఎవరు మాట్లాడితేవాళ్ళవైపు ముఖం తిప్పుతూ చూస్తున్నాడు సారధి.
    
    "మీకిప్పుడిప్పుడే బంగారు పంజరంలోకి వెళ్ళాలని లేదా?"    

 

    "ఊహు"
    
    "పిట్టజత అక్కరలేదా"
    
    "కావాలి"
    
    "మరి......పంజరంలోకి వెళ్ళినా వెళ్ళకున్నా ఆ పిట్ట తోడుగా ఎప్పుడూ వుంటుంది"
    
    "ఉహూ"
    
    "ఔను"
    
    "అయితే ఆ మధుర మీనాక్షమ్మతో ఇలా మొక్కుని మార్చుకున్నానని మళ్ళీ మొక్కుకుని చెప్పండి"
    
    "చెప్పండి"
    
    "ఈ పరీక్షల్లో నెగ్గితే తప్పక నీవాడినౌతానని"
    
    "అరే! ఎంత బాగా చెప్పారు నా మట్టి బుర్రకి తట్టనే లేదు చూడండి.....అవునా సారధీ.....బావుంది కదూ?"    

 

    "చాలాబావుంది బ్రదర్"
    
    "అయితే ఏమంటావ్"
    
    "నేనేమంటాను బ్రదర్, లాయర్ కావాలని అనుకునే వాడి దగ్గరనేనే అప్పుడప్పుడూ సలహాలు తీసుకోవటంప్రారంభించి సంవత్సరంపైగా అయింది"    

 

    "మంచిదంటావ్"
    
    "ముమ్మాటికీ"    

 

    సంతోషించిందే వదనంతో అన్నాడు మధురం.
    
    "కరెక్ట్! బ్రదర్.....బుర్రపగలేసుకుంటున్న నాకు పరిష్కారం చెప్పారు. ఆల్ రైట్ వస్తా సైకిల్ ఎక్కబోయాడు.
    
    "ఆల్ రైట్ ఎలా వెడతావో చూస్తా"
    
    కొత్తగొంతు విని విభ్రాంతితో తల తిప్పి చూశారు. ఎవరో ఓ వ్యక్తి సైకిల్ కారియరు పట్టుకుని నిలేశాడు.
    
    "ఆనాడు దారిలో కలిసిన పిచ్చివాడిలా వున్నాడే" అనుకున్నాడు మధురం.
    
    సారధికి అతనెవరో అర్ధంకాలేదు. కానీ ఎక్కడో ఎప్పుడో చూసినట్లుగా గుర్తు తగులుతుంది గీతాంజలికి లీలగా ఏదో గుర్తుకి వస్తోంది.
    
    "ఏమిటి బ్రదర్.......ముగ్గురుఅలా నిస్తేజులైపోయారు. అంటే అర్ధం కాలేదా? అంటే భవదీయముఖారవిందములు వెల్లువైన వేమా? అని"

   
    ఎవరూ జవాబు చెప్పలేదు.
    
    'ఓహో టీకాటూక మపేక్ష్యతి- టీప్పణంకావాలా?.....పోనీలే....ఎక్కడికి బ్రదర్ ఈ ప్రయాణం?"
    
    "......."
    
    "నామాటలు విని భయపడుతున్నారా?"
    
    "......."
    
    "నేనుపిచ్చివాడిని కాదు-రాజకీయవాదిని కాదు- వాస్తవిక వాదిని"
    
    "........"
    
    "ఉన్నమాట ఢంకా బజాయించి-కుండబద్దలుకొట్టి-తెలుగు మేష్టారుకి స్కేలు తక్కువైసరిగా చెప్పలేదు- తర్వాత ఇంకా కొన్ని విశేషణాలు వెయ్యాలి-గుర్తుకి.
    
    "ఏమిటి? ఓహో నా కావ్యం సంగతా? అరరే! ఎంత శ్రద్ద అమ్మాయ్ నీకు.....నాకావ్యం ఎత్తుకుని పోకపూరం నీవే ఇలా కనిపించి అడిగితే నా పద్యాలన్నీ నీకంఠస్థం అయ్యేట్టు మనసుకి హత్తుకునేట్టు చెప్పేవాడివి. కానీ అది వున్నన్నాళ్ళూ ఎవర్ని చదవమన్నా 'అబ్బ' ఇప్పుడు కాదు-ఇదితీరిగ్గా చదవాలి. మళ్ళీ చదువుతాలే అనేవారు..... అందుకే నా ఖండ కావ్యం ఎవడో ఎత్తుకుని పోయాడు.    

 

    తీరిగ్గా కూర్చుని చదువుకుంటూ వుంటాడు- పెంచుకున్న తీగను తెంచినట్టు వ్రాసుకున్న కావ్యాన్ని తగిలేసినట్టు-గీసుకున్న బొమ్మని చించినట్టు కట్టుకున్న ఇల్లుపడగొట్టినట్టు-నాకావ్యం ఎత్తుకుపోయాడు.....అమ్మా......!" దుఃఖం భరించలేక ఏడుస్తూ సారధీ గీతాంజలి మధ్యగా దూసుకుని గీతాంజలిని రాసుకుంటూ వెళ్ళిపోయాడు.
    
    కొంతసేపు అందరూ అలాగే మ్రాన్పడిపోయారు. కొద్దిసేపయ్యాక సారధి అన్నాడు.
    
