Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 14


    ఫోన్ మ్రోగింది.
    
    లిఫ్ట్ చేసాను. "హలో....నేను విరించిని" అన్నాడు.
    
    ఆ సంఘటన తర్వాత విరించి కలవలేదు.
    
    "బావున్నారా?" అన్నాను.
    
    "ఆ ప్రశ్న నేను అడగాలి సుమతీ.....ఆ దుర్మార్గులు నిన్ను ఎన్ని కష్టాలు పెడుతున్నారో అని భయంగా వుంది. కానీ మాధవి నన్ను మీ ఇంటికి వెళ్ళద్దంది" అన్నాడు.
    
    "ఇప్పుడు బాగానే వున్నాను. గొడవలేం లేవు" అన్నాను.
    
    "ఒకసారి కలవాలని వుంది" విరించి చెప్పాడు.
    
    "ఎందుకూ?" అడిగాను.
    
    "సుమతీ! నువ్వంటే నాకున్న ప్రేమ ఇప్పుడు మరీ ఎక్కువైంది" అన్నాడు.
    
    "నన్ను లేవదీసుకుపోగలరా?" అడిగాను.
    
    "సుమతీ!" షాక్ అయినట్లు అన్నాడు.
    
    "మరి ప్రేమని ఇంక ఏవిధంగా చూపెడతారు చెప్పండీ.....పోనీ విడాకులిచ్చేస్తాను. పెళ్ళి చేసుకుంటారా?"
    
    "సుమతీ....ఆనంద్ చాలా పలుకుబడిగలవాడు. మాధవి చెప్పింది వాళ్ళెంత కర్కోటకులో..." అన్నాడు.
    
    "విరించీ! మీకూ ఆనంద్ కీ పెద్ద తేడాలేదు. మీరు నా పట్ల జాలి చూపగలరూ, అవసరమయితే సేఫ్ గా ఎవరికీ తెలీకుండా నాతో సంబంధం పెట్టుకోగలరూ.....అంతే! అంతకుమించి నా మీదున్న ప్రేమ మీ చేత ఏ సాహసమూ చేయించలేదు. నేనిచ్చే ప్రొటెక్షన్ తో, సౌకర్యంతో హాయిగా సుఖం అనుభవించి పోయే మగాడు నాకు అవసరంలేదు. ఏవీ తెలీని వయసులో మీరు నా ఒళ్ళో తల పెట్టుకుని ఏడిస్తే భరించానేమోగాని, ఇప్పుడు నాకు అలాంటి మగాడంటే చాలా అసహ్యం! ఇంకెప్పుడూ నాకు ఫోన్లు చెయ్యడం కానీ, కలవాలని ప్రయత్నం చెయ్యడం కానీ చెయ్యకండి" అని పెట్టేసాను.
    
    ఎంతో హాయిగా అనిపించింది. వెన్నెముక లేని మగాళ్ళవల్ల కొన్నాళ్ళకు సామజం నిర్వీర్యమయిపోయే ప్రమాదం వుంది. నేషనల్ ఇన్ కమ్....నేషనల్ వేస్టేజ్ లా నేషనల్ ఇంపొటెన్సీ.... ఇది చాలా ప్రమాదం. ఎయిడ్స్ కన్నా భయంకరమైనది. వాళ్ళవల్ల వాళ్ళ జీవితాలే కాదు.....చుట్టూ వున్న వాళ్ళ జీవితాలు కూడా పాడయిపోతాయి.
    
    కంప్యూటర్ క్లాసులోంచి బయటకొచ్చి చూసేసరికి కారు కనిపించలేదు. కాసేపు చెట్టుక్రింద వెయిట్ చేద్దాం అనుకుంటూ వెళ్ళికూర్చున్నాను.
    
    "సుమతిగారూ!" అని వినిపించి అటుచూస్తే ప్రదీప్ నిలబడి కనిపించాడు. అతను మా కోచింగ్ సెంటర్ ఓనర్. అప్పుడప్పుడూ వస్తూ వుంటాడు. "మీ పేరు సుమతే అనుకుంటా కదూ!" అన్నాడు.
    
    ఆశ్చర్యంతో వుబ్బితబ్బవుతూ "ఔను" అన్నాను.
    
    "రండి....నేను డ్రాప్ చేస్తాను"
    
    "అక్కర్లేదండీ!" మొహమాటంగా అన్నాను. అప్పటికే కొంతమంది అమ్మాయిలు నావైపు ఈర్ష్యగా చూడటం నేను గమనించాను. అతను వచ్చిన రోజు అమ్మాయిలు ఏదో ఒక వంకతో అతని కళ్ళల్లో పడాలని తెగ ట్రై చేస్తుంటారు. అటువంటిది అతి సామాన్యంగా కనిపించే వివాహిత స్త్రీతో అతను అంత చనువుగా మాట్లాడడం వారికే కాదు, నాకూ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒకపక్క ఆనందంగా కూడా....అతని అందం అలాంటిది మరి!
    
    "మా కారు వచ్చేస్తుంటుంది" అన్నాను.
    
