Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 14


    ఆమె దుప్పటిలోంచి బలవంతంగా ఆపుకుంటున్న నవ్వు వినిపించింది.
    తిరిగి మెలకువ వచ్చేసరికి రైలు కైకలూరు దాటేసింది.
    కింద తులసీ, ఆ యువతీ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
    "గుడ్ మాణింగ్" అన్నాడు సురేష్ ఆ యువతితో.
    ఆమె కలవరపాటుతో తులసివేపు చూసింది.
    "రాత్రంతా నిద్రలేదు, తులసితో అన్నాడు.
    "ఎందుకు?"
    "భయం.....నిన్నెవరయినా ఏమైనా చేస్తారేమోనని."
    తులసినవ్వేసింది.
    "మనకంపార్ట్మెంట్ లో అంతా ఆడాళ్ళూ, పిల్లలే కదా వుంది?"
    "వాళ్ళ వల్ల కాదు భయం.....ఈమెవల్ల"
    ఆమె ముఖం ఎర్రబడిపోయింది.
    తులసినవ్వేస్తోంది.
    "అసలే కేరళా గాళ్ రూమ్మేట్.....చాలాడేంజరస్."
    భీమవరంలో దిగిపోయేటప్పుడు ఇద్దరికీ గుడ్ బై చెప్పిందామె.
    "నేను చెప్పింది గుర్తుందికదా?" అడిగాడు.
    ఆమె ఇబ్బందిగానవ్వుతూ తలూపింది.
    నర్సాపురం ఫ్లాట్ ఫారంమీద అచ్చంతులసి లాగానే వున్నయువతి మరింత స్లిమ్ గా, మరింత అందంగా ఎదురుచూస్తోంది.
    "ఇతనే సురేష్!" పరిచయం చేసింది తులసి. "మా అక్క పేరు మాయ"
    "హాయ్.....హౌడూయూడూ?" అందామె.
    "జస్ట్ ఎబ్ నార్మల్ అండ్ ఎబోవ్ నార్మల్!"
    ఆమె నవ్వేసింది.
    "తులసి చెప్పిందిలెండి మీరిలా అతిగా మట్లాడతారని."
    "మాట్లాడటమేకాదండి! యాక్షన్ ఓరియెంటెడ్."
    "అది కూడా చెప్పింది."
    "అలాగా! కానీ మాటలు విని ఇమేజిన్ చేసుకోవటం వేరు.....కళ్ళతో చూసి 'అవునవును' అనుకోవడం వేరు."
    తులసి అతని చేతిమీద తన శక్తినంతా ఉపయోగించిగిల్లింది.
    "34........28.........36" అన్నాడు ఆమెవంకే పరీక్షగా చూస్తూ.
    మాయకంగారు పడింది.
    "అంటే ఏమిటి?" అనుమానంగా అడిగింది.
    "అంటే.....మీరు తులసికంటే చాలా ఉన్నతమయిన స్థితిలో వున్నారు. కనీసం టూ ఇంచెస్!"
    ఆమెకు అర్ధమయ్యేసరికి రక్తం మొఖంలోకి ప్రవేశించింది వేగంగా.
    "నువ్వేమిటక్కా కొంచెం చిక్కినట్లున్నావ్?" ఆప్యాయంగా ఆమె చేయిపట్టుకొని అడిగింది తులసి.
    "డయిటింగ్ చేస్తున్నాను. లేకపోతే మోడలింగ్ దెబ్బతింటుంది కదా!"
    "ఓ! మీరు మోడల్ గా వర్క్ చేస్తున్నారు కదూ! తులసి చెప్పింది కానీ మర్చిపోయాను. నాకూ మోడలింగ్ అంటే చాలా ఫాజినేషన్! కాలేజ్ చదివేరోజుల్లో ఓ కాంట్రాసెప్టివ్స్ కంపెనీకి మోడల్ గా చేశాను."
    "రియల్లీ!"
    "అవును! కావాలంటే నా పక్కననటించిన ప్రతిమ అనే అమ్మాయినడగండి! ప్రస్తుతం బాంబేలోని యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తోంది. ఆ తర్వాత ఇంకా జన్మలో ఎవరితోనూ కలసి మోడలింగ్ చేయనని ఒట్టు పెట్టుకుంది."
    మాయవిస్మయంగా చూసింది.
    "ఎందుకు?"