    "ఎక్కడో ఎప్పుడో పరిచయం కలిగినట్లయింది. అతని మాటలధోరణి వింటూంటే! కానీ గుర్తుకి రావటంలేదు"
    
    "ఇంతకుపూర్వం నాకు ఓసారి కనిపించాడు బ్రదర్, అప్పుడూ ఇదే ధోరణిలో ఏదో వాగి వాగి వెళ్ళిపోయాడు అంతు చిక్కని ధోరణిలో అర్ధం వుండీ వుండని మాటలు వాగుతుంటాడు ఎప్పుడూ కానీ ఎవరో నాకూ తెలియదు" గీతాంజలి గుర్తుకు తెచ్చుకుంటూ అంది.
    
    "అప్పుడు మనం ఫస్టియర్ లో ఉన్నాం. మన కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండే వాడు. 'గురుదేవ్' అని చాలా చక్కగా కవిత్వంవ్రాసేవాడు."    

    "అవును ప్రైవేటుగా సంస్కృతం కూడా చదివేవాడు బి.ఎ. మేధమేటిక్స్ లో ఉండేవాడు.....కాలనీలో వుండేవాడు" గుర్తుపట్టి అన్నాడు సారధి.
    
    గీతాంజలి చెప్పసాగింది. "నవలలుకూడా రాసేవాడు ఏదో పోటీకి పంపితే తన నవల ఒకటి తిరిగి వచ్చిందనీ, రక్తం సిరాగా మార్చి తనశక్తినంతా ధారపోసి రాశానని అందులో ఏదో అన్యాయం జరిగిందని చాలాబాధపడుతూ వుండేవాడు-అప్పుడే అతనింట్లో దొంగతనం జరిగింది. మక్కువతో మనసారా వ్రాసుకున్న పద్యాలు పోయాని చాలామంది కవులకి మల్లేతన పద్యాలు తనకి గుర్తుండవనీ ఏవో పద్యపాదాలు కొన్ని ఉదాహరిస్తూవాని పూరణలు ఇంకా    మధురంగా ఉన్నాయని గుర్తుకి రావటంలేదని రాత్రింబవళ్ళు కుమిలిపోయేవాడట.....వినలేదా?"
    
    "అవునవును గుర్తుకి వస్తోంది. అతనితోనాకు కొంచెం పరిచయంకూడా వుంది......ఒకసారి బజార్లో నీవు కనిపించావు. అప్పుడు నాతోనే వున్నాడతను.....నీవేణికను జూచి అన్నాడు నాతో.    
    
    "మబ్బు చాలువేణిమగున తావిరిబోణి-కన్నడగడయమిన్నకలువకన'ఇందులో 'చాలు' అనేపదం మీద అరగంట ఉపన్యాసం ఇచ్చాడు. అదేపాదంలోని విరిబోణి అనే పదానికీ మగువ తా అనేపదం అతకటంలో 'తావి' కూడా వుందని ఆ సొగసు తెచ్చిన నీ సొగసుకి ఎంతో మురిసిపోయాడు- నాకుబాగా గుర్తుంది"
    
    గీతాంజలి అంది'
    
    "అవును ఏ శ్రీనాధ మహాకవికాలంలోనో లేకపోతే రాయలవారిరసి సామ్రాజ్యంలోనో వుండవలసినవాడు. ఎవరో పుష్పలావికనుజూచి శ్రీనాధుడు పద్యం చెప్పాడు అంటే నమ్మలేని ఈ దేశానికి ఇతన్ని జూపితేసరి.....సరి..... ఆతర్వాత అతను సరదా వాటినేమనసులో అనుకుంటూ అలాంటి కవిత్వాన్ని పోగొట్టుకున్నందుకు తనని తాను తిట్టుకుంటూ ఎప్పుడూ ఏడ్చేవాడట. ఒకరోజు హఠాత్తుగా ఏవేవో గీతాలు గేయాలు పాడటం మొదలుపెట్టి ఆశువుగా పద్యాలల్లుతూ వున్నట్టుండి వెర్రిగా నవ్వాడట......
    
    తిరిగికవిత ధోరణిలో పడ్డందుకు సంతోషిస్తున్న స్నేహితులకి ఉన్నట్టుంది అతనులేచి ప్రక్కనే వున్నదుప్పటి మీద వేసుకుని బయటికి లేచిపోవటంతో ఆశ్చర్యమేసి బయటికివెళ్ళి అతని ఆపారట. వాళ్ళని చంపేట్టుగా చూస్తూ అన్నాడట.    
    
    "ఎవరు మీరు? రాజ భటులా? రక్షక భటులా? లేక పోతే రాక్షసులా? ఈ శాలువా నాది నా రసిక మంజరివిని రాయలవారు స్వయంగా శాలువా కప్పారు......ముట్టుకోకండి"
    
    "అతనిలో కలిగిన మనఃచాంచల్యానికి దుఃఖిస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయారట వాళ్ళు"
    
    చాలారోజులు కాలేజి అతన్ని మరువలేక పోయింది. లిటరరీ అసోసియేషన్ సమావేశం జరిపిప్రిన్సిపాల్ గారు అతను మాటలు చెప్పుతూ కన్నీరుకూడా పెట్టుకున్నారు"
    
    "అతన్ని గురించి చెపుతున్న ఆమెలో కూడా భావచలనం మనస్సు నిండాదుఃఖం పొంగి కన్నీళ్ళువచ్చాయి మౌనంగా ముగ్గురూ నడక సాగించారు-

 Previous Page Next Page