Previous Page Next Page 
మొగలిబాకు పేజి 15

   

     "ఇప్పుడేం చేయాలో చెప్పు.....మేం విని ఓట్లేస్తాం" సరదాపటేల్ అనుపమ్ఖేర్ మాడ్యులేషన్తో అన్నాడు.
   
    "అందర్నీ అందరూ ప్రేమించలేరు కాబట్టి.....ప్రేమించుకోదంకుదరదు కాబట్టి...."మోతీలక్ష్మి ఇవ్వబోతున్న ఉపన్యాశానికి అడ్డుగా వచ్చాడు వాసుదేవ్.
   
    "ఎందుకు.....ప్రేమించుకోవడం......కుదరదు" పాత సినిమాల్లో ముక్కామలలా అడిగాడు.
   
    "కొంతమంది మగ స్టూడెంట్స్ కి, కొంతమంది ఆడ స్టూడెంట్స్ భాయీ బహిన్లు సిన్సియర్ గా అవుతారు కాబట్టి__" విసుక్కుంది మోతీలక్ష్మి.
   
    "ఓహో__ఆ కీలక రహస్యం....." మహమ్మదాలీ ఆలీ లెవెల్లో ఫోజిచ్చాడు.
   
    "అందువల్ల మైడియర్ ఫ్రెండ్స్.....మన మొత్తం స్టూడెంట్స్ ఒకర్నొకరు వెంటనే ప్రేమించేసుకోవాలంటే చాలా కష్టం కనుక ఒక జంటని ఎన్నిక చేద్దాం. ఆజంటద్వారానే పెద్దవాళ్ళకు బుద్ది వచ్చేలా చేద్దాం. వాళ్ళని లాటరీద్వారా....సెలక్ట్ చేద్దాం.....సదరు ఆడ, మగా ఇద్దరూ ప్రేమించుకునేట్లు చేద్దాం.....ఆ తర్వాత పెళ్ళి చేద్దాం"
   
    "స్టోరీ అంతా సుఖాంతమైపోతే ఈ నవల షాగేడెట్టా అబ్బా....." మధ్యలో ఓ రచయితకు ధర్మడౌట్ వచ్చింది.
   
    "పెళ్ళి దగ్గర ఆపాలన్నమాట.......అక్కడ పెద్దవాళ్ళు ఎంటరౌతారు__ఈ పెళ్ళికి ససేమిరా మేం ఒప్పుకోమని ఆడపిల్ల తాలూకూ మమ్మీ నూతిలో దిగి, అమాయిత్యానికి పూనుకుంటానని మంగమ్మ శపధం లెవెల్లో శపధం చేస్తుంది.
   
    అలాగే ఆడపిల్ల తండ్రికూడా ఏరాడకొండెక్కి కిందకి లాంగ్ జంప్ చేసి దూకేస్తానని, స్టీరియో ఫోనిక్ సౌండ్ లో శివాజీ గణేషన్ లా అరుస్తాడు"
   
    రచయితగారి భార్య సలహా ఇవ్వటంతో వాసుదేవ్ అనే కేరక్టర్ లేచి నిలబడింది.
   
    "అయితే ముందు మన చీటీలు తయారుచేద్దాం. అందరిలో యిద్దరిని మెయిన్ గా తీద్దాం.....ఆ పని అర్జంట్ గా చెయ్యండహో....." అని అడవిరాముడు సినిమాలో రావుగోపాలరావులా అరిచాడు.
   
    స్టూడెంట్లు బృందాలు బృందాలుగా విడిపోయి ఓ అయిదారు దస్తాల తెల్లకాగితాలు తెచ్చి చిన్న చిన్న పేపర్లుగా చింపడం ప్రారంభించాడు.
   
    "ఏమి జన్మము, ఏమి జీవనము......
   
    మనిషికి చివరాఖరకు మిగిలేది......
   
