Previous Page Next Page 
శతఘ్ని పేజి 15

 

    మాటమార్చాడు "బయలుదేరుదామా"
    
    సరేనంది సాలోచనగా ....... బైక్ బయలు దేరాక అన్నాడు "చిన్న అనుమానం." "అడగండి"
    
    "మీరింత స్వచ్చమైన తెలుగులో ఎలా మాటాడగలుగుతున్నారు."
    
    "మామమ్మీ అచ్చ తెలుగు స్త్రీ...... లవ్ మేరేజ్."
    
    "ఫైన్" అన్నాడు అభినందిస్తూ.
    
    "ఏమిటి లవ్ మేరేజెసా....."
    
    "కాదు....... మీ మమ్మీ తెలుగుపడుచు కావడం."
    
    రెండుక్షణాలవిరామం తర్వాత "ఇంటికొస్తారా" అంది.
    
    "మరోసారి."    
    
    "ఇక్కడ ఆపేయండి"
    
    చార్మినార్ చౌరస్తా దగ్గర బండి ఆపేక అంది లిజీ ......."మళ్ళీ ఎప్పుడు ఎక్కడ....." ఎందుకో ఆమెకే అదోలా వుంది..... అది మాత్రమే కాదు..... అతడి పరిచయపు మెరుపులు శాశ్వతమో అశాశ్వతమో అర్ధం కానట్టు అదోలాంటి భావం ఆమెను కలవర పరుస్తోంది.
    
    "ఏమిటలాచూస్తున్నారు" అడిగాడు సీరియస్ గానే.
    
    "మీరు జాగ్రత్త"
    
    ఎందుకిలా అంటున్నదీ కొంత అర్ధమైనా ఆ ప్రసక్తినిపొడిగించటం ఇష్టం లేనట్టు అన్నాడు నెమ్మదిగా" మరో ప్రశ్న అడగనా.......మొన్నడిగిన ప్రశ్నలాంటిదే"
    
    "వెల్ కమ్"
    
    "ఒకేసారి మూడు ప్రమాణాలు మూడు చోట్ల జరగబోతున్నాయి....."
    
    ముందు త్యాగి ఇందాకటి ఉద్యమం గురించి మాటాడుతున్నాడనుకుంది.
    
    "ఎక్కడోరుమేనియాలో ఓ భూకంపం జరిగి ఏభై వేలమంది. చనిబోతున్నారు ఢిల్లీలో ఓ విమానప్రమాదం జరిగి సుమారుమూడు వందలమందిప్రాణాలు కోల్పోయే స్థితిలో వున్నారు. మీరు చాలా దగ్గరగా ఓ కారు ఏక్సిడెంటులో మీకు చాలా ఇష్టుడైన వ్యక్తి. మరణానికి సిద్దంగా వున్నాడు. ఆ మూడింటి గురించి మీకు తెలుసు....." అవక్కయి వుంటుంది.
    
    "అయితే ఆ మూడింటిలో ఒకటి ఆపగలిగే శక్తి మీకువుంది"
    
    "ఎలా?"
    
    "ఒక్కక్షణం పాటు ఉందీ అనుకోండి. ప్లీజ్ నోట్...... మీరు ఆపగలిగేది మూడుకాదు
    
    ......ఏదో ఒక్కటి మాత్రమే..... అప్పుడు మీరు ఏది ఆపాలని ప్రయత్నిస్తారు.....దేన్ని ప్రిఫర్ చేస్తారు ఆలోచించి చెప్పండి ఈసారి కలిసినప్పుడు"
    
    అతడెందుకిలా అడిగినా గాని ఆందోళనగా చూసింది. ప్రశ్నలో మేధస్సుకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు మనసు పొరల్ని స్పృశించే విశ్లేషణ కనిపిస్తూంది. తను ఆపదలో కూరుకుపోతున్నట్టు త్యాగి కూడా ఊహిస్తున్నాడా...... వెళుతున్న త్యాగిని చూస్తుంటే ఎందుకో ఆమె మనసు కీడు శంకిస్తూంది.
    
