Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 15

                                 


                 
    
    ఆ రోజు పొద్దున్నే మా ఫ్లోర్ లో పెద్దగా కేకలు, ఏడుపులు వినిపించేసరికి మా బ్లాక్ లో వాళ్ళ నిద్ర చెడిపోయింది.
    గొడవేంటా అని షర్ట్ వేసుకుని బయటకు నడిచాను- అప్పటికే త్రీనాట్ సిక్స్ ఫ్లాట్ ముందు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ హమీద్ మియా, జనరల్ సెక్రటరీ శంకరమూర్తి, లేడీస్ వింగ్ ప్రెసిడెంట్ షైనీ, వైస్ ప్రెసిడెంట్ మంగతాయారు, విజయ్ యాదవ్ గుమికూడి పోయారక్కడ.
    "ఎన్నా ప్రాబ్లెమ్? ఏమి జరుగుతావుండాది?" అంది సీతా వరదరాజన్.
    "ఆ ఫ్లాట్ లో రాజేశ్వర్ అనే అతను ఉంటయ్. రాజేశ్వర్ కొక్కటి భార్య, ఒక్కటి తండ్రి, ఒక్కటి తల్లితో ఉంటున్నయ్- రాజేశ్వర్ కో మా బాప్ కే సాత్ జగడా హో గయా!" అంటూ కొన్ని వివరాలందించాడు హమీద్ మియా.
    అప్పుడు సంగతి నాకర్ధమయింది.
    ఈ మధ్య కొద్ది రోజులుగా రాజేశ్వర్ భార్యకీ అతని తల్లిదండ్రులకూ గొడవలవుతూనే ఉన్నయ్.
    అత్తాకోడళ్ళ గొడవలు నార్మలేనని మేమెవరమూ పట్టించుకోలేదు.
    కానీ రాన్రాను అవి ఎక్కువయిపోయినయ్. ముఖ్యంగా రాజేశ్వర్ నా భార్యే కరెక్ట్- నా తల్లిదండ్రులదే తప్పంతా- అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసరికి గొడవలు ఇంకా పెరిగిపోయాయ్.
    శంకరమూర్తికి జరిగిందంతా చెప్తున్నాడు రాజేశ్వర్.
    "సార్- తప్పంతా నా తల్లిదండ్రుల్దేసార్- అన్నిటికీ నా మిసెస్ తో గొడవ పడుతూంటారు. తిడుతూంటారు. సూటిపోటీ మాటలంటారు- ఎవరయినా అలాంటి అవమానాలు ఎంతకాలం సహిస్తారు? అందుకే నా మిసెస్ ఎదురుతిరిగింది. వాళ్ళు ఒకమాటంటే తను రెండు మాటలనడం మొదలుపెట్టింది.
    అక్కడికీ నేను ముగ్గురినీ దగ్గర కూర్చోబెట్టుకుని నచ్చచెప్పాను- వింటేనా? పైగా నన్ను కూడా ఏ కన్నతండ్రీ, తల్లీ తిట్టని తిట్లు తిడుతున్నారు సార్- అందుకని నా ఇంటి నుంచి బయటకు పొమ్మన్నాను-"
    శంకరమూర్తి కల్పించుకున్నాడు.
    "ఇదిగో చూడు రాజేశ్వర్! వాళ్ళు తిట్టినా, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవాలిగానీ అలా బయటకు గెంటటం బాగుండదు-"
    అందరూ కలిసి రాజేశ్వర్ దంపతులకూ, అతడి తల్లిదండ్రులకూ నచ్చజెప్పి- ఇంట్లోకి పంపిస్తున్న సమయంలోనే దిగాడు మా అపార్ట్ మెంట్స్ లోనే ఉంటున్న రాజు. అతని వెనుకే తుగ్లక్ ఛానెల్ కెమెరామెన్.
