Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 15


    స్టేడియంలో లయబద్ధంగా పరుగెడుతున్న అన్వితవైపే చూస్తున్నాడు మధు.

 

    ఒకర్ని ఒకరు గుర్తుపట్టలేని దూరం.....

 

    ఒక్కొక్కప్పుడు  దూరం, మనసుకు భారంగా వుంటుంది. ఆ భారాన్ని భరించడం చాలా కష్టం.

 

    మధుకి విష్ చేయాలని ఉంది. ఆమె ఎదురుగా వెళ్ళాలని వుంది, గబగబా మెట్లు దిగాడు. ఆమెవైపు నడుస్తున్నాడు. సరిగ్గా ఆమె కూడా అతనివైపే పరిగెత్తుకుని వస్తోంది.

 

    పాద ధ్వనులలో మట్టి లయ.....

 

    ఆ సమయంలో అక్కడ మధుని చూడగానే ఆశ్చర్యపడింది అన్విత.

 

    "హలో! మీరు ఇక్కడ...."

 

    చిరుచెమట పట్టిన ఆమె ముఖాన్ని, సన్నని చిరుగాలికి ఎగురుతున్న జుత్తును, తెల్లటి డ్రస్ లో మిలమిల మెరుస్తున్న ఆమె వంటివైపు చూస్తున్నాడతను.

 

    "అవును...... నేను ఇక్కడ....." టెలిగ్రామ్ భాషలో అన్నాడు మధు.

 

    "జాగింగ్ ఇక్కడికే  వస్తారా?"

 

    "అవును..... వాకింగ్ కు వస్తాను....." మళ్ళీ టెలిగ్రామ్ భాష.

 

    "రోజూ కాలేజీలో కల్సుకోవడం.... ఇక్కడ కూడా కల్సుకోవడం.... బావుంటుంది కదూ.... సీయూ" అనేసి తెల్లపావురంలా ముందుకెళ్ళిపోతున్న ఆమెవైపే అరవిరిసిన కళ్ళతో చూస్తుండిపోయాడు మధు.

 

    లవ్ ఒక స్వీట్ పాయిజన్ లాంటిది. ఒకసారి ఆ ప్రేమ భావన మనసులో విత్తనంలా నాటితే, ఆ లేతమొక్క మహావృక్షమవుతున్న ప్రతిక్షణం, దుస్సహమైన అసహనం, తీపి, బాధ..... అలాంటి బాధావస్థలోనే వున్నాడు మధు.

 

    జాగింగ్  చేస్తూ ముందుకెళ్ళిపోతున్న అన్వితను చూస్తూ, వెనక్కి మరలాడతను.

 

    అతనికిప్పుడు ఆనందంగా వుంది.

 

    కిటికీ తెరవగానే ఇంద్రధనుస్సు కన్పిస్తే ఎలా వుంటుందో లా వుంది అతని మానసిక పరిస్థితి.

 

    రోడ్డు పక్కన టీబడ్డీ దగ్గర టీ తాగి, హాయిగా సిగరెట్ కాల్చుకోవాలని పించింది. అటూ ఇటూ చూసి ఒక బడ్డీవైపు నడిచి సిగరెట్ తీసుకుని, టీ ఆర్డర్ చేసి కూర్చున్నాడు. అతని ఎదురుగా ఒక వ్యక్తి అదేపనిగా మధువైపు చూస్తున్నాడు. చిన్న పిల్లిగడ్డం -  మనిషి సన్నగా, పోడవుగా వున్నాడు.

 

    అప్రయత్నంగా మధు  చూపులు అతనిమీద పడ్డాయి.

 

    అవునా? కాదా? సంశయం.

 

    "భయ్యా! మీరు..... మీరు...... మధు కదూ....." దగ్గరగా వస్తూ అడిగాడతను.

 

    ఆ గొంతు వినగానే గుర్తుకొచ్చింది మధుకి, ఆ వ్యక్తి ఎవరో. సరసాగా ఫడేల్మని అతని చెంపమీద ఒక దెబ్బ కొట్టాడు మధు.

 

    "మీరు....మధూయే.... యాద్ ఆగయా....." అన్నాడతను ఆనందంగా.

 

    "మధూ! బాగున్నారా? ఎన్నాళ్ళకెన్నాళ్ళకు...." ఏదో అనబోయాడతను.

 

    "మళ్ళీ కొట్టనా..... లేకపోతే...."

 

    "నేనేం చేశాను! ఆ కొట్టడం అలవాటు నీకు పోలేదా?" అన్నాడు అతను.

 

    "మీరేంట్రా..... మీరు- నువ్వు, నువ్వు అనుకున్న స్నేహం మనిది. కొన్నాళ్ళపాటు కల్సుకోకపొతే, మీరు.... మీరూ అయిపోతుందా..... ఏం చేస్తున్నావ్? ఎలా వున్నావ్?" గబగబా ప్రశ్నలు వేశాడు మధు.

