Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 15

    విమలా శర్మలు లోపలికి వెళ్ళారు. వెండి స్థంభాలతో చేయించిన పెద్ద మండపంలో మధ్యగా వెంకటేశ్వరస్వామి వెండి విగ్రహం అటూ యిటూ- అలువేలుమంగా, బీబీనాంచారమ్మలు ఉన్నారు. ఒకవైపు సీతారామలక్ష్మణులు ఆంజనేయు లున్నారు. మరొకవంక రాధాకృష్ణులు విగ్రహాలూ వెండివే! పెద్ద పెద్ద వెండి పూజా పాత్రలు ఆ విగ్రహాల గోడలకు చిత్రపటాలున్నాయి. వైష్ణవమతం కాబోలు! పన్నిద్దరుల చిత్రపటాలూ ఉన్నాయి. గోదాదేవి తైలవర్ణ చిత్రం బాగా పెద్దగ వుంది. మరొకవైపు శ్రీకృష్ణుని రాసలీలలూ, కాళీయ మర్ధనమూ. మొదలైన చిత్రపటాలున్నాయి.    
    వింతగా చూస్తున్న విమలతో రాజవల్లి, "మీ తాతగారికి దైవభక్తి. ప్రతిరోజూ ఉదయం పురోహితుడు వచ్చి పూజచేసి ప్రసాదాలు ఇచ్చేవరకూ మంచినీళ్ళైనా తాగేవాడు కాదు. ఇప్పటికీ పూజ చేయిస్తూనే ఉంటాను" అంది.    
    శ్రీధర్ లెంపలు వాయించుకొని నమస్కారం చేశాడు. విమల చూసి బయటకు వచ్చేసింది.అది గమనించినా, మాట్లాడలేదు రాజవల్లి.    
    పూజ గదికి కొద్దిదూరంలో ఉంది వంటిల్లు. ఆ వంటశాల చూసి నివ్వెరపోయింది అన్నీ ఏవో పెళ్ళిళ్ళలో వాడే పాత్రలాలా పెద్దవిగాఉన్నాయి. "ఈఇంట్లో రోజూఇరవై మందిదాకా తినాలి తోట మాలీ, గదులు ఊడ్చేవాడూ, గిన్నెలుతోమే దాసీలూ, ఇలా చాలా మంది ఉన్నారు. చాకలి రోజూ వస్తాడు వాడికి రోజూ అన్నంపెడతాము." భావం అర్ధం చేసుకున్నట్లు చెప్పింది.    
    ఆ తరువాత విశాలమైన హాలు. గోడలు కొంతవరకు పాలరాతితో ఉన్నాయి. గచ్చుకూడా పాలరాయే. నిలువుటద్దాలు ఆ గదిలోనూ ఉన్నాయి పైన దీపాలు ఉంచేది వేలాడుతోంది కరెంటులేని కాలంలోది. దానిలో కొవ్వువత్తులు పెట్టటానికి వీలుగా అమర్చారు. ఒక్క దానిలో వంద కొవ్వువత్తులు అమర్చవచ్చు. చక్కని డిజైనులో అందంగా ఉంది.    
    "ఇప్పటికీ పాత వైభవానికి గుర్తుగా ఈ గదిలో కొవ్వువత్తులు వెలిగిస్తుంటారు నౌఖర్లు. ట్యూబ్ లైట్లు కూడా న్నాయి." అంది రాజవల్లి.    
    ఆ తఃరువాత నలుచదరంగా ఉన్న చిన్న సరస్సు ఉంది ఇంట్లోనే డానికి నాలుగు పక్కలనుంచీ గదులలోకి దారులున్నాయి.    
    "ఇది సరస్సా?" అప్పటి వరకూ మాట్లాడని విమల ఆశ్చర్యంగా అడిగింది.    
    "అవును మామూలుగా అంతలోతు వుండదు. కానీ, దానిఅడుగున ఒక చట్రం వుంది దాని ద్వారానే నీళ్ళు పైకి వస్తుంటాయి. ఆ చట్రం తీస్తే చాలా లోతట; "జాగ్రత్త! పక్కనుంచి రండి" అంది హెచ్చరింపుగా.    
    అప్పటికీ విమల ఆశ్చర్యం అణచుకోలేకపోయింది. "ఇంటిమధ్య ఇలాంటి కూపం వుంటే ప్రమాదం కదూ:"    
    "ప్రమాదమే! కానీ, ఆ రోజుల్లో ఆడవాళ్ళం ఈ గదుల్లోకి వచ్చేవాళ్ళం కాదు! మొగవాళ్ళ వ్యవహారాలేవో, ఇక్కడ జరిగేవి. అంచేత పిల్లలెవరూ అసలు ఇటు రారు. అదీగాక ఆ చట్రం ఎలా తొలగించాలో మీ తాతగారికి మాత్రమే తెలుసు. అందుచేత యింట్లో వాళ్లకి ప్రమాదం లేదు."    
    రాజవల్లి తెలిసి అందో, తెలియక అందో కానీ 'ఇంట్లోవాళ్లకి ప్రమాదంలేదు' అన్నమాట విచిత్రంగా వినిపించింది.    
    "ఆ తరువాతవి మా గదులు" అంది రాజవల్లి.    
    ఆ గదులన్నిటిలో ఉయ్యాల వుంది. అలా వుయ్యాల ఉన్నగదులు మూడున్నాయి. విశాలమైన ఆ గదులలో ఉయ్యాలకు ఒక పక్కగా ఆధునికమైన డబుల్ కాట్స్ ఉన్నాయి. వాటిపైన డన్ లప్ పరుపులు ; తెల్లటి దుప్పట్లూ అప్పుడే పరచినట్లు వున్నాయి. అక్కడ గోడలకు నిలువుటద్దాలే కాక రకరకాల ఫోటోలున్నాయి. అన్ని ఫోటోల్లోనూ వయసుమళ్ళిన ఒక మొగాయనకు రెండువైపులా ఇద్దరూ ఆడవాళ్ళున్నారు. ఒకావిడ నడివయసుది. మరోకావిడ చాలా చిన్నపిల్ల.    
    ఉయ్యాల బల్లమీద కూచునీ, పచ్చీసు ఆడుతూ, పూజ చేస్తూ, తోటలో తిరుగుతూ - ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఫోటోలు అన్ని ఫోటోలలోనూ అతనికి రెండువైపులా ఆడవాల్లిద్దరు ఉన్నారు.    
    అవి ఆశ్చర్యంగా చూస్తున్న విమలతో, "ఫోటోల్లో -మా అక్కయ్య నేనూ మీ తాతగారూ, మా అక్కయ్యకి పిల్లలు లేరని మీ తాతగారు నన్నుచేసుకున్నారు నాకు మీ నాన్న పుట్టారు. అప్పటి నుంచే మీ తాతగారికీ దశ అందుకొంది." అంది రాజవల్లి.

