Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 14

                                 


    అంతలో అక్కడికి తుగ్లక్ టీవీ చానెల్ వాన్ వచ్చింది. ఫేమస్ యాంకర్ వెంగమాంబ కెమెరా యూనిట్ తో దిగింది.
    టీవీ కెమెరా అనగానే తెలీందేముంది? లేడీస్ ఆమె చుట్టూ మూగిపోయారు.
    "హలో లేడీస్ అండ్ జెంటిల్ మేన్! ఇప్పుడు మా తుగ్లక్ టి.వి చానెల్ వాళ్ళు నిర్వహిస్తోన్న 'నీస్టెప్స్- నా హిప్స్' కార్యక్రమం లైవ్ గా కవర్ చేస్తున్నాం. మీరు చేయాల్సిందేమిటంటే మీ ఆయన్తోగానీ లేక మీ బాయ్ ఫ్రెండ్ తో గానీ మీకిష్టమయిన సినిమా పాటను పాడుతూ డాన్స్ చేయాలి. బాగా చేసిన జంటకు ఒక పోర్టబుల్ టీవీని బహుమతిగా ఇస్తారు జంగ్లీ ఎలక్ట్రానిక్స్ వారు. మరి ముందుగా వచ్చే జంట ఎవరు?"
    ఒక్కసారిగా లేడీస్ అంతా ఒకర్నొకరు తోసుకుంటూ ముందుకొచ్చారు.
    "అందరూ ఒకేసారి వస్తే ఎలా? జంటలందరికీ కూడా మా తుగ్లక్ టీవీ అవకాశం ఇస్తుంది. గనుక మీరు తొందరపడాల్సిన అవసరం లేదు-"
    అంతలో వింధ్యాదేవి, వాళ్ళాయన వీర్రాజుని ఈడ్చుకొచ్చేసింది.
    "మీపేరేంటి?" అడిగింది యాంకర్ వెంగమాంబ.
    "వింధ్యాదేవండీ"
    "ఈయన మీవారా? మీ పేరేంటండీ?"
    "వీర్రాజండీ!"
    "మీకు పెళ్లి ఎప్పుడయింది?"
    "పదిహేనేళ్ళయిందండీ?"
    "పెళ్ళయి పదిహేనేళ్ళయినా ఇద్దరూ హ్యాపీగా ఉంటానికి కారణం? అయ్ మీన్ మీ ఆవిడలో ఏం ప్రత్యేకత ఉంది?"
    "కొంచెం లావుగా వుంటుంది కదండీ! అందుకని కంపల్సరీగా అన్యోన్యంగా ఉండాల్సి వస్తుందండీ!"
    "ఫెంటాస్టిక్ రిప్లయ్ వీర్రాజుగారూ- మీరిప్పుడు మీకిష్టమైన డ్యూయెట్ పాడుతూ డాన్స్ చేయాలి- ఏ పాట పాడతారు?"
    "ఆరేసుకోబోయి పాట మాకెంతో ఇష్టమండీ! ఇంట్లో ఎప్పుడూ అదే యేసుకుంటాం"
    "ఓ.కే. కారీ ఆన్! అచ్చం ఎన్టీఆర్ లాగానే స్టెప్స్ వేయాలి వీర్రాజుగారూ- వింధ్యాదేవి గారూ కమాన్ స్టార్ట్"
    ఇద్దరు ఆ పాటకు డాన్స్ చేస్తుంటే వింధ్యాదేవి సెక్సీ భంగిమలు చూసి యూత్ అంతా విజిల్స్ వేశారు.
    వీర్రాజు సరేసరి- తాగినోడు తూలుతున్నట్లు డాన్స్ లాంటిది చేశాడు. మధ్యలో వింధ్యాదేవి హిప్స్ మీద చేత్తో కొడుతూంటే యాంకర్ కెమెరాని వింధ్యాదేవి హిప్స్ మీదే క్లోజ్ యాంగిల్ పెట్టించింది.
    మధ్య మధ్యలో యాంకర్ కూడా నలుగు స్టెప్స్ వేస్తూ భార్యాభర్తల మధ్యలో దూరింది. అందరూ విజిల్స్ వేశారు.
    ఆఖర్లో వింధ్యాదేవి విజ్రుంభించింది చాలా అసభ్యకరంగా నడుము ఊపుతూంటే అందరూ షాకయి చూస్తుండిపోయారు.
    "ఒండర్ ఫుల్ వింధ్యాదేవి గారూ! వీర్రాజుగారు కూడా చాలా రసికులే! మీకే బహుమతి వస్తుందని నాకనిపిస్తుంది. మరి జడ్జి ఏం చేస్తాడో చూడాలి!" అంది యాంకర్.