 

    అతని పేరు సుల్తాన్. మధు డిగ్రీ రోజుల్లో అతని రూమ్మేట్. పరిస్థితుల కారణంగా చదువుకు పుల్ స్టాప్ పెట్టేసి బిజినెస్ లోకి దిగాడు సుల్తాన్.

 

    "ఆ సమయంలో నువ్వు గనుక, నాకు హెల్ప్ చేసి ఉండకపొతే ఏమైపోయే వాణ్ణి? నీ గోల్డెన్ చెయిన్ అమ్మి - నా బిజినెస్సుకు పెట్టుబడి పెట్టావు గుర్తుందా?"

 

    జ్ఞాపకం చేశాడు సుల్తాన్ కృతజ్ఞతగా.

 

    "ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు చెప్పు? ఎలా వున్నావ్? ఏం చేస్తున్నావ్? అడిగాడు మధు ఆప్యాయంగా.

 

    "చెప్పడం ఎందుకు? చూద్దుగాని రా!" అంటూ టీ షాపువాడికి డబ్బులిచ్చేసి మధు చేతిని పట్టుకుని ముందుకు తీసికెళ్లాడు సుల్తాన్.

 

    రెండు సందుల తర్వాత కార్నర్ దగ్గర ఆగి "మధూ- తలెత్తి ఆ బోర్డువైపు ఒకసారి చూడు-" అన్నాడు సుల్తాన్.

 

    మధు తలెత్తి చూశాడు.

 

    అతనికి ఒక్కక్షణం నోటిమాట రాలేదు. నిశ్చేష్టుడైపోయాడు.

 

    "మధు మోటార్ రిపేరింగ్ షాపు"

 

    "నీ గుర్తుగానే నీ పేరుమీద పెట్టుకున్నాను. అవునుగానీ- నువ్విక్కడ ఏంటీ?"

 

    చెప్పాడు మధు.

 

    అప్పట్లో మధు, సుల్తాన్ కి వ్యాపారంలోనే కాదు, జీవితంలో కూడా చాలా సహాయం చేశాడు. సుల్తాన్  పక్కింటి అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పెళ్ళికి పెద్దగా  వ్యవహరించాడు కూడా.

 

    "పెళ్ళయిందా?"

 

    "లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను" చెప్పాడు మధు."

 

    "ఎవర్నయినా ప్రేమించావా? అదీ లేదా!" నవ్వుతూ అడిగాడు సుల్తాన్.

 

    నవ్వాడు మధు.

 

    "దారిలో పడ్డావన్న మాట. ఎవరా అమ్మాయి?" అడిగాడు ఉత్సాహంగా సుల్తాన్.

 

    "టైమింగ్స్ ఏమిటి?"

 

    "మార్నింగ్ పది నుంచి అర్థరాత్రి వరకు."

 

    "ఇవాళ నువ్వు కాలేజీకి సెలవిచ్చెయ్ - వచ్చెయ్- నీ ప్రేమకథ వినాలని వుంది" అన్నాడు సుల్తాన్.

 

    "లేదు. మధ్యాహ్నం వస్తాను. కాలేజీకి వెళ్ళక తప్పదు" అన్వితను గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు మధు.

 

    "నీకోసం ఎదురు చూస్తుంటాను" అన్నాడు సుల్తాన్.

 

    సుల్తాన్ అనుకోకుండా కలవడం మధు మనసుకు ఆనందాన్ని ఇచ్చింది.

 

    కాలేజీలో కెళ్ళగానే పార్కింగ్ వేపు చూశాడు మధు. అన్విత కారు కనబడలేదు. రవి, రమణ, బుచ్చిబాబు ఎవరూ కనబడలేదు. క్యాంటిన్ లో కాసేపు కాలక్షేపం చేసి క్లాస్ రూమ్ లో కెళ్ళాడు. రెండు క్లాసులు గడిచాయి. లెక్చరర్లు చెప్తున్నది తలకెక్కడం లేదు. డోర్ వేపు చూస్తూ అసహనంగా గడుపుతున్నాడతను. మైదానం నారాయణ మధ్యాహ్నం ఫస్ట్ పిరియడ్ కొచ్చాడు.

 

    "డియర్ స్టూడెంట్స్..... నోట్ డవున్ ద కొటేషన్Management must have a purpose, a dedication and that dedication must have an emotional commitment. It must be built in as a vitalpart of the personality of any one who truly is a manager.

 

    ఆ కొటేషన్ ఎందుకో నచ్చింది మధుకి.

 

    Management బదులు Love అని, Manager దగ్గర Lover అని రాసుకున్నాడు. ఆ కొటేషన్ ని ఒకసారి చదువుకున్నాడు. సంతృప్తిగా వుందతనికి. అన్విత ఇక ఆరోజు కాలేజీకి రాదనీ తెలిసిపోగానే సడన్ గా లేచి నిలబడ్డాడు.

 

    "ఇంకా టెన్ మినిట్స్ వుంది. కొటేషన్ తో క్లాస్ అయిపోయిందనుకున్నావా?" సీరియసై పోయాడు మైదానం నారాయణ.

 

    "లేద్సార్..... తలనొప్పిగా వుంది."

