"అంతా ట్రాష్!" చాలా తేలికగా నాలుక చప్పరిస్తూ అన్నాడు.
ఇన్ స్పెక్టర్ పైకి అలా అన్నాడుగాని లోలోపల దీర్ఘాలోచన చేస్తూనే వున్నాడు. శక్తిమాయి గురించి వార్తలు ఇన్ స్పెక్టర్ చెవిదాకా వచ్చాయి. కలకత్తా కాళిలాంటి ఓ స్త్రీ అమెచుట్టూ వందిమూగధులు పిల్ల రాక్షసులు చిన్న ముఠా రహస్యస్థావరం వగైరాలు వుండవచ్చు. నిప్పులులేనిదే పొగరాదు....ఆనోటా ఆనోటా ఎన్నో కొన్ని విషయాలు తెలుస్తూనే వున్నాయి.
అలా అని పరిశోధన చేయటం యిష్టం లేదు. అనుమానంతో నిక్షేపం లాంటి కాలాన్ని వ్యర్ధం చేసుకోవటం దేనికి? గట్టిగా ఏ నేరమన్నా బయటపడితే అప్పుడు చూడొచ్చు. పుండుమీద పుల్లబెట్టి కెలకకూడదు. బాధ తాలూకా సలపరం ఎక్కువ అవుతుంది. విషయం చెవిదాకా వస్తే చాలదు....కళ్ళకి కనపడాలి.
బద్దకానికి తోడు విధి నిర్వహణ పట్ల చిన్న చూపు అధికార గర్వం. పని అందు అలక్ష్యంగల ఇన్ స్పెక్టర్ కన్నా రావు అతని ఆలోచనలు అలా సాగుతున్నాయి.
"ఇది అంత తేలికగా తీసేయదగ్గ విషయం కాదు" బన్సీలాల్ అన్నాడు నోరు తడుపుకుంటూ.
"విషయాన్ని తేలికగా తీసేయటం కాదు లాల్ జీ!"
"మరి?"
"శక్తిమాయ అన్న విషయం ట్రాష్ అంటున్నాను. శక్తిమాయి లేదు వుల్లిపాయ లేదు. ఎవరో మీకు శతృవులు ఉన్నారు అంతవరకూ ఖాయం..."
"మరి ఆనందయ్య శక్తిమాయి అంటూ...
"ఇష్? ఆ విషయం వదిలేసి ఆలోచించండి."
"ఏమాలోచించను?"
"మీతో సమాన పాయగల మీ శతృవులు ఎవరా అని...?"
"అదా మీ ఆలోచన, అలా ఆలోచించేటట్లయితే ఠాకూర్ లు ఉన్నారుగా మా పక్కలో పల్లెంలాగా, వాళ్ళే మా ప్రథమ శతృవులు మాకు అన్నింటా ప్రత్యర్ధులు."
"ఇప్పుడు గాడిలో పడ్డారు....లాల్ జీ"
"గాడిలో పడ్డానో గోతిలో పడ్డానో తర్వాత సంగతి ఈ మధ్య కాలంలో మేము ఠాకూర్ ల జోలికి పోలేదు...మా జోలికి వాళ్ళూ రావటంలేదు....పని గట్టుకుని వాళ్ళు మాకు అపకారం చేయడం దేనికి?"
"ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది."
"అంటే?"
"ఈ మధ్య కాలంలో దేశంలో చాలా మార్పులు వచ్చాయి....కులం, అంతం పేరుతో వెర్రివేషాలు ఎక్కువ అయ్యాయి. ఒకళ్ళు మనకన్నా పై చేయిగా వుండకూడదు. మీ కులాన్ని అణగదొక్కాలని ఠాకూర్ లకి పుట్టందేమో!" కేసు ఎలాగూపట్టటం చేతగాలేదు....అనుమాన బీజమన్నా నాటితే ప్రస్తుతానికి కధ పక్కదారి అన్నా పడుతుంది...ఈ రోజు గడిస్తే రేపటి సంగతి రేపు అనుకున్న ఇన్ స్పెక్టర్ కొత్త కథ ఆల్లాడు.
విషం పనిచేసినంత తొందరగా అమృతం పనిచేయదు. వెనకటికో మహానుభావుడు అనుభవం మీద శలవిచ్చాడు. అధి అక్షరాలా నిజం అన్నట్లు ఇన్ స్పెక్టర్ చెప్పింది బన్సీలాల్ నమ్మాడు.
"నేనేనా అంత చాతగాని వాడిని చేతులు ముడుచుకున్న వాడివీను! నా తడాఖా చూపిస్తాను".... ఎర్రబారిన కళ్ళని మరింత ఎర్రబరుస్తూ అన్నాడు బన్సీలాల్.
"తొందర పడకండి లాల్ జీ! మనం ఏమి తెలియనట్లు మిన్నకుండి సమయం చూసి చావుదెబ్బ తీయాలి"
"అద్చే ఎలా....ఎలా అన్నది చెప్పండి."
"ఆవేశంతో పనులుగావు....ఆనందరామయ్య ఠాకూర్ ని కలుసుకుంటున్నాడేమో చూడమని మా వాళ్ళని నిఘా వేయిస్తాను..."
"మీరు నిఘావేసి...వాళ్ళు కనిపెట్టి చూసి....ఈలోపల మరో అనర్ధకం జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు ....పోలీసాళ్ళనే ఎత్తుకెళ్ళి వాళ్ళ డ్రస్ లు ఊడగొట్టి లాక్కుని వాళ్ళలా నా యింటికి రాగలిగారంటే వాళ్ళెంత ఘటికులో నా కెంత అవమానమో ఆలోచించండి...రేపు మీలాగా కూడా తయారయివస్తే నా గతి ఏమిటి?" బన్సీలాల్ నిషా కళ్ళతో అడిగాడు.
ఇన్ స్పెక్టర్ ఉలిక్కిపడ్డాడు....ఈ ఆలోచన తనకి రానందుకు లోలోపల తనని తానే తిట్టుకున్నాడు.... పైకి మాత్రం బుకాయింపుగా "మీరు మీ నీడని చూసి భయపడుతున్నారు" అన్నాడు.
"తాడే పామై కరిచింది. కాలం ఖర్మం కలిసి రాక అన్న విధంగా ఎవరికీ తెలుసు, నీడనిప్పులు వెదజల్లుతుందేమో?"
బన్సీలాల్ కి కొద్దిగా కోపం వచ్చినట్లు గ్రహించాడు ఇన్ స్పెక్టర్ తెలివి తెచ్చుకుని జాగ్రత్త పడ్డాడు.
"మీరు ఎలాగయినా తెలివిగలవారు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు....మీ ఆలోచనలు అద్భుతం మిమ్మల్ని భయపెట్టటం నా ఉద్దేశ్యం కాదు...చెప్పండి ఏం చేద్దాం?"
"మన్ని వాళ్ళు చాటుదెబ్బ తీశారు....మనమూ వాళ్ళనలా తీద్దాము" అన్నాడు బన్సీలాల్.
"మంచి ప్లాను ఆలోచిద్దాం..."
"మీరు వచ్చేముందు నే ఆలోచించే పెట్టాను... మీతో చెప్పి చేద్దామని ఆగాను."
"చెప్పండి."
"ఆకాశరామన్న రాసినట్లు వాళ్ళకో లెటర్ రాసి పోస్ట్ చేస్తాను."