Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 14

    విమల ఎందుకో ముందుకు అడుగు వెయ్యలేకపోయింది. శకుంతల తన చురుకుదనంతో ముందు కురికింది ఆవిడ దగ్గరికి.    
    ఆవిడ శకుంతలను ఎత్తుకుని, తొడమీద కూచోపెట్టుకొని ముద్దు పెట్టుకుంది. నీ "కూతురా?" అంది.    
    అవునన్నట్లు తల ఊపింది విమల. తన ఎదురుగా ఉన్న ఆ వృద్దురాలికి ఎనభై ఏళ్ళ వయసుంది అంటే విమలకు నమ్మకం కలగడంలేదు. ఆవిడ సింహాసనం లాంటి కుర్చీలో ఒదిగి పడుకునిఉంది__ముఖమల్ దిల్ల మధ్య. ముఖంలో ఒక్క ముడతలేదు సరికదా_ కాంతివంతంగా ఉంది. కళ్ళకు బంగారు ఫ్రేము అద్దాలు వున్నాయి. తెల్లని రవిక తొడుక్కుని, తెల్లని పెద్దాపురం సిల్కు చీర కట్టుకుంది. వంటినిండా నగలున్నాయి. కాళ్ళ పట్టాలూ, వడ్డాణం, పాపిట పిందెలూ మొదలైనవి తప్ప మిగిలిన నగలన్నీ పెట్టుకుంది. ఆ నగల కాంతితో సమానంగా ఉంది ఆమె శరీరకాంతి.    
    "కూర్చోండి" అంది సోఫాలు చూపిస్తూ.    
    విమలా శర్మలు కూచున్నారు. విశాలమైన ఆ గదిలోనూ అద్దాలున్నాయి. ఆ అద్దాలలో అందరి ముఖాలు ప్రతిఫలిస్తున్నాయి. రాజవల్లి దాసీలవైపు ఒక్క చూపు విసిరింది. వాళ్ళు వెంటనే భయభక్తులతో వెళ్లి నగిషీలు చెక్కిన వెండి పళ్లెలలో ఇడ్లీలు, పెసరట్లు, వుప్మాలూ, దోసెలూ తెచ్చి పెట్టారు.    
    "ఇన్నా?" అన్నాడు శర్మ భయంగా.    
    "రాజవల్లి నవ్వి. "కావలసినవె తీసుకోండి. తమకేం ఇష్టమో మాకు తెలీదుగా!" అంది.        
    తన భర్తను 'తమరు' అని మన్నించే సరికి విమల ముఖంలో బిగువు కాస్త సడలింది.    
    "ఏం తల్లి మీ నాయనమ్మమీద నీకు కోపం పోలేదా?" అంది రాజవల్లి.    
    శర్మ సైగ అందుకుని. "అదేంలేదు" అంది విమల.    
    "మనవడు బాబుగారు వుత్తరం రాసేవరకూ కోడలు చచ్చిపొయిందనే నాకు తెలీదు; చాలా బాధపడ్డానమ్మా!"    
    ఆ వృద్దురాలి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. విమల మనసు కొంచెం మెత్తబడింది. తన తల్లి ఏ పరిస్థితుల్లో ఎలా పోయిందో తలుచుకుని, విమలకూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.    
    రాజవల్లి తొడమీద కూచున్న శకుంతల ఆవిడ కన్నీళ్లు తుడిచింది. రాజవల్లి మెరుస్తున్న కళ్ళతో ఆ చేతిని ముద్దుపెట్టుకొని "చిన్నరాణీ గారిది పెద్దమనసు" అంది. విమల ఆ మాటలకు వులిక్కిపడింది.    
    ఫలహారాలు ముగిసాక, ఆ పళ్లెలు ఒక కుర్రాడు వచ్చి తీసేసాడు. వాడుమాత్రం చూడగానే పని కుర్రాడని తెలిసేలా వున్నాడు. చిరిగిన నిక్కరు, రేగిన జుట్టు దీనంగా వున్న మట్టికొట్టుకుపోయినట్టున్న ముఖం. దాసీలు స్నానానికి రమ్మన్నారు. వాళ్ళ వెంట స్నానానికి బయలుదేరుతూ "ఈ తేడా ఏమిటి?" అనుకుంది విమల.
    
