Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 15

                                    

                                           అరెరే దమ్మిడీ

అరెరే దమ్మిడీ దొరికింది
దాన్తో యేమిటి చేస్తావు?
దీన్తో పలక కొంటాను
నాకో బలపం కొంటాను
ఇంకా ఏమిటి కొంటావు?
నేనో రెక్కల ఏనుగు కొంటాను
గజ్జెలగుర్రం కొంటాను
ఇంకా ఏమిటి కొంటావు?

అక్కడ రాజుగారి కూతుర్నే కొనేస్తాను
ఆమెను నా సంతలో పడేస్తాను
తాళిబొట్టు మూడుసార్లు ముడేస్తాను
ఆ తర్వాత?
ఏనుగుమీద ఆకాశంలో
ఇద్దరం షికార్లు చేస్తాము
ఓరోరి యెర్రి నాయనా
యెంతసేపూ సొంతగొడవేనా?
ఈ ప్రపంచం కోసం
ఏమైనా చేయలేవూ?
ఊ! ఎందుకు చెయ్యలేను
విలువైనది నా దమ్మిడీ
వెలకందనిది నా దమ్మిడీ
దీన్తో బాంబులు కొంటాను
దీన్తో చాకులు కొంటాను తు
పాకులు కొంటాను
దీన్తో టాంకులు కొంటాను
దీన్తోవిమానాలుకొంటాను
అన్నీ పేదోళ్లకి పంచిపెడతాను
లేనొళ్ళకి పంచిపెడతాను
కూలీలకి సరఫరా చేస్తాను
రైతోళ్లకి సరఫరా చేస్తాను
చేసి?
ప్రజాసేవ నిర్మిస్తాను
ప్రజాయుద్ధం ప్రకటిస్తాను
పెదలతో సాదలతో
చిన్నలతో పెద్దలతో
కూలోళ్లతో రైతోళ్లతో
సేనలోన నేనూ ఒక    
సిపాయి నవుతాను
లడాయి చేస్తాను
ఎర్రకోట రగిలిస్తాను
యెర్రజండా ఎగరేస్తాను

అన్యాయాలు హతమారుస్తాము
అక్రమాలు పరిమారుస్తాము
ఈ ప్రపంచాన్ని మారుస్తాం
పరిపాలిస్తాం
సమసమాజమే రూపొందిస్తాము
నవ సమాజమే మీకందిస్తాము

                                                                                            రచన:3-3-1974
                                                                 ముద్రణ:సృజన మాసపత్రిక - జూన్, 1975

 Previous Page Next Page