 

    "నా క్లాస్ అంటే అందరికీ తలనొప్పే. ఆ కెమిస్ట్రీ మేడమ్ క్లాస్ కి అందరూ ఎగబడి వెళతారు..... వెళ్లిపో...." అని నారాయణ అనగానే పరుగు, పరుగున బయటికి వచ్చేశాడు మధు.

 

    ఆటోని పిలిచి కూర్చుని, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు.

 

    ఆటో సర్రుమని ముందుకు కదిలింది.

 

    ఊరు చివర చిన్న రెస్టారెంట్- దూరంగా చిన్న ఏరు. అక్కడికి తీసుకెళ్ళాడు మధుని సుల్తాన్.

 

    "పూర్వకాలంలో ఇక్కడో చిన్నకోట వుండేదిలే. మిగిలిన భాగంలో ఎవరో ఈ హొటల్ పెట్టారు. నీకిలాంటి వన్నీ ఇష్టం గదా- అందుకే తీసుకొచ్చాను" ఉపోద్ఘాతంలా చెప్పి, రెండు కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసి "ముందు నీ  ప్రేమకథ చెప్పు" అని అడిగాడు ఉత్సాహంగా సుల్తాన్.

 

    మనిషి తన ముఖాన్ని చూసుకోవడానికి అద్దం ఎలా అవసరమో, మనసుని తట్టి లేపడానికి ఇంకో మనసు కూడా అవసరమే. ఆ అవసరాన్ని  చాలామంది గుర్తించరు. మధుకి, సుల్తాన్ అద్దంలా కనిపించాడు. అన్వితను చూసిన తోలిక్షణం  నుంచి, తన మనసులో కదిలే, అస్పష్ట భావప్రకటనల గురించి తన భాషలో చెప్పాడు మధు.

 

    అర్థమైపోయింది సుల్తాన్ కి.

 

    "ప్రేమలో టీనేజ్ లవర్స్, జంపింగ్ లవర్స్, శాడిస్ట్ లవర్స్, ప్యూర్ లవర్స్ , డివైడెడ్ లవర్స్, టైమ్ పాస్ లవర్స్ , సెక్స్ వల్ లవర్స్, ఎటర్నల్ లవర్స్ ఇలా రకరకాల లవర్స్ వుంటారు. నువ్వు ఏ రకమైన లవర్ వో  ఆలోచించావా.....?" సీరియస్ గా  అడిగాడు సుల్తాన్.

 

    "అన్ని రకాలుగా ఆలోచించేది, ప్రేమంటావా!" సిగరెట్ పొగ వదులుతూ అన్నాడు మధు.

 

    "ఆ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం ఆ అమ్మాయ్ కి తెలుసా?"

 

    "తెలీదు."

 

    "నీ ప్రాబ్లమ్ నాకర్థమైపోయింది. ప్రస్తుతం నీ ప్రేమ, ఆరాధనలో వుందన్న మాట. నువ్వు  అర్జంటుగా చెయ్యాల్సిన పని "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని నువ్వు ఆ అమ్మాయికి చెప్పెయ్యాలి. నువ్వు, ఎవర్ని ప్రేమిస్తున్నావో వాళ్ళ దగ్గరకి వెళ్ళి నీతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి నీ మనసులో మాట ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పి వాళ్ళ అభిప్రాయం ఏమిటో అడగాలి. వాళ్ళు వెంటనే సమాధానం చెప్పలేకపొతే- ఆలోచించుకుని చెప్పమని చెప్పాలి. ఇంత డైరెక్టుగా చెపితే అవతలి వాళ్ళు ఏమనుకుంటారోనన్న సందేహం ఏమాత్రం ప్రేమించే వారిలో వుండకూడదు. నీ నిజాయితీ, నీ ధైర్యం ఆమెకి నచ్చవచ్చు. అంతకు ముందుగా నువ్వు చెయ్యాల్సిన పని ఏమిటో తెలుసా? ఆ అన్విత నువ్వంటే ఇష్టపడుతోందో లేదో పరోక్షంగా తెలుసుకోవాలి" ప్రేమ పెళ్ళి చేసుకున్న స్వీయానుభవంతో చెప్పాడు సుల్తాన్.

 

    "నేనంటే అన్వితకు ఇష్టమో లేదో తెలుసుకోవడం అవసరమా?"

 

    "ఒరే పిచ్చికన్నా- నీ దగ్గర బాలే వుంది. ఆడాలంటే గ్రౌండ్ కావాలా లేదా. ఆ అమ్మాయికి నీ మీద ఇంట్రస్ట్ వుంటేనే కథ నడుస్తుంది. లేకపోతే నువ్వు కంచికి- నేను నా రిపేర్ షాపుకు వెళ్ళిపోవాల్సిందే."

 

    "అయితే ఏం చెయ్యమంటావో కంగారు పెట్టేయ్యకుండా వన్ బై వన్  చెప్పు-" అడిగాడు మధు.

 

    చెప్పడం ప్రారంభించాడు సుల్తాన్.

 Previous Page Next Page