    ఎప్పుడో కాదు. ఈ రాత్రికే ఏదో జరగబోతుందనిపిస్తుంది చిత్రంగా......సరిగ్గా ఇదే సమయంలో.....
    
    బ్రహ్మాజీగెస్ట్ హౌస్ లో ఓ సమావేశం చేయబడింది.
    
    ఆ సమావేశంలో పరమహంస ముకుందాలు మాత్రమే బ్రహ్మాజీకి నగరంలో కుడిభుజాలైన అప్పారావులాంటి వ్యక్తుల అదే కేటగిరీకి చెందిన వివిధ జిల్లాల ప్రతి నిధులూ వున్నారు వంద దాకా.
    
    ఆ సాయంకాలమే రప్పించబడిన ఆ వంద మందిలో కొందరు మండలాధ్యక్షులపదవికి పోటీ చేసి ఓడిన వాళ్ళయితే మరి కొందరు సర్పంచ్ లైనాచాలు అనుకునే సర్పంచ్ లు కాని వ్యక్తులూ వున్నారు. రాజకీయాలలో అడుగుపెట్టడానికి మార్గం వెదుక్కుంటున్న వాళ్ళు కొందరైతే, నాయకుల వెంట కార్యకర్తలుగా తిరిగి ఆనక గుర్తింపు లేక దెబ్బతిన్న వాళ్ళుమరి కొందరున్నారు. అయితే, అందరూ క్రిమినల్ రికార్డ్సు వున్నవాళ్ళే అలాంటి వాళ్ళనే అప్పారావు ద్వారా పిలిపించాడు పరమహంస.
    
    ఇంతఖరీదయిన మందునిగానీ, గౌరవాన్ని గాని వూహించని వందమంది మందుసేవిస్తుంటే అందర్నీ చూస్తూ అన్నాడు పరమహంస.
    
    "తాజ్ మహల్ కి రాళ్ళెత్తిన కూలీల్ని మరిచిన జాతియిది. మోసే బోయిల్ని మరిచి పల్లకీల్లో ఊరేగుతూ ఎదిగిపోతున్న వ్యక్తులకి పట్టంకట్టే సంఘం యిది. అందుకే మీ గురించి నేను ఆలోచించింది. మీ బాగు కోసం ఈ ఉద్యమంప్ర్రారంభించింది కూడా అసలు మీరే లేకపోతే ఈ నేల ఎక్కడ, ఈ వ్యవస్థ ఎక్కడ.
    
    ఇంతసేపూ ఆయనకి సీతారామరాజుమీదే అభిమానం అనుకున్నవాళ్ళు ఇప్పుడు ఆ పెద్దమనిషి తమనీ అంతగా అభిమానిస్తున్నాడని తెలిసి పోయింది.
    
    "అసలు ఏ దేశప్రగతికయినా మూలస్తంభాలెవరు?"
    
    "మీలాంటిచదువుకున్నబాబులు" అన్నాడు అప్పారావు ఉద్వేగంగా.
    
    "అక్కడే పొరపాటు పడుతున్నారు "టక్కున ఖండించాడు పరమహంస "ఓట్లువేసేది మీరు.....పదవుల్ని అందించేది మీరు.....ఆ తర్వాత దోపిడీ చేయబడుతున్నదీ మీరే....."
    
    అక్కడకూర్చున్న వ్యక్తులమూర్ఖత్వం పై చెక్కుతున్న శిలాక్షరాల్లో ఒక్కో వాక్యాన్నీ సంధిస్తున్నాడు పరమహంస.    