    "ఇందాకా ఫోన్ వచ్చింది మీకు. మీ డ్రైవర్ రిపేర్ వచ్చింది కాబట్టి మేడంగారిని ఆటోలో వచ్చెయ్యమని చెప్పండి అన్నాడు. మీరు క్లాసులో వున్నారు ఎందుకులే అని నేను చెప్పలేదు" అన్నాడు.
    
    "అలాగా!" అన్నాను.
    
    "రండి.....నేనూ అటే వెళ్ళాలి...." అన్నాడు.
    
    కాదనలేక అతనితో నడిచాను.
    
    "మీరు శాండల్ వుడ్ ఫెర్ ఫ్యూమ్ వాడతారా? కారు స్టార్టు చేస్తూ అడిగాడు.
    
    ఆ ప్రశ్నకి నా గుండె ఝల్లుమంది. ఎదుటివారి గురించిన ఈ చిన్న చిన్న గమనింపులూ, కాంప్లిమెంట్సూ ఎంత బావుంటాయో!
    
    "ఔను" అన్నాను.
    
    "చాలా మైల్డ్ గా హాయిగా వుంది. లేడీస్ కొందరు ఇరిటేటింగ్ గా వుండే పెర్ ఫ్యూమ్స్ వాడ్తుంటారు. ఆ ఘాటుకి అస్సలు దగ్గరగా కూడా పోవాలనిపించదు" అని "సారీ....మొదటిసారే ఎక్కువగా మాట్లాడేశాను" అన్నాడు.
    
    నేను చిన్నగా నవ్వాను.
    
    "యువర్ స్మైల్ ఈజ్ ఏ ట్రెజర్. ముఖ్యంగా నవ్వినప్పుడు మెరిసే ఆ ముక్కు కొన!" అన్నాడు.
    
    నేను అతనివైపు చూశాను.
    
    "స్పెండింగ్ టైమ్ విత్ యూ ఈజ్ ఎ లీజర్. ఇట్ కెనాట్ బీ మెజర్డ్!" అన్నాడు.
    
    ఈసారి కాస్త గట్టిగానే నవ్వేశాను.
    
    "వీడెవడో కార్లో తిరిగే బేకారు అనుకుంటున్నారా?" అడిగాడు.
    
    నేను తల అడ్డంగా వూపాను.
    
    "ఖచ్చితంగా ఏదో ఒకటి అనుకునే వుంటారు. అదేమిటో చెప్పండి" అన్నాడు.
    
    నేను చెప్పలేదు.
    
    "చెప్పాలి!" అన్నాడు రెట్టిస్తూ.
    
    "ఆశ్చర్యంగా వుంది. మీతో నేను ఇంతకు ముందెన్నడూ మాట్లాడి వుండలేదు కూడా" అన్నాను.
    
    "దేనికయినా ప్రారంభం అనేది ఒకటి వుంటుందిగా....దీని కోసం ఆర్నెల్లు ఆలోచించాలా.....అప్పుడూ ఇలాగే వుంటుంది. అంతకన్నా వెంటనే చేసెయ్యడం మంచిది. మా ఫ్రెండొకడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. వెంటనే చెప్పడానికి భయపడి ఆర్నెల్లు వెయిట్ చేసాడు. ఈలోగా ఆ అమ్మాయి వీడు అమితంగా ఇష్టపడిన పొడుగు జడని కత్తిరించేసుకుంది. లంగా, ఓణీలు మానేసి జీన్స్, టీ షర్టులు మొదలెట్టింది. వాళ్ళ ఇంటి ఓనర్ యాభై ఏళ్లవాడిని పెళ్ళిచేసేసుకుంది."
    
    వింటున్న నేను ఆత్రంగా - "ఎందుకూ!" అన్నాను.
    
    "మరదే....చెపుతున్నా వినండి. వీడు వాళ్ళ పెళ్ళి కెళ్ళి బలంగా అక్షింతలు వాళ్ళ తలలమీద విసరికొట్టి ఆ సాయంత్రం రిసెప్షన్ లో-
    
    "ఎందుకు అంత పెద్దవాడ్ని పెళ్ళి చేసుకున్నావ్? నిన్ను నేనెంత గాఢంగా ప్రేమించానో తెలుసా?" అన్నాడుట. దానికి ఆ అమ్మాయి కన్నీరు పెడుతూ-" ఆర్నెల్లుగా నిన్ను ఆకర్షించటానికి నేను చేయని ప్రయత్నం లేదు. నేనేం చేసినా నువ్వు ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి విరక్తిపుట్టి ఎప్పటినుండో అడుగుతున్న ఆయన్ని చేసుకున్నాను. వయసుకాదు ధైర్యం, మగతనం ముఖ్యం అందిట. దాంతో మావాడి పరిస్థితి ఏవిటో ఊహించండి." అన్నాడు.
    
    నేను నవ్వు ఆపుకోలేకపోయాను.
    
    అంత మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులయిందో కూడా జ్ఞాపకం లేదు.

 Previous Page Next Page