    రాజు ఈ మధ్యే మా అపార్ట్ మెంట్స్ లో దిగాడు. అతను తుగ్లక్ ఛానెల్ జర్నలిస్ట్.
    ఎక్కడేం గొడవ జరిగినా తక్షణం కెమెరామెన్ తో పాటు వాలిపోయి కవరేజ్ ఇవ్వటం అతనికి బాగా అలవాటు.
    రావటంతోనే కెమెరాని రాజేశ్వర్ అపార్ట్ మెంట్ వేపు ఫోకస్ చేశాడు. మామూలుగా ఫ్లాట్స్ లేడీసంతా కెమెరా చుట్టూ మూగిపోయారు.
    రాజు మాత్రం ఛానెల్ కి కామెంటరీ ఇస్తున్నాడు మైక్ పట్టుకుని.
    "వెంగమాంబా! ఈ రాంభరోసా అపార్ట్ మెంట్స్ లో రాజేశ్వర్ అనే యువకుడు, తన భార్య చెప్పుడు మాటలు విని వృద్దాప్యంలో వున్న కన్నతల్లినీ, తండ్రినీ ఇంటి నుంచి బయటకు గెంటాడు.....వెంగమాంబా!
    "రాజేశ్వర్ ఏం చేస్తుంటాడు రాజు?"
    "అతను ఒక సాధారణ వ్యక్తి అయితే ఫరవాలేదు కానీ అతను ఒక టి.వి. ఆర్టిస్ట్! యాక్టర్ గా పైకొస్తున్నాడు- ఒక వర్ధమాన నటుడిగా దేశానికి ఆదర్శంగా నిలవాల్సిందిపోయి ప్రత్యక్ష దైవాల్లాంటి తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా కేవలం భార్య మాటలు విని బయటకు గెంటాడంటే అది చాలా దారుణం. అమానుషం వెంగమాంబా.
    "అసలు రాజేశ్వర్ భార్యకూ, అత్తమామలకూ గొడవలెందుకొచ్చాయ్? ఆ విషయంలో ఆ అపార్ట్ మెంట్స్ లో ఉన్న మిగతా రెసిడెంట్స్ ఏమంటున్నారు?"
    "వాళ్ళ మధ్య గొడవలు రావడానికి చాలా కారణాలున్నట్లు తెలుస్తోంది వెంగమాంబా. మొదటిది- ఆ వృద్ద దంపతుల కనీసావసరాలు వాళ్ళ కోడలు సమకూర్చకపోవటం వెంగమాంబా! అదే కాకుండా వారిని శారీరకంగా, మానసికంగా కూడా హింసిస్తూ వేధిస్తూ, దౌర్జన్యానికి పాల్పడుతోందని ఆ వృద్దదంపతులు చెప్తున్నారు వెంగమాంబా!
    "నిజంగా ఇది చాలా అమానుషమయినా ప్రవర్తన రాజు! ఆ దంపతులేమయినా మాట్లాడారా? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటీ? వాళ్ళ రియాక్షన్ ఏమిటి?"
    "ఇప్పుడే కెమెరా వాళ్ళముందుకొస్తోంది వెంగమాంబా! ఒక్క  నిమిషం! ఆ చెప్పండి సార్- మీ అబ్బాయి మిమ్మల్ని కట్టుబట్టలతో బయటకు గెంటినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మీరెలా ఫీలవుతున్నారు?"
    "మా ఇద్దరికీ కాలిపోతోంది. కొడుకూ కోడలూ ఛస్తే బావుండునని ఉంది"
    "వెంగమాంబా! ఇద్దరికీ కాలిపోతోందంటున్నారు! వాళ్ళే కాదు- ఈ అపార్ట్ మెంట్ వాసులు కూడా అలాగే ఫీలవుతున్నారు వెంగమాంబా! ముందు అసోసియేషన్ వుమన్స్ వింగ్ ప్రెసిడెంట్ అభిప్రాయం తెలుసుకుందాం షైనీగారూ! ఈ రాజేశ్వర్ తల్లిదండ్రుల సమస్య గురించి మీరెలా ఫీలవుతున్నారు?"

 Previous Page Next Page