    "జడ్జ్ గారెక్కడున్నారండీ" అడిగాడు వీర్రాజు.
    "అదిగో- ఆ బుట్ట పట్టుకుని పల్లీలమ్ముతున్నాడు చూడండి! వాడే! రోడ్ మీద కనబడితే జడ్జీగా ఉండమని తీసుకొచ్చాను- మా తుగ్లక్ చానెల్ 'మాస్'నే జడ్జీలుగా పెట్టాలని పాలసీ డెసిషన్ తీసుకుంది-"
    అంతలో- అసభ్య నృత్యాలకు వ్యతిరేకంగా వేదిక మీద ఉపన్యాసం ఇచ్చిన సంధ్యాదేవి కూడా వాళ్ళాయనతో వచ్చింది.
    "మీరే పాటకు డాన్స్ చేస్తారు సంధ్యాదేవిగారూ!" అడిగింది యాంకర్.
    "అమ్మనీ తీయనీదెబ్బ- ఎంతకమ్మగా వుంది రో యబ్బ-"
    "ఓ ఒండర్ ఫుల్! నాకూ ఈ పాటంటే ఎంతో ప్రాణం! కమాన్ స్టార్ట్-" అనగానే సంధ్యాదేవి, లావుపాటి వాళ్లాయనా కలసి పరమ నికృష్టంగా డాన్స్ లాంటిది చేస్తూ బహుమతి కోసం సెక్స్ భంగిమలతో నడుము, ఛాతి ఊపుతూ ఒకరినొకరు అచ్చం సినిమాల్లోలాగా కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఎగుర్తూ గంతులేశారు.
    యాంకర్ తప్పట్లు కొట్టేసింది సంతోషం భరించలేక.
    ఆ రకంగా పధ్నాలుగు జంటలు విచ్చలవిడిగా డాన్స్ లు చేశాక జడ్జి- సునీతాదేవినీ ఆమె భర్తనీ 'బెస్ట్ డ్యూయెట్ కపుల్' గా ఎన్నిక చేశాడు.
    "వాళ్ళనే ఎందుకు ఎన్నుకున్నావ్?" పల్లీలవాడ్ని అడిగింది యాంకర్.
    "అందరు లేడీస్ లోకీ ఆవిడే ముమైత్ ఖాన్ లాగా నడుము ఎత్తెత్తి ఊపింది మేడమ్! చెస్ట్ కూడా బాగానే ఊపింది! నిజం చెప్పాలంటే నేను చిన్నప్పుడు మెచ్చుకున్న జ్యోతిలక్ష్మి కంటే కూడా బాగా ఊపారు ఈ లేడీసంతా-" అందరూ తప్పట్లు కొట్టారు.
    సునీతాదేవికి పోర్టబుల్ టీవి బహుమతిగా అందజేస్తూంటే శంకరమూర్తి ఠక్కున మధ్యలో అడ్డువచ్చాడు.
    "వన్ మినెట్ యాంకర్ గారూ! ఇప్పటిదాకా వీళ్ళందరూ చిన్న పిల్లలు చేసిన రికార్డ్ డాన్స్ లు చాలా అశ్లీలంగా అసభ్యకరంగా ఉన్నాయని నన్ను దుమ్మెత్తిపోశారు.
    కానీ ఇప్పుడు టీవీలో కనపడాలనే పిచ్చితో, ఆ పోర్టబుల్ టీవీ గెలవాలనే అత్యాశతో మొత్తం సభ్యత, సంస్కారం అన్నీ తెలుగు గంగలో వదిలేసి- సినిమాల్లో డబ్బుకోసం కక్కుర్తిపడి వళ్ళంతా చూపిస్తూ సెక్స్ డాన్స్ లు చేసే వాళ్ళకన్నా అన్యాయంగా సెక్సీ భంగిమలు ప్రదర్శిస్తూ నికృష్టమయిన నృత్యాలు చేశారు. వీళ్ళకు తోడు వీళ్ళ భర్తలు! వాళ్ళ డాన్స్ లు చూస్తేనే ఎలర్జీ వచ్చేసింది- వాంతి చేసుకోవటం ఒక్కటే తక్కువ!
    థూ! వీళ్ళంట- నాకు తెలుగు సంస్కృతి గురించి పాఠాలు చెప్తారంట! ఇలాంటి తల్లిదండ్రులున్న పిల్లలు పెద్దయ్యాక ఏమవుతారో అందరూ తేలిగ్గా ఊహించుకోవచ్చు-!" అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అందరూ షాకై చూస్తూండిపోయారు.

 

                   

 Previous Page Next Page