"శశి ఎంతటి అందగత్తో నీకు తెలుసు. ఏ మగాడికైనా ఆమెను చూస్తూనే తెగులు పుడుతుంది. నేను ఊర్లో లేకపోవడం ఎవడైనా అడ్వాంటేజ్ చేసుకుని ప్రయత్నించవచ్చు. ఇలాంటిది జరక్కుండా చూడాలి."
ఎంతలేదనుకున్నా ఆ వాక్యాలు చెప్పడానికి అతను చాలా ఇబ్బందిపడ్డాడు
"ఈ సాయం చేసి నా శశిని నాకు భద్రంగా అప్పగించావనుకో. నేను తిరిగి వస్తూనే ఎంతిస్తానో తెలుసా? రెండు లక్షలు. టూ లాక్స్ ఎఫెక్ట్ కోసం అన్నట్టు రెండు లక్షలన్నమాట కాస్త గట్టిగా నొక్కి చెప్పాడు.
"ఆరునెలలపాటు మీ భార్యను జాగ్రత్తగా చూసుకున్నందుకు, ఏ మగాడి నీడా ఆమెమీద పడకుండా చూసుకున్నందుకు రెండు లక్షలు ఇస్తున్నారంటే, మీకు ఆమెమీద ఎంత ప్రేముందో అర్థమౌతోంది. మీరింక నిశ్చింతగా వెళ్ళిరండి. శశమ్మను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది" అన్నది గంగారత్నం.
తన మాటల్ని ఆమె అపార్థం చేసుకోకుండా వున్నందుకు అతనికి సంతోషం వేసింది. తను ఏమీ తప్పు చేయడంలేదన్న భరోసా చిక్కింది.
ఓ అయిదు నిముషాల తర్వాత అతను భరోసాగా ఫీలవుతూ "రెండు లక్షలు రేపే ఇచ్చేస్తాను. నీమీద నాకా నమ్మకం ఉంది." అన్నాడు.
"ఆ డబ్బు నాకొద్దు బాబూ" ఆమె గొంతులోని స్థిరత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
"అవును బాబూ! ఆ డబ్బుని నేనేం చేసుకోగలను? ముసల్దాన్ని. అయితే ఒక్కమాట. ఎప్పట్నుంచో నాకు ఓ కోరికుంది. నాలా ఏ ఆధారమూ లేకుండా గాలికి కొట్టుకొచ్చిన విస్తర్లా ఆధారంకోసం చూసే అనాథ స్త్రీలకోసం ఓ ఆశ్రమాన్ని నిర్మిస్తాను. అందుకోసమని మీరిచ్చే రెండు లక్షల రూపాయల్ని వెచ్చిస్తాను ఆశ్రమంకోసం భవనాల్ని నిర్మిస్తాను. స్థలం అంటారా? మీలాంటి ఏ ధర్మదాతో యివ్వకుండాపోడు" అన్నది.
ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతయింది, డబ్బుకోసం ఎలాంటి మోసాలకైనా సిద్ధపడుతున్న మనుష్యుల మధ్య మెలుగుతున్నాడు. అలాంటిది ఓ పేద ముసలామె తనకొచ్చే రెండు లక్షల్తో ఓ ఆశ్రమాన్ని కట్టిస్తానంటే అతనికి మొదట నమ్మబుద్ధికాలేదు. తనేదో తప్పుగా విన్నానేమో అనిపించింది. తీరా అది నిజమని తెలిశాక ఆమెమీద గౌరవం పెరిగింది.
"మీరు నిశ్చింతగా వెళ్ళిరండి బాబూ! మీరు తిరిగి వచ్చేటప్పటికి మీ శశిని తిరిగి పువ్వుల్లో పెట్టి యిస్తాను" అంది గంగారత్నం ఎంతో నమ్మకంగా.
తన గుండెలమీదున్న బరువును దించేసినట్టు పీలయ్యాడతను. వెంటనే నిద్ర ముంచుకొచ్చింది అతనికి. సరిగ్గా అదే సమయంలో చింతామణి కూడా సురేష్ వర్మ తనకు అప్పగించిన పని గురించే ఆలోచిస్తోంది.
గంగారత్నం ఆ ఇంట్లో వుండటం ఒక్కటే ప్రతికూలంగా వున్న విషయమని తెలిసిపోయింది.