    ఏడు కట్ల పట్టె మంచమురా నరుడా......
   
    చిన్న చెంబు నిండా.....ఎముకల బస్మమురా నరుడా"
   
    మహ్మదాలీ పాట పాడుతూ కాగితాలని పర, పరమని చింపుతున్నాడు.
   
    "ఒరేయ్ ఆలీ....శుభమా.....అని ప్రేమకు శ్రీకారం చుటుతుంటే నువ్వు ట్రాజడీ గీతాలు పాడతావేంట్రా?" నారాయణరావు అన్నాడు.
   
    "ఇలాంటి పాటలు చాలా మంచివని మా నాన్నమ్మ చెప్పిందే" అనుమానంగా అన్నాడు ఆలీ.
   
    "ఇలాంటి పాటలు స్మశానాల్లో వేస్తారు, ఇక్కడకాదు-ఇక్కడ ఎలాంటి పాటలు పాడాలో తెలుసా?"
   
    "తెలుసు.....హమ్ తుమ్ ఏక్ కమరేమే బంద్ హోలాంటి పాటలు పాడాలి సరేనా.....దీదీ .....తేరా....దీవర్....ది....ది......ది....." రాగాలు తీస్తున్నాడు జుత్తుల ఆలీ.
   
    అరగంట గడిచాక స్టూడెంట్స్ అందరూ కాగితాలన్నీ చింపిపోగులు పెట్టి ఆడ, మగ స్టూడెంట్స్ అందరి పేర్లూ రాసారు.
   
    ఇంతలో ఒకడు క్యాంటీన్ దగ్గరికెళ్ళి రెండు ఖాళీ డబ్బాల్ని తీసుకొచ్చాడు.
   
    ఆ డబ్బాల్లో చీటీలన్నీ ఉండచుట్టి వేసి ఆ డబ్బాల్ని అందరూ పావుగంటసేపు అటూ ఇటూ తిప్పారు.
   
    "ఎవరికీ డౌట్ లేదుకదా?" మోతీలక్ష్మి అడిగింది.
   
    "లేదు" వాసుదేవ్ ఉత్సాహంగా అరిచాడు-అతని గొంతుతో పాటు వంక పలికారు స్టూడెంట్స్.
   
    "ఇప్పుడు మనతో ఒకరు, మగ స్టూడెంట్స్ డబ్బాలోంచి ఒక చీటీని, ఆడ స్టూడెంట్స్ డబ్బాలోంచి యింకో చీటీని తీస్తారు.....ఒకే...."
   
    "ఓ.కే...." అందరూ ఎలుగెత్తి అరిచారు.
   
    "అలా ఎంపిక చేయబడిన విద్యార్ధి, విద్యార్ధిని, ఇద్దరూ ఇప్పటినుంచి బాహాటంగా ప్రేమించుకోవడం మొదలెడతారు...."
   
    "బాహాటంగా ప్రేమించుకోవడమంటే?" నారాయణరావు అయోమయంగా ప్రశ్నించాడు.
   
    "అందరికీ తెలిసేటట్లు ప్రేమించుకోవడమన్నమాట" వెర్రివాడా నాకు ఈమాత్రం కోదా తెలీదా అన్నట్లుగా, నారాయణరావు వేపు చూస్తూ అంది ఓ అమ్మాయి.
   
    "ముందు లెక్షర్లు ఆపి, లాటరీ తియ్యండెహే" బొండంలాంటి కుర్రాడొకడు అరిచాడు.
   
    "ఈ ప్రేమలూ, పెళ్ళిళ్ళు మాట సరే.....మరి మన చదువుల మాటేమిటి?" ఓ సరస్వతీ పుత్రుడు వ్యాఖ్యానించాడు.
   
