"అన్యాయం. కష్టం నాది, ఫలితం నీకునా" అన్నాడు సిద్ధార్థ.
అతని మాటలకి ఆమె నవ్వింది.
"నీ కష్టానికి బుణం వుంచుకోనులే, మంచి ప్రజంటేషన్ ఇస్తాను."
"అంత మంచి బహూమతి ఏమిటో?"
ఇందిర మూతిని మూడు ఒంకర్లు తిరిగోపోయేలా చూస్తూ అంది అతనితో-
" నీ కిష్టమైన తియ్యని లడ్డూలు. అంతకంటే తియ్యని చాక్లెట్స్. చాలా ?" అంది ఇందిర.
"ఎప్పుడిస్తావో చెబితే రెండు రోజులు భోజనం చేయకుండా ఎదురు చూస్తాను,"
చిన్నగా నవ్వాడతను.
"మా అమ్మ ఊళ్ళో లేనప్పుడు!" ఆమె పెదవులను తడిచేసుకొంటూ చెప్పింది.
సిద్ధార్థ ఆమె మాటలకి ఉలిక్కి పడ్డాడు.
"ఏమో అనుకొన్నాను గడసుదానివే!"
"మరి నీలా పప్పుసుద్దనుకొన్నావా?" అని పకపకమని నవ్వింది. ఆమె నవ్వుతో అతను శృతి కలిపాడు.
అదే అతను చేసిన తప్పు గుమ్మంలో గజలక్ష్మి భద్రకాళిలా నించుని వుంది కళ్ళలో నిప్పులు చెరుగుతూ.
"ఇందూ!" ఖంగుమంది గజలక్ష్మి గొంతు.
ఆగొంతు వినడంతో టే బిక్కచచ్చిపోయారు ఇందిర, సిద్దార్థ.
" ఈడొచ్చిన పిల్లవి. సిగ్గూ సెరం ఉండనక్కర్లా?" ఆ ముష్టి వెధవతో ఏమిటే ఆ వికవికలు, పకపకలు...."
సిద్దార్థకి ముచ్చెమటలు పోస్తున్నాయి.
గజలక్ష్మి తీక్షణంగా చూసిందతనికేసి.
ఈ చూపులోని తీక్షణతకి తను మాడి మసైపోతానా అన్నంత భయం. కలిగి వణికోపతోయాడు సిద్దార్థ.
"పూట గడుపుకోడానికి వచ్చిన ముష్టి వెధవ్వి. నా బిడ్డని తెలివి తక్కువదాన్ని చేసి మత్తుమందు పెట్టడానికి చూస్తున్నావా? త్రాష్టుడా!"
"నీ మొహానికి వారానికో పూట భోజనం కాదురా పెట్టాల్సింది. మొహాన పేడనీళ్ళు చల్లాలి. నలుగురికీ చెప్పి, నాలుగుపూటల్ని ఒదటగొట్టి నీ మొహం ఈ పేటలో కనబడకుండా చేస్తాను" అని కూతురు వేపు తిరిగింది.
" ఏమే! సిగ్గులేనిదానా! యింకా యిక్కడే తగలడ్డావే. లోపలికి పో.... " అరిచింది.
కానీ ఇందిర కదలలేదు.
" అతనేం చేశాడని అలా తిడుతున్నావు?" అంది ఇందిర.
దాంతో గజలక్ష్మికి శివమెత్తింది. కూతురు ఎదురు చెప్పడంతో మండిపడుతూ సిద్దార్థ కేసి తిరిగింది.
" ఇదిగో ముష్టి సన్నాసీ! నీకిదే చెప్పడం. నీకు ఇదే ఆఖరిరోజు నా ఇంట పిండాకూడు తినడానికి. నీకిక వారం లేదూ, నెలా లేదు ఇంకె ప్పుడూ ఈ గడప తొక్కకు మళ్ళీ ఈ ఛాయలకొచ్చావంటే కాళ్ళు విరగ్గొడతాను."
సిద్దార్థ మెల్లగా నోరు విప్పాడు.
"అది కాదమ్మా ఇందిరకి లెక్క తెలీకపోతే" చెప్పబోయాడతను.
తల్లికేసి కోపంగా చూస్తోంది ఇందిర. కానీ ఏమీ చేయలేని స్థితి. సిద్దార్థని ఆమె తిట్టిపోస్తోంటే మాత్రం ఇందిరికి చాలా బాధగా వుంది. ఏడుపొస్తోంది. తన మూలంగా అతన్ని తల్లి తిడుతోంది . కానీ అది చాలా అన్యాయంగా తోస్తోంది ఇందిరకి.
" మాట్లాడకు నీ బోడిలెక్కలు నాకూ వచ్చు. అది నన్నడక్కగానీ నీ మాత్రం నేనూ చెప్పగలను. నీ ముష్టి లెక్కలు. ఇదిగో అబ్బాయ్ నేను మంచిదాన్ని కాబట్టి సరిపోయింది లేకపోతే నీకు గుండు కొట్టంచి సున్నపు బొట్లు పెట్టేదాన్నీ."