 

    "అందుకే ఈ ప్రభుత్వం పడిపోవాలనీ ఒకనాడు సీతారామరాజు కలల్ని నిజం చేసి మమ్మల్నందర్నీ గద్దెనెక్కించాలని నేను నిర్ణయించుకుని ఆ సీతారామరాజు ఉద్యమాన్నే ప్రారంభింపచేసాను మీ నాయకుడు బ్రహ్మాజీ ద్వారా ముందు తనతో ఇదెలా సాధ్యం అన్నాడు నిస్వార్ధపరుడైన బ్రహ్మాజీ. అసలు తనకి పదవియెందుకు అంటూ పట్టుబట్టాడు.....నేను ఒప్పించాను. ప్రతి జిల్లాలోను మీలాంటి బాధితులువుండగా మీకు వందల సంఖ్యలో మనుషుల్ని కూడగట్టుకోగలిగే శక్తివుండగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎందుకు కష్టమా అంటూ నిలదీశాను. కంట తడి పెట్టుకున్నాడు బ్రహ్మాజీ......వెంటనే మిమ్మల్నిరప్పించాడు. మీరు ఒక్కొక్కరూ ఒక్కోవ్యక్తికాదు. ఒక్కో అణ్వాయుధం తెల్లవాడి తూటాలకు నేలరాలిన సీతారామరాజు గుండెల నుంచి చిమ్మిన రక్తబిందువులు మీరంతా....."
    
    ప్రతి వ్యక్తి గుండె ఆవేశంగా ఉబికింది.
    
    "మమ్మల్నేం చెయ్యమంటారో చెప్పండి" చెప్పలేదు పరమహంస.
    
    రాష్ట్రస్థాయి అల్లూరి సీతారామరాజు సంస్మరణ సంఘమొకటిమాటలతోనే స్థాపించి వెంటనే దానికి బ్రహ్మాజీని అద్యక్షుడ్ని చేశాడు. అరగంట వ్యవధిలో అక్కడ వున్న ప్రతి వ్యక్తికీ జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో" మీరంతా అమరవీరుడి ప్రతినిధులు' అంటూ తేల్చి చెప్పాడు.
    
    ప్రతిజిల్లాలోనూ రామరాజు స్మృతి చిహ్నంగా ఓ ఆగ్రహం ఆవిష్కరించబడాలి. దానికి విరివిగా విరాళాల్ని వసూలు సచేయాలి. ఉద్యమం ఉధృతం కావాలి. వారంరోజుల పాటుసాగిన ఉద్యమం సరిగ్గా ఏదో రోజున బంద్ దాకా విస్తరించాలి. ఆ రోజు కనీసం వంద దాకా ఆర్టీసిబస్సుల్ని తగలబెట్టాలి. కొన్నిచోట్ల 'రాస్తారోకో' పేరిట ట్రైన్స్ ఆపాలి. వీలైతే సీతారామరాజు ఎక్కువగా తిరిగిన విశాఖ జిల్లాలో ఓ పదిమందైనా పోలీసుకాల్పుల్లో మరణించాలి"
    
    వరుసగా తీర్మానాలతో బాటు ఒక్కో వ్యక్తికి డబ్బుసంచులూ అంద చేయబడ్డాయి.
    
    దానికోసం ముకుందం అకౌంట్ కాని నల్లడబ్బుని పది లక్షలదాకా అందచేశాడు(రేపు కొత్త ప్రభుత్వం వస్తే చక్రవడ్డీతో ఈ డబ్బంతా వసూలుచేసుకోవచ్చనేనమ్మకం అతడిది)
    
    "రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని కోఆర్డినేట్ చేసేది అప్పారావు. దానికింద జిల్లాల సంఘాలలో ఎప్పటికప్పుడు అప్పారావు మాటాడుతూ వివరాలు తెలుసుకోవాలి. ముకుందం డబ్బువిరజిమ్మి పత్రికల్లో విరివిగా పబ్లిసిటీ యివ్వాలి....." క్షణం ఆగాడు పరమహంస. "అలా అయితే రాష్ట్రశాంతిభద్రతలు పూర్తిగా విచ్చిన్నమైపోతాయి. ప్రజా జీవితం స్తంభించిపోతుంది. ముఖ్యమంత్రి రాజారాం ని ఓ అనర్హుడిగా భావించిన కేంద్ర ప్రభుత్వం అతడ్ని గద్దె దింపి ప్రజల ఆరాధ్యనాయకుడైన బ్రహ్మాజీకి పట్టం కడుతుంది. అప్పుడు మీరంతా పెద్దపెద్దపదవులు చేపట్టే ప్రజానాయకులైపోతారు"
    
    "అదెలాగ" అనకాపల్లి వీర్నాయుడు ఆశ్చర్యంగా అడిగాడు.
    