    "ఇద్దరం కలిసి మేము ప్రచారం చేసిన ఆ కాంట్రాసెప్టివ్స్ నిజంగా పనిచేస్తాయోలేదో ఇన్ స్పెక్షన్ చేసి చూశాము. అవి సరిగ్గా పని చేయలేదనిలేడీ డాక్టర్ చెప్పింది. ఆరొందలు బిల్లుఛార్జ్ చేసి."
    మాయనవ్వాపుకోలేకపోయింది.
    "ఆ మాటలేమీ నమ్మకు అక్కా....." అంది తులసి కాజువల్ గా.
    "పదండి! ఇక ఇంటికి వెళదాం."
    ముగ్గురూ స్టేషన్ బయటకు నడిచారు.
    "మీ ఇద్దరూ రిక్షా ఎక్కండి! నేను మోపెడ్ మీద వస్తాను" చెప్పింది మాయ.
    రిక్షా పక్కనే మోపెడ్ నడిపిస్తూ తులసితో మాట్లాడుతోందామె.
    నాలుగయిదుకిలోమీటర్ల దూరం ఉంటుంది.
    పంట కాలవపక్కనే కొబ్బరి తోటల్లో నుంచి వెళ్తోంటే వింతలోకంలో ప్రయాణిస్తున్నట్లుంది. ఓ విశాలమయిన కొబ్బరితోట మధ్యలో ఉందా యిల్లు. చిన్నదయినా చాలా ఆధునికంగా అందంగా వుంది. రెండే రెండుగదులు, కిచన్! అతి ఖరీదైన సోఫాలూ, టి.వి, .వి.సి.ఆర్, టూహండ్రెడ్ వాట్స్ స్టీరియో సెట్, ఫ్రిజ్, అందమయిన పెయింటింగ్స్.......బెడ్ రూమ్ మరింత శోభాయమానంగా ఉంది.
    డబుల్ బెడ్, చుట్టూ నీలం రంగు సిల్కు దోమతెర, ఎదురుగా నిలువెత్తు విశాలమయిన డ్రస్సింగ్ టేబుల్, బెడ్ కి పైన సీలింగ్ కి కూడా మిర్రర్స్, ఎయిర్ కండిషన్, కింద మెత్తనితివాచీ.......ఓ అద్దాల అల్మారాలో అందంగా అమర్చిన మాగజైన్స్!
    "మీరు నన్నుమోసం చేశారు" మాయవేపు తిరిగి ఉక్రోషంగా అన్నాడతను.
    "ఇదే.......మీరింత 'రిచ్' అని తెలిస్తే తులసిని వదిలేసి మిమ్మల్నే తీసుకెళ్ళిపోయేవాడిని"
    "అంటే మీక్కావలసింది తులసికాదన్నమాట"
    "తులసికీ మీకూ పెద్ద తేడా ఏమీ కనిపించటం లేదునాకు" ఆమె చుట్టూ తిరిగి చూస్తూ అన్నాడు.
    "పోలికలసంగతలా ఉంచి, తులసికంటే అయిదేళ్ళు పెద్దదాన్ని నేను."
    "ఓ! అదా......ఏం పర్లేదు! ఏజ్ నో బార్! నలభైవరకూ ఎడ్జస్ట్ అయిపోగలను."
    తులసి అతని కాలర్ పట్టుకొంది.
    "ఏది? మళ్ళీ అను చూద్దాం."
    "సరే! నీక్కోపంవచ్చేట్లయితే ముఫ్ఫై తొమ్మిదివరకే ఎడ్జస్ట్ అవుతాను."
    మాయనవ్వేసింది.
    "ఇంతకూ మీ 'కో ప్లేయర్' ఏడీ?" అడిగాడు సురేష్.
    "వైజాగ్! కేవలం శని, ఆదివారాలకే ఇక్కడుంటారు."
    "ఓ......అర్ధమయింది! పెద్దింట్లో ఉంటారన్నమాట అక్కడ"
    "అయితే తులసి మీకన్నీ చెప్పేఉంటుంది."
    లోపల్నుంచి ఓ నడివయసు స్త్రీ కాఫీ ట్రే తీసుకొచ్చి టేబుల్ మీదుంచింది.
    ఆమెను చూస్తూనే ఉక్కిరి బిక్కిరయాడతను.

 Previous Page Next Page