శంకర్రావు సిగరెట్ కాల్చడు. కొద్దిగా వంగి, ఆ సిగరెట్ ని పరీక్షగా చూసింది.
డన్ హిల్! సుధీర్ బ్రాండ్!
పాకెట్ ఇరవైరూపాయలు చేసే ఆ ఫారిన్ సిగరెట్లు తాగేది నర్సింగ్ హోమ్ లో సుధీర్ ఒక్కడే!
సిగరెట్ చేతిలోకి తీసుకుని తెలియని దేనికోసమో మంచంమీద వెదికింది శశి మంచం కోడుకి గడ్డకట్టి, నలుపురంగుకి తిరిగిపోయిన రక్తం!
వెంటనే శారద మొహానికున్న బాండేజి గుర్తొచ్చింది శశికి. మొహం వివర్ణమయింది.
పరుపుమీద ఎర్రటి, సన్నటి రక్తపు చార ఇంకోటి కనబడింది. తడిమి చూసింది.
అది రక్తపు చార కాదు - పగిలిపోయిన ఎర్రటి మట్టిగాజు!
ఆ గాజూ, సిగరెట్ పీక తీసుకుని, లైటార్పేసి మెట్లు దిగడం మెదలెట్టింది శశివదన.
* * *
శంకర్రావు మాట్లాడుతూనే వున్నాడు. శారద వింటూనే వుంది. రాత్రి పదయిపోయింది. అతని మాటలు వింటోంది గానీ, ఆ మాటల్ని పూర్తిగా అర్ధం చేసుకోలేక పోతోంది శారద. అతను పలుకుతున్న ఒక్కొక్క పదం ఇదివరకు అతనేసందర్భాల్లో వుపయోగించాడో ఆ సన్నివేశాలూ, ఆ సంతోషం, ఇష్టంగానే జరిగిన వాదనలూ, ప్రతివాదనలూ, అలకలూ, హద్దుమీరని కోపాలూ అవన్నీ గుర్తొస్తున్నాయి...అన్యమనస్కంగా వింటోంది. ఆలోచిస్తూంది.
అతను మామూలప్పుడు ఎంత మితభాషిగా వుంటాడో, సంతోషంగా వున్నప్పుడు అంత వాగుడుకాయలా అయిపోతాడు. బయట అందరి దగ్గరా పిల్లిలా వుండే శంకర్రావు శారద దగ్గర పులే అయిపోతాడు.
ఇవాళ అతను మహా సంతోషంగా వున్నాడు. మూడురోజులు - మూడురోజుల పాటు శారద దగ్గర లేకుండా గడిపాడు తను! మూడురోజుల విరహం తరవాత ఆమెకి దగ్గరగా కూర్చుని మాట్లాడగలుగుతున్నాడు. ఆ సంతోషం అంతా బయట పెట్టెయ్యాలని వుంది అతనికి.
ఆమె మెడ వంపులో తల దాచుకుని, ఒత్తుగా వున్న ఆమె జుట్టు సహజమైన సువాసన వెదజల్లుతూ తన మొహాన్ని కప్పేస్తూ వుంటే, గుబురు ఆకుల్లో దాక్కున్న కోకిల నిర్భయంగా గొంతెత్తినట్లు చెప్పడం మొదలెట్టాడు.
"శారదా! నా శారదా! మూడ్రోజులు నువు దగ్గర లేకపోతే ఎంత దిగులు పడిపోయానో తెలుసా? ద్వీపాంతర వాసం, దేశ బహిష్కరణ అని ఆ శిక్షలు విధించే వాళ్ళుట ఇదివరకు. నిన్ను వదిలి వుంటే ఆ శిక్షలు అనుభవించినట్లే వుంది నాకు. నువ్వంటే నా కెందుకింత ఇష్టం శారదా! శారదా! నా శారదా!"
"అబ్బ!" అంది శారద, అతని కౌగిటి బిగువు భరించలేక. అతని సంతోషం చూస్తే ఆమెకి ఆనందంగా వుంది. తను చనిపోయాక అతను ఏమైపోతాడో అని ఆదుర్దాగానూ వుంది. మలినమై పోయిన తన శరీరాన్ని తలుచుకుంటే దుర్భరంగానూ వుంది.
విషం బాటిల్ గుర్తొచ్చింది.
"శారదా! నా శారదా! ఇవాళ ఎంత సంతోషంగా వుందో తెలుసా?"
దిగులుగా చిరునవ్వు నవ్వింది శారద.
"శారదా! ఇదివరకు నేను ఎప్పుడూ దేముడ్ని తిట్టుకుంటూ వుండేవాణ్ణి. ఎందుకో తెలుసా? నేను ఆగర్భ దరిద్రున్ని శారదా! అనాధని! నాకు తల్లి లేదు. తండ్రి లేడు. వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఎంగిలి మెతుకులు తిని బతికాను. ఒక సంవత్సరం వాళ్ళూ, ఒక సంవత్సరం వీళ్ళూ దయతలచి చదివిస్తే, హైస్కూలు పూర్తిచేశాను. శారదా! శనివారం రాత్రిళ్ళు భోజనం మానేసి అర్ధాకలితో ఉంటారు కొందరు పుణ్యం కోసం! కానీ నేను ప్రతిరోజూ శనివారం లాగే అర్ధాకలితో గడిపాను. నేను బాగుండను. అద్దం నాకు అర్ధమయ్యేలా చెప్పింది. దేముణ్ణి ఎంత తిట్టుకునేవాడినో! దేముడా! నాకు అందం ఎందుకు ఇవ్వలేదు? అన్నం ఎందుకు ఇవ్వలేదు? దేముడా! నాకు తల్లిదండ్రుల్ని ఎందుకు ఇవ్వలేదు? దేముడా నాకు చదువెందుకు ఇవ్వలేదు? చదువక్కర్లేని డబ్బెందుకు ఇవ్వలేదు? -రోజూ ఇలా దేముడితో మవునంగానే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ ఉంటే, ఆయన భయపడి పోయి వీటన్నిటికీ బదులుగా నాకు నిన్నిచ్చాడు, శారదా! శారదా! నువ్వే నాకు తల్లీ తండ్రీ! నువ్వే నాకు బంధువ్వి, గురువ్వి, దైవానివి! నువ్వే నాకు అన్నం, నీళ్ళూ, డబ్బూ, దస్కం - అన్నీ! నిన్ను పెళ్ళి చేసుకున్న తరువాత నేను కూడా మనిషిగా చలామణి అవుతున్నాను శారదా!"
ఆమె చెంపల్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు శంకర్రావు.
శారద కళ్ళల్లోంచి నీళ్ళు చెంపలమీదుగా కారి అతని చేతుల్ని తడితడిగా చేస్తున్నాయి.
"శారదా! ఏడుస్తున్నావా?" ఆశ్చర్యంగా అడిగాడు శంకర్రావు.
"ఎంత ఇష్టం మీకు నేనంటే!"
"మరి నీకో?"
శారద కాసేపు మవునంగా ఉండిపోయింది.
"నాకు మీలాగా మాటల్లో చెప్పడం చేతకాదు.
"పోనీ చేతల్లో చెప్పు!" అన్నాడు శంకర్రావు నవ్వుతూ.
తల అడ్డంగా ఊపింది శారద. "ఉహూ! ఇవాళ వద్దు! నాకు వంట్లో అంత బాగా లేదు. మీరు మాట్లాడుతూనే ఉండండి.. వింటాను."