Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 14


    
    "నువు చేసింది అంత కరెక్ట్ పని కాదేమోరా?"
    
    "ఎవిరిథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్! ప్రేమలో, యుద్దంలో ఏం చేసినా చెల్లుతుందన్నాడు కవి."
    
    "కానీ నీది కేవలం వన్ సైడెడ్ లవ్వే గదా?"
    
    "అతి త్వరలో అది టూ సైడెడ్ అవుతుంది. మిగతా కథ వెండితెరపై చూడుడు."
    
    "నాకు నమ్మకంలేదు"
    
    "కానీ నా ప్రేమ మీద నాకు అపారమైన నమ్మకముంది."
    
    "నాకు నీమీదా, నీ ప్రేమమీదా కూడా దారుణమైన నమ్మకముందిగానీ ఆ సితార మీద మాత్రం బొత్తిగా లేదు"
    
    "సితారకాదు! సితార వాళ్ళ అమ్మమ్మయినా సరే, నా ప్రేమకు లొంగక తప్పదు."
    
    "అమ్మమ్మ! ఎంత మాటొరేయ్! ఒరే! నువ్వంటున్నది తప్పేమోరా?"
    
    నాలిక్కొరుక్కున్నాడు జెయ్.
    
    "తప్పా? తప్పున్నరా? గొప్ప తప్పే!" అని ఒప్పుకున్నాడు.
    
    "మరి నీ చేతిలో ఏంటదీ?" అన్నాడు శేషు.
    
    "వజ్రపుటుంగరం"
    
    "ఎందుకూ?"
    
    "నా సితార వేలికి తొడుగుతా!"
    
    "ఉంగరం తొడుగుతా అంటారా, పెడతా అంటారా?"
    
    "నాకూ అదే డౌటొచ్చిందిగానీ మన సినిమావాళ్ళు తెలుగుభాషని రెండర్దాల దడైలాగుల్తో చెత్త చెత్త చేసేశారుగదా, అందుచేత పెడతా అన్నపదమే పాడయిపోయింది."
    
    "అవునుగురూ!" అని సంతానం ప్రకటిస్తూ ఒప్పేసుకున్నాడు శేషు. మళ్ళీ అంతలోనే అతనికి జెయ్ చంద్ర పలుకుల తాలూకు పూర్తి తాత్పర్యం తలకెక్కింది.
    
    "ఏమిటీ! వెళ్ళి సితార వేలికి ఉంగరం పెడతావా?" అన్నాడు.
    
    "తొడుగుతా" అన్నాడతను సహనంగా.
    
    దిగ్భ్రమ చెందినట్లు చూశాడు శేషు.
    
    తర్వాత పెదాలు తడిచేసుకుని అన్నాడు- "పిల్లి మెడలో గంట కడతా!' అని ఎలకపిల్ల ఛాలెంజ్ చేసినా 'సింహానికే షేక్ హేండిస్తా' అని....ఓ కుందేలుపిల్ల రొమ్ము విరుచుకున్నా ఎంత దిగ్భ్రమ కలుగుతుందో అంత దిగ్భ్రమ కలిగిందిరా నాకు" అన్నాడు నిజాయితీగా.
    
    "నీ రియాక్షన్ తో నాకేం పని? నేవెళ్ళి సితార వేలికి ఉంగరం తొడుగుతా!" అన్నాడతను.
    
    "నిజంగా నువ్వు....!" అన్నాడు శేషు.
    
    "నిజంగా నేను!" అన్నాడతను.
    
    "నీకు ఇన్సూరెన్స్ వుందా?"
    
    "ఎందుకూ?"
    
    "ఆ పిల్ల నిన్ను పీకి పాకాన పెడితే?"
    
    "విజయమో, వీరస్వర్గమో అన్నారు."
    
    కాసేపు ఆలోచించాడు శేషు.
    