    "మేమింకా ఎమ్మెల్యేలుకాలేదు"
    
    "రేపు ఎలక్షన్లలో బ్రహ్మాజీ మీ అందరికి టిక్కెట్లు యిస్తాడు. అప్పుడిక అవకాశాలు మీవేగా...." పరమహంస నచ్చచెప్పాడు.
    
    అంతా ఆనందంగా చప్పట్లుకొట్టారుగాని కాస్త తెలివిమీరిన వీర్నాయుడికి యింకా అనుమానంగానే వుంది "బాపూ....... నిజమేనండి మీరిచ్చిన మందుకొట్టేసి సంచుల్లోని ఈ డబ్బు తీసేసుకుని మేం ఉద్యమం మాబాగానే సాగించేస్తాం. మా గొప్పతనం ఏటో సూపించడానికి యింకో కేటుగాళ్ళని కూడగట్టి చూసుకుంటాం. జిల్లాల్లో సెడుగుడు ఆడిస్తాం. యింకా సెప్పాలంటే బోలెడన్ని బస్సుల్ని తగలెట్టేస్తాం. మరి పోలీసుల కాల్పులు గట్రా మొదలెట్టి ఆ తూటాల మగ్గానితగిలి మాం సచ్చిపోతే....."
    
    "ఉద్యమం ఆగిపోతుంది" వెంటనే అన్నాడు పరమహంస" అంచేత మీరు చావకూడదు..... మీరు కల్లు పోయించిన జనం చావాలి. మీలాంటినాయకులు అలాటిసమయాల్లో వెనకనక్కేస్తుండాలి ....."
    
    ఈ అయిడియా నచ్చింది నాయుడికి" మరైతే బాపూ యిందలసిన్న సిక్కున్నాదండీ" ఏమిటది"
    
    "ఈమద్దిగాలంలో సేనాతూర్లు సూసినాను గందా. ఏదన్నా బంద్ లు జరిగినప్పుడు మనంబస్సుల్ని తగలెడుతుంటేపోలీసులు చూసిసూడనట్టు తలల్దిప్పేసుకుంటున్నారు. అలాటప్పుడు కాల్పులకి సేన్సు లేదుగదా అని....."
    
    "దారుణం" అరిచాడు బ్రహ్మాజీ ఆ దృశ్యం కళ్ళముందు మెదుల్తున్నట్టుగా "పోలీసులు అలాంటిబాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించడం అమానుషం మేం గర్హిస్తాం."
    
    పరమహంస టెంపో చెడకుండా అన్నాడు ఆవేశంగా" అవును నాయుడు. ఆలాంటప్పుడు మీరంతా సీతారామరాజుల్లా చెలరేగి పోలీసుల్ని ముఖ్యంగా పోలీసు అధికారుల్ని రాళ్ళతో బలంగా గాయపరచాలి. అంతే కాల్పులకి ఆదేశాలిస్తారు ..... ఇక కాల్పులు మొదలయ్యాయి అనగానే ...."
    
    "మేం వెనక నక్కియ్యాల.....సెబాసో"
    
    రేపురాబోయే మంత్రిపదవి దండలు డబ్బుకార్ల సీరియల్ గా గుర్తుకొస్తున్న నాయుడు రెండు క్షణాల తర్వాత అడిగాడు "ఆ తర్వాత....."
    
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
    
    "చనిపోయినపదిమందికోసం గగ్గోలుపెట్టే బ్రహ్మాజీక్షణం ఆగి అన్నాడు.
    
    "ఎనిమిదోరోజు నుంచి ఆమరణనిరాహారదీక్ష మొదలుపెడతాడు"

 Previous Page Next Page