                                                             9
    
    స్నానాలగది చాలా విశాలంగా ఉంది మధ్యలో పాలరాతి అరుగు ఒకతొట్టినిండా వేడినీళ్ళు. మరో తొట్టి నిండా చన్నీళ్ళు ఉన్నాయి. వెండి చెంబు, వెండిగిన్నె, వెండి పళ్ళాలు అమర్చి ఉన్నాయి. వెండి గిన్నెలో ఏదో సుగంధ తైలం ఉంది. పళ్ళాలలో సున్నిపిండికాబోలు. ఏం కలిపారో ఘుమఘుమ లాడుతోంది. రాజవల్లి శరీరం నుండి అలాంటి పరిమళమే వచ్చింది.    
    సీకాయపొడి, కుంకుడు రసమూ, వేరు వేరు గిన్నెలలో ఉన్నాయి. షాంపు సీసా కూడా ఉంది. బాత్ రూంలోనే ఉన్న స్టాండ్ మీద శుభ్రంగా వుతికి ఇస్త్రీ చేసిన తెల్లని తువ్వాళ్ళు నాలుగు వేళ్ళాడుతున్నాయి.    
    ఓక దాసీది, "అమ్మగారూ! స్నానం చేయించమంటారా?" అని లోపలికి రాబోయింది.    
    "చ__ఏం వద్దు!" అని చిరాకుపడుతూ తలుపు వేసుకోబోతూంటే మరో దాసీది, "రాణీ అమ్మగారు మీకివి ఇవ్వమన్నారు." అని చీర, జాకెట్టు అందివ్వబోయింది అది వేంకటగిరి జరీ చీర, జానెడు పైగా జరీ తళతళలాడుతోంది. చీర మధ్యలో కూడా సన్నని జరీ పూలు ఉన్నాయి. కనీసం ఆరువందలుంటుంది. ఆ చీర. ఆ చీరకిందకు మేచ్ అయ్యే పావడా, జాకెట్టుకూడా ఉన్నాయి.    
    "మీరు రైక తొడుక్కుని చూసుకోండి అమ్మాయిగారూ! సరిపోకపోతే నేను సరిచేసిస్తాను. నాకు కుట్లన్నీ వచ్చు" అంది ఆ దాసీది గొప్పగా.    
    విమల ఆ చీరవంక ఒక్కసారి తిరస్కారంగా చూసి "నాకా చీర అక్కరలేదు. నా చీరలు తెచ్చుకున్నాను." అంది.    
    దాసీలు తెల్లబోవటం స్పష్టంగా కనిపించింది. వాళ్ళ మనసులలో భావం విమలకు అర్ధమయింది. అంత ఖరీదయిన చీర చూడగానే విమల తీసుకుంటుందనుకున్నారు. విమల ఈ తిరస్కారం వాళ్ళ ఊహ కందలేదు.    
    మామూలుగా తన ఖటాఫ్ వాయిల్ చీర కట్టుకుని బయటకువచ్చింది విమల, శర్మ అప్పటికే స్నానంచేసి వచ్చాడు, మొగవాళ్ళకు వేరుగా స్నానాల గదులు ఉండి ఉంటాయని అనుకుంది. తను  చీర తిరస్కరించినందుకు రాజవాల్లి ఏమైనా అంటుందని అనుకొంది. ఆవిడ మనసులో ఏమనుకుందో కాని, పైకి ఏమీ అనలేదు.    
    విమల ముందు అలంకరణ సామగ్రిపెట్టారు దాసీలు, స్నో, పౌడరు లతోపాటు రకరకాల సుగంధ ద్రవ్యాలున్నాయి. వాటి పేర్లు అడగాలనుకుని ఊరుకుంది. అవేమీ ముట్టుకోకుండా తన బేగ్ లోంచి పౌడరుతీసి అడ్డుకుని తిలకం పెట్టుకొంది.    
    "ఇల్లు చూస్తావా?" అంది రాజవల్లి. 'చూస్తాను' అన్నట్లు తల తిప్పింది విమల.    
    "నేను వస్తాను" అని రాజవల్లి అనగానే ఓక దాసీది వచ్చి రాజవల్లి కూచున్న కుర్చీ వెనుక నిలబడింది. అప్పుడు గమనించింది విమల అది చక్రాల కుర్చీ అని ఆశ్చర్యంగా చూసింది.    
    రాజవల్లి నవ్వుతూ, "కీళ్ళ వాతంతో నా మోకాళ్ళుపడి పోయాయి నడవలేను" అంది.    
    చక్రాలకుర్చీ ముందుకు కదిలింది అది కదలినంతమేరా, సుగంధ తరంగాలు, శకుంతలను దాసీలు స్నానం చేయించి తయారుచేయించినట్లు న్నారు. పట్టు పరికిణీ కట్టుకొని రాజవల్లి వడిలోనే కూర్చొని ఉంది. రాజవలికి అటుపక్క, ఇటుపక్క విమల శర్మ ఉన్నారు.    
    ముందు పూజ గది దగ్గిరకు దారితీసింది దాసీది బయట నిలబడి లోపలికి వెళ్లి చూడమ్మా" అంది రాజవల్లి.

 Previous Page Next Page