అయినా ఆడపిల్లలు వున్న ఇంటికి అడ్డమైన గాడిదల్ని రానివ్వకూడదన్న జ్ఞానం ఆ మనిషి కుండాలి.
" అమ్మా చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు.ఇందిరకిగానీ, నాకుగానీ ఏపాపం తెలీదు.
తెలీని లెక్కని అడిగితే చెప్పాను. అనవసరంగా గొడవచేసి అల్లరి కావద్దు.
"నేను అనాధని. నాకు పరవాలేదు నలుగురూ వింటే ఆడపిల్ల పరువేం కావాలి."
" ఓరి ఓరి ఓరి..... ముదనష్టపు వెధవా! ఎంతకి తెగించావురా. నా బిడ్డ మర్యాద గురించి నాకే చెబుతున్నావా! ఓయమ్మో తెలిసిందిరో! నువ్వు మామూలు మనిషవికావు, గుండెలు తీసిన బంటుని నన్నే బెదిరిస్తున్నావా? నీ కళ్ళు పోను.
నీ చేతులు విరిగిపోను" గజలక్ష్మి నోటికి ఆనకట్ట తెగింది.
పక్క ఇళ్ళలోంచి అమ్మలక్కలు గోడ దగ్గరికి చేరి చోద్యాన్ని తిలకిస్తున్నారు ఆ వాడలోనివాళ్ళు.
సిద్దార్థ ఎంత మంచి కుర్రాడో వాళ్ళందరికీ తెలుసు. గజలక్ష్మి నోటి దురుసుతనానికి విస్తుబోతున్నారు.
సిద్దార్థ కళ్ళలో నీరు తిరిగింది. పట్టెడు అన్నం పెడుతోందని వచ్చాడే తప్ప పుట్టెడు శాపనార్దాలు పెడుతోందని రాలేదు. వూహించని అవమానం జరిగేసరికి భరించలేకపోయాడు.
అతను మెల్లగా కదిలాడు వెళ్ళిపోడానికి.
"పోరా పో. వారాలు చేసుకొని పొట్ట గడుపుకోడానికి లేని నా మర్ద కాస్త మందలించేసరికి పొడుచుకొచ్చింది. బోడి సన్నాసి పో" విదిలించి కొడుతూ అంది గజలక్ష్మి.
గుమ్మం దాటుతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు సిద్ధార్థ.
గజలక్ష్మి కూతురి నెత్తిన మొట్టికాయలు వేస్తోంది. సిద్దార్థ వీధి గుమ్మంలోంచి బయటకిరాగానే ఆ పక్కంటి ఆవిడ పార్వతమ్మ అతని దగ్గరగా వచ్చింది.
" అంతా విన్నాను బాధపడకు నాయనా! దాని నోరే ఆంత. పద, రెండు మెతుకులు నా ఇంట్లో తిని వెళుదుగాని" అంది పార్వతమ్మ.
ఆమె ఔదార్యానికి అతనికి ఏడుపొచ్చేసింది.
ఆమె కేసి ఒక్కసారి చూశాడు.
సాక్షాత్తు పార్వతీదేవిలా కనబడింది ఆమె అతని కళ్ళకి.
ఆమెకి రెండు చేతులెత్తి నమస్కారం చేసి వడివడిగా నడుస్తూ వెళ్ళిపోయాడు సిద్దార్థ.
6
అభనయ్ సిగరెట్ పెట్టె కొనుక్కొంటూ వెనక్కి తిరిగిచూశాడు.
ఇందిరా వెళుతోంది.
సన్నగా ఈల వేశాడు.
ఆమె అతన్ని చూసింది.
అతను ఆమె దగ్గరగా వెళ్ళి " ఇందూ, సిద్దార్థ వచ్చివెళ్ళాడా?అడిగాడు.
ఆరోజు సిద్దార్థకి కొండలరావింట్లో భోజనం అని అభినయ్ కి తెలుసు.
" ఆ వచ్చాడు..... వెళ్ళాడు" అంది నిట్టూరుస్తూ ఇందిర.
"అభినయ్ కి ఆ సమాధానం నచ్చలేదు."
"ఏం అలా అంటున్నావు" నోరు పారేసుకొంటే వెళ్ళిపోయాడు. బొంగురుపోయింది. ఇందిర గొంతు."
ఆపిల్ల కళ్ళల్లో నీరు సుడులు తిరుగుతోంది.
"సరే. నువ్వెళ్ళు" అన్నాడు సిగరెట్ వెలిగించుకొని మెల్లగా ఇంటికేసి నడిచాడు అభినయ్.
"ఏం నాయనా, బలాదూరు తిరగడం పూర్తయిందా?"