    "వీడెవడండీ బాబూ.....యూనివర్సిటీలో చదువులేంట్రా నాన్నా ఆ కాలం ఎప్పుడో పోయింది. నీకు చదువుకోవాలంటే.....ప్రైవేటుగా చదువుకో యూనివర్శిటీ ఎప్పుడు రాజకీయాలు, కులమతాలు, కాకాపట్టటాలు, అడ్డదారులు ఇలాంటివే నేర్పుతారు" ఒక కుర్రాడు సీరియస్ గా అన్నాడు___ఆ వ్యాఖ్యానం ప్రస్తుత యూనివర్శిటీ విద్యా విధానానికి అద్దంలాంటిది.
   
                                               *    *    *    *
   
    ఎత్తయిన వేదికమీద నుంచుంది మోతీలక్ష్మి-ఆ పక్కన నారాయణరావు, వాసుదేవ్ తదితర కుర్రాళ్ళున్నారు.....కొంచెం దూరంలో ఆడపిల్లల మధ్య, ఆసక్తిగా చూస్తూ కూర్చుంది సంధ్య.
   
    "మైడియర్ ఫ్రెండ్స్.....మరికొద్ది క్షణాల్లో, యూనివర్శిటీ హిస్టరీలో మొట్టమొదటిసారిగా, స్టూడెంట్స్ చేత ఎన్నుకోబడుతున్న ప్రేమికుల జంట పేర్లను, మన హిస్టరీ ప్రొఫెసర్....పరమానందంగారు ప్రకటిస్తారు" మోతీలక్ష్మీ ఎనౌన్స్ చేసింది.
   
    అందరిదృష్టీ అప్పుడే చిరునవ్వు నవ్వుతూ, స్టూడెంట్స్ కి అభివాదం చేస్తూ మెట్లెక్కుతున్న పరమానందంమీద పడింది.
   
    "పరమానందం ట్రాజడీ హీరోరాబాబూ...ఆరుసార్లు అమ్మాయిల్ని ప్రేమించాడు. ఆ ఆరుసార్లూ ఆ అమ్మాయిలు పరమానందం పక్కనున్న ఫ్రెండ్స్ ని ప్రేమించేసి, వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసేసుకున్నార్ట......తప్ప, ఈయనగారిని ప్రేమించలేదట."
   
    "ప్లాష్ బ్యాక్ లోకి వెళ్ళక, ముందు జరుగుతున్నదానిని తిలకించరా...." చికాగ్గా అన్నాడు పక్కనున్న ఫ్రెండ్.
   
    అందరి స్టూడెంట్స్ ముఖాల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది.....పక్క చప్పట్లు మార్మోగిపోతున్నాయి.
   
    పరమానందం స్టేజెక్కి, స్టూడెంట్స్ అందరివైపూ చూసి___
   
    "నేనేం మాట్లాడను......పాట పాడతాను" అన్నాడు.
   
    "టీవీలో బోర్నవిటా యాడ్ చూసొచ్చావా నయ్ నా...." ఎవరో ఎలుగెత్తి అరిచారు.
   
    జలపాతం తుళ్ళిపడినట్టు, లేడీ స్టూడెంట్స్ అందరూ ఫెళ్ళున నవ్వారు.
   
    గొంతు సవరించుకుని పాట పాడడం మొదలెట్టాడు.
   
    "ప్రేమించుట పిల్లలవంతు, దీవించుట పెద్దల వంతు......
   
    'పెద్దలు' ఔనంటే అది ప్రణయం.....
   
    పెద్దలు విడదీస్తే అది ప్రళయం.....
   
    ప్రేమించుట పిల్లలవంతూ.....థోఒ....థోఓ...." చివరి చరణానికి వందలాదిమంది స్టూడెంట్స్ వంత పాడారు.
   
    సరిగ్గా అదే సమయంలో__
   
    "ఇపుడు మన పరమానందంగారు......లవ్ లాటరీ తీస్తారు" అని మోతీలక్ష్మి ఎనౌన్స్ చేసింది.

 Previous Page Next Page