    తన అక్క మొగుడు, వయసు మీరినవాడు తనను చేసుకున్నాడు. అక్కకు పిల్లలు లేరని? ఈ విషయాన్ని ఎంత సామాన్యంగా చెపుతోంది ఈవిడ?    
    ఒక్కసారి మళ్ళీ ఆ ఫోటోలవంక చూసింది. అన్నీ ఫోతోల్లోనూ అక్క చెల్లెల్లిద్దరూ చిరునవ్వుతోనే కనపడ్డారు. వంటినిండా నగలతో బుట్టబొమ్మల్లా వున్నారు. ఒక్కరి ముఖంలోనూ బాధలేదు.    
    "భగవంతుడా! ఈ జాతి ఏనాటికయినా బాగుపడుతుందా!" అనుకొంది విమల.    
    అలా ఫోటోలలో అలంకరించబడిన మూడుగదులు దాటాక తోట లోకి వ్యాపించి విశాలమైన వరండా వుంది. అక్కడ పాలరాతి అరుగులున్నాయి. అని కూర్చోటానికే కాక, పడుకోటానికి కూడా వీలుగా వున్నాయి.    
    అక్కడ రెండు రోజులున్నాక చాలా విషయాలు అర్ధం చేసుకొంది విమల.    
    రాణి రాజవల్లి వితరణ శీలి ఎంతమాత్రం కాదు. పరమ పీనాసి. నయాపైసలా దగ్గరనుండి జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటుంది. ఒక పనివాడు వారంరోజులుగా పనిలోకి రాలేదని, వాడు జ్వరంగా ఉందని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా జీతం విరగ్గోడతానంది. ఆ మాటలు వట్టి బెదిరింపు మాటల్లాలేవు.    
    ఆ ఇద్దరుదాసీలు రాజవల్లిని వంతులవారీగా కనిపెట్టుకుని సకల సపర్యలూ చేసేవాళ్ళు. అందుకే వాళ్ళకు అన్ని సౌకర్యాలు.    
    రాజవల్లి తెల్లని పెద్దాపురం సిల్కు చీరలు కడుతుంది. అవికొంచెం పాతబడగానే తన దాసీలకు ఇచ్చేస్తుంది. అంచేత వాళ్ళకన్ని చీరలు ఆ దాసీలు మిగిలిన నౌకర్ల మీద పెత్తనం చేలాయిస్తారు. కసురుకుంటారు. ఈసడిస్తున్నట్లు మాట్లాడతారు.    
    ఏమి మానవ స్వభావామో! కొద్దిపాటి ఇస్వర్యం కళ్ళపడగానే తామంతా ఒకే జాతి అన్న విషయం పూర్తిగా మరచిపోతారు. ఆ దాసీలకు ఆ టౌనులో పెంకుటిళ్ళు ఉన్నాయట. తనకు సపర్యలు చేసేవాళ్ళు  విషయంలో చాలా ఉదారంగా ఉంటోంది రాజవల్లి. దీనినిబట్టే ఆవిడకుఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ బిగించాలో బాగా తెలుసుననుకోంది. ఈసంస్కారం ఈ కుటుంబాలలో జన్మతః వస్తుందేమో!    
    ఆ సాయంత్రం రాజవల్లి విమలను తనదగ్గర కూచోబెట్టుకుని ప్రారంభించింది.    
    "జరిగిందంతా నీకు తెలుసుగా, ఒక విధంగా మీతాతగారు కొడుకు మీద బెంగతోనే పోయారు. ప్రస్తుతం ఆస్తి అంతా నా పేరుమీదే ఉంది. కానీ దీన్ని అమ్మటానికి మాత్రం నాకు అధికారంలేదు. నా తదనంతరం మన వంశీకులాలో ఒకరికి ఈ సంపదనంతా అప్పగించాలి. అదీ ఆయన వీలునామా! పోతూ కూడా యీ పీనాసి తనమేమిటనుకోకు. అంత జాగ్రత్తగా కూడబెట్టబట్టీ యీ నాటికి ఇంత సంపదపోగయింది. నువ్వూ మనువడు గారూ ఇక్కడే ఉండి ఇదంతా చూసుకొంటే నా తదనంతరం ఇదంతా మీకే చెందేలా వీలునామా రాస్తాను." ప్రాధేయపూర్వకంగా దీనంగా అడిగింది.

 Previous Page Next Page