    "సరే! దటీజ్ యువర్ ఫ్యూనరల్!" అని తనకి వచ్చిన ఒక్క ఇంగ్లీషు ముక్కా పలికేసి, తర్వాత అదనంగా ఇంకో ప్రశ్న తగిలించాడు "మరి పెట్టేబేడా ఏమిటీ?" అన్నాడు అనుమానంగా.
    
    "ఇవాళనుంచి నా మకాం యిక్కడే" అని భరోసా యిచ్చాడు.
    
    "మైగాడ్! దిసీజ్ మై ఫ్యూనరల్!" అనుకున్నాడు శేషు పైకే.
    
    అంతా వింటున్న సితార క్రోధంతో కంపించిపోయింది. ఆ తరువాత మందార పువ్వులా ఎర్రబడిన మొహంతో, సీన్లో నుంచి ఫేడవుట్ అయిపోయింది.
    
                                                                      * * *
    
    చదువరీ!
    
    ఇక మనము ఒక్కసారి ఆ ముగ్గురు మూర్ఖుణిలను పరామర్శించి వచ్చెదముగాక.
    
    ముగ్గురు మూర్ఖుణిలు అని సితార ముద్దుగా పిలుచుకునే ముగ్గురమ్మాయిలూ ఒకళ్ళని మించి మరొకళ్ళు గొప్పతనం వున్నవారే! ఆ గొప్పతనం ప్రదర్శించడానికిగానూ నిరంతరం శ్రమించువారే!
    
    నిమ్మీ, రచనా, షీలా! అనేవి ఆ ముగ్గురమ్మాయిలకీ వాళ్ళ జననీజనకులు పెట్టిన పేర్లు.
    
    ఆ ముగ్గుర్లో షీలా నాయర్ మలయాళీ అమ్మాయి.
    
    వాళ్ళ నాన్నగారు అదేదో పెద్ద గవర్నమెంటు అండర్ టేకింగ్ కి చీఫ్.
    
    ఆయనకి కంపెనీ కారూ...
    
    కంపెనీ ఫోనూ....
    
    కంపెనీ బంగళా.....
    
    కంపెనీ ఎయిర్ కండిషనర్లూ....
    
    కంపెనీ సర్వెంట్లూ....
    
    కంపెనీ కార్పెట్లూ.....
    
    కంపెనీ కర్టెన్లూ....
    
    కంపెనీ పెట్రోలూ.....
    
    కంపెనీ పార్టీలూ.....
    
    కంపెనీ ట్రీట్ మెంటూ.....
    
    కంపెనీ ఖర్చుమీదే హాలీడే ట్రిప్పులూ....
    
    కంపెనీ తరఫున ఫారిన్ టూర్లూ....
    
    కంపెనీ ఖర్చుమీద పిల్లలచదువులూ....
    
    సమస్తం ఉచితంగా వచ్చేస్తాయి.
    
    అతను పీల్చే గాలి తప్ప, మిగతావన్నీ కంపెనీనే ఫ్రీగా యిస్తోంది.    

    సరే....
    
    అతను పీల్చే గాలి ఎట్లాగూ ఖర్చులేకుండానే వస్తోందిగదా!
    
    ప్రభుత్వంవారు ప్రజల సొమ్ముతో ఆ కంపెనీ పెట్టారు.
    
    ఆ కంపెనీ సొమ్ముని నాయర్ లాంటి వాళ్ళ మీద ఖర్చు పెడుతూ వున్నారు.
    
    దానికి బదులుగా నాయర్ గారు చేస్తున్న మహత్తరమైన సేవ ఏమిటంటే.....
    
    ఆ కంపెనీని సంవత్సరానికి కేవలం పదికోట్ల రూపాయలనష్టంతోనే నడిపించగలగడం!
    
    ఇంతకుముందు ఉన్న చీఫ్ గారు కంపెనీని సంవత్సరానికి ఇరవైకోట్ల నష్టంతో నడిపించేవాడు.
    
    నాయర్ గారొచ్చి నష్టాన్ని పదికోట్ల రూపాయలకు దింపేశాడు.

